N. Sairam Garu || Email: sridatta50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.

Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here

Tuesday 24 January 2017

Spiritual Soup-15

ధ్యానము - ఆధ్యాత్మిక భూమికలు (Dimensions)

లోబ్సంగ్ రంపా (Lobsang Rampa) గారి దర్శనము మరియు అయస్కాంత వ్యక్తి   దర్శనము, వారు  చెప్పిన మాటలు పదేపదే మననం చేసుకుంటూ నా నిత్యకృత్యాలలో మునిగిపోయాను. వారు ఆదేశించినట్టుగానే ధ్యానప్రక్రియ మొదలుపెట్టాను, కాని ఎంత ప్రయత్నించినా కూడా ధ్యానం మీద మనస్సు నిలిచేది కాదు. ధ్యానం మొదలుపెట్టగానే మనస్సు పరిపరివిధాలా పరిగెట్టేది, ఎన్నోసార్లు అభ్యంతర విషయాలపైకి కూడా వెళ్తుండేది. మనస్సు యొక్క పరిస్థితి చాలా విచిత్రంగా ఉంటుంది. ప్రతివ్యక్తీ కూడా ఎల్లవేళలా వర్తమానాన్ని వదిలి భూత, భవిష్యత్ కాలాలోనే జీవిస్తూ ఉంటాడు. భూతకాలంలో జరిగిన మంచికన్నా ఎక్కువగా చెడునీ, మనస్సుకి కష్టం కలిగించే విషయాలనే తలచుకుంటూ, ఏ వ్యక్తి వల్ల అలా బాధపడాల్సి వచ్చిందో ఆ వ్యక్తుల గురించి ఆలోచిస్తూ, వారిని నిందిస్తూ ఉంటారు. భవిష్యత్తులో కూడా ఇలాగే చెడు జరుగుతుందని ఆలోచిస్తూ ఉంటారు. కాని పొరబాటున కూడా మంచి గురించి ఆలోచించకుండా అడకత్తెరలో పోకచెక్కలాగా నలిగిపోతుంటారు. దీని మూలంగా వారిలో చెడుస్పందనలు కలుగుతూ ఉంటాయి. నిజానికి ఎవరైతే  వర్తమానకాలములో జీవిస్తారో వాళ్ళ జీవితాలు అద్భుతంగా ఉంటాయి. అది కాకుండా భూత, భవిష్యకాలంలో కూడా ఎవరు మంచి విషయాలు ఆలోచిస్తారో వారు మంచిస్పందనలు కలిగి ఎప్పుడూ సంతోషముగా ఉంటారు. కాని సగటు మానవుడు మాత్రము ఎప్పుడూ జరిగిపోయిన చెడూ, జరగబోయే చెడుని గురించ ఆలోచిస్తూ ఉండడము వల్ల మనస్సు నిలకడగా ఉండదు. అందుకనే మన పూర్వీకులు ఎప్పుడూ సత్సంగాలలో పాల్గొనడమో, మంచిపుస్తకాలు, ఆద్యాత్మిక పుస్తకాలో లేక మంచిపనులతో మనని ప్రభావితము చేసే   మహానుభావుల జీవితచరిత్రలో చదువుతూ ఉండేవారు. ఒక్కక్కసారి సినిమాల్లో చూపబడే భయంకరదృశ్యాలో లేక శృంగార సన్నివేశాలో చూసినప్పుడు మన మనస్సు వాటిచుట్టే తిరుగుతూ ధ్యానం మీద నిలకడ ఉండదు. ఇలాంటి కారణాల వల్లే కాబోలు నా మనస్సు నిలకడగా ఉండట్లేదు అని నేను అనుకుంటున్నాను. ఇలా ఆలోచిస్తూ ఉంటే ఒక్కక్కసారి మనస్సు అనవసరమయిన ఏ విషయాలు ఆలోచించకుండా ఉంటే ప్రశాంతముగా ఉంటుంది. అందుకనే సాధ్యమైనంతవరకు అవతలివ్యక్తుల సంభాషణలు నాకు నచ్చకపోతే వారికో నమస్కారం పెట్టి దూరంగా వెళ్ళిపోతాను. దాని మూలంగా వారి ప్రభావము నామీద పడకపోవడంవల్ల ధ్యానం కాస్త దారిలో పడుతుంది.

