ఆ రోజుల్లో టాంజానియాలో ఉన్నప్పుడు చాలా తీరికగా
ఉండేది. ధ్యానప్రక్రియలో ఎక్కువ కాలం గడపడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడిని. చాలాసార్లు
ధ్యానం కుదరడం అతికష్టంగా ఉండేది. ధ్యానం మొదలుపెట్టగానే పనికిరాని ఆలోచనలు వస్తుండేవి. గాలం పట్టి
మనస్సుని వెనక్కి లాగినా షరా మామూలే. పట్టుమని పది నిమిషాలు ధ్యానం
చేయలేకపోతున్నాను, పూర్వకాలంలో మన ఋషులు అన్ని సంవత్సరాలు ఎలా ధ్యానం
చేస్తుండేవాళ్ళు? అని ఆలోచిస్తూ ఉండేవాడిని. అక్కడే ఉన్న నా స్నేహితుల అనుభవాలు
కూడా ఇలాగే ఉండేవి. అందుకనే కాబోలు పెద్దవాళ్ళు సత్సంగ్
,సజ్జన సాంగత్యం అంటుండేవారు.
ఎప్పుడు మంచిమాటలు, ఆధ్యాత్మిక మాటలు
వింటూ ఉంటే మన మనస్సు కూడా మంచి విషయాలను గూర్చి ఆలోచిస్తుంది. మెల్లమెల్లగా
ధ్యానం మీద మనస్సు కుదురుతుంది అని నాకు నేనే సమాధానం చెప్పుకున్నాను. ఇలా అనుకుంటూ
ఉండగా ఒకసారి నేను మొంబాసా దగ్గరలో ఉన్న మలింది పట్టణంలోని ఒక బీచ్ రిసార్ట్ కు
ట్రైనింగ్ నిమిత్తం వెళ్ళడం జరిగింది. మాకు శిక్షణ ఇవ్వడానికి బెల్జియం, జర్మనీ, హోలాండ్
నుంచి ముగ్గురు ఆఫీసర్లు వచ్చారు. ఆడుతూ,పాడుతూ, సరదాగా కలిసి మాట్లాడుకుంటూ,
కలిసి భోజనాలు చేస్తూ ట్రైనింగ్ ప్రోగ్రాం చాలా బాగా జరుగుతోంది.
ఒక రోజు సాయంత్రం రిసార్ట్ తోటలో కూర్చున్నాను, మనస్సు చాలా ప్రశాంతంగా ఉంది. మళ్ళీ ఆ రోజు అయస్కాంత వ్యక్తి కనిపించారు. “నాయనా ! క్రిందటి సారి అక్షరాల గురించి ఉదాహరణలు ఇస్తూ వివరించాను కదా, దాన్ని గురించి విమర్శించుకున్నావా? ఎప్పుడూ నీకు ప్రశ్నల మీద ప్రశ్నలు వస్తుంటాయి కదా. ఈసారి ఏమి రాలేదా?” అని చమత్కారంగా అడిగారు. “అవును స్వామి! మీరు క్రిందటిసారి చక్కగా కథల రూపం లో చెప్పారు. అందుకనే అర్థం అయ్యింది. అయినా కొంచెం వివరంగా అక్షరాలూ, ధ్వని గురించి మళ్లీ చెప్తారా” అని అడిగితే “సరే” అన్నారు. “నేను అయస్కాంత శక్తికి అధిపతిని. నీలోనే కాదు , ప్రతి వ్యక్తిలో, సమస్త ప్రాణకోటిలో కూడా ఉంటాను. నీవు ధ్యానంలో కూర్చున్నప్పుడు కలిగే ప్రశ్నలకి నేనే సమాధానాలు చెప్తుంటాను. అది నీకు అనుభవంలోకి రాదు. ఇక నీవడిగిన అక్షరాలూ, ధ్వని గురించి చెప్తాను విను. మీలో కొంతమంది మహాత్ములు అక్షరాలన్నింటినీ కలిపి వర్ణమాల లేక అక్షరమాల అంటారు. ఈ అక్షరాలన్నింటినీ కలిపి ఒక మాలగా గుచ్చి మీరు మాట్లాడుతుంటారు. నీవు మాట్లాడుతున్నప్పుడు ధ్వని వస్తుంది. అది ఎక్కడనుంచి వస్తుంది ?
