N. Sairam Garu || Email: sridatta50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.

Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here

Monday 25 April 2016

Mohini Katha-07


శ్రీ రాంలాల్ ప్రభుజి లీల ­- మోహిని కథ – 7 (ఆఖరి భాగం)
                       (Concluding Part)
యదావిధిగా వాళ్ళందరినీ లేపి జరిగిందంతా రవి కాంత్ వాళ్లకి చెప్పాడు. ఇదేమిటీ మేమెంత ప్రయత్నించినా సరిగ్గా ఆవిడ వచ్చే సమయానికి బాగా నిద్ర పడుతుంది. ఆవిడ రావడం, మీరిద్దరూ గంటలు గంటలు మాట్లాడుకోవడం మేము ఒక్క రోజైనా స్వయంగా  మా కళ్ళతో మేము చూడలేదు. “అమ్మ బాబోయ్ ! ఈ కామ పిశాచానికి చాలా శక్తి ఉన్నట్టుగా ఉంది.” “హారీ భగవంతుడా ! ఇప్పుడేమిటీ మార్గం? ఏం చేయాలి? శ్రీ రాంలాల్ ప్రభువు గారిని పూజించిన పూలలో ఎంతో శక్తి ఉందని మనం సంతోషించి పోయాం కాని ఆ కామ పిశాచి, ఆ మోహిని ఆ పువ్వులనే నీ చేత్తో దూరంగా అవతల పారేసేటట్టు చేసిందే, ఏం చేయాలి ఇప్పుడు ? 


అని వాళ్ళంతా ఆలోచిస్తూ కూర్చున్నారు. తరువాత కొంత సేపట్లో వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే వాళ్ళు సర్వశ్రీ రాంలాల్ ప్రభు భక్తుల ఇంటికి వెళ్లి దయ చేసి మీరు  మాకోసం ప్రత్యేకంగా ఈ రోజు పూజ చేయ గలరా? అని అడిగారు. నాయనా ! మేము ప్రతి గురువారమే పూజ చేస్తాము, మరి మీ కోసం చేయమంటే తప్పకుండా ఈ రోజు పూజ చేస్తాము. ఇప్పుడే బజారుకి వెళ్లి పువ్వులు తీసుకుని వస్తాము. 

