రామచిలకల కథ
ఇంతకు
మునుపు పైభూమికలో ఉన్న ఎన్నో విషయాలు మనము శాస్త్రీయపరంగా, విజ్ఞానపరంగా వివిధ కోణాల
నుంచి చర్చించడం జరిగింది. ఎందుకంటే ఆధ్యాత్మిక స్థాయిలో అందరూ ఒకటే మాదిరిగా ఉండరు.
కొంతమంది యొక్కఆధ్యాత్మిక స్థాయి ఎక్కువస్థాయిలో ఉంటే కొంతమందికి మధ్యమ స్థాయిలో ఉంటుంది,
కొంతమందికి క్రిందిస్థాయిలో ఉంటుంది. కాబట్టి ఒకటే విషయాన్ని నాలుగైదు రకాలుగా చెప్పడం
జరిగింది. అయితే ఇక్కడ చదువుతున్న పాఠకులకు ఎంతవరకు అర్థమయ్యిందో అన్న
విషయం నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఈ విషయాలన్నింటిని ఇంకా సులభంగా అర్థంకావటానికి ఒక కథ రూపంలో చెబితే ఇంకా అర్థంకానివారికి అర్థమవుతుందేమో
అని ఒక విశ్వాసముతో నాకు గుర్తుకి వచ్చిన చిన్న కథ చెప్తాను. ఇది రెండు రామచిలకల కథ.
ఒకప్పుడు ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజుగారు, మంత్రిగారు ఇద్దరు మారువేషాల్లో ఆ పట్టణ
పరిసర ప్రాంతాల్లో సంచారం చేస్తూ ఉండగా అక్కడ సంత జరిగే ప్రదేశానికి రావడం జరిగింది.
అక్కడకి ఆ చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలనుంచి ఎంతోమంది వర్తకులు వచ్చి వారి వస్తువులు
అమ్మకానికి పెట్టడం జరిగింది. అందులో ఒక వేటగాడు రెండు పంజరాలలో రెండు రామచిలకల్నిఅమ్మడం
కనిపించింది. వాడు బిగ్గరగా “ఈ రామచిలకలని అమ్మదలుచుకున్నాను, ఒక చిలక ఖరీదు వంద వరహాలు
ఇంకొక చిలక ఖరీదు ఐదు వరహాలు. మరి ఎవరైతే వంద వరహాలనిచ్చి చిలకను కొంటారో వారికి రెండవ
చిలకనుకూడా కేవలం ఐదు వరహాలకే ఇస్తాను” అని చెప్పడంతో ఆ రాజుగారికి, మంత్రిగారికి
చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకు ఒక చిలకకి అంత ధర చెప్తున్నాడు, ఇంకొక చిలకకి
అంత తక్కువ ధర చెప్తున్నాడు అని. వారికి ఎంతో కుతూహలం కలిగింది. వాడి సమీపానికి
వెళ్లి, ”ఏమయ్యా ! మరి నీవు ఒక చిలక్కి ఎక్కువ ధర మరి ఇంకొక చిలక్కి అంత తక్కువ ధర
ఎందుకు చెప్తున్నావు? ఇందులో రహస్యం ఏమిటి” అని అడగ్గా ఆ రహస్యం తెలుసుకోవాలంటే మీరే
స్వయంగా ఈ చిలకలనే తీసుకువెళ్ళండి.