అలా నా ధ్యానం కొన్నిరోజులకి ఒక దారిన పడి నా మనస్సు ప్రశాంతంగా ఉంది, ఎటువంటి ఆలోచనలు లేవు. అలా ఉండగా ఒక రోజు నాకు మళ్ళీ అయస్కాంత వ్యక్తి దర్శనమయింది. అయితే చాలా తరచుగా అతను కనిపిస్తుండడం వల్ల మనస్సులో ఉత్సాహం ఉన్నా అది పైకి కనిపించని స్థితికి వచ్చాను. నన్ను చూసి ఆయన ఇలా అన్నారు, “నాయనా! నీవు మంచి స్థితికి వచ్చావు. ఇదివరకు ఎప్పుడూ ఏదో ఆందోళనగా, ఆలోచిస్తున్నట్టుగా ఉండేవాడివి. దాని మూలంగా భావతరంగాలలో మునిగి నీ దగ్గరలో ఉన్న నన్ను చూసేవాడివి కావు. ఇప్పుడు నిన్ను చూస్తే చాలా సంతోషంగా ఉంది”.  “ఇదివరకు కలసినప్పుడు మీరేన్నోవిషయాలు నాకు చెప్పారు. అవి అప్పుడు అర్థమయినట్టుగా అనిపించినా తర్వాత ఆలోచిస్తే కొన్ని అర్థం అయినట్లుగా లేవు. డైమెన్షన్స్ (Dimensions) అంటున్నారు, కాస్త ఈ డైమెన్షన్స్ ఏమిటో వివరంగా చెప్తారా” అని అడిగాను. “చాలా మంచి ప్రశ్న వేసావు నాయనా! కాని ఇక్కడ చిన్న చిక్కు ఉంది. పరమగుప్తమైన ఈ ఆధ్యాత్మిక విషయం మీ స్థాయికి దిగి వచ్చి మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అనేది అతికష్టమైన ప్రక్రియ. సంక్షిప్తమయిన భావాలకి సరయిన భాష కాని, పదాలు కాని మీ భాషలో ఉండవు. అందుకనే మేము చెప్పేది ఒకటయితే మీరర్థం చేసుకునేది ఇంకొకటి అవుతుంది. లోగడ కూడా ఆధ్యాత్మిక గ్రంథాలు వ్రాసినవారు సాధారణ మనుషులే కాని వారు ఉన్నతస్థాయిలో ఉండి వ్రాసిన పుస్తకాలు అవి. ఆ రోజుల్లో ఇప్పటిలాగా ప్రింటింగ్ సౌకర్యాలు లేవు. ఆ రోజుల్లో ప్రింటింగ్ సౌకర్యాలు లేకపోవడం వల్ల విషయజ్ఞానం ఒకరినుండి ఒకరికి శ్రుతిద్వారా వ్యాప్తి చెందుతుండేది. ఎంత బాగా చెప్పినా, అర్థమయినా ఒకరు చెప్పినదానికి ఇంకొకరు చెప్పినదానికి చాలా తేడా ఉండడంతో ప్రజలు సందిగ్ధావస్తలో ఉండేవాళ్ళు. ఆధ్యాత్మిక విషయాలు నీ స్థాయికి దిగి నీకర్థం అయ్యేలా చెప్పడం తప్పదు కాబట్టి సాధ్యమైనంతవరకూ నీకు అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీకు ఏ విషయమైనా కథల రూపంలో చెప్తే ఆసక్తిగా విని అర్థం చేసుకుంటారు. కాని ఆ కథలో ఉన్న నీతిని గురించి కాని దాన్ని జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి అని ఆలోచించరు. అయినా సరే నీవడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తాను.