మనందరమూ కూర్చొని  కాసేపు శ్రద్ధగా శ్రీ రాంలాల్ ప్రభు భజన చేద్దాం. ఆయన గురించి కొంచెం సేపు సత్సంగ్ చేద్దాం కాస్త మీరు మాకు సాయం చేయండి అని అన్నారు. వాళ్ళు సరే అనగా రవి కాంట్ అన్నగారు, వారి మిగతా స్నేహితులు అందరూ కలిసి పూజ కోసం బంతి పూలు,రకరకాల పూలు తెచ్చి ఎంతో శ్రద్ధా భక్తులతో శ్రీ రాంలాల్ ఫోటోను అలంకరించి భజన చేశారు. ఈ విధంగా ఒక  అయిన తర్వాతా ఆ ఫోటోని అలంకరించిన పూల మాలను తీసుకుని వాటిని కాసేపు నీళ్ళలో ఉంచి, ఆ నీళ్ళను రవికాంత్ తో త్రాగించారు. ఇది వాళ్ళు ఆఖరి సారిగా చేస్తున్న ప్రయోగం. వారెంతో ఆర్తితో శ్రీ రాంలాల్ ని ప్రార్థించారు. ఓ సిద్ధ పురుషా ! మీరు సాక్షాత్తు భగవంతుడైన దత్తుని అవతారమని అందరూ చెప్పుకుంటున్నారు. మీరే మమ్మల్ని కాపాడాలి. సర్వ మంత్రాలకి, సర్వ తంత్రాలకి, యంత్రాలకి మీరే మూలం  అని చెప్పుకుంటారు కాబట్టి మీరే కరుణించి ఎలాగైనా మా తమ్ముడ్ని ఆ కామ పిశాచి బారినుంచి కాపాడాలి అని పరి పరి విధాలా ఆ ప్రభువుని ప్రార్థించి వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్లి పోయారు. ఆ రోజు అర్ధ రాత్రి సమయం అందరు నిద్రిస్తుండగా ఆ కామ పిశాచి వచ్చినట్టుగా రవికాంత్ కి తెలిసిపోయింది. దుప్పటి తొలగించి ఆ కిటికీ వైపు చూస్తూ కూర్చున్నాడు. మొట్ట మొదటి సారిగా రవి కాంత్ కి ఆశ్చర్యం వేసింది. మొట్ట మొదటిసారిగా ఆవిడ ముఖం లో భయము, ఆందోళన కనిపించాయి. అప్పుడు రవికాంత్ ఆవిడని ఎందుకు నీవీసారి ఇంత భయంగా ఉన్నావు? అని ప్రశ్నించాడు. “దుర్మార్గుడా ! ఎంత మోసం చేశావు?నీకు ఇంత దుర్మార్గపు ఆలోచనలు ఉన్నాయని నాకు తెలియదు. అయినా మీ మనుషులని నమ్మడం నాదే తప్పు” అని ఆ మోహిని అన్నది. ఈ సారి నీవు ఎందుకంత భయ పడుతున్నావు? నీవు సర్వ శక్తిమంతురాలివి కదా! మేము ఎన్నో దేవతలని పూజించాము, ఎన్నో తాయత్తులని తెప్పించాము, ఎంత మంది మాంత్రికులు, తాంత్రికులు వచ్చినా నీ శక్తికి వాళ్ళు అడ్డు చెప్ప లేక పోయారు మరి ఈ సారి నీవు ఎందుకింత భయ పడుతున్నావు?” అని అనగా మహాత్ములు, సాధువులు, యోగులు వీళ్ళందరి కన్నా పై స్థాయిలో సిద్ధ పురుషులనే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీరు పూజించిన అతను సాక్షాత్తు భగవంతుడైన దత్తుని అంశావతారం. ఆయన సిద్ధ పురుషుడు. ప్రతి మహాత్ములకి కూడా కొంత దూరం వరకు అదృశ్యంగా వారి శక్తి వలయాలు ఎటువంటి దుష్ట శక్తులు రాకుండా అవి కాపాడుతూ ఉంటాయి. అయితే అపరిమితమైనటువంటి వలయాకారంలో ఉన్న ఆ శక్తులు కేవలం సిద్ధ పురుషులనబడే వారికే ఉంటాయి. సిద్ధ పురుషుడంటే సాక్షాత్తు ఆత్మతో  సాయుధ్యం  పొందినటువంటి మహాత్ముడు. భగవంతునికి, అతనికి ఏం భేదం ఉండదు. అటువంటి ప్రభు శ్రీ రాంలాల్. ఆయన చేత పూజ చేయబడిన పుష్పాలకి అంత శక్తి ఉంటుంది కాబట్టి నేను లోపలకి రాలేక పోతున్నాను. అందుకనే క్రిందటిసారి నీ చేతనే ఆ పూలని గిరవాటు చేయించాను కాని ఈ సారి నీవు ఆ పూల నీళ్ళని గ్రహించినట్టుగా (త్రాగినట్టుగా) నాకు తెలిసి పోయింది. నీ చుట్టూతా బ్రహ్మండమై నటువంటి ఒక శక్తి వలయం కనిపిస్తుంది. నేను నీ దగ్గరకి రాలేక పోతున్నాను. ఎంతో ప్రయత్నించి ఒక్క అడుగు ముందుకి వేస్తె నా ఒళ్ళంతా భగ భగా మండిపోతుంది. కాబట్టి నేను నీ దగ్గరకి రాలేక పోతున్నాను. ఎంత అన్యాయం చేశావు నీవు నాకు? ఎంత మోసం చేశావు నన్ను? అని అంది. నేను నిన్నేమీ మోసం చేయలేదు, అన్యాయం అంత కన్నా చేయ లేదు. నీవే ఆలోచించు. మానవులకి , పిశాచాలకి ఎటువంటి సంబంధం ఉండదు, ఉండకూడదు. అది ప్రకృతికే విరుద్ధం.మానవులలో భూతత్వం ఉంటుంది, మీ పిశాచాల్లో వాయు తత్త్వం ఉంటుంది. ఈ రెండింటికీ పొత్తు కుదరదు. మీ అనుభూతులు , మా అనుభూతులు వేరుగా ఉంటాయి. మీ అనుభూతుల్ని మేము తట్టుకోలేము. భగవంతుని యొక్క ప్రణాళికలో అటువంటివి ఏమీ లేవు. నేను మొదట్నుంచి నిన్ను ప్రాధేయ పడుతున్నాను, నిన్నెప్పుడూ నేను కామ భావంతో చూడ లేదు. నీ సాంగత్యం వల్ల నాకు ఎన్నో విజ్ఞాన పరమైనట్టి విషయాలు తెలిశాయి. నీ పట్ల నాకు చాలా గౌరవముంది. నీవంటే నాకు ఒక సోదరి అనే భావం తప్ప వేరే ఎటువంటి భావం లేదు కాబట్టి నేనేం తప్పు చేయ లేదు అని చెప్పి నాకు మొట్ట మొదటి సారిగా యోగులకి,తపస్వులకి, మనుష్యులకి తేడా నీ  మూలంగా తెలిసింది. నాకు ఇంత కాలం ఎన్నో మంచి విషయాలు చెప్పావు. ఇప్పుడైనా నన్ను వదిలి పెట్టు అని చెప్పగా ఆవిడ సరే ! నిన్ను లొంగదీసుకోవాలి అని నేను విశ్వ ప్రయత్నాలు చేశాను, కాని సాధ్యం కాలేదు. నీవు ఇప్పుడు ఒక సిద్ధ పురుషుని ఆశ్రయంలో ఉన్నావు అందుకని నిన్ను నేనేమీ చేయలేను. అయితే ఒకటి నేను వెళ్లి పోవాలంటే నన్ను ఒక మంత్రం శక్తితో అనుసంధానం చేసి, నీ మీద ప్రయోగం చేసిన ఆ తాంత్రికుని వస్తువులన్నీ బయట పారేస్తే కాని నిన్నునేను వదిలి పెట్టి వెళ్ళలేను. నీ ఇంటి క్రింద నైఋతి వైపు త్రవ్వితే అక్కడ నీకు మేకులతో గుచ్చిన ఒక బొమ్మ, నిమ్మ కాయ, ఇంకా చాలా వస్తువులు కనిపిస్తాయి. అవన్నీబయటకి  తీసి, ఆ  బొమ్మకి గుచ్చిన మేకులు తీసివేసి  ఆ మేకులు, బొమ్మ, నిమ్మకాయ ఆ మిగతా వస్తువులు అన్నీ కలిపి నీవు నీ చేత్తో కాని వేరే వాళ్ళతో కాని ఒక బట్టలో మూట కట్టి దాన్ని ప్రవహించే నీళ్ళలో కాని, నదిలో కాని పారేయాలి. అప్పుడే నేను నిన్ను వదిలి వెళ్ళ గలను. నిన్ను వదిలే శక్తి నాకు లేదు. లేకపోతె నీ చుట్టూ ఇలా తిరగవలసి వస్తుంది అని చెప్పింది. ఆ మరునాడు వాళ్ళు అదే ప్రకారంగా పెద్ద వాళ్ళందరినీ సంప్రదించి నైఋతి మూలలో ప్రదేశాన్ని త్రవ్వగా అక్కడ యంత్రాలు, తాంత్రికులు వాడే అనేక వస్తువులు కనిపించాయి.అవన్నీ బయటకు తీసి, ఒక సాధకుని చేత అవన్నీ బయట పారేయించి అక్కడ స్థల శుద్ధి చేశారు. ఆ తర్వాత రాత్రి  అందరూ కూర్చుని శ్రీ రాం లాల్ ప్రభువు గారి భజన చేసి, ఆయన గురించిన విషయాలు అన్నీ విని యథాప్రకారంగా వాళ్ళు వారి గదికి వెళ్లి పోయారు. ఆ రోజు రాత్రి ఎటువంటి సంఘటన జరగ లేదు. ఆ కామ పిశాచి, బాణావతి శక్తి నుంచి ఆకర్షించ బడి వచ్చినట్టి ఆ పిశాచి మాత్రం రాలేదు. అలా వాళ్ళు మెల్లగా మెల్లగా ఒక వారం వరకు చూశారు. ఎటువంటి సంఘటన జరగలేదు. “అమ్మయ్య” అని వాళ్ళంతా అప్పుడు ఊపిరి పీల్చుకున్నారు.

