స్పిరుచ్యువల్ సూప్
14
ప్రతీ గురువారం
మేము ఎవరో ఒకరి ఇంట్లో కలిసి గంటసేపు దత్తాత్రేయుడు, షిరిడీ సాయిబాబా, ఆధ్యాత్మిక గురువుల
గురించి మాట్లాడుతూ ఉండేవాళ్లం. అందులో ఒక పదిహేను నిమిషాలు వేదాంతం, షిరిడీ సాయిబాబా
చరిత్ర, గురు చరిత్ర, దత్తపురాణానికి సంబంధించిన చర్చ కూడా నడుస్తూ ఉండేది. కుంబ్లే,
అనిల్, చారిగారు మా ఆధ్యాత్మిక బృందంలో సభ్యులు. ఒకసారి ఈస్టర్ పండుగ ముందు కుంబ్లేగారు
ఫోన్ చేశారు. కుంబ్లేగారు ఒక ఇటాలియన్ టూరిస్ట్ కంపెనీలో కంప్యూటర్ డివిజన్లో పని చేస్తూ
ఉండేవారు. నేషనల్ పార్కులో ఉన్న తమ కార్యాలయంలో రెండు కంప్యూటర్లలో సమస్య వచ్చింది,
దాన్ని బాగు చేయడానికి యాజమాన్యం అక్కడికి పంపిస్తోందని ఫోన్ చేసి చెప్పారు. అయితే
ఈస్టర్ పండుగ కాబట్టి ఒక్కరే వెళ్లడం ఎందుకు, ఎవరైనా స్నేహితులను కూడా వెంటబెట్టుకుని
వెళ్లమన్నారంటూ నాకు చెప్పారు. నన్ను గుర్తుపెట్టుకుని రమ్మన్నందుకు నేను చాలా సంతోషపడ్డాను.
కంపెనీకి
చెందిన ప్రత్యేక ఫ్లైట్లో కుంబ్లేగారు, నేను, చారితో పాటు మరొక మిత్రుడు కలిసి వెళ్లాం.
ఆ ప్రాంతం ఒక తూనీగలా ఉంటుంది. ఫ్లైట్ లో గంట ప్రయాణం తర్వాత ఒక అడవి ప్రాంతంలో దిగాం.
మేం దిగిన తర్వాత లాడ్జి నుంచి ప్రత్యేక జీపు మా కోసం వచ్చింది. ఆ వాహనానికి పైన మాత్రమే
టార్పాలిన్ లాంటి కవర్ ఉంది. అటూ.. ఇటూ.. ఏమీ లేదు, దాన్ని చూసి మేం డ్రైవర్ ను అడిగాం
“అరణ్యం మధ్య నుంచి మమ్మల్ని తీసుకువెళ్తున్నావు కదా, ఇక్కడ చాలా మృగాలన్నీ తిరుగుతున్నట్టు
ఉన్నాయి.. ప్రమాదం లేదా ?” అప్పుడు డ్రైవర్ అన్నాడు.. 'కొన్ని కొన్ని పార్కుల్లో జంతువుల
ప్రవర్తన ఒక్కోలా ఉంటుంది. అదే మసాయ్ మారా నేషనల్ పార్కులో మాత్రం మీరు ఇలాంటి జీపులో
వెళ్లి ఉండేవారు కాదు. ఎందుకంటే మీరు ఈ పాటికే ఏ సింహం కడుపులోనో ఉండేవారు' అని చమత్కరించాడు.
