దేవదత్తుని వృత్తాంతం - 8
ఈ విధంగా ఎంతో అద్భుతంగా వల్లభ దాసు శ్రీ దత్తాత్రేయుని అవధూత తత్వం చెప్పడం నాగనాథునికి చాలా సంతోషం కలిగింది. వల్లభ దాసు జీవితంలో కొన్ని ప్రధాన ఘట్టాల్ని అయన అవలోకించారు. వల్లభ దాసు ఒక పేద రైతు కుటుంబంలో పుట్టినప్పటికీ వారి తల్లిదండ్రులు ఎంతో ధర్మపరాయణులు. ఏదో విధంగా కొద్దిగా ఉన్న భూమిను సాగు చేసుకుంటూ సంతృప్తిగా జీవనం సాగిస్తున్నారు. వల్లభ దాసు తల్లిదండ్రుల వంశం అంతా కూడా సాక్షాత్తు శ్రీపాద శ్రీవల్లభుని భక్తులు. వారు ప్రతి రోజు దేవుడికి అంటే శ్రీపాద శ్రీవల్లభునికి నైవేద్యం పెట్టిన తర్వాతే వాళ్ళు భోజనం చేస్తూ ఉండేవారు. వారింటికి ఏ సమయంలో అతిథులు వచ్చినా వారికి కడుపు నిండా భోజనం పెట్టి పంపేవారు. ఇటువంటి మంచి సంస్కారమున్న ఇంట్లో పుట్టి ,పెరిగినందుకు వల్లభ దాసుకి ఆ దత్తుని మీద, ఆ శ్రీపాద శ్రీ వల్లభుని మీద ఎనలేని భక్తి భావం కలిగింది. అతనుకూడా ఎల్లప్పుడూ ఆ దత్తుని ధ్యాసలోనే, ధ్యానంలోనే గడుపుతూ ఉండేవాడు. ఇది చూసిన తల్లిదండ్రులకి తమ పుత్రుని మీద అమితమైన ప్రేమ కలిగింది. వాత్సల్యం పొంగి పొరలింది. వల్లభ దాసు గంటలు గంటల తరబడి ధ్యానం చేస్తూ ఉండేవాడు. అందరి పిల్లలలాగా అతను ఆటపాటల్లో సమయం గడపకుండా ఎక్కువగా ధ్యానంలోనూ, మరియూ ఆ చుట్టుప్రక్కల ఎక్కడైనా సరే ఎవరైనా పురాణ ప్రవచనాలు చెప్పుతున్నారంటే, ఎంత దూరమైనా అక్కడికి వెళ్లి వస్తుండే వాడు. ఆ ఊరి చివర ఉన్నశివాలయంలో వల్లభ దాసు వీళ్ళందరూ వెళ్లి ధ్యానం చేస్తుండేవాళ్ళు.
ఒక సారి ఆ ఊరికి వచ్చిన ఒక అవధూతగా చెప్పబడే ఒక గురువు గారు తన శిష్య బృందంతో అక్కడ మకాం వేసి భక్తులందరికీ ప్రత్యేక దర్శనాలు, పాదపూజలు ఇస్తుండేవాళ్ళు. ఆ అవదూతేంద్ర స్వామిగా చెప్పబడే అతని శిష్యులు చుట్టుప్రక్కల ఊళ్ళకి వెళ్లి తమ గురువుగారి గురించి చాలా గొప్పగా ప్రచారం చేయ సాగారు. తమ గురువుగారికి చాలా మహిమలు ఉన్నాయని, అతను సాక్షాత్తు దత్తాత్రేయుని అంశ కలిగిన అవధూత అని ప్రచారం చేయడంతో చాలామంది ఆయన దర్శనానికి రావడం, అక్కడ పాద పూజ చేసినందుకు కొంత దక్షిణ ఇచ్చి, చేతికి తోరణం రక్షరేఖ కట్టినందుకు కొంత దక్షిణ, ఆయన దర్శనం ఇప్పించినందుకు ఆయన శిష్యులు భక్తుల దగ్గర్నుంచి కొంత దక్షిణ డబ్బు రూపం లో, వస్తు రూపం లో సేకరించ సాగారు. ఒక సారి వల్లభ దాసు అక్కడికి వెళ్లి నప్పుడు, పిల్లవాని ముఖం లోని తేజస్సును గమనించి ఆ అవధూతానంద స్వామి వారు వల్లభ దాసుని పిలిచి, గౌరవించి తనతో పాటు రమ్మని ఆదేశించారు. వల్లభ దాసు కూడా మిగతా భక్తుల మాదిరిగానే ఆయన గురించి చాలా గొప్పగా ఊహించుకున్నాడు. ఆ గ్రామం నుండి వెళ్ళిపోతూ ఆ అవధూతానంద స్వామి వారు వల్లభ దాసుని కూడా తమతో పాటు తీసుకుని వెళ్లి పోయారు.
ఆ అవధూతకి ఒక పెద్ద ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో కూడా చాలామంది సేవకులు ఉన్నారు. అందులో కొంత మంది వంట పని చేస్తూ ఉంటారు, కొంత మంది గురువు గారి బట్టలు ఉతుకుతూ ఉంటారు, ఆయనకి ఎంతో సేవ చేస్తూ ఉంటారు. ఒక రోజు ఆయన ఆశ్రమంలో భజనలు, కీర్తనలు అయిపోయినాక చుట్టుప్రక్కల గ్రామాల నుండి వచ్చిన భక్తులు తాము తెచ్చిన కానుకలు, దానదక్షిణలు సమర్పించి వెళ్లి పోయాక ఆ శిష్యులంతా గురువుగారికి వచ్చిన డబ్బులు లెక్క చెప్పడం ఇదంతా చూసిన వల్లభ దాసుకి కొంచెం నిరాశ కలిగింది. వారంతా భోజనం చేశాక గురువు గారి చుట్టూ మూగి యేవో భజనలు పాడసాగారు. ఆ అవధూతానంద స్వామి వారు వల్లభ దాసుని పిలిచి స్వయంగా తాను త్రాగుతున్న చిలుముని త్రాగమని చెప్పారు. అంటే అక్కడ చుట్టూ కూర్చుని ఉన్నఆ శిష్యులందరూ ఆ గంజాయిని త్రాగుతూ, ధూమపానం చేస్తూ ఆ మత్తులో పడి పాటలు పాడుతున్నారు, కొంత మంది గంతులు వేస్తున్నారు. ఇదంతా చూసిన వల్లభదాసు కి చాలా ఆశ్చర్యం వేసింది. అతను ససేమిరా తనకి ఇష్టం లేదని, తాను ఆ గంజాయిని త్రాగనని చెప్పాడు. ఏమీ ఫరవా లేదు, నీ ఇష్టదైవం కనిపిస్తాడు, త్రాగు అని ఎంత చెప్పినా వల్లభ దాసు తీసుకోలేదు.