నీలో ఉన్న ఆకాశతత్వం నుంచి
వస్తుంది. అందులోని విషయపరిజ్ఞానం అవ్యక్తస్థితి నుంచి వ్యక్తస్థితికి
వచ్చినప్పుడు నీ భాషలో మాట్లాడినప్పుడే ధ్వని రూపంలో వ్యక్తమయ్యి నీకర్థమవుతుంది. ప్రతి
అక్షరానికి ఒక స్థాయి, కంపన ఉంటాయి; ఆ కంపన మూలంగా ధ్వని పుట్టి ఏ భాష
మాట్లాడేవాళ్లకి ఆ భాషలో వినపడి అర్థమవుతుంది. మనం మాట్లాడే మాటలు అవతలి వ్యక్తిలో
స్పందనలు కలిగిస్తాయి. మంచిగా, ప్రేమగా మాట్లాడితే మంచి
స్పందనలూ, కోపంగా, కఠినంగా మాట్లాడితే బాధామయ స్పందనలూ
కలుగుతుంటాయి. ప్రతిచర్య వేరు, ప్రతిస్పందన వేరు. అలాగే మీరు ఏ భావంతో
మాట్లాడతారో అవే భావనలు ఎదుటివారిలో కూడా పుడుతుంటాయి. అలాగే ఈ రంగులకి కూడా
ప్రభావం ఉంటుంది. ఇవన్నీ మీ మానసిక చైతన్యశక్తి అంటే మీ దేహంలో అనుసంధానించబడి ఉన్న అన్నమయ, ప్రాణమయ,
మనోమయ , విజ్ఞానమయ, ఆనందమయకోశం అనబడే అయిదు అయస్కాంత క్షేత్రాలో ఉంటాయి”.
“మహాత్మా ! అన్నమయ కోశం, ప్రాణమయ
కోశం అంటే ఏమిటో వివరంగా చెప్తారా” అని అడిగాను. “అన్నమయ కోశం చాలా
ముఖ్యమైనది. ప్రాణతత్వమంతా మీరు తినే పదార్థాల వల్ల కలిగే శక్తి మీద ఆధారపడి
ఉంటుంది. ఈ శక్తి సత్వ (మంచి గుణం), రజ(అహంకార గుణం),తామస (చెడ్డ
గుణం) అని మూడు రకాలుగా ఉండి అయస్కాంత క్షేత్రాలతో దగ్గర సంబంధం
ఉంటుంది. మీరు తీసుకునే ఆహారం శుద్ధమైనప్పుడు సాత్విక గుణం కలిగి ప్రకాశంతో వెలుగుతుంటుంది.మీ
అన్నమయ కోశం ఎప్పుడైతే ప్రకాశంతో వెలుగుతుంటుందో అప్పుడు దానికి ఆనుకుని ఉన్న
ప్రాణమయకోశం ఉత్తేజించబడి ప్రాణశక్తి అన్ని అవయవాలకి ప్రవహిస్తుంది. ఈ
ప్రాణమయ కోశం ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటుందో మన శరీరంలో ప్రతి అణువులో కూడా దివ్యమయిన
ప్రకాశం పెరుగుతుంది తద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం పెరుగుతుంది. అప్పుడు మంచి
కోరికలు, ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవాలన్న తపన మనోమయ కోశంలో
కలుగుతుంది. ఎప్పుడైతే మనోమయ కోశం ప్రకాశిస్తుందో, ప్రక్కనే ఉన్న విజ్ఞానమయకోశం
అనుసంధానించబడుతుంది. మీ కోరికలు సంస్కారవంతంగా, న్యాయబద్ధంగా
ఉంటాయి. మీరు మీ గురించే కాకుండా, ఇరుగుపొరుగు వారి గురించి, సమాజం గురించి
ఆలోచిస్తారు. విశాల దృక్పథంతో విశ్వమానవ శ్రేయస్సుకోసం పాటుబడుతుంటారు. తత్క్షణమైన
అంటే క్షణభంగురమైన, అశాశ్వతమైనటువంటి చిన్న చిన్న కోరికలగురించి మీ మనస్సు ఆలోచించదు.