అయితే వాళ్లకి ఒక్క విషయం తెలిసింది, అర్థం అయింది. ఈ ప్రపంచంలో సాధువులు, సత్పురుషులు సిద్ధపురుషులు ఉంటారు , ఎన్నో సాధనలు చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళు చేసే ఆ సాధనలకి ఫలితం ఉంటుంది, ప్రభావం ఉంటుంది. వాళ్లకి కొద్దిగా భక్తులని రక్షించే శక్తి కూడా ఉంటుంది. కాని అందరికన్నా పై స్థాయిలో సిద్ధ పురుషులే ఉంటారు. సిద్ధ పురుషుల భావాలెప్పుడూ శుద్ధంగానే ఉంటాయి. మనకు తెలిసినట్టుగానే మహాత్ములలో, యోగులలో అరిషడ్వర్గాలు ఎప్పుడో ఒకప్పుడు బయట పడుతుంటాయి. వాళ్లకి అహం అన్నది పూర్తిగా తగ్గి పోదు. కామ, క్రోధ, మద,లోభ, మోహ మాత్సర్యాలని వాళ్ళు సంపూర్ణంగా జయించలేని పరిస్థితిలో ఉంటారు. కాకపొతే వాళ్లకి కూడా ఎంతో కొంత శక్తి ఉంటుంది. ఈ అరిషడ్వర్గాలని జయించిన వాళ్ళనే సిద్ధ పురుషులుగా చెప్పుకోవడం జరుగుతుంది. సిద్ధ పురుషుల యొక్క శక్తి అపరిమితంగా అంటే పరిమితం లేకుండా, హద్దు లేకుండా కొన్ని మైళ్ళ వరకు వలయాకారంగా విస్తరించి ఉంటుంది. మనకి భక్తి శ్రద్ధలు ఎంత ఎక్కువగా ఉంటాయో మనకి వాళ్ళతో అనుసంధానం అంత బలంగా ఏర్పడి మనకి పిశాచ బాధలు, వేరే ఇతరత్రా బాధలు లేకుండా ఉంటాయి అని వాళ్లకి అర్థం అయింది. అప్పట్నుంచి వాళ్ళు శ్రీ రాంలాల్ ప్రభువు యొక్క గాఢమైన భక్తులుగా మారి పోయారు.