మేం కూడా అతనితో పాటు నవ్వుకుంటూ లాడ్జికి చేరాం. చాలా ఆకలి వేస్తూ ఉండడంతో మా కోసం
ఏర్పాటు చేసిన వెజిటబుల్ శాండ్ విచ్ తిన్నాం. ఆ సమయంలో హోటల్ మేనేజర్ మేం తీసుకోవాల్సిన
జాగ్రత్తలను వివరించారు. 'టెంట్ హౌస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే 'మసాయ్' అని పిలిస్తే
ఆ తెగకు చెందిన రక్షకుడు వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తారు. కొసమెరుపుగా ఆయన మరొక విషయం
చెప్పాడు. కొద్దిరోజుల క్రితం యూఎస్ నుంచి ఒక కుటుంబం వచ్చిందని, తాను చెప్పిన జాగ్రత్తలను
ఆ ఫ్యామిలీలోని పిల్లలు పట్టించుకోకపోవడం ఒక పిల్లాడిని చిరుతపులో, సింహమే తినేసిందనడంతో
మా అందరి గుండె ఝల్లుమంది. మాకు కేటాయించిన రూమ్ ఒక వైపు, క్యాబిన్ ఒకవైపు ఉంది. అప్పుడు
ఇంకా చీకటి పడలేదు కాబట్టి మేము ఏమీ భయపడలేదు. ఈ లోపు కుంబ్లేగారు తాను వచ్చిన రిపేర్
పనిని చూసుకుంటానన్నారు. రేపు ఉదయం జంగిల్ సఫారీ ఏర్పాటు చేయాలని అక్కడి వాళ్లకు సూచించారు.
ఈలోపు అక్కడ కూర్చుని మేం అంతా వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాం. కుంబ్లేగారు రెండు
గంటల పాటు కష్టపడ్డ తర్వాత ఆ కంప్యూటర్ రిపేర్ అయింది. రాత్రి అయిన తర్వాత మా కోసం
మసాయ్ వచ్చాడు. క్యాబిన్ నుంచి రూముకు బయలుదేరాం. నేను మాత్రం కాస్త భయంతో అటూ ఇటూ
చూస్తూ అడుగులు ముందుకు వేస్తున్నాను. అక్కడ బలమైన టెంట్ ఏర్పాటు చేశారు. అదంతా చాలా
శుభ్రంగా ఉంది. అక్కడ స్నానం చేసి కాసేపు విశ్రమించి మేమంతా రెస్టారెంటుకు వెళ్లాం.
ఈ లోపు రెస్టారెంట్ మేనేజర్ వచ్చారు. 'లాడ్జిలో దిగిన వాళ్లందరూ వస్తున్నారు, నెగడు
కూడా వేస్తున్నాము' కాబట్టి కాసేపు సరదాగా గడపాలని కోరారు. దాంతో నేను, చారి గారు కూడా
వెళ్లి అక్కడ చాలాసేపు సరాదాగా ముచ్చటించుకున్నాం. అక్కడ ఒక సరస్సు కూడా ఉంది. లాడ్జ్
మేనేజర్ దగ్గరున్న ఇన్ ఫ్రారెడ్ బైనాక్యులర్ తో సరస్సు అందాలను, అందులో ఉన్న హిప్పోపోటమస్
లను అందరికీ చూపిస్తున్నారు. కాసేపటి తర్వాత మేమంతా మళ్లీ మా క్యాబిన్ కు వెళ్లిపోయాం.
ఉదయం నుంచి అంతా అలిసిపోయాం కాబట్టి డిన్నర్ చేసి పడుకున్నాం.
నాకు సాధారణంగా
అడవులంటే ఇష్టం. ఆ వాతావరణంలో మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మా వృత్తిలో ఎప్పుడూ
ఆందోళనగా ఉండేది. అటువంటి ప్రపంచం నుంచి ఇలాంటి ప్రశాంతమైన అడవుల్లోకి రావడం, చెక్క
గృహాల్లో నివాసం నాకు చాలా ఆనందంగా అనిపించింది. అయితే నేను ప్రకృతిని ఆస్వాదించేందుకు
అక్కడున్న చెక్ ప్లాట్ ఫామ్ పైకి వచ్చాను. కీచురాళ్ల ధ్వనులు, సరస్సును, నిశ్శబ్దాన్ని
ఆస్వాదిస్తున్నాను. అలా ఆలోచిస్తూ అక్కడే ఉన్న ఆరామ్ కుర్చీలో నిద్రామయ స్థితిలో ఉండగా,
అకస్మాత్తుగా నాలో మంచి స్పందనలు అనుభూతిలోకి వచ్చాయి. నాకు మళ్లీ చాలా కాలం తర్వాత
అయస్కాంత వ్యక్తి దర్శనమైంది. ఏదో ఒక తెలియని
హాయి మనస్సుకు అనిపించింది. ఆయనకు వినయంగా నమస్కరించారు. "నీకు ఇంకా చాలా విషయాలను
చెప్పవలిసి ఉంది, అయితే పని ఒత్తిడిలో నీ మనసు వేరే ధ్యాసలో ఉండడం వల్ల నేను రాలేకపోయాను.
ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉన్నావు కాబట్టి ఇది నాకు అనుకూలమైన పరిస్థితి. నీకు కొన్ని
విషయాలను చెప్తాను " అని అయస్కాంత వ్యక్తి అన్నారు. అప్పుడు “మహాత్మా ప్రశాంతంగా
ఉన్న నాకు ఒక్కడికే మీరు కనిపిస్తారా లేక ప్రశాంతంగా ఉన్న ప్రతీ ఒక్కరికీ మీ దర్శనం
ఉంటుందా” అని అడిగాను. అప్పుడు ఆయన "మాకు ప్రతీ మానవుడు ఒక ప్రత్యేకమైనటువంటి,
అద్భుతమైనటువంటి వాళ్లలానే కనిపిస్తారు. కానీ తటస్థ వైఖరి, జిజ్ఞాస ఉన్నవాళ్లకు, సంకుచితమైన
ఆలోచనలకు దూరంగా ఉన్న నీలాంటివాళ్లకు మేం ఆకర్షింపబడతాం” అని ఆయన చెప్పుకొచ్చారు. “మీరు
ఏ కొత్త విషయాలు తెలుసుకున్నా దాని గురించి ఆలోచిస్తారు, వెంటనే ఖండించరు, పరిపరివిధాల
ఆలోచించి తటస్థ వైఖరిలో ఉంటారు కాబట్టే అలాంటివారి యొక్క తత్వానికి ఆకర్షితులవుతాం.
అందుకే నేను నీకు కనిపిస్తున్నాను. నేను నీకు చెప్పిన విషయాలను నువ్వు జనాలకు వివరించాలి.
నీలాంటి వాళ్లు వందలు, వేల మందికి మేం ఇలానే కనిపించి కొత్త విషయాలను చెప్తుంటాం. కానీ
అది వాళ్లకు తెలియదు. వాళ్లే ఏదో కొత్త విషయాలు తెలుసుకుంటున్నట్టు, కొత్త పనులు చేస్తున్నట్టు
అనుకుంటారు. కానీ నేను ప్రతీ మానవుడిలోనూ ఉంటాను. నేను లేకుండా ఏ జీవి కూడా ఉండదు.
నీలో, నీ మిత్రులలో, సమస్త ప్రకృతిలో వ్యాపించి ఉన్నాను. నేను అయస్కాంత క్షేత్రాన్ని
కాబట్టి నేను లేకుండా ఏదీ ఉండలేదు. ప్రస్తుతం ప్రపంచమంతా ఆధ్యాత్మికంగా, రాజకీయంగా,
సామాజికంగా అల్లకల్లోలంగా కనిపిస్తున్నాయి. పెద్ద పండితులు, మహానుభావులకే అనేక విషయాలు
అర్థం కావడం లేదు" అన్నారు.
అప్పుడు నేను
మహాత్మా 'నేను కూడా చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వెళ్తూ ఉంటాను. అక్కడ ఒక గురువు
గారు చెప్పిన మాటలకు విరుద్ధంగా మరొక గురువుగారు కొద్ది రోజుల తర్వాత మాట్లాడుతూ ఖండిస్తూ
ఉంటారు. పరస్పర విరుద్ధ విషయాలను మేం తరచూ వింటూ ఉన్నాం కాబట్టి నాకు అర్థం కాని ఈ
విషయాలను చెప్పమని' అయస్కాంత వ్యక్తిని నేను కోరాను. అప్పుడాయన అన్నారు "పుట్టినప్పటి
నుంచి చాలామంది చాలా ఆలోచిస్తూ ఉంటారు. నేను ఎవరిని, నేను భూమిపైకి ఎందుకు వచ్చాను,
భగవంతుడు ఉన్నాడా, నేను పోయిన తర్వాత ఏం జరుగుతుంది.. అనే ఆలోచనలతో ఆధ్యాత్మిక ప్రయాణం
చేస్తూ ఉంటారు. అయితే చాలాసార్లు లౌకిక ఆకర్షణలకు లోనై మార్గం తప్పుతూ ఉంటారు. మహానుభావులు
చెప్పిన ప్రతీ విషయానికీ విజ్ఞానపరంగా సాక్ష్యాధారాలు కావాలని వాళ్లంతా అడుగుతూ ఉంటారు.
