N. Sairam Garu || Email: sridatta50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.

Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here

Tuesday, 29 October 2013

Vaakku - Praamukhyata

వాక్కుప్రాముఖ్యత
మనం ఎన్నో ఆధ్యాత్మిక గ్రంధాలు చదువుతూ ఉంటాము, కాని వాటిలోని మంచి విషయాలని ఎంత వరకు గ్రహించి ఆచరణలో పెట్టాము అనేది ముఖ్యము. శ్రీపాదవల్లభ చరితామృతము ద్వారా మనకెన్నో మంచి విషయాలు బోధింపబడ్డాయి. అందులో ప్రముఖముగా చెప్పుకోవలసినది వాక్కు, దాని ప్రాముఖ్యత.

మనలో నూటికి తొంభై శాతం మంది ప్రతి రోజు ఏదో సందర్భంలో మన బంధువులనో, స్నేహితులనో లేదా మన ఇంట్లో వారినో దూషించడమో లేక వారు లేనప్పుడు వారి గురించి చెడుగా మాట్లాడుకోవడమో చేస్తూనే ఉంటాము. ముఖ్యంగా మన దైనందిన కార్యక్రమాలలో ఇంట్లో పనివారిని, ఆఫీసుల్లో మన కింద పనిచేసేవారిని, ఇంకా చెప్పాలంటే అత్త కోడలిని, కోడలు అత్తని, తండ్రి కొడుకుని ఇలా కొంతమంది మీద మనం ఊరికే నోరు పారేసుకోవడం చూస్తూ ఉంటాము.ఒకరిని దూషించడంవలన కాని, చెడుగా మాట్లాడుకోవడం వలన కాని మనకేం లభిస్తుంది అని ఒక్కసారి ఆలోచించుకోవడం ఎంతైనా అవసరం. లోపాలు అనేవి ప్రతి మనిషిలోను ఉంటాయి. వాటిని సాకుగా చేసుకుని ఎదుటవ్యక్తిని సూటిపోటి మాటలతో కించపరచడమో, లేక చెడుగా మాట్లాడటమో సరికాదు. వీలైతే లోపాలను అధిగమించడానికి వారికి సాయం చెయ్యాలి, లేదంటే మౌనం వహించాలిఎదుటవారిని విమర్శించే ముందు, మొదట మన గురించి మనం ఆత్మవిమర్శ చేసుకోవడం, మన లోపాల గురించి విశ్లేషించుకోవడం మొదలుపెట్టాలి.

ఒకానొక సందర్భంలో బాబా ఆస్థానంలో ఇద్దరు వ్యక్తులు గొడవపడటం జరిగింది. దానిలో కాస్త బలవంతుడైన వ్యక్తి రెండవ వ్యక్తిని అందరిముందు నానా దుర్భాషలాడాడు. పాపం రెండవ వ్యక్తి ఇతని తిట్ల ధాటికి చాలా బాధపడి అక్కడినుంచి నిష్క్రమించాడు. మరుసటి రోజు మొదటివ్యక్తి బాబాతో "చూసారా బాబా, వాడిని ఎలా కడిగేసానో" అని గొప్పగా చెబుతాడు. దానికి బాబా అక్కడి దగ్గరలో ఒక పందిని చూపించి "శుద్ధమైన పదార్ధాలను వదిలిపెట్టి  పంది ఆశుద్ధాన్ని మాత్రమే ఎంత ప్రేమగా తింటూ ఉందో చూసావా! నువ్వు కూడా దానిలాంటి వాడివే. సాటి మనిషిలోని శుద్ధ గుణాలను వదిలిపెట్టి, వాడిలోని ఆశుద్ధాన్ని నీ నోట్లో వేసుకుంటున్నావు. పవిత్రమయిన మానవ జన్మనెత్తి ఇలా పందిలా ప్రవర్తించడం నీకేమైనా బాగుందా?" అని సుతిమెత్తగా మందలించారు.

మనం మాట్లాడే ప్రతిమాట వాయుమండలంలో చేరి, వాటి యొక్క సారమే మనం చేసే ప్రతి పనిలో ప్రస్ఫుటిస్తుంది. మనం ఎటువంటి భావాలనైతే ఎదుటవారి మీద ప్రదర్శిస్తామో, అవే భావాలు తిరిగి మనకి ఎదురవుతాయి. ఉదాహరణకి మనం ఒకరి మీద ద్వేష భావం పెంచుకుంటే, వారి నుంచి కూడా తిరిగి మనకి అవే భావాలు ఎదురవుతాయి. అందువలన మనం మాట్లాడే ప్రతి మాటలో, ప్రదర్శించే ప్రతి భావంలో ప్రేమ, కరుణ నిండి ఈర్ష్యద్వేషాలు, కోపం వంటి అరిషడ్వర్గాలను  అధిగమించాలి. ఇంకొకరి గురించి నిర్దయగా ఆలోచిస్తే ఆలోచనలు మన ముందు కూడా ప్రత్యక్షమవుతాయి. అలాంటి ఆలోచనలతో మనం ఇంకెవరికీ హాని కలిగించలేము. మనం మనకే హాని కలిగించుకుంటాము. అదే మనం ప్రేమతో నిండిన ఆలోచనలు చేస్తే వాటివల్ల ఎవరికి లాభమో చెప్పండి చూద్దాం - మనకే!

