గాయత్రి మంత్రం మహిమ
ఆర్య సమాజ స్థాపకుడైన స్వామి
దయానంద సరస్వతి గారు గుజరాత్ రాష్ట్రంలో పుట్టారు. ఆయనకి చిన్నప్పట్నుంచే
ఆధ్యాత్మికత అంటే చాలా ఆసక్తిగా ఉండేది. కుటుంబంలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక
వాతావరణం ఉండడంతో అతనికి ఈ విషయాల మీద ఆసక్తిగా ఉండేది. అయితే ప్రతి భారతీయుడు
హిమాలయ పర్వతాల గురించి ఎంతో గొప్పగా వింటూ ఉంటాడు. అక్కడ మహర్షులు, సాదువులు,
సిద్ధపురుషులు, చాలా యోగ శక్తులున్నవాళ్ళు, నిరంతరం తపస్సు చేసుకుంటూ ఉంటారని మన
పెద్దవాళ్ళు మనకి నిరంతరం చెప్తూ ఉండడం, పుస్తకాలలో కూడా అదే ప్రస్తావన ఉండడంతోటి
ఆయనకి చాలా చిన్న వయస్సులోనే హిమాలయ పర్వతాలకి వెళ్లాలని, అక్కడ తన గురువుని
వెతుక్కోవాలని చాలా ఆత్రుతగా ఉండేది. ఆయన మంచి ఆరోగ్యవంతుడుగా, దృఢ౦గా, దివ్యమైన
ముఖ వర్చస్సుతో ఉండేవాడు.
ఆయన మనస్సులో ఎప్పుడు కూడా
హిమాలయ పర్వతాలు, తన గురువునే ఊహించుకుంటూ ఉండేవాడు. ఎలాగోఅలా ఆయన ధైర్యం
చేసి ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా చిన్న వయస్సులోనే హిమాలయ పర్వతాలవైపు ప్రయాణం
చేశారు. అష్టకష్టాలు పడి మొత్తానికి హిమాలయ పర్వతాలకి ముందుగానే ఈ హరిద్వార్,
హృషీకేష్ వంటి ప్రదేశాలకి చేరుకున్నారు. అయితే అక్కడ ఆయనకి ఈ సాధువులు, సన్యాసులు,
పెద్ద పెద్ద మఠాధిపతులు కలవడం, ఇతని ముఖంలో కనిపిస్తున్న వర్చస్సుని చూసి వాళ్ళు
ఆశ్చర్యపడి ఆయన్ని తమ మఠంలో శిష్యునిగా ఉండమని చెప్పడం, అలాగే అని ఆయన ఆ ఆశ్రమంలో
ఉండి ఆ సాధువులకి శుశ్రూష చేస్తూ ఉండేవాడు. ‘దూరపు కొండలు నునుపు’ అన్నట్టుగానే
మనకి ఎవరైనా సాధువులు, సన్యాసులని దూరంగా చూస్తుంటే వాళ్ళుచాలా గొప్పవాళ్ళ లాగా
కనిపిస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనం వాళ్ళ సహచర్యంలో ఎక్కువ కాలం గుపుతూ ఉంటామో,
దగ్గరే ఉండి శుశ్రూష చేస్తూ ఉంటామో అప్పుడు వారి నిజస్వరూపం బయటపడుతుంది. అలాగే
ఈయన చేరిన ఆశ్రమంలో ఆశ్రమాధిపతులు గాని, పీఠాధిపతులు గాని బోలెడంత డబ్బులు
భక్తుల దగ్గర్నుంచి తీసుకుంటూ ఉండేవాళ్ళు. భక్తులకి కూడా ఈ గురువుల మీద అపారమైన
నమ్మకం ఉండేది.