నేను చెప్పడం కన్నా మీరు వాటి నుంచి తెలుసుకోవడమే బాగుంటుంది” అని చెప్పాడు. “సరే” అని కొంత ఆశ్చర్యముతో, కొంత కుతూహలముతో ఆ రాజుగారు ఆ రెండు చిలకల్ని కొని రాజభవనానికి తీసుకుని వెళ్లి ముందుగా వంద వరహాలు పెట్టి కొన్న చిలకని తన శయనమందిరములో ఉంచారు. సుప్రభాత సమయములో అంటే సూర్యుడు ఉదయించడానికి కొంచెం ముందు ఆ చిలక దేవుని గురించి ఎంతో శ్రావ్యంగా భక్తి కలిగించేటటువంటి స్తోత్రం పాడుతుండగా ఆ రాజుగారికి మెలకువ వచ్చి ప్రొద్దున్నే భగవంతుని నామస్మరణ చేస్తున్నటువంటి చిలకను చూసి చాలా సంతోషపడిపోయాడు, దానిని చాలా ప్రశంసించాడు. ఆ మరుసటి రోజు ఆ రాజుగారు రెండో చిలకను కూడా మనము పరీక్షిద్దాము అని చెప్పి తన శయనమందిరానికి ఆ రెండవ చిలకను తెప్పించి ఉంచారు. తెల్లవారుఝామున ఆ రాజుగారికి మెలకువ వచ్చి చూసేసరికి ఆ రెండో చిలక ఎదుట కనపడిన వారినందరినీ తిట్లు తిడుతోంది. దాని నోటినిండా తిట్లూ దూషణలు తప్ప మంచి వాక్యం రానే రాలేదు. ఆ దూషణవాక్యాలు వినగానే ఆ రాజుగారికి చాలా కోపం వచ్చింది. వెంటనే తన సైనికులని పిలిపించి ఆ చిలకని వెంటనే చంపివేయమని ఆజ్ఞాపించాడు. ప్రక్కనే ఉన్న మొదటి చిలక, ”మహారాజా ! దీన్ని క్షమించండి. ఆ చిలక కూడా నా సోదరియే. మా చిన్నతనంలోనే ఒక వేటగాడు మా తల్లి లేని సమయంలో ఎత్తుకుపోయి నన్ను వేరే వారికి, తనని వేరే వారికి ఇవ్వడం జరిగింది. అయితే రాజా ! నన్ను ఒక సాధువు కొనుక్కుని వెళ్ళాడు. ఆయన రోజూ ప్రొద్దున్నే దేవుని స్తుతించుచూ స్తోత్రాలు, కీర్తనలూ పాడుతుండగా నేను అవి విని నేర్చుకున్నాను. మరి దురదృష్టవశాత్తు నా సోదరిని ఒక ధూర్తుడు కొన్నాడు, వాడు చాలా కోపిష్టి కాబట్టి ప్రతి నిమిషానికి ఇట్లా తిడుతూ ఉంటే అవే మాటలు పదే పదే వినడంతో నా సోదరి కూడా అవే మాటలు నేర్చుకుంది. ఇందులో దాని తప్పేమీ లేదు, కనుక దాన్ని కనికరించి వదిలివేయండి” అని ప్రార్ధించింది. మహారాజు చాలా ఆశ్చర్యపోయాడు, “ఈ చిలకలో ఇంత సంస్కారము, ఇంత వినయమూ ఎట్లా వచ్చాయి? తన సోదరిని గురించి ఎంత దీనంగా ప్రార్థిస్తోంది” అని సంతోషపడి ఆ చిలక చెప్పిన విధంగానే ఆ రెండో చిలకను స్వేచ్ఛగా పంజరంలోనించి వదిలివేయడం జరిగింది. ఆ రెండు చిలకలు కూడా ఒకే తల్లి పిల్లలయినప్పటికీ వాటి పెంపకాలు వేరుగా ఉండడం తోటి ఒక చిలకకి మంచి సంస్కారాలు, మంచి భాష రావడం జరిగింది, అదే రెండవ చిలకకి దుష్ట సంస్కారాలు, దురలవాట్లు వచ్చాయి. దీనివల్ల మనకి తెలిసినది ఏమిటంటే మన ప్రవర్తన ఎలా ఉంటుందో, మన మాటలెలా ఉంటాయో, మన పెంపకంలో పెరిగినటువంటి పిల్లలు కూడా అటువంటి సంస్కారాలని, భాషలనే, అలవాట్లనే వారు నేర్చుకుంటారు అని అనుకున్నాను.