నేను చెప్పినట్టు ప్రతీ వెయ్యి సంవత్సరాలకు ఒకసారి భూఅయస్కాంత క్షేత్రంలో మార్పులూ
వస్తూ ఉంటాయి. అప్పుడు పాత నమ్మకాలన్నీ పోయి కొత్త ఆచారాలు వస్తూ ఉంటాయి. అయితే చాలా
మంది కొత్త అయస్కాంత క్షేత్రంలోకి రావడానికి భయపడుతూ ఉంటారు, జంకుతారు. కొన్ని తరాలు
అలా జరిగిపోయిన తర్వాత వాళ్లు కొత్త క్షేత్రానికి అలవాటు పడిపోతారు. సామూహిక ప్రజాచైతన్యాన్ని
బట్టే మార్పులు ఉంటాయి. ఒక దేశంలోని ప్రాంతంలోనే అనేక మార్పులుంటాయి. అలాంటిది ఒక దేశానికి,
మరొక దేశానికి కూడా చాలా తేడాలుంటాయి. ఒక ఊరిలో ఒక ప్రాంతానికి చెందిన వాళ్లు ఒకలా,
మరొక ప్రాంతానికి చెందిన వాళ్లు మరొకలా ఉంటారు. ఇది ప్రకృతిలోని మార్పు కాదు. ఆ ప్రాంత
ప్రజాచైతన్యం బట్టే భూమి యొక్క అయస్కాంత క్షేత్రం, లక్షణం మారుతూ ఉంటుంది. ఇక్కడ మంచి
కానీ, చెడు కానీ భగవంతుడు నిర్ణయించడు. కేవలం అక్కడున్న ప్రజలే కారణం. అందుకే పరస్పర
విరుద్ధమైన మార్పులు చూస్తూ ఉన్నాం. ఒక జాతి నమ్మిన విశ్వాసాన్ని ఇతరులు నమ్మకపోతే
పెద్ద యుద్ధం జరుగుతుంది. ఇది ఆధ్యాత్మికస్థాయిలో తక్కువగా ఉన్నవాళ్ల స్థితి. ప్రస్తుతం
మనం మూడో భూమికలో ఉన్నాం. ఇంగ్లిష్ లో చెప్పాలంటే థర్డ్ డైమన్షన్ లో (third
dimension) ఉన్నాం. 1987 నుంచి మెల్లిమెల్లిగా ఆధ్యాత్మిక భూమికలోకి ప్రజలు వెళ్తున్నారు.
కొంతమంది చాలా ఉన్నతంగా పెద్ద భూమికలైన నాలుగు, ఐదో భూమికల్లోకి వెళ్తూ ఉంటారు. వారియొక్క
ఆధ్యాత్మికస్థాయి వృద్ధి పరుచుకోకుండా మళ్లీ మూడో డైమన్షన్ లోకి వచ్చేస్తూ ఉంటారు.
అలా ఎప్పటికప్పుడు ఉన్నతస్థాయికి వెళ్తున్న వారిని మహాత్ములు, సత్పురుషులు, బుషులు
అంటూ ఉంటాం. వారు మీలాగే పుట్టినప్పటికీ, నిరంతరసాధన చేస్తూ, పరమాత్మతతో అనుసంధానం
కావడం వల్ల మహాత్ములుగా మారతారు. వాళ్లే సమాజంలో మార్పులు తీసుకువస్తారు.