వారు ఏ పనులైనా సాధించగలరనే
నమ్మకంతో వాళ్ళు రావడం వస్తురూపేణా, ధన రూపేణా ఎంతో కొంత సమర్పిస్తూ ఉండడం జరుగుతూ
ఉండేది. ఆ డబ్బుతో వాళ్ళు ఎంతో ఆస్తుపాస్తుల్ని కొనుక్కోవడం ఈ విధంగా వాళ్ళు
అలౌకిక జీవనం నుండి వాళ్ళు లౌకిక జీవనం వైపు పతన౦ కావడం, వాళ్ళలో కూడా
అరిషడ్వర్గాలున్నాయని ఈయనకి తెలియడం, దా౦తో ఈయన నిరాశ చెంది ఆ మఠాధిపతి
దగ్గరనుండి, ఆ మఠ౦ నుండి వదిలి వెళ్ళడం గురువుని వెతుక్కుంటూ వెళ్ళడం, ఈ
రకంగా అనేక మంది కపట గురువులని, సాధువులని ఆయన గమనించారు. మనకి ఇప్పుడుకూడా
హిమాలయాల్లో కనిపించేది ఇలాంటి కపట సాధువులే. ఏవో చిన్న చిన్న మాయలు, మర్మాలు చేసి
ప్రజల్ని భ్రమి౦పజేస్తూ ఉంటారు. సామాన్య మానవునికి కూడా కావలసింది ఇదే కదా !
ఆధ్యాత్మికతను చూడకుండా ఇలా మాయలు చేస్తుండేవాళ్ళ కే భక్తులు నీరాజనం పడుతూ
ఉంటారు. ఇలా అనేక ఆశ్రమాలు తిరిగి, అనేక పీఠాధిపతుల్ని చూసి ఆయన చాలా నిరాశ చెంది
వెతుక్కుంటూ, వెతుక్కుంటూ తన ప్రయాణాన్ని కొనసాగించారు. అలా అష్టకష్టాలు పడుతూ
భౌతికంగా అంటే శారీరకంగా ఎన్నో బాధలు ఓర్చుకుని , చివరకి ఆయన తనకి తెలియకుండానే ఒక
పెద్ద గుట్టలో ముళ్ళపొదల్లో పడడం, ఒళ్ళంతా ముళ్ళు గీరుకుని అష్టకష్టాల మీద
దానినుండి బయటపడడం జరిగింది. ఆయనకి ఒక చిన్న గుహ కనిపించింది. నది యొక్క చిన్న పాయ
అతనికి అక్కడ కనిపించగా దారి తెలుసుకుని అప్పటికే ఎంతో ఆకలిగా ఉన్నాడు ఈయన
అలాగే ఆ గుహలోకి వెళ్ళినప్పుడు అక్కడ వృద్ధుడైన ఒక తపస్వి కనిపించాడు. ఆయన
ఇతన్ని గుర్తు పట్టి వచ్చావా నాయనా! అని అనడం ఎందుకో ఈ బాలునికి ఆయన్ని
చూడగానే ఆయనే తన గురువని మనస్సులో స్ఫురించడం జరిగింది.
కుర్రాడి కథంతా విన్నాక ఆ
కుర్రాడు ప్రాధేయపడ్డాక ఆ వృద్ధుడు ఆ కుర్రాడిని అంటే దయానంద్ ని తన శిష్యుడిగా
తీసుకున్నాడు. ఆ వ్రుద్ధుడే గిరిజానంద స్వామి గారు ఆయనకి కళ్ళు సరిగ్గా కనపడవు.
ఆయన గాయత్రి ఉపాసకుడు. వాళ్ళిద్దరూ ఒక ఒడంబడిక చేసుకున్నారు. దాని ప్రకార౦ దయానంద్
ఏ రోజు పాఠం ఆ మర్నాడే గురువుగారికి అప్పచెప్పాలి. ఒక వేళ పాఠం
అప్పచెప్పకపోతే గురువుగారు ఆ రోజు పాఠం చెప్పను అని ఖండితంగా చెప్పారు. కాని
దయానంద్ ఏకసంతాగ్రాహి కనుక గురువుగారు చెప్పిందంతా ఆ మర్నాడే అప్పచెప్పుతూ
ఉండేవారు. అంతకు మునుపు గురువుగారు చెప్పినట్టుగానే దయానంద్ గాయత్రి మంత్రం సాధన
చేస్తూ ఉండేవాడు. ఆ రోజుల్లో బ్రాహ్మణులకి చిన్నతనంలోనే ఒడుగు చేయడం పరిపాటి.
ఎనిమిదేళ్ళ వయస్సులోనే ఉపనయనం చేస్తుండేవాళ్ళు.