లౌకికమూ, అలౌకికమూ అనే పదాలు నీకు తెలుసు కదా. అలౌకికము అంటే మాకు సమయము, ప్రదేశము అనేవి ఉండవు. అన్నీ కలిపి టైం అండ్ స్పేస్ అని చెప్తారు.  టైం అండ్ స్పేస్ అనే కాన్సెప్ట్ మాకు ఉండదు. అది మీ భాషలో చెప్పినా మీకర్థం కాదు. ఏ విషయాన్నయినా మీకు ముక్కలు, ముక్కలుగా చేసి , చిన్న భాగాలుగా చెప్పితే  కాని అర్థం కాదు.” అని అన్నప్పుడు నేను “మహాత్మా ! ముక్కలు ముక్కలు ఏమిటీ ? చిన్న భాగాలు ఏమిటీ నాకు అర్థం కాలేదు” అని చెప్పగా ఆయన నవ్వి “అదే చెప్పుతున్నాను, విను. ఉదాహరణకి కాలం అనేది ఒక ప్రవాహం. అది బ్రహ్మాండమయిన  మహా చైతన్య శక్తి, నిరంతరమూ సాగిపోతూనే ఉంటుంది. మీకు కాలం ఇలా వెళ్ళిపోతుంది అని చెప్తే అర్థం కాదు కదా అందుకనే దాన్ని సంవత్సరాలు, నెలలు,వారాలు, దినాలు, గంటలు, సెకన్లుగా విభజించాము. నిజానికి కాలం అలా ముక్కలు ముక్కలుగా ఉండదు. అది నిరంతరమూ ప్రవాహంలాగా సాగిపోతూ ఉంటుంది.అందుకనే మీ స్థాయికి వచ్చి మీకర్థంయ్యేట్టుగా లీనియర్ భాషలో చెప్పాల్సి వస్తుంది. మీ ఆలోచనలు ఒక రేఖ (లైన్) లాగా ఒకే డైమెన్షన్ లో ఉంటాయి అందుకనే మీకదే డైమెన్షన్లో  చెప్పాల్సి వస్తుంది.మీలో కొంతమంది నిరంతర సాధన వల్ల మా స్థాయికి చేరుకోగలుగుతారు. వారికి  భాషతో ప్రమేయం ఉండదు, నిశ్శబ్దంగా అన్నీ గమనిస్తూ ఉంటారు” అని వివరించారు.  “మహాత్మా! నాకు ఇప్పుడు కొంచెం కొంచెంగా అర్థం అవుతుంది కాని ప్రతీసారి డైమెన్షన్స్, లోవర్ డైమెన్షన్స్, అప్పర్ డైమెన్షన్స్ అంటారు. అవి ఏమిటీ ? ఎన్ని డైమెన్షన్స్ ఉంటాయి? అని అడగగా “నాయనా ! నిజానికి డైమెన్శన్స్ లో ఎన్నో రకాలు ఉండవు. కాలాన్ని గురించి లీనియర్ భాషలో ఎలా చెప్పానో అలాగే ఈ భూమికల గురించి కూడా నీకర్థంయ్యేట్టుగా చెప్తాను.  ఉదాహరణకి అక్షరాభ్యాసం చేసినప్పుడు మీరు పలకా బలపం పట్టుకుని అక్షరాలు నేర్చుకుంటారు. తర్వాత పెద్దయ్యాక మీకు భౌతికంగా వాటిని పట్టుకోనవసరం లేదు. అన్ని చదవగలుగుతారు, అంటే ఏమిటి ? మీరు పై స్థాయికి వచ్చినట్లే. ఆ స్థాయికి తగ్గట్లు మీరు చదువుకుంటారు. పైస్థాయికి వెళ్ళినప్పుడు మీరు ఏవైతే భౌతికంగా పలక మీద రాసారో అవి మీ మెదడులో కాని, మనస్సులో కాని ప్రతిష్టించి పోయి ఉంటాయి. అవి జ్ఞానము అనే చైతన్య స్థాయిలో ఉంటాయి.మీ శక్తి సామర్త్యాలని బట్టి మీరు ఏ భూమికలో ఉన్నప్పుడు ఆ భూమికకు తగ్గట్టుగా విషయం చెప్పబడుతుంది. ఒకటవ తరగతిలో చదువుతున్న విద్యార్థికి వృక్ష శాస్త్రము, జంతుశాస్త్రమో చెప్తే అర్థం అవుతుందా ?