ప్రస్తుతం
రాజకీయ గందరగోళమే కాదు, ఆధ్యాత్మికంలోనూ గందరగోళం ఉంది. గురువులు పరస్పరమైన విరుద్ధ
ప్రకటన చేయడం వల్ల కొంతమంది జనాలు కూడా వాళ్లకు వత్తాసు పలుకుతున్నారు. కేవలం మూడో
భూమికలో ఉన్న జనాలు మాత్రమే ఒక వైపుకు అలా వెళ్లిపోతూ ఉంటారు. ఏ గురువు దగ్గర దైవీసంపద
లక్షణాలు ఉంటాయో, ఎవరిదగ్గర బేధభావాలు ఉండవో వాళ్లను ఆశ్రయించాలి. వాళ్లు నివురు గప్పిన
నిప్పులా ఉంటూ బయటపడరు. ఎవరి దగ్గరికి వెళ్తే మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుందో, ఆత్మశాంతిగా
ఉంటుందో, మంచి విషయాలపై ఆసక్తి ఉంటుందో, అటువంటి వాళ్ల దగ్గరికి వెళ్లినప్పుడే కలుగుతుంది.
1987 నుంచి కొత్త యుగం (new age) మొదలైంది. దీని అర్థం ఏంటంటే ఈ భూమి యొక్క అయస్కాంత
క్షేత్రం విశ్వమానవ యుగంగా మారుతోంది. దీనినే పోల్ షిఫ్టింగ్ అంటారు. అందుకే మానవుల్లో
ఇలాంటి విపరీతమైన లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ కూడా సమసిపోతాయి. 1987 తర్వాత
పుట్టిన వాళ్లలో కొంతమంది నాలుగో, ఐదో డైమన్షన్ లో పుడతారు. అలాంటి వాళ్లు చిరుప్రాయంలోనే
అద్భుతాలు చేస్తూ ఉంటారు. కొంతమంది అద్భుతమైన చిత్రాలు గీస్తారు, మరికొంత మంది నేర్పుగా
కారు నడుపుతారు, మరికొందరు పుణ్యతిధుల్లో ఉపవాసాలు ఉంటారు, కొందరు ఆసనాల్లో కూర్చుని
భగవత్ ధ్యానంలో ఉంటారు. ఇటువంటి తత్వం ఉన్నవాళ్లు భూమిపై చాలామంది ఉన్నారు. వీళ్లే
పూర్వం ఉన్నటువంటి పాత ఎనర్జీని మార్చేస్తూ ఉంటారు. ప్రతీ ఐదువేల ఏళ్లకు ఒకసారి భూమి
యొక్క అయస్కాంత క్షేత్రం చాలా ఎక్కువగా మారుతుంది. ఆధ్యాత్మికానికి జాతి, కుల, ప్రాంత,
మత బేధాలు ఉండవు. ఎవరైతే నూతనశక్తిని ధరిస్తున్నారో, వాళ్లకు ఇవన్నీ పట్టవు. వాళ్లలో
ఈర్ష్య,అసూయ ద్వేషాలు ఉండవు. తల్లిదండ్రులు ఇలాంటి వాళ్లను గుర్తించి వాళ్లకు మంచి
విషయాలను చెప్పడం, నేర్పించడం, ఆచరించి చూపించడం వల్ల ఆ పిల్లలు గొప్ప వారు అవుతారు.
ఈ సమాజంలో అనూహ్యమైన మార్పులు తెస్తారు. ముఖ్యమైన మొదటి ఏడు సంవత్సరాల్లో ఎవరైతే తమ
పిల్లలకు మంచి సంస్కారం, ఆహార అలవాట్లను నేర్పిస్తారో వాళ్లు ఎంతో ఎత్తకు ఎదుగుతారు,
లేకపోతే చెడు అలవాట్లకు బారినపడి సమాజాన్నీ ఇబ్బందిపెడతారు. వాళ్లను తట్టుకోవడం కూడా
కష్టం. అందుకే తల్లిదండ్రులు పిల్లల పెంపకం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రకృతిలో
ఉన్న ఆహారాన్ని మీరు గుర్తించి తీసుకున్నప్పుడు మాత్రమే మీ శరీరంలోని అయస్కాంత క్షేత్రం
కూడా బాగుంటుంది. పిల్లలకు ఇష్టం ఉన్నా లేకపోయినా కొంతమంది తల్లిదండ్రులు వాళ్ల వ్యక్తిగత
ఇష్టాలను పిల్లలపై రుద్ది తినిపిస్తారు. ఎక్కువ కారం, తీపి, మాంసభక్షణ వంటివి చేయిస్తారు.