ఈ విధంగా ఆ మోహినికి కూడా విముక్తి కలిగింది అని అనుకోవాలి. ఈ కథ మాకు మా అమ్మగారు చెప్పారు. ఇందులో లోతైన విషయాలు అప్పుడు నా వయస్సుకి అందలేదు చాలా విషయాలు నాకు మా అమ్మగారు చెప్పారు కాని అవి నాకంత గుర్తు లేవు ఆ తర్వాత చాలా కాలానికి కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్య నారాయణ గారు “బాణావతి” అనే చిన్న పుస్తకం వ్రాసినప్పుడు ఈ యదార్థ కథని వివరించారు. అందులో ఇంకా ఎన్నో అద్భుత విషయాలు పిశాచాలకి సంబంధించినవి, ఈ మంత్రాలకి, తంత్రాలకి సంబంధించినవి, ఇతరత్రా ఎన్నోవిషయాలు  చాలా చక్కగా దానిలో పొందు పరచడం జరిగింది. నేను సుమారు పన్నెండేళ్ళ వయస్సులో ఉన్నప్పుడు ఈ కథ విన్నాను. ఈ కథ నా మనస్సులో గాఢ౦గా నాటుకుపోయింది అయితే కొన్నాళ్ళ తర్వాత ఉద్యోగరీత్యా నేను 1975లో దోమలగూడాలో  ఒక ఇంట్లో అద్దెకు ఉన్నప్పుడు అక్కడ నాకొక రాంలాల్ అనే మితృడు పరిచయమయ్యాడు. అతను వాళ్ళ పరివారమంతా శ్రీ రాంలాల్ ప్రభువు భక్తులని చెప్పడం జరిగింది. ఆ విధంగా నేను నా జీవితంలో శ్రీ రాంలాల్ ప్రభువు గురించి రెండవసారి విన్నాను. మళ్ళీ 2000సంవత్సరంలో శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారి “శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం” లోశ్రీ రాంలాల్  ప్రభువు గురించిన వృత్తాంతం చాలా ఉత్సాహంగా చదివాను, విన్నాను. అది చదివిన కొన్ని రోజులకే ఒక మహానుభావుడైన కొండల రావు అనే శ్రీ రాంలాల్ ప్రభువు యొక్క ప్రశిష్యుణ్ణి దర్శించడం జరిగింది.