కాబట్టి భూమికల గురించి చెప్పాల్సి వచ్చింది. అంతే కాని లేక పొతే మీకర్థం కాదు. ఇంకా చెప్పాలంటే 1,2,3........10వ తరగతి ,కాలేజి విద్యలో, ఉన్నత విద్యలు అంటూ మీరు భౌతిక రూపంలో ఉన్న విషయాలు చదువుతున్నప్పుడు, అర్థం చేసుకుంటున్నప్పుడు   వాటి గురించి విస్తారంగా తెలుసుకోవాలంటే మీరున్న తరగతి నుంచి పై తరగతికి వెళ్ళాలి, అలా వెళ్లినపుడే  అవి మీకు అర్థం అవుతుంటాయి. అయితే మీరు క్రింద భూమికనుంచి పై భూమికకి వెళ్ళినప్పుడు మీ భూమికను బట్టి సరి అయిన పరిజ్ఞానం ఉంటుంది కాబట్టి విషయం మీకు సరిగ్గా అర్థమవుతుంది. అలాగే ఈ ఆధ్యాత్మికంలో కూడా ఉంటుంది” అని చెప్పారు. అప్పుడు “మహాత్మా ! కొంచెం కొంచెం అర్థమవుతుంది. ఇంకా మీరు దాని గురించి వివరంగా చెప్తారా” అని అడిగాను. ఆయన నవ్వి “సరే ! ఇంకా వివరంగా చెప్తాను” అని అన్నారు. “అయితే మానవులకి విజ్ఞానము అక్షరరూపంలో ఉంటుంది. మీరు మొదట్లో బడికి వెళ్ళినప్పుడు తెలుగులో అ,ఆ ,ఇ,ఈ లు,ఇంగ్లీషులో ఎ,బీ, సి, డి, లు అని చదువుతారు. దీన్నిబట్టి విజ్ఞానికి ఒక ఆకారం ఉంది అని తెలుస్తుంది. మీరు అమ్మ ,ఆవు అన్నప్పుడు మీకు మీ అమ్మగారు ,ఆవు ప్రత్యక్షమవుతారు. దీనివల్ల మీకేం తెలుస్తుంది ? అవ్యక్తంగా ఉన్నదాన్ని వ్యక్తపరచాలంటే నిరాకారంగా ఉన్నదానికి ఒక ఆకారం కలిపించి చెప్తేనే మీకర్థం అవుతుంది”. అవును మహాత్మా ! ఇప్పుడు కొంచెం కొంచెం అర్థం అవుతుంది. ఆ అక్షరాలను బట్టి మేము చదువుతాము.” “అంటే ఏమిటి మీరిప్పుడు చదివే అక్షరాలు ఒకప్పుడు అవి అక్షరాలుగా రానప్పుడు ఒక అవ్యక్తస్థితిలో ఉన్న శక్తిగానే  (invisible energy ) మీరు గమనించాలి. అంటే ప్రతి అక్షరంలో జ్ఞానము ఉంది, అది అవ్యక్తస్థితిలో ఉన్నపుడు  దాన్నే మనము చైతన్యశక్తి అని అంటాము . మీరు ఏదైనా పుస్తకాన్ని చదువుతున్నప్పుడు అందులో ఉన్న అక్షరాలూ , గీతలూ, బొమ్మలు మొదలైన సంకేతాలను బట్టే చదువుతారు కదా ! ఆ సంకేతాలని చదువుతూ ఉంటే మీరు ఆ చైతన్యంలో ఒక భాగమై జ్ఞానాన్ని పొందుతారు. జ్ఞానమూ, విజ్ఞానమూ ఏవైతే ఉన్నాయో అవి ఒక మహా చైతన్య స్థితిలో ఉన్నాయి.”

“మహాత్మా, ఇప్పుడు కొంచెం కొంచెంగా అర్థమవుతుంది” అని అన్నాను. దానికి ఆయన “నీవు ఎప్పుడైనా ఏ విషయాన్నైనా సరే విశ్లేషించుకోవాలి విమర్శించుకోవాలి. గురువులనే వారు ప్రత్యేకంగా ఉండరు, మీలోనే ఒక గురువుని భగవంతుడు ప్రతిష్టించాడు”  అనగా నేను “కొంచెం వివరించి చెప్పండి మహాత్మా” అని అడుగగా “నాయనా, ప్రతి మనిషిలో కూడా ఏ విషయమయినా ఒకే ఒకే కోణంలో మరియు  వివిధ కోణాల్లో చూసే సామర్ధ్యం ఉంటుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సింగిలారిటి ఉంటుంది అంతే కాకుండా మల్టీ డైమెన్షనల్గా  కూడా ఆలోచిస్తారు. మీరు కేవలం ఒకే భూమికలో ఉండి ఆలోచించారు, అప్పుడప్పుడు పైభూమికలలో కూడా వెళ్ళుతూ ఉంటారు. ఎవరైతే ఈ పైభూమికలలో  ఉండి అనుసంధానం కావించబడతారో వారికి ఎప్పటికీ అర్థం కాని విషయాలు అర్థం అవుతాయి.

పై భూమికలో వెళ్ళడం అంటే ఏమిటీ ? ఆ భూమికలో ఉన్న విషయజ్ఞానాన్ని గ్రహించడం, అంటే నేను ఇదివరకే చెప్పినట్లుగా క్రమక్రమంగా ఆధ్యాత్మిక స్థితిలో పైభూమికల్లో చేరుతుంటారు. అంటే మీలో ఏకాగ్రత పెరిగినప్పుడు, మంచి విషయాల గురించి   ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఒక్కొక్కసారి పైభూమికలో వెళ్ళుతూ ఉంటారు.”