ఇలా నేను ఆలోచిస్తూ ఉండగా అనుకోకుండా నేను ధ్యానస్థితిలోకి వెళ్ళిపోయి
రంపాగారి గురించి ఆలోచిస్తున్నప్పుడు రంపాగారి చైతన్య స్థితి నా మనస్థితికి
అనుసంధానం జరగడమూ, అక్కడ నా మనోనేత్రమునందు రంపాగారు దర్శనం ఇవ్వడం జరిగింది. “అయస్కాంత
వ్యక్తీ, మరి నేనూ చెప్పిన అన్ని విషయాలు చక్కగా విమర్శన చేస్తూనే ఉన్నావు. ఇంకా
ఇంకా నీవు విమర్శన చేస్తున్న కొద్దీ, ఇంకా ధ్యానంలో లోతుగా నీవు వెళ్ళుతున్నప్పుడు
నీలోని ఆయస్కాంత క్షేత్రము అనగా, నీలో ఉన్న స్పందనలన్నీ కూడా పైస్థాయిలోకి
పెరిగినప్పుడు, నీవు ఆలోచించే విషయాల మీద మరి కొంచెం అవగాహన పెరుగుతుంది. నీవు చెప్తున్న
విషయాలు, నీవు చేస్తున్న విశ్లేషణ అంతా బాగుంది. నేను నా జీవితమంతా మనుషులలో
ఉన్నటువంటి ఆరా గురించే చాలా పరిశోధన చేసాను. మా గురువులైన శ్రీ మింగ్యార్ దొన్దుప్
(Mingyar Dondup) గారు కూడా ఈ మనుషులలో ఉన్న ఆరా గురించే రాబోయే తరంవాళ్లకి నీవు
చెప్పవలసి ఉంటుంది అని ఆయన సెలవిచ్చారు. ఒకప్పుడు మనుషులందరికీ కూడా దివ్యదృష్టి
ఉండేది. అప్పట్లో మనుషులెవ్వరూ కూడా దుస్తులు వేసుకునేవారు కారు. అప్పుడు వారిలో ఒకరి
ఆరా ఇంకొకళ్ళకి స్పష్టంగా కన్పిస్తూ ఉండేది. ఈ ఆరా లోపల కూడా రంగులు ఉంటాయి.
ఒక్కొక్కళ్ళ ఆరా చాలా సున్నితంగా, మృదువుగా ఉంటుంది. కొంతమంది యొక్క ఆరా కొంచెం కఠినంగా
ఉంటుంది, అంత సున్నితంగా ఉండదు. ఇట్లా మనుషుల యొక్క మనస్తత్వాలని బట్టి ఆరాల
రంగులు కూడా మారుతూ ఉంటాయి. అయితే ఆ రోజుల్లో మనుష్యులలో ఉన్న ఆరాని బట్టి వాళ్ళు
నిజం చెప్తున్నారా లేక అబద్ధం చెప్తున్నారా, ఎటువంటి ఆలోచనలు వారి మనస్సులో
ఉన్నాయి అని కనుక్కునేవాళ్ళు. అబద్ధం చెప్పినపుడల్లా ఎదుటి వ్యక్తిలోని ఆరా ఏదైతే ఉందో
దాని కాంతి కొంచెం తగ్గిపోతూ ఉంటుంది. అంటే కాకుండా స్వచ్చమైనటువంటి నీలం రంగులో
ఉన్నటువంటి ఆ ఆరా కొద్దిగా మట్టి రంగులో మారిపోతుంటుంది. ఈర్ష్య, ద్వేషము,
అసూయ లాంటి గుణాలు ఉన్నప్పుడు ఆ ఆరా యొక్క కాంతి పరివేష్టితం, ఆ చుట్టుతా
ఉన్నటువంటి రంగులు మారుతూ ఉండడం వల్ల అప్పుడు మనుష్యులు మెల్లమెల్లగా వారి
తత్వాలు కప్పిపుచ్చుకోవడానికి దుస్తులు ధరించడం జరిగింది అని మా గురువుగారు
చెప్పడం జరిగింది అని ఆయన చెప్పారు. అయితే మా దేశం చైనాదేశం మూలంగా దురాక్రమణకి
గురి అవుతుందని తెలిసినప్పుడు ఎంతోమంది పాశ్చాత్య దేశస్తులు, చైనా వారు, ఇంకా
చాలామంది మా గురువుగారిని కలుసుకోవడానికి వస్తుండేవాళ్ళు. నాకు మరీ చిన్నప్పుడే ఒక
ప్రత్యేకమైన శస్త్రచికిత్స చేసినందువల్ల నా మూడో కన్ను తెరుచుకుని నేను మనుషుల