 మనం ఒకరిమీద ఫిర్యాదులు చేస్తుంటే, ఆకర్షణ సిద్ధాంతం మన జీవితంలోకి మరికొన్ని అసంతృప్తికరమైన పరిస్థితులని మోసుకొస్తుంది. ఇంకొకరు చేసే ఫిర్యాదుని వింటూ దానిమీద దృష్టి కేంద్రీకరిస్తే, వాళ్ళ పట్ల సానుభూతి చూపిస్తే, వాళ్ళు చెప్పే విషయాలతో ఏకీభవిస్తే, క్షణంలో, మనం అసంతృప్తిపడగల మరిన్ని పరిస్థితులని మన జీవితంలోకి ఆహ్వానిస్తున్నట్లే.

ఒకసారి ఒక బ్రాహ్మడు కడుపునొప్పితో బాధపడుతూ శ్రీ పాదుల వారి వద్దకు వచ్చి, తనను ఎలాగైనా బాధ నుంచి రక్షించమని శరణు కోరాడు. దానికి శ్రీ పాదులవారు "నువ్వు పూర్వజన్మలో ఎందరినో నీ వాక్బాణాలచే బాధపెట్టావు, దాని ఫలితంగానే నీకు వ్యాధి వచ్చింది," అని శ్రీపాదుల వారి నామస్మరణ చేయించి అతని బాధ నివారించారు.
తరువాత శ్రీ పాదులవారు యిట్లనిరి "వాయుమండలం అంతయును ఈనాడు తప్పుగా మాట్లాడబడే వాక్కులతో నిండిఉన్నది. మానవుడు ఏదయినా ఒక వాక్కును ఉచ్చరించునపుడు, ప్రకృతిలోని సత్వరజస్తమో గుణములలో ఏదో ఒక గుణమును రెచ్చగొట్టుచున్నాడు. రెచ్చగొట్టబడిన గుణములు మంచికి దోహదము చేయని కారణమున పంచభూతాల మీద దుష్ప్రభావము చూపించి, దాని వలన మనిషి మనస్సు, శరీరము, అంతరాత్మ దూషితములగుచున్నవి. తద్వారా మానవుడు పాపకర్ముడయ్యి, దరిద్రుడగుచున్నాడు. దరిద్రము వలన తిరిగి పాపము చేయుచున్నాడు". వీటినుండి విముక్తి కావలెనన్న భగవన్నామ స్మరణ ఒక్కటే శరణ్యము. నామము నాలుక మీద ఉండుట కారణంగా పవిత్రమయిన వాక్కులు పలుకుట అలవాటగును. నామము జపించినపుడు మనస్సు దైవము మీద లగ్నమయ్యి, పవిత్రమగును. తద్వారా పవిత్ర కర్మలను చేయుటకు ప్రేరణ కలుగును".

దీనిని బట్టి మనము తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే కేవలం భగవన్నామ స్మరణ వలన మాత్రమే మనం మన వాక్కుని నియత్రించుకోగలం. పూర్వకాలంలో అందరూ గాయత్రీ మంత్రాన్ని విధిగా జపించేవారు, దాని వలన వారి వాక్కులో ఎంతో  పరిశుద్ధత కలిగి, ఎంతో విలువ ఉండేది. అదే విధంగా ఈనాడు మనం మన వాక్కును శుద్ధి చేసుకోవటానికి వీలైనన్ని సార్లు గాయత్రీ మంత్రమును జపించవలెను.

గాయత్రీ మంత్రం:
“ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య
ధీమహి ధియో యోనః ప్రచోదయాత్  |”

భావము:  నాలోని సమస్త పాపములను, రోగాలను, కుసంస్కారాలను పోగొట్టి నాలోని  సవితాశక్తిని నింపు      
"ప్రతి మానవుడు మానవజన్మ తీసుకోకముందు శబ్దరూపముగా ఉండి తీరవలసిందే" అని శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము తదుపరి ఖండములో వివరించబడెను.


విషయసేకరణ - శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము, శ్రీ సాయిబాబా చరిత్ర, పూజ్యగురుదేవులు శ్రీరామశర్మ ఆచార్యుల ప్రచురణలు, రహస్యం (The Secret), శ్రీ గోవిందదీక్షితుల గారి ప్రవచనముల నుండి..



Beloved Devotees, we have created a new page named as “Random Thoughts”. This is created for the devotees who wish to express or share their spiritual thoughts.

Please send your thoughts to the below mentioned email so that we will have a look and post it in the website.


While sending the articles, please mention your personaldetails as well. Email id: raghuprasadpalaparthy@gmail.com