“అయితే మహాత్మా ! మాలోనే కొంతమందిని ఋషులూ, యోగులూ,సిద్ధులూ  అని అంటారు మరి తేడా ఏమిటీ ?” అని అడిగాను. అప్పుడు ఆయన ఇలా అన్నారు “నాయనా. మీకు వారికి తేడా ఏమి లేదు. వారు కూడా మీ స్థాయినుంచి పైస్థాయికి వచ్చినవాళ్ళే. కాకపొతే మీకు వారికి తేడా ఏమిటంటే మీరు అప్పుడప్పుడు పై భూమికల్లోకి వెళ్లి అక్కడ మహా చైతన్య శక్తితో అనుసంధానించబడి ఎప్పటికి అర్థం కాని విషయాలను అర్థం చేసుకోగలుగుతారు. కాని అదే స్థితిలో మీరు ఎప్పుడూ ఉండరు. మామూలు స్థితికి వచ్చినప్పుడు కామ, క్రోధ, మద, లోభ, మోహ, మాత్సర్యాలకు అనుగుణంగానే మీరు ప్రవర్తిస్తూ ఉంటారు. కాని మీలో ఉన్న మామూలు మానవులే పైభూమికలో వెళ్ళినప్పుడు మహాచైతన్య శక్తితో నిరంతరమూ అనుసంధానించబడతారు కాబట్టి ప్రకృతిలో ఒక భాగామవుతారు. ప్రకృతి కూడా వారికి అనుగుణంగానే ఉంటుంది” అని వివరించారు. “కాని మహాత్మా !  విషయం పూర్తిగా అర్థమయినట్లుగా లేదు. కొంచెం స్పష్టంగా వివరిస్తారా, ఆ స్థాయికి వెళ్ళాలంటే ఏం చేయాలి” అని అడుగగా,
నాయనా ! నీకు మొదలే చెప్పాను. పై స్థాయిలో ఉన్న విషయాలు మీ స్థాయిలో  చెప్పాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందని.  అందుకు తగిన భాష ఉండదు.అయినా నీకు నేను   తప్పకుండా చెప్తాను”
అని చెప్పి ఆయన ఒక్క క్షణం ఆగారు. “నాయనా జాగ్రత్తగా విను.నేను చెప్పినట్లే భగవంతుని యొక్క మహాచైతన్యశక్తి , పరిశుద్ధమైనటువంటి శక్తి ఒక ఎనర్జీ రూపంలో ఉంటుంది. ఇవన్నీ కూడా మానవులలో ఎవరికైతే భేదభావాలు ఉండవో , సుఖదు:ఖాలని ఒకే రీతిగా భావిస్తారో, ఎవరికైతే వీరు మంచివాళ్ళు, వీరు చెడ్డవాళ్ళు , అంటరాని వాళ్లు, దుర్మార్గులు అనే భావన ఉండదో వారి మానసికశక్తి చాలా పరిశుద్ధంగా ఉండడమే కాకుండా ప్రకాశవంతంగా ఉంటుంది. అటువంటి ప్రకాశవంతమైన శక్తి ఎప్పుడైతే ఉంటుందో  వారు ఈ మహాచైతన్యశక్తితో అనుసంధానం కావించబడతారు.


అటువంటివారు మహిమలూ, లీలలూ అని ప్రత్యేకంగా వాటి వెంటపడరు. కాని ఈ మహిమలు ,అష్టశక్తులే వారి వెంటపడుతుంటాయి .ఆ మహానుభావులు అటువంటి శక్తికి లొంగక నిరతరమూ వారు ఈ చైతన్యశక్తితో అనుసంధానం కావించబడతారు. ఎటువంటి వికారాలు వారికి ఉండవు”, అని ఆయన వివరించారు. అప్పుడు ఆయన ఇంకొక విషయం కూడా చెప్పారు “నీకు ఇప్పుడు ఇన్ని విషయాలు చెప్పాను. ఇవన్నీ ఒక్కసారిగా అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి నేను చెప్పిన విషయాలన్నీ కూడా మరొక్కసారి విమర్శన చేసుకుని నీలో నువ్వే ప్రశ్నించుకో. నీలో ఒక అంతర్మధనం కలగాలి. కనుక నేను చెప్పిన విషయాలు ధ్యానపరంగా ఆలోచించు.నీవు ఎలాగో స్వాధ్యయనం చేస్తున్నావు కదా. దాని వల్ల నీకు ఎన్నో మంచి విషయాలు అర్థమవుతుంటాయి. ప్రస్తుతం నేను చెప్పిన విషయాలు విమర్శన చేసుకో” అని చెప్పి అయస్కాంత వ్యక్తి అదృశ్యమైపోయారు.