మీ కోరికలు చాలా విశాలంగా విశ్వపరంగా ఉంటాయి. ఎప్పుడైతే విజ్ఞానమయ కోశం ప్రకాశిస్తుందో, ప్రక్కనే
ఉన్న ఆనందమయకోశం అనుసంధానించబడుతుంది. ఇది మనని ఎప్పుడూ బ్రహ్మానందస్థితిలో
ఉంచుతుంది. ఎవరైతే శుద్ధమైన ఆనందమయ కోశం కలిగి ఉంటారో వారికి దు:ఖం ఉండదు. బాహ్య
సంసారంలో ఉంటూ కూడా భగవంతుని చైతన్యశక్తితో అనుసంధానం కావించబడి ఉంటారు. నిశ్చల
స్థితిలో ఉంటారు. విశ్వచైతన్యం, బ్రహ్మచైతన్యం,పరమాత్ముని చైతన్యంతో వెలుగుతూ
ఉంటారు. మీనుంచి వచ్చే కాంతి వలయం విస్తారంగా, అమితంగా ఉంటుంది. అది పరిశుద్ధంగా
ఉంటుంది. ఆ దివ్యకాంతి అన్నివైపులా ప్రసరిస్తూ ఉంటుంది . మీ
కాంతివలయంలోకి తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తులు వచ్చినప్పుడు వారు పైస్థాయికి
వెళ్తారు. వాళ్లకి వాళ్ళలో తెలియని మార్పులు కనిపిస్తూ , భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా
మార్పులు కనిపిస్తుంటాయి. కేవలం వారు ఏమి మాట్లాడకపోయినా వారి యొక్క శుభమైన
స్పందనల వల్ల ఎదుటివారిలో మార్పూ, ఒకవిధమైన శాంతి కూడా కలుగుతూ ఉంటుంది” అని చెప్పారు . “మహాత్మా ! ఆహారానికి అంత
శక్తి ఉందా ? మనం తీసుకునే ఆహారానికి అయస్కాంత క్షేత్రానికి ఏమిటీ
సంబంధం? ఇటువంటి మహాత్ముల సన్నిధిలో మనకు ఎందుకు ఇంత ప్రశాంతత కలుగుతుంది?” అని
ప్రశ్నించాను. దానికి ఆయన ప్రశాంతంగా నవ్వి “సమస్త మానవప్రపంచ ఉనికికి పంచభూతాలతో ఉన్న ప్రకృతి కారణం అయింది” అని అన్నారు. “కొంచెం వివరంగా చెప్పండి”
అంటే ఆయన ప్రశాంతంగా నవ్వి ఇలా చెప్పారు. “సమస్త
మానవప్రపంచ ఉనికికి పంచ భూతాలూ అంటే
పంచ తత్వాలకి ప్రకృతికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఇవి చాలా ప్రధానమైనవి.