యొక్క ఆరాలన్నీ స్పష్టంగా చూడగలుగుతూ ఉండేవాణ్ణి. ఇట్లాంటి రాయబారులు, విదేశీయులు మా గురువుగారిని కలవడానికి
వచ్చినప్పుడు నేను రహస్యంగా ఒక తెరచాటున
ఉండి ఆ మనుషుల యొక్క ఆరాని చాలా నిశితంగా గమనిస్తూ ఆ తరువాత వాళ్ళు వెళ్లిపోయినాక
మా గురువుగారికి వాళ్ళలో ఉన్న ఆరాలగురించి
చెప్పడం జరుగుతూ ఉండేది. నాకు దానిలో కొంతమంది ఎంతో కపటస్వభావం ఉన్నవాళ్ళు,
పైకెంతో మంచిగా మాట్లాడుతున్నప్పటికీ వాళ్ళలో, వాళ్ళ ఆరాలో కలుగుతున్నటువంటి
మార్పులని బట్టి నేను మా గురువుగారికి ఇతని యొక్క ఆరా స్వచ్చంగా లేదు అని
చెప్పడమూ, వీడిని నమ్మకూడదు వీడు మనస్సులో
ఒక రకంగా, పైకొక రకంగామాట్లాడుతున్నాడు అని, కొంతమంది ఆరా చాలా స్వచ్చంగా ఉందని
విశ్లేషించి చెప్తుండేవాడిని. ప్రతి ఒక్క మనిషిలోఈ ఆరా ఒక రకమైనటువంటి విద్యుత్ అయస్కాంత క్షేత్రమని చెప్పవచ్చు.
అయితే ఈ అయస్కాంత క్షేత్రానికి, మన పరిశోధనాలయంలో ఉన్న అయస్కాంతానికి కూడా చాలా
తేడా ఉంటుంది. ఇది మనిషి చుట్టూ ఒక కోడిగ్రుడ్డు ఆకారంలో ఒక కాంతి వలయంలాగా ఉంటుంది.
మనిషి యొక్క స్వభావాన్ని బట్టి , ప్రవర్తనను బట్టి, వారి ఆలోచనలను బట్టి వారు
తీసుకునే ఆహారాన్ని బట్టి మనిషి చుట్టూతా ఉన్న ఆ కాంతి వలయం పరివర్తనం చెందుతూ
ఉంటుంది. సాధుసత్పురుషుల యొక్క ఆరా నీలం రంగులో ఉంటుంది, ఇక ఎవరికైతే
ఈర్ష్యా, అసూయ, ద్వేషాలు ఇలాంటి భావాలు ఉండవో ఎవరైతే అందరినీ ప్రేమగా చూస్తారో,
అటువంటి వారి యొక్క ఆరా కాంతి వలయం బంగారు రంగులో ఉంటుంది. ఇప్పుడు మరి అధునాతన
ప్రపంచంలో ఎన్నో పరికరాలు రావడం వల్ల మనిషిలో ఉన్న అయస్కాంత క్షేత్రాలని
కనుక్కోవడం చాలా సులభమైపోయింది కాని మరి మాకటువంటి పరికరాలు లేకుండానే ఒక మనిషిని
చూడగానే వారి యొక్క ఆరా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ముందు ముందు తరాలలో
మనుషులందరూ కూడా ఈ ఆరాల మీద ఎంతో పరిశోధన చేసి,
ఎటువంటి మందుల సహాయం లేకుండా కేవలం వారి ఆరాలని, విద్య్యుత్ అయస్కాంత
క్షేత్రాలను బట్టి వారి రోగాలను ముందే కనుక్కోవడమూ, వాళ్లకి వాళ్ళే వాటికి తగిన
చికిత్స చేసుకోవడమూ జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మన మనసులో ఉన్నటువంటి ప్రాణశక్తిని
ఏవిధంగా మనము ఉపయోగించుకుని మనలో ఉన్నటువంటి
రకరకాల రోగాలని ఎలా నయం చేసుకోవాలి అనే ప్రక్రియ కూడా త్వరలోనే రాబోతుంది.
ఇంకా దీనికి సంబంధించిన వివరాలు నేను మరొక సందర్భంలో అవకాశం వచ్చినప్పుడు చెప్తాను”
అనేసి ఆయన నా మనోనేత్రం నుంచి మాయమైపోయారు.