నాకు ఇదంతా కొంచెం అర్థమయినట్టుగా కొంచెం అర్థం కానట్టుగా ఉంది. ఏ విషయమైనా మనం చదివినప్పుడు పదిసార్లు మననం చేసుకుంటే కాని అర్థం కాదు. చిన్నప్పుడు మన పాఠ్యపుస్తకాలలోని విషయాలు మన మాస్టారుగారు చెప్తే ఒక్కసారికే మనకి అర్థం అయిపోయేవా? పదే పదే మనం చదివినప్పుడు మనకి అర్థం అయ్యేవి. ఒక్కొక్కసారి వేరే ఎవరైనా చెప్తే అర్థం అయ్యేవి కదా. ఈవిధంగా నేను ఆలోచిస్తూ అయస్కాంత వ్యక్తి మాటలు విమర్శించుకోవడం మొదలు పెట్టాను. అయస్కాంత వ్యక్తితో జరిగిన సంభాషణలను నేను పదే పదే మననం చేసుకుంటూ ఇంకా ఆయన చెప్పిన సమాధానాల్ని ఎక్కడ ఎలా విశ్లేశించుకోవాలో, ఎలా అర్థం చేసుకోవాలో అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. అయితే నాలో ఉన్న ఏ గురువు కూడా అన్ని విషయాలు విశదీకరించి చెప్పరు. ఒక మార్గానికి నాలుగు మూలలు, నాలుగు దిక్కులు ఉంటే కేవలం ఒక్క మూల కాని, ఒక్క దిక్కు గాని చూపిస్తారు. దాన్ని బట్టి మిగతా దిక్కులని, మూలలని మనం కనుక్కోవాలి. ఎందుకంటే ఏ విషయము నిర్ధారణ చేసుకోవాలన్నా స్వానుభవం వల్ల ఒక ధృఢ నిర్ణయానికి కాని అభిప్రాయానికి కాని రావడం జరుగుతుంది.
ఏదో రోజులయితే గడిచిపోతున్నాయి, నా ధ్యానం సాఫీగా సాగటం లేదు. ఒక ప్రశ్నకి సమాధానం దొరికితే అందులోనుంచి ఇంకొక ప్రశ్న, అందులోంచి ఇంకొక ప్రశ్న, ఇలా గొలుసులలాగా పుట్టుకొస్తున్నాయి. పాపం! మనుష్యుల జీవితాలు ఇంతే కదా అని పరిపరివిధాలా ఆలోచిస్తున్నాను. మరి ఆయనేమో ఎవ్వరి గుణదోషాలు చూడవద్దు, పరిశుద్ధమైన ఆలోచనలు ఉండాలి అని అన్నారు. భగవంతుని మహాచైతన్యశక్తి అని అంటున్నారు.దీన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి. వేరే వాళ్లకి చెప్తున్నప్పుడు వారికి ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాలి అని ఆలోచిస్తుండగా అనుకోకుండా నా దృష్టి "ఒక యోగి ఆత్మ కథ " (Autobiography of a yogi) మీద పడింది. 1971-72 సంవత్సరంలో నేను ఆ పుస్తకం చదవడం, ఆ తర్వాత యోగాడా సత్సంగ్ సొసైటీ లో దీక్ష తీసుకోవడం గురించి ఇదివరకే చెప్పాను. ఆ పుస్తకం చదువుతుండగా అందులోని ఒక సంఘటన నాకు జ్ఞాపకం వచ్చింది. అప్పుడు నాకు అర్థం అయింది. మనుష్యులకి ఏ విషయమైనా ఉపన్యాస ధోరణిలో కాకుండా కథల్లాగా చెప్తే తొందరగా అర్థం అవుతుంది, హృదయానికి హత్తుకుపోతుంది అని. అలాంటి ఒక ఘటన గుర్తుకి వచ్చింది. అది ఏమనగా గురుపరంపరలో అంటే యోగాడా సాంప్రదాయంలో మొట్టమొదటి గురువు మహావతార బాబాజి గారు. ఆయన్ని చాలా మంది దత్తాత్రేయుడిలాగానే భావిస్తుంటారు. ఆ మహావతార బాబాజిగారి ప్రియశిష్యుడు శ్రీ లాహిరి మహాశయులు, ఆయన శిష్యుడు శ్రీ యుక్తేశ్వరగిరి, ఆయన శిష్యుడు