కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామివారు చాలా గొప్ప సాధకుడు, ఆధ్యాత్మికవేత్త, ఎంతో ప్రతిభాశాలి. ఆయన దర్శనానికి, ప్రవచనాలు వినడానికి వేలాది మంది గుంపులు గుంపులుగా వస్తూండేవారు. ఒకసారి ఆయన బాలత్రిపురసుందరి పూజ నిర్వహిస్తుండగా చుట్టు ప్రక్క గ్రామాల నుంచి తండోపతండాలుగా ఎంతో మంది భక్తులు ఆ పూజని చూడడానికి రావడం జరిగింది. అందరూ చాల నిశ్శబ్దంగా ఉండి స్వామివారు చేస్తున్న అద్భుతమైనటువంటి అమ్మవారి అలంకరణ చూసి మురిసిపోతున్నారు. పరమాచార్యగారు స్వయంగా బాలాత్రిపురసుందరికి పూజ చేసినప్పుడు అమ్మవారికి ఒక మంచి పట్టు చీర కట్టారు. ఎంతో వైభవంగా అలంకరణ చేశారు. ఇలా తంతు సాగిపోతుండగా, అక్కడికి వచ్చిన చాలా మంది మహిళలలో ఒక స్త్రీ కూడా నిశ్శబ్దంగా తన వరుస క్రమంలో కూర్చొని పరమాచార్య చేస్తున్నటువంటి పూజని తిలకిస్తూ ఉంది.
ఆమె ఒడిలో ఒక చిన్నపాప పట్టు పరికిణీ,గౌను వేసుకొని ఎంతో శ్రద్ధగా ఈ పూజనంతా చూస్తూ ఉంది. కాసేపటికి ఆ పాప చాలా గంభీరంగా అమ్మా నాకు ఆ అమ్మవారు కట్టుకున్న చీర కావాలి అని అడిగింది. ఆ తల్లి చాలా ఆశ్యర్యపడిపోయింది. చిన్నపిల్లలు సాధారణంగా ఏవో మిఠాయి వస్తువులుగాని, చాక్లేట్లుగాని కావాలని అడుగుతారుగాని అదేమిటి ఇంత చిన్న పాప అమ్మవారు కట్టుకున్న చీర కావాలని అడుగుతోంది అని ఆవిడ కొంచెం విడ్డుర పడింది. తన దగ్గర ఉన్న చాక్లెట్ని ఇచ్చి కాస్త మురిపించింది. అ పాప కాసేపు ఆగి మళ్ళా అమ్మా! నాకు అమ్మవారి చీర కావాలి అని అడిగింది. ఆ పాప అడగటం తల్లి చాక్లేట్లు ఇవ్వడం చివరి చాక్లెట్ కూడా అయిపొయింది. ఆ పాప కాసేపు ఆగి మళ్ళా అమ్మవారి చీర కావాలని మారాం చెయ్యసాగింది. అప్పుడు ఆ తల్లి కొంచెం విస్సుగ్గా అదేమిటి పరమాచార్యగారు పూజ చేసిన సాక్షాత్తూ బాలాత్రిపురసుందరికి కట్టిన చీర ఇంత చిన్నదానివి నీకు ఎందుకు ఇస్తారు? అలా అడక్కూడదు నువ్వు అని మెత్తగా మందలించింది. అయినా కూడా ఆ పాప తన పట్టుని వదల్లేదు.
ఆ చీర కావాలని పదేపదే మారాం చెయ్యసాగింది. మెల్లగా అందరూ పూజ కాగానే వారందరూ ఒక పద్దతిలో బయటకు వెళ్తుండగా , ఆ తల్లి తన కూతురితో పరమాచార్య దగ్గరకి వచ్చి ఆయనకి ఎంతో భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసింది. ఆ పాప కూడా పరమాచార్య కళ్ళలోకి చూస్తూ నిలబడిపోయింది. పరమాచార్య కూడా అలాగే ఆ బాలికను 30 సెకన్ల పాటు చూస్తూ ఉండిపోయినారు. ఇంక ఆ తల్లి వెళ్లిపోతుండగా అమ్మా కాసేపు ఆగు అని చెప్పి ఆయన ఎంతో శ్రద్ధగా కట్టిన అమ్మవారి చీర స్వయంగా తీసి చక్కగా మడతపెట్టి ఆ తల్లిని పిలిచి ఆ బాలిక చేతిలో ఆ చీర పెట్టి అమ్మవారి చీర ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పటంతో ఆ తల్లి చాలా ఆశ్చర్యపడిపోయింది. ఎంతో ఆనందపడిపోయింది. కళ్ళకద్దుకొని వాళ్ళు నిష్క్రమించారు. అక్కడున్న స్వామివారి శిష్యులు అందరూ చాల ఆశ్చర్యపడిపోయారు. పరమాచార్య వాళ్ళందరిని చూసి నవ్వి ఏమిచెయ్యమంటారు? స్వయంగా బాలాత్రిపురసుందరి అమ్మవారు వచ్చి తన చీర తనకి ఇమ్మని అడిగితే ఇవ్వకుండా ఎలా ఉంటాను అని అన్నారు.
ఈ సంఘటన ఒకసారి పుట్టపర్తి సాయిబాబాగారు చెప్పారు.