అవి ఆకాశం, వాయువు, అగ్ని, జలము, భూమి. ఇంకా వీటిపైనవి చెప్పినా మీ అవగాహనకి
అందవు. మీరు భూమి మీద ఉంటారు కదా అందుకని
మొట్టమొదట నేను మీ భూమి గురించి చెప్తాను . భూమి మనకి కనిపిస్తుంది కదా . అది
ఒక ఘన పదార్థము. ఉదాహరణకి మంచుముక్క, అది మనకి కనిపిస్తూ ఉంటుంది. దానికి ఒక ఆకారం ఉంటుంది. అది ఆక్రమించుకునే స్థలం కూడా కొద్దిగా ఉంటుంది. ఇంకా కొంచెం లోతుగా వెళ్లి మీకు చెప్పాలంటే
దీని లోపల ఉన్నటువంటి అణుసముదాయం చాలా దగ్గరగా ఉంటుంది. ఒక అణువుకి ఇంకొక అణువుకి మధ్యన స్థలం చాలా
తక్కువగా ఉంటుంది. అవి దగ్గర దగ్గరగా
ఒకదానికొకటి అనుసంధానించబడి ఉంటాయి కాబట్టి అది ఒక ఆకారంగా ఏర్పడింది . అది
ఘనపదార్థంగా ఉంది కాబట్టి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు అదే మంచుముక్కను వేడి చేసాము అనుకో ,వేడి తగిలి ఇక్కడ వేడి అంటే అగ్ని అన్న
మాట ఇప్పుడు అగ్నితత్వానికి దగ్గరగా వస్తుంది. అప్పడు
దాని పరిమాణం ఏమవుతుంది? ఆ ఘనీభవీంచిన
మంచుముక్కలో దగ్గరదగ్గరగా ఉన్నటువంటి ఆ అణువుల సముదాయం మెల్లమెల్లగా కరిగిపోయి దాని
యొక్క స్వరూపాన్ని మార్చుకొని అది ద్రవీభవించి జలంగా అంటే జలస్తితికి లేక జలతత్వానికి అది మారిపోతుంది. దేనివల్ల మారిపోయింది? అగ్ని వల్ల మారిపోయింది. అంటే ఘనీభవించినప్పుదు ఉన్న మంచుముక్కకొద్ది
స్థలాన్ని ఆక్రమించేది. అది జలంగా మారేసరికి
ఏమవుతుంది? అక్కడ దానికి చలనం తగిలి
ఇంకొకచోటికి చాలా దూరం ప్రవహిస్తుంటుంది.
విజ్ఞానపరంగా ఆలోచిస్తే ఆ అణుసముదాయం ఘనీభవించినప్పుదు అణుసముదాయం దగ్గర దగ్గరగా ఉంటుంది.
సాంద్రత ఎక్కువైనప్పుడు తక్కువ స్థలం ఆక్రమించుకుంటుంది.అది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అదే పదార్థమునకు అగ్నితత్త్వం తగిలినప్పుడు
జలంగా మారినప్పుడు ఏమవుతుంది? అందులోపల
ఉన్నటువంటి అణువుకి అణువుకి మధ్య స్థలం పెరుగుతూ వస్తుంటుంది . అంటే
కాకుండా ఎప్పుడైతే ఒక అణువుకి ఇంకొక అణువుకి మధ్య స్థలం పెరిగిపోతుందో అప్పుడు ఏమవుతుంది? అది ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది కదా !”
“అవును, అంతవరకు నాకర్థమయ్యింది” అన్నాను. “అయితే
జలతత్వంగా మారినటువంటి మంచుముక్క కి మరల కొంచెం అగ్నితత్త్వం ప్రవేశపెట్టినప్పుడు
అది ఏమవుతుంది? అప్పుడు అది ఒక
వాయువుగా అవుతుంది కదా”. “అవును. వాయువుగా
మారిపోతుంది”. “మరి ఇప్పుడు వాయువు అంటే వాయుతత్త్వం. అంటే ఒక ఘనీభవించినటువంటి పదార్థము,
భూతత్వంలో ఉన్నటువంటి పదార్థము అగ్ని తగిలినప్పుడు దాని ఆకారమూ మారింది దాని విధి
అంటే ఫంక్షన్ మారింది కదా.అదే పదార్థము
జలతత్వంనుంచి మళ్ళీ వాయుతత్వంలోకి వెళ్ళినప్పుడు దాని విధి మారింది కదా, గూడంగా
ఆలోచిస్తే ఏమిటి? ఒక అణువుకి ఇంకొక
అణువుకి ఉన్నటువంటి దూరం పెరిగిపోయి చాలా విశాలంగా అయిపొయింది కదా. అప్పుడు అది వాయుతత్వంలో వెళ్ళినప్పుడు
చాలా ప్రదేశాన్నిఆక్రమించుకుంటుంది. ఇటువంటి వాయుతత్వానికి ఇంకా అగ్ని
పెంచినప్పుడు ఏమవుతుంది? ఆ
వాయుతత్వంలో ఉన్నటువంటి ఇదే పదార్ధం దాని ఆకారము మారింది ,స్వరూపమూ మారింది ,దాని
లక్షణాలు మారినాయి. అది ఆకాశతత్వంలో వెళ్ళుతుంది. మరి ఈ ఆకాశతత్త్వం అంటే
ఏమిటీ? మీ థర్డ్ డైమెన్షన్ లో చెప్పాలంటే
మంచుముక్కగా ఉన్నప్పుడు (భూతత్వంలో) ఒక అణువుకి ఇంకొక అణువుకి మధ్య ఒక మిల్లీమీటరు
స్థలము, అది జలతత్వంలో మారినప్పుడు ఆ స్థలము ఒక అంగుళము అనుకుంటే, వాయుతత్వంలో ఒక
అణువుకి మరి ఇంకొక అణువుకి మద్య స్థలము వంద గజాలు ఉంటే, అదే మరి ఆకాశతత్వంలో ఈ
అణువుల మధ్య స్థలం ఒక పది మైళ్ళ దూరంవరకు ఉంటుంది.అంటే దాని అర్థం ఏమిటి?