ఆయనకి ఏదో తెలియని ఒక ఆధ్యాత్మిక బంధాన్ని శ్రీ రాంలాల్ ప్రభువు వేశారు. నాఅదృష్టం ఏమిటంటే ఆయన హైదరాబాదుకి వచ్చినప్పుడు ప్రత్యేకంగా మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించి, ఒక గంట పాటు శ్రీ రాంలాల్ ప్రభువు గురించి ఆయన చెప్పడం జరిగింది. ఈ రకంగా ఆయన భక్తులతో నేను సంబంధం పెట్టుకున్నాను. ఎందుకంటే 1951 లోనే మా అమ్మ గారు చంటి పిల్లవాడినైన నన్ను షిర్డీ క్షేత్రానికి తీసుకుని వెళ్ళారు. అప్పట్నుంచి నాకు దత్తుడికి సంబంధించిన మహాత్ముల చరిత్రలు చదవడం, వారిని దర్శనం చేసుకోవడం కూడా జరిగింది. ఆ రకంగా దత్త బంధువైన శ్రీ రాంలాల్ ప్రభువు గురించి విన్నప్పుడు నాలో ఒక ప్రేరణ కలిగింది. ఎలాగైనా మనం శ్రీ రాంలాల్ ప్రభువు వృత్తాంతం సంక్షిప్తంగా చెప్పాలనే కోరిక కలిగింది. అది ఎన్నేళ్ళనుంచో ఉంది. అది సాక్షాత్తు ఈ నవరాత్రి పర్వంలోనే  చెప్పాలనే ప్రేరణ శ్రీ రాంలాల్ ప్రభువే కలిగించారు. అయితే ఆయన జీవిత చరిత్ర చెప్పే ముందు నాకెందుకో ఈ యదార్థ సంఘటన (అంటే ఈ కామిని పిశాచం మోహిని కథ) గురించి చెప్పాలని అనిపించింది.  దాన్ని బట్టి  నాక్కూడా చిన్నప్పుడు మనం పూజలు  చేస్తుంటాము, గాయత్రి మంత్రం చదువుతూ ఉంటాము అయినా కూడా ఇటువంటి క్షుద్ర శక్తులు ఉంటాయా? మరి భగవంతుడు సర్వ శక్తిమంతుడు కదా! అని ఒక ప్రశ్న ఎప్పుడు నా మనస్సులో ఉంటుండేది . మరి నేను చదివిన పుస్తకాల వల్ల , మా అమ్మగారు చెప్పిన ఈ యదార్థ కథ ద్వారా ఎక్కడ “మంచి” ఉంటుందో, అక్కడ “చెడు” కూడా దాన్ని అంటు పెట్టుకుని ఉంటుందని నాకు అర్థం అయింది. మరి అయితే గాయత్రిమంత్రం, హనుమాన్ చాలీసా మరి వీళ్ళంతా చదివినా కూడా ఎందుకు ఆ దుష్ట శక్తిని నిరోధించ లేకపోయారు ? అనే ప్రశ్న కూడా మనందరి మనస్సులో కలిగింది. హనుమాన్ చాలీసా చదివితే భూత పిశాచాలు మన దగ్గరకి రావని అంటుంటారు. అలాంటప్పుడు మరి ఎందుకిలా జరిగింది? అని మనకి మనం విశ్లేషించు కున్నప్పుడు నాకేం అనిపించిందంటే మన సాధన చాలా తీవ్రంగా ఉన్నప్పుడే మనం ఆ దైవిక శక్తిని ఎక్కువగా ఆకర్షించ గలుగుతాము. అంతే కాని మనకి ఏవో ఆపదలు, అవాంతరాలు కలిగినప్పుడు ఏదో అద్భుతం జరగాలని మనం అప్పటికప్పుడు హనుమాన్ చాలీసా చదవడం కాని లేకపోతే ఇంకా ఏవేవో చేయడం వల్ల అంతగా ప్రయోజనం ఉండదు అని నాకనిపించింది. మనం ఎంత ఎక్కువగా సాధన చేస్తామో, మనలోపల భగవంతుని అయస్కాంత శక్తి ఒక దివ్యమైన జ్యోతిస్వరూపంలో ఉంటుంది ,అది క్రమ క్రమంగా పెరుగుతూ ఉంటుంది ఆ జ్యోతి సమీపంలోకి  పిశాచగ్రహాలు గాని వాటి యొక్క శక్తి గాని దీనిముందు నిర్వీర్యమై పోతుంది అని నాకనిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనా మనం సాధన చేసుకుంటూ పవిత్రమైన మనస్సుతో ఉండి నలుగురికీ మంచి చేస్తున్నప్పుడే ఆ భగవంతుని శక్తి మనని ఎల్లవేళలా కాపాడుతూ ఉంటుందని ఇవన్నీ చూశాక, ఈ కథలన్నీ విన్నాక నాకనిపించింది. దత్తుని యొక్క అంశావతారమంటారు, గాయత్రి మాత సంపూర్ణ స్వరూపం అంటారు ఆ శ్రీ రాంలాల్ ప్రభువుగారిని, త్వరలోనే మనం ఆయన చరిత్ర కూడా చెప్పుకుందాం. 
శ్రీ రాంలాల్ ప్రభువుకి జై
                                         ఓం శాంతి !   ఓం శాంతి !    ఓం శాంతి !