నిరంతరం గాయత్రి సాధనతోపాటే
గురువుగారు చెప్పిన ఆధ్యాత్మిక విషయాలన్నీ, వేదాలన్నీ కంఠతా పడ్తుండేవాడు. అలాగే
గురువుగారికి శుశ్రూష చేస్తుండేవాడు. చుట్టుప్రక్కలనుంచి పళ్ళు-ఫలాలు తీసుకుని
రావడం, దాహం తీర్చడానికి నీళ్ళు తీసుకుని రావడం ఇవన్నీ చేస్తూ ఉండేవాడు. అయితే ఒక
రోజు దయానంద్ గురువుగారు చెప్పిన పాఠాన్ని అప్ప చెప్పలేక పోయినప్పుడు గురువుగారు
నేను చెప్పిన పాఠమంతా నీవు నాకు అప్ప చెప్పెంతవరకు నేను నీకు పాఠం చెప్పను అని
చెప్పారు. ఈ మాట విని దయానంద్ ఏమాత్రం భయపడకుండా గాయత్రి మాతను తల్చుకుని,
అప్పటికే ఎంతో విశేషంగా గాయత్రి సాధన చేశాడు కనుక ఆ గాయత్రి మాతనే ప్రార్థించి
గాయత్రి మంత్రాన్ని చదువుతుండగా ఆయనకి గురువుగారు అంతక్రితం రోజు చెప్పిన
పాఠాలన్నీ గుర్తుకి వచ్చి అవన్నీ గురువుగారికి అప్పచెప్పాడు. దాంతో ఆ గురువుగారు
ఎంతో సంతోషించి కొత్త పాఠం నేర్పించడం ఇలా జరుగుతూ ఉండేది. ఇలా గురువుకి శుశ్రూషలు
చేస్తూ, గురువుగారి దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నాక గురువుగారు ఒక రోజు దయానంద్
ని పిలిచి నీవు సమాజానికి సేవ చేయాల్సిన సమయం వచ్చింది కనుక నీవు ఇక్కడ్నుంచి
ఇక బయలుదేరవచ్చును అని చెప్పారు. ఆయన గురువుగారి ఆశీర్వాదం తీసుకుని ఆయన బయట
ప్రపంచానికి వచ్చి ఈ ఆర్య సమాజం అనే సంస్థను స్థాపించడం జరిగింది. అయితే మన
భారతీయులందరికీ ప్రామాణికం మన వేదాలు, దాంట్లోనే ఉన్నటువంటి ఉపనిషత్తులు. ఇవి
సామాన్య జనానికి అర్థం కావడం లేదని అష్టాదశ పురాణాలు రావడం జరిగింది. ప్రజలందరికి
కథలరూపంలోచెప్తేనే ఆకర్షణ ఉంటుంది. దురదృష్టవశాత్తు ఈ పద్దెనిమిది పురాణాల్లో
నిక్షేపాలు అంటే అసత్యాలు చాలా ఉన్నాయి. ఎవరికి వారు వారికి తోచిన రీతిలో వారు
పూజించే దేవుడే గొప్పవాడనే భావనతో, అతిశయోక్తులతో ఈ పుస్తకాలు వ్రాయడంతో జనాల్లో
ఒకరకమైన తికమక ఏర్పడింది. చాలా మంది ఈ క్రైస్తవ మతానికి ఆకర్షింపబడి గొప్ప గొప్ప
విద్యావేత్తలంతా హిండుమతంనుండి దూరంగా వెళ్లి పోసాగారు. స్వామి విజయానంద
సరస్వతి తన శిష్యుడికి దయానంద సరస్వతి అని బిరుదుని ఇవ్వడం జరిగింది. ఈ పురాణాల్లో
ఉన్నటువంటి లేనిపోని తర్కానికి అందనటువంటి అతిశయోక్తులు. అసమద్ధంగా ఉండే విషయాల్ని
ఆయన బాహాటంగా ఖండిస్తూ ఇలా అయోమయ పరిస్థితిలో ఉన్న యువతీయువకులని ఒక
శాస్త్రీయపరంగా ఆధ్యాత్మికతను బోధించడం, సనాతన ధర్మంలో ఉన్నటువంటి ముఖ్యంగా
వేదాలు, ఉపనిషత్తులు ప్రమాణంగా ఉన్నటువంటి అనేక విషయాలన్నీ క్రోడీకరించి చాలా
సరళంగా పుస్తకాలు వ్రాయడం మొదలు పెట్టారు.