ఘనపదార్ధంగా సాకార రూపంలో ఉన్న వస్తువు అగ్నితత్వానికి ప్రభావితమైనప్పుడు అదే ఆఖరికి రకరకాల
దశలు మారి చాలా వ్యాప్తమై ఆకాశతత్త్వంలో ఉంటుంది కదా!” “అవును మహాత్మా ! మరి
ఆలోచిస్తే అంతే కదా!” అన్నాను.
“అటువంటి
దాన్ని మనం ఆధ్యాత్మికపరంగా ఆలోచిస్తే మన మనుష్యులు మొట్టమొదట భూతత్వంలో కనక ఉంటే
మన ఆలోచనలు, మన మానసిక చైతన్యం చాలా తక్కువ స్థాయిలో పరిమితంగానే (లిమిటెడ్) ఉంటాయి,
అంటే మనము మన గురించే ఆలోచిస్తాము. మనం ఎప్పుడైతే మారుతామో , మన మనస్థితి
మారుతుందో అంటే మన మనస్సులో స్వార్థచింతనలాంటి తత్వాలన్నీ ఎప్పుడైతే కరిగిపోతాయో
అప్పుడది ఏమవుతుంది? మనం మెల్ల మెల్లగా మన చుట్టూ ప్రక్కల ఇరుగు-పొరుగు వారి
గురించి, మన దగ్గర వారి గురించి, సమాజం గురించి ఆలోచిస్తుంటాము. అది ఇంకా మంచివారి
సాంగత్యంతో, మంచి అనుభవాలతో మనం మంచివారుగా మారాలి, మంచి ఆధ్యాత్మిక మార్గంలో
వచ్చినప్పుడు ఇంకా మంచి పనులు చేయాలి అని ఒక కోరిక కలుగుతుంది. దీన్ని ఇంగ్లీష్ లో
“బర్నింగ్ డిసైర్” అని అంటారు. ఇలాంటి కోరిక కలిగినప్పుడు మనము ఏం చేస్తాము. అంటే
మన ఆలోచన, మన మానసిక చైతన్యము జలతత్వాన్ని దాటి వాయుతత్వంలోకి వెళ్ళిపోతుంది.
అప్పుడు మనము ఏం చేస్తాము. మన దేశాన్ని గురుంచి కావచ్చు లేక ప్రపంచము గురించే
కావచ్చు దాని శ్రేయస్సు కోసం ఆలోచిస్తుంటాము. అదే మరి ఆకాశతత్వంలోకి వెళ్ళినప్పుడు
మనం విశ్వవ్యాప్తంగా కూడా అందరూ చక్కగా ఉండాలి అని ఒక ప్రేమమయ స్పందనలు కలుగుతాయి.