శ్రీ పరమహంసయోగానందగారు. లాహిరి మహాశాయులు గారు ఆయన గురువుగారిని ఎన్నో సార్లు చూడడం జరిగింది కాని యుక్తేశ్వరులుగారు ఆయన దర్శనం ఎప్పుడు కలుగుతుందా అని ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ఒకసారి గురువైన లాహిరి మహాశయులు గారు వారికి కాశిలో కుంభమేళ జరుగుతుంది నీవు వెళ్ళు అన్నట్టుగా టెలీపతి ద్వారా చెప్పారు. అది విని యుక్తేశ్వరులుగారు చాలా సంతోషపడి కుంభమేళయాత్రకి వెళ్ళారు. అయితే ఆయన మనస్సు మటుకు బాబాజీ గారిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆత్రుతగా ,ఆదుర్దాగా ఉంది. అనుకోకుండా ఆయన దృష్టి దూరంగా ఉన్న ఒక వ్యక్తి మీద పడింది. వెంటనే యుక్తేశ్వరగిరిగారికి ఆయన ఎవరో కాదు సాక్షాత్తు బాబాజి గారే అని అర్థమయింది. అక్కడ ఆయన ఒక కపట సన్యాసికి సేవ చేస్తున్నారు (అతను ఉత్త మోసగాడు , కపట సన్యాసి అని అందరికీ తెలుసు) యుక్తేశ్వర్ గారు కూడా ఒక్క క్షణం ఆశ్చర్య పోయారు. దైవ సమానమైన ఆ బాబాగారు ఈ కపట సన్యాసికి సేవ చేయడం ఏమిటీ అనే ఒక ప్రశ్న ఆయన మనస్సుకి వచ్చింది. దానికి సమాధానంగా బాబాగారు పంపిన వాణి కూడా అర్థం అయింది. ఆయన ఇలా చెప్పారు “నీ దృష్టిలో ఇతను కపట సన్యాసి కావచ్చు కాని నాకా భావన లేదు. ఇతను భోజనం చేసిన పాత్రలు నేను శుభ్రంగా కడిగి భ క్తిశ్రద్ధలతో ఈ బట్టతో తుడుస్తున్నాను, అంతేకాదు ఆయన విడిచిన మైలబట్టలు కూడా ఉతుకుతున్నాను. కూరగాయలు కొని వంట కూడా చేసి పెడ్తున్నాను”. అయితే యుక్తేశ్వరులుగారు మహాజ్ఞాని కాబట్టి తన తప్పు తెలుసుకున్నారు. ఇదే కాబోలు గుణదోషాలు ఎంచకూడదు అంటే అని నాకిప్పుడు ఈ కథ ద్వారా స్పష్టం అయింది. ఈ విధంగా విమర్శన చేసుకున్నప్పుడు తప్పకుండా ఆ దైవికశక్తి మనకు సహాయం చేస్తూ ఉంటుంది అది పుస్తక రూపంలో కావచ్చు వేరే ఏదైనా రూపంలో కావచ్చు మరి ఇంకొక విషయం కూడా నాకు అర్థమయింది. అది ఏమిటంటే జ్ఞానము అనేది ఒక మహా చైతన్యము. అది అంతరాంతరాలలో అవ్యక్త స్థితిలో ఉంటుంది అందుకే దానిని మహానుభావులు ప్రకాశంతో పోల్చారు. అది ఒక అవ్యక్త రూపంలో ఉన్నప్పుడు ఒక ధ్వని రూపంలో బయటపడ్తుంది. కాబట్టి ఈ ప్రపంచంలో ప్రధానమైనవి రెండే రెండు. వీటి వల్లే ఈ జగతి నడుస్తుంది అని నాకు అనిపించింది. ఒకటి విషయపరిజ్ఞానము అంటే ప్రకాశము, రెండవది ధ్వని (వ్యక్తస్థితిలో ఉన్నప్పుడు అది శక్తిరూపంలో మారినప్పుడు ధ్వనిరూపంలో బయటకు వస్తుంది) ఎవరైతే ఈ ప్రకాశాన్ని, ధ్వనినీ రెంటినీ సమన్వయపరచి అర్థం చేసుకుంటారో వారికి భగవంతుడి తత్త్వం పూర్తిగా అర్థం అవుతుంది అని నేను గ్రహించాను. అయితే మనకి కూడా ఏ అరిషడ్వర్గాలు లేనప్పుడే మనకి ఎదుటివారిలో లేని పోని గుణాలు కనిపించవు .