పూర్వజన్మ సంస్కారంలో వాళ్లకు ఇష్టం ఉన్నా లేకపోయినా పిల్లల బలహీనత వల్ల వాళ్లపై రుద్దుతారు.
వద్దని పిల్లలు ఎంత వద్దన్నా బలవంతంగా కొంతమంది తల్లిదండ్రులూ ఇస్తూ ఉంటారు. దీని వల్ల
తామసిక భావాలు ఎక్కువైపోతాయి. లోపల ఉన్న కణాలన్నీ మారిపోతాయి. అందుకే ఆహారం విషయంలో
చాలా జాగ్రత్తలు అవసరం. తర్వాత పిల్లలు ఎటువంటి వాళ్లతో సహవాసం చేస్తున్నారో గమనించుకోవాలి.
ఎలక్ట్రానిక్ వస్తువులు, టీవీల్లో వచ్చే ప్రసారలను కూడా సాధ్యమైనంతవరకూ దూరంగా ఉంచాలి.
దీని వల్ల భావ కాలుష్యం ఎక్కువైపోతోంది. ఒక చిన్నారి లేత మనస్సులో ఒక భయంకర దృశ్యాన్ని
చూపిస్తే వాళ్లు వేరే రకంగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంటుంది. అదే వాళ్ల మనసులో ముద్ర
వేసుకుని ఉంటుంది. మంచి ఆధ్యాత్మిక విషయాలను హాస్యాస్పదం చేయడం వంటివి పిల్లల ఆలోచనలను
ప్రభావితం చేస్తాయి. జిహ్వకు రుచి కలిగినప్పుడు అది అలవాటుగా మారుతుంది. వీలైనంత వరకూ
ప్రకృతికి దగ్గరగా ఉన్న ఆహారాలను, సాత్వికఆహారాలను తీసుకోవాలి. అటువంటి వాళ్ల వల్ల
సమాజం బాగుటుంది. ఎప్పుడూ మంచిగా మాట్లాడడం, వాగ్దోషాలు చేయకుండా ఉండాలి. 1987 తర్వాత
ప్రజల్లో మంచి చైతన్యం వస్తుందని" అయస్కాంత వ్యక్తి వివరించారు.
అప్పుడు నేను
ఇలా ప్రశ్నించాను 'ఈ విషయాలన్నీ నేను ఏ విధంగా చెప్పాలి. నాకు అటువంటి జ్ఞానంలేదు.
సామాన్యుడిని కాబట్టి నేను చెప్పిన విషయాలు ప్రజలు నమ్ముతారని లేదు కదా. నన్ను ఎందుకు
నమ్ముతారు. నేను ఎందుకు చెప్పాలి' అని అడిగాను. అప్పుడు అయస్కాంత వ్యక్తి అన్నారు
"నువ్వు ఎవరినీ మార్చాల్సిన ఉద్దేశంతో చెప్పాల్సిన పనిలేదు. ఇటువంటి కుతూహలం,
జిజ్ఞాస ఉన్న నీలాంటి వాళ్లకు చెప్పు. అప్పుడు వాళ్లలో ఉన్న సందేహాలకు నివృత్తి అవుతుంది.
నీ ద్వారా నేను చెప్పదలుచుకున్న విషయాలు వాళ్లకు చేరతాయి. అప్పుడు వాళ్లలో చైతన్యం
వచ్చి మిగతా మార్గాలను అన్వేషిస్తారు. మనషులను నమ్మించే ప్రయత్నం మాత్రం చేయాల్సిన
పనిలేదు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్లు. ఎవరికి ప్రాప్తం ఉంటుందో, ఎవరు ఈ శక్తికి
ఆకర్షింపబడ్తారో వాళ్లకే తెలుస్తాయి. మూడో భూమికలో ఉన్నవాళ్లు పై స్థాయికి వెళ్తారు.