అందరిలో మనం మనల్నిచూసుకుంటాము. మనలో అందరినీ చూసుకుంటాము. అటువంటి తత్వానికి మనం
వెళ్తాము కదా, అనగా “మహాత్మా! అర్థమయింది, మరి ఈ పంచభూతాలూ, పంచతత్వాలలో ఏది
మారకుండా ఉంది?” “కొంచెం ఆలోచిస్తే నీకే తెలుస్తుంది కదా!” అప్పుడు నేను “అవును
మహాత్మా ! అన్నింటిలో అగ్ని మారకుండా ఉంటుంది కదా” అని అన్నాను. “అవును చాలా బాగా
చెప్పావు. విజ్ఞానపరంగా చెప్పాలంటే అగ్ని ఒక కటలిస్ట్(catalyst) అని చెప్పుకోవచ్చు.
అగ్ని అనేది తను మారకుండా తనలో ఎటువంటి మార్పు లేకుండా క్రింద స్థాయిలో ఉన్న
తత్వాలని పై స్థాయిలోకి పంపటం జరుగుతుంది. ఎప్పుడైతే అగ్నితత్త్వం
తగ్గిపోతుందో పైస్థాయిలో ఉన్నటువంటి
లక్షణాలన్నీ కూడా మెల్లమెల్లగా ఆకాశతత్త్వం నుంచి వాయుతత్త్వం, అక్కడనుంచి మెల్లగా సాకారరూపంలో ఉన్నజలతత్వానికి, తర్వాత
భూతత్వానికి వస్తూ ఉంటాయి.” కాని మహాత్మా! అర్థం అయినట్టుగా ఉంది , అర్థం
కానట్టుగా ఉంది, కాస్త వివరంగా చెప్తారా” అని అడిగాను.
“మనలో
ఏదైనా మంచి సంకల్పం కలిగినప్పుడు , ఆ భావన , ఆ
కంపన విశ్వవ్యాప్తంగా వెళ్లిపోతూ ఉంటుంది. మంచి
సంకల్పంనుంచి వెళ్ళిన మంచి ప్రకంపనలు మంచి ప్రకంపనలనే ఆకర్షిస్తూ ఉంటాయి” అనగా “మహాత్మా! నాకసలేమీ అర్థం కాలేదు”
అంటే “సరే, నేను నీకు ఇంకొక ఉదాహరణ
ఇస్తాను. నేను నీకు కొన్నివిషయాలు
చెప్పినప్పుడు అర్థం కాలేదు, అప్పుడు
నేను నీకు కథల రూపంలో చెప్పినప్పుడు నీకర్థమయ్యాయి. నీవు వాటి గురించి తీవ్రంగా ఆలోచించావా
లేదా?” అని అనగా “ఆలోచించాను” అని అన్నాను. “మరి నీవు ఆలోచించినప్పుడు నీ సమస్యకి
పరిష్కారం, అంటే సమాధానం దొరికిందా లేదా?” “అవును స్వామి ! నేను
ఎప్పుడో చదివిన పుస్తకంలోని కొన్ని సంఘటనలు నేను వాటిని గురించి తలుచుకున్నప్పుడు
మీరు చెప్పిన విషయాలు నాకర్థమైనాయి.” “అదేవిధముగా నీకు నేను చెప్పుతున్నాను, నీవు దేనినైతే గాఢముగా కావాలని
కాంక్షిస్తావో, నీవు మానసికముగా
పంపించినటువంటి కంపనలన్నీ కూడా ఆకాశములో అంటే ఆకాశతత్వంలో అదృశ్యరూపంలో ఉన్నవి అన్నీ కూడా ఆకాశతత్వము
నుంచి వాయుతత్వము, ఆ తర్వాత
క్రమంగా జలతత్వమూ , అక్కడ నుంచి ఘనీభవించి సాకారముగా నీకు
కనిపిస్తుంటుంది .ఈ విషయాలన్నీ
మరొక్కసారి ఆలోచిస్తే బోధపడతాయి. ఇప్పటికి నీకు మెల్లమెల్లగా అర్థం అవుతుంది, నేను చెప్పినవన్నీ కూడా నీవు జాగ్రత్తగా
ఆలోచించుకో. వాటికి సమాధానాలు నీకు తప్పకుండా దొరుకుతాయి. నేను త్వరలోనే మరల
వస్తాను” అని చెప్పి ఆయన అదృశ్యమైపోయారు.