ఇదే సందర్భంలో నాకు ఇంకొక ఉదాహరణ త్రైలింగస్వామి గారిది, ఒక యోగి ఆత్మ కథలో చదివాను అది జ్ఞాపకం వచ్చింది.ఆయన కూడా ఒక యోగి, వారణాసిలో ఉంటుండేవారు. ఎప్పుడూ ఆ భగవంతుని యొక్క చైతన్యశక్తితో అనుసంధానించబడి బ్రహ్మానందస్థితిలోనే ఉండేవారు. ఎప్పుడూ అలౌకిక ప్రపంచంలోనే ఉంటూ, దిగంబరంగా తిరుగుతూ ఉండేవారు. వారణాసిలోనే ఒక ధూర్తుడు కూడా ఉండేవాడు.అతను సున్నపు భట్టిలో పని చేస్తూ ఉండేవాడు. ఈ స్వామిని చూసి ఎప్పుడూ వెటకారంగా మాట్లాడుతుండేవాడు. ఒకసారి ఆయనని ఆట పట్టించాలని ఆలోచించి మహాఆదరంగా ఆహ్వానించి సున్నపు నీటిని ఇచ్చి “ఒక గ్లాసు మజ్జిగ త్రాగండి” అని ఇచ్చాడు. మనస్సులో ఆనంద పడుతూ పైకి మటుకు “త్రాగండి స్వామి! ప్రత్యేకంగా మీకోసం తయారు చేసాను” అని అన్నాడు. స్వామి సరే అని త్రాగడం మొదలు పెట్టారో లేదో ఆ ధూర్తుడు “మంటలూ ! మంటలూ !” అని గట్టిగా అరుస్తూ, గంతులు వేస్తూ “స్వామీ ! రక్షించండి”  అని ఆయన కాళ్ళ మీద పడి ప్రాధేయపడ్డాడు. బ్రహ్మానంద స్థితిలో ఉన్న ఎవరినైనా మనం బాధపెట్టడానికి ప్రయత్నించినప్పుడు ఆ బాధ వాళ్లకి తగలకుండా మనకే తగులుతుంది అని నాకర్థమయింది. స్వామీజీ కొంచెంకూడా కోపం రాలేదు. “నాయనా, ఇలాంటి పనులు ఎన్నడూ చేయవద్దు.అందరిలో భగవంతుడు ఉన్నాడు” అని చెప్పారు. స్వామి వారు అతనికి ఎప్పుడైతే అభయం ఇచ్చారో అప్పుడు వెంటనే అతని బాధ తగ్గిపోయింది.

ప్రతి మనిషిలో కూడా భగవంతుడు చైతన్యస్థాయిలో ఉంటాడు. ఆ చైతన్యం ప్రతి మనిషిలో ప్రతిబింబిస్తుంది.  విషయపరిజ్ఞానం లేని వాళ్ళలో చైతన్యం మాయ అనే తెరలో కప్పబడి ఉంటుంది.ఎవరైనా మహాత్ములకి అపకారం చేసినప్పుడు దాని ఫలితం వాళ్ళ మీదకే వస్తుంది. అంటే మీలో ఉన్న బ్రహ్మపదార్ధం నాలో ఉన్న బ్రహ్మ పదార్ధం ఒకటే కాబట్టి నేనేవరికైనా అపకారం చేయాలని దెబ్బ కొట్టినప్పుడు అది నాకే తగిలి నన్నే ఎవరో దెబ్బ కొట్టినట్టుగా అనిపిస్తుంది. మనం భౌతికంగా ఆ బాధను అనుభవించకపోయినా బాధామయమైన స్పందన కలిగి ఎవరైతే కొట్టారో వారిలో ప్రతిష్టమైపోయి ఏదో ఒక రూపంలో బయటికి వస్తాయి. ఆ బాధ స్వయంగా అనుభవించే దాకా ఎదుటివారిని ఎంత బాధపెట్టాడో అర్థము కాదు. అందుకని మనం ఎవరిని కూడా అనవసరంగా బాధించకూడదు అని నాకు అర్థం అయింది. గుణదోషం ఉండకూడదు అంటే ఇదన్నమాట అని చెప్పి నేను విమర్శించుకున్నాను. ఒక విధంగా నాకు ఇటువంటి కథల వల్ల అయస్కాంత వ్యక్తి చెప్పిన మాటలు అర్థం చేసుకోవడం జరిగింది.