అందుకని వేరే విషయాల గురించి ఆలోచించకుండా నీ పని నువ్వు చెయ్యి. ఏం జరుగుతుందో నీకు
అనవసరం. నీకే కాదు ఎవరికైనా మేం ధ్యానస్థితిలో ఉన్నవాళ్లకు సమాధానాలు ఇస్తాం. కాకపోతే
ప్రతీ విషయాన్నీ మీరు విమర్శగా చూసుకుంటే అన్ని విషయాలు మీకే బోధపడ్తాయి. ప్రస్తుతం
ఇది సంధి గం. ఈ విపరీత పరిణామాలన్నీ తగ్గి 2020 సమయంలో మంచి మార్పులు జరుగుతాయి. ఎప్పటికప్పుడు
మేము ఎవరికి ఇటువంటి జిజ్ఞాస ఉంటుందో వాళ్లను కలిసి ఈ విషయాలను చెప్తాం" అన్నారు.
సత్యం అనేది
ప్రతీవారి నోట ఒకలా వస్తుంది. రంపా మహాశయులు కూడా ఇదే చెప్పారు, ఇప్పుడు ఈయన కూడా ఇదే
చెబుతున్నారు. 'నేను ఆధ్యాత్మికంగా పై భూమికల్లో ఉన్న విషయాలను ఎలా చెప్పాలి. మూడో
భూమికలో ఉన్న వాళ్లకు భాష ఉండదు కదా. పైస్థాయి విషయాలను కిందిస్థాయిలో వాళ్లకు ఎలా
చెప్పాలి'. అని అడిగాను. "ఎవరు ఇటువంటి విషయాల పట్ల ఆకర్షింపబడతారో వాళ్లు ఇటువంటివన్నీ
చక్కగా అర్థం చేసుకుంటారు, అపార్థం చేసుకోరని నాకు చెప్పారు. తర్వాత ఎప్పుడు నువ్వు
ప్రశాంతంగా ధ్యానస్థితిలో ఉంటావో అప్పుడు ధ్యానప్రసారాలను నీకు పంపిస్తూ ఉంటాను. ఈ
మధ్య నీకు ధ్యానప్రక్రియపై ఆసక్తి తగ్గింది. అందుకే ధ్యానంపై దృష్టి కేంద్రీకరించమని
చెప్పడమే కాకుండా త్వరలోనే కలుస్తానని" అయస్కాంత వ్యక్తి అదృశ్యమయ్యారు.
మళ్లీ ఉదయం
కాలకృత్యాలన్నీ తీర్చుకున్న తర్వాత అల్పాహారం
ముగించుకుని కొంత ఆహారాన్ని తీసుకుని అడవిలోని సఫారీకి బయలుదేరాం. సింహాలు ఎదురైతే
భయపడొద్దు, ఏమీ అరవొద్దు, ప్రశాంతంగా ఉండమని జీపు డ్రైవర్ మాకు ముందే సూచించారు. మార్గమధ్యంలో
జింకలు, నక్కలు, జిరాఫీలు కనిపించాయి. గుబురుగా ఉన్న ఒక చోట ఒక ఆడ సింహం తన పిల్లలతో
విశ్రమిస్తూ ఉంది. దాన్ని మేం గమనించాం. చారి గారు ఫోటోలు కూడా తీశారు. ఒక అరగంట సేపు
అక్కడక్కడ చూసుకుంటూ వచ్చేశాం. మళ్లీ టాంజానియా ఎయిర్ పోర్టుకు చేరుకున్నాం. అయస్కాంత
వ్యక్తి, రంపా గారు చెప్పినట్టే ప్రతీ మనిషిలో అద్భుతమైన అయస్కాంత శక్తి ఉంటుంది. కొంత
సాధన చేస్తే మూడో భూమిక నుంచి పైపైకి వెళ్లొచ్చు. సమాజ శ్రేయస్సుకు పాటుపడొచ్చు. మనం
ప్రతీవ్యక్తిలో దైవాంశ ఉందని భావించినప్పుడు పరస్పర గౌరవభావంతో ఉంటారు. నాలాంటి వాళ్లు,
నాకంటే ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్లకు రంపా, అయస్కాంత వ్యక్తి తారసపడి ఇలా బోధిస్తూనే
ఉంటారని అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాను.