ఆధ్యాత్మిక అనుభవాలు - విశేషాలు - Gayatri Mantra Shakti
గాయత్రి మంత్ర శక్తి : ఎండిపోయిన గులాబీ మొక్క కథ
నేను ఒక సారి గాయత్రి పరివార్ ఫౌండర్ శ్రీరామ్ శర్మ ఆచార్యగారి ప్రముఖ శిష్యుడైన డా.మారెళ్ళ రామకృష్ణ గారు మౌంట్ శంబలలో నిర్వహించిన మూడు రోజుల శిక్షణ శిబిరానికి వెళ్ళడం జరిగింది ఆయన బనారస్ లో M.Sc బయో కెమిస్ట్రీ అనుకుంటా చేసారు. ముఖ్యంగా ఆయన ఆధ్యాత్మికంగా ఎంతో పై స్థాయిలో ఉన్నటువంటి అద్భుతమైన వ్యక్తి. ఆయనకిష్టమైన ఆధ్యాత్మిక రహస్యాలు కాని విశేషాలు కాని సామాన్య మానవులకి కూడా అతి తేలికగా అర్థమయ్యేటట్టుగా ఆయన చెప్ప గలుగుతారు. మౌంట్ శంబల హైదరాబాదులో రామోజీ ఫిలిం స్టూడియో దాటాక ఎడమ వైపున దేశ్ముఖ్ అనే ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక చిన్న గుట్ట ఉంది. అక్కడ ఈ శిబిరం ఏర్పాటు చేసారు అక్కడ మారెళ్ళ రామకృష్ణ గారు, వారి శిష్యులైన శ్రీ యుగంధర్ గారు, విజయశ్రీ గారు అనే ఒక పుణ్య దంపతులతో పరిచయం జరిగింది . వారిద్దరూ అగ్రికల్చర్ డిపార్టుమెంటు లో మంచి ఉన్నతమైన పదవులలో ఉన్నారు. ఆవిడ తనకి కలిగిన అనుభవాన్ని మాతో పంచుకున్నారు.
ఒక సారి రామ కృష్ణ గారు గాయత్రి మంత్ర మహిమ గురించి ఉపన్యాసమిచ్చినప్పుడు ఆవిడ అంటే విజయశ్రీ గారు విన్నారుట. అది విన్నాక ఆవిడకి ఎంతో కుతూహలం కలిగింది.వారింటిలో ఒక ఎండిపోయిన గులాబి మొక్క ఉంది. అది పూర్తిగా చనిపోయిన స్థితిలోనే ఉంది వారిద్దరూ అగ్రికల్చర్ డిపార్టుమెంటు లో పని చేస్తున్నారు కాబట్టి ఆ మొక్కకి ఏమాత్రం బ్రతికే అవకాశం లేదు అని బాగా తెలుసు. అయినా ఆవిడ వారి గురువుగారైన రామకృష్ణగారు చెప్పినట్టుగా ఒక గ్లాస్ నీళ్ళు ప్రక్కన పెట్టుకుని అందులో రెండు తులసీ దళాలు,రెండు అక్షింతలు వేసి శ్రద్ధగా గాయత్రి మంత్రం చదివినాక ఆ నీళ్ళు రోజు ఆ గులాబి మొక్కకి పోయడం మొదలు పెట్టారు. అయితే ఆవిడ భర్త యుగంధర్ గారికి రామక్రిష్ణగారితో అంత సన్నిహిత్వం లేదు ఆ మొక్కకి ఎక్కడా బ్రతికే అవకాశం లేదు ఎందుకు నీవనవసరంగా దానితో కష్ట పడుతున్నావు అని అన్నారు. అయినా ఆవిడ పట్టు వదలకుండా రోజు శ్రద్ధగా మంత్ర ఉపాసన చేసి ఆ నీళ్ళు ఆ మొక్కకి సమర్పిస్తూ ఉండేవారు. ఇలా 15 రోజులు గడిచిపోయాయి.
ఒక రోజు ఆవిడ యథాప్రకారముగా ఆ మొక్కకి నీళ్ళు పోయడానికి వెళ్ళినప్పుడు అక్కడ చిగురిస్తున్న ఆ గులాబి మొక్కని చూసి ఆశ్చర్య పోయి, యుగంధర్ గారిని పిలిచి చూపిస్తే ఆయన అంతకన్నా ఆశ్చర్య పోయారు.ఎందుకంటే ఆయనకి ఇలాంటివాటిమీద నమ్మకం లేదు. ఆయన ఏదైనా శాస్త్రీయపరంగా ఆలోచిస్తారు. అదేమిటీ ఇది ఎలా సంభవం?అని వెంటనే ఆయన తనతొ పాటు పనిచేస్తున్న మితృలకి ఫోన్ చేసి గులాబి మొక్కకి ఫలానా ఫలానా పరిస్థితి, అది ఎండి పోయి మళ్ళీ దానిలో జీవించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని అడిగితే అందరూ కూడా ఇలాంటి పరిస్థితిలో అది చిగురించడం అసాధ్యం అని జవాబు చెప్పారు. ఈవిధంగా ఆవిడ 40 రోజులపాటు అతి శ్రద్ధగా గాయత్రి మంత్రం జపిస్తూ, ఆ గులాబి మొక్కకి క్రమం తప్పకుండా ఆ మంత్రోపాసన నీళ్ళు పోస్తూ ఉంటే అది అద్భుతంగా కొత్త గా జీవం సేకరించుకుని మామూలుగా పెరగడం మొదలు పెట్టింది.యుగంధర్ గారు చాలా ఆశ్చర్య పోయారు.వారికి ప్రత్యక్షంగా ఈ అనుభవం జరగడంతో నమ్మక తప్పలేదు. కాబట్టి పెద్దలు చెప్పింది నిజమేనని తెలిసింది. అప్పట్నుంచి వారు గాయత్రి మంత్ర సాధన చక్కగా చేస్తున్నారు.ఇదే విషయం ఒక సత్సంగ్ లో ఉన్నప్పుడు ఆవిడ చెప్పారు.
తులసీ మొక్క చిగురించుట
విజయశ్రీ గారి గాయత్రి మంత్రం అనుభవం విన్నాక నాకు కూడా ఈ ప్రయోగం చేయాలని ఎంతో ఆసక్తి కలిగింది మా ఇంట్లో ఉన్న రెండు తులసీ మొక్కలలో ఒకటి ఎండి పోయింది. ఆ ఎండిపోయిన తులసీ మొక్క తో నేను ప్రయోగం చేసాను.
శ్రీరాం శర్మ ఆచార్య గారు గాయత్రి మంత్ర మహిమ చెప్పిన విధంగానే నా ప్రక్కన నీళ్ళ గ్లాస్ పెట్టుకుని అందులో రెండు అక్షింతలు,రెండు తులసీ దళాలని వేసి, ఆ సూర్యుని యొక్క తేజస్సు దానిలో వస్తున్నట్టుగా భావించి మరి దానిలో సూర్యుని శక్తి, గాయత్రి మంత్ర శక్తి ప్రసారం కావాలి అనే భావనతో ఆ సూర్యుని యొక్క కిరణాలు ఆ నీటిలో ప్రసరిస్తున్నట్టుగా మనస్సులో ఊహించుకుని 30 మాలలు గాయత్రి మంత్రం శ్రద్ధగా చదివి, అంతకన్నా శ్రద్ధగా ఏ మొక్కనుంచి దళాలని కోసానో ఆ తులసీ మొక్కకే కాకుండా ఆ ఎండి పోయిన తులసి మొక్కకి కూడా ఆ నీళ్ళని సమర్పిస్తూ ఉండే వాడిని. నీళ్ళు పోస్తున్నప్పుడు మనస్సులో ఈవిధంగా సంకల్పం చేస్తుండే వాడిని "నేను ఇస్తున్నటువంటి గాయత్రి మంత్ర జలంతో నీకు మళ్ళీ జీవం వచ్చి పచ్చని ఆకులతో కళ కళ లాడుతూ ఉండాలి" అని అనుకుంటూ ఆ నీళ్ళు పోసి, అందరికి ఆ తీర్థం ఇచ్చి నేను కూడా త్రాగుతూ ఉండేవాడిని .ఇలా 15 రోజులయ్యాక ఆ ఎండి పోయిన మొక్క పెరగడం మొదలు పెట్టేసరికి నా మనస్సు ఆనందంతో గంతులు వేసింది ఆ మొక్క అద్భుతంగా పెరిగి నేను వేరే మొక్కనుండి దళాలని తీసుకోనక్ఖర్లేకుండా ఆ తులసీ మొక్కే స్వయంగా నాకు ప్రసాదించే లాగా వృద్ధి చెంది పచ్చని ఆకులతో కళ కళలాడుతూ నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది.
కొన్ని కొన్ని సాధనలు మనం చేసేటట్టు సులభంగానే ఉంటాయి.వారు చెప్పినట్టుగానే నేను చేస్తే నాకు కూడా అదే అనుభవం జరిగింది. గాయత్రి మంత్రంలో ఇంత అద్భుతమైన శక్తి ఉందని నేను ప్రత్యక్షంగా ఈ అనుభవం ద్వారా తెలుసుకోగలిగాను.