స్వామి వారి అంతిమ సందేశం
ప్రభుశ్రీ గారు తమ శిష్యులని,
సాధు సంతువులని అందరిని సమావేశ పరచి “భక్తులారా ! నేను ఈ భూమికి
వచ్చిన పని నా అవతరణ సమాప్తమయింది. నేను వెళ్ళవలసిన సమయం వచ్చింది. కాని నేను
నాలుగు విధాలుగా మీ దగ్గరే ఉంటాను ఒకటి ఆదిదేవుడు నర నారాయణ రూపంలో ఉంటాను, రెండు
ఆచార్యుల రూపంలో ఉంటాను, మూడు ఇక్కడ నా శిష్యులు, సాధువుల రూపంలో ఉంటాను, నాలుగు
మన స్వామి నారాయణ సాంప్రదాయం, తరువాత కథల్లో కూడా నేనే ఉంటాను కాబట్టి
నేనెక్కడికి వెళ్ళను.
నాలుగు రకాలుగా మీ దగ్గరే ఉంటాను. అంతే కాక అహ్మదాబాదు
నగరం లోని మందిరంలోని నర నారాయణ రూపంలో, ముల్తాన్లో లక్ష్మినారాయణ రూపంలో, గడ్కిలో
గోపికృష్ణుడి రూపంలో ఉంటాను. ఎవరికైనా, ఎప్పుడైనా ఏ కష్టం కలిగినా వారు
నిరభ్యంతరంగా ఈ మందిరాలలోకి రావచ్చును. వారికి నేను శాంతిని ప్రసాదిస్తాను. అందుకే
నేను భౌతిక రూపంలో లేకపోయినా నా చర్మ అక్షువులతో చూడగలను. ఈ రూపాన్ని నేను
అదృశ్యంగా ఉంచదలచుకున్నాను. నేను మీకు కనిపించే మనుష్య రూపాన్ని అదృశ్యం
చేసినప్పటికీ కూడా నేను మీ దగ్గరే ఉంటాను. మీలాంటి సాధు సంతువులను,
సజ్జనులని వదిలి వెళ్ళడం నాకు కూడా బాధగానే ఉంది. కాని సమయం నన్ను పిలుస్తుంది.
నేను వచ్చిన కార్యక్రమం అయిపోయింది. కాబట్టి నా పనులన్నీ మీరు చేస్తూ ఉండండి.
సంతులారా ! కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. భక్తులకు ధైర్యవచనాలు చెప్పండి.
ఒక వేళ
మళ్ళీ నేను అవతారమే ఎత్తాలనుకుంటే మీ లాంటి సాధు సంతువుల మధ్యన, మహాత్ముల మధ్యన
ఇంతమంది భక్తుల మధ్యనే నాకు అవతారం ఎత్తాలని అనిపిస్తుంది. ప్రస్తుతానికి నేను ఈ
మనిషి అవతారాన్ని చాలించ వలసిన అవసరం వచ్చింది. నేను వెళ్ళక తప్పదు అని అనగానే
స్వామి ముక్తానంద గారు మిగతా శిష్యులందరు కూడా చాలా విచార పడి అందరు గొల్లున
ఏడవసాగారు. అందరు స్వామిని “మీరు వెళ్ళవద్దు”, “మీరు వెళ్ళవద్దు”, “మీరు
వెళ్ళిపోతే మాకెవరు దిక్కు?” అంటూ ఏడవసాగారు. స్వామి నారాయణ గారు మాత్రం
నిర్వికారంగా అలాగే ఉండిపోయారు. ఈ విధంగా నర నారాయణుడే భూమ్మీద స్వామి నారాయణుడి
లాగా అవతరించి, శ్రీ కృష్ణ పరమాత్ముడి లాగా చిన్నపుడు ఎన్నో బాల్యలీలలను
చూపించారు. ఘోరమైన తపస్సు చేశారు. మానవుడి వలె మనుష్యుల వద్ద విద్యాభ్యాసం
చేశారు, యోగాభ్యాసం చేశారు. ఆధ్యాత్మిక విద్యలు కూడా గ్రహించారు. సాధారణ మానవుని
వలె ఆయన జీవించారు.
ఎలా జీవించాలో కూడా మనకు చూపించారు. సాధువులను, సజ్జనులను,
సాధారణ మానవులని ఎంతో మందిని ఆయన ఉద్దరించారు. సమాజంలోని దురాచారాలను
అరికట్టారు. ఈ విధంగా ఎన్నో మహిమలు చేసి స్వామి నారాయణ సంప్రదాయాన్ని
స్థాపించి ఉత్త భారత దేశంలోనే కాకుండా ప్రపంచమంతటా ఆయన శాఖలను
విస్తరింపజేసి, అందరినీ ధన్యులను చేసి ఆయన కార్య సమాప్తి కాగానే అందరి కన్నీటి
మధ్యన ఆయన మహా సమాధి చెందినారు. ఆయన ఒక సామాజిక వేత్త. సంఘకర్త . ఇంకా ఎన్ని విధాలుగా
ఆయన గురించి చెప్పినా కూడా మన భాషకి అందదు. మన భావాలకి భావాతీత స్థితిలో ఉన్న ఆయన
పరిపూర్ణ అవతారాన్ని మనం వర్ణించడం కాని, చెప్పడం కాని చాలా కష్టం. ఈ రోజు
ప్రపంచం నిండా ఆయన యొక్క అనుచరులు లక్షల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళంతా స్వామి నారాయణ
సంప్రదాయాన్ని చక్కగా నిర్వర్తిస్తున్నారు.
(ఇంతటితో భగవాన్ శ్రీ స్వామి
నారాయణ గారి జీవిత చరిత్ర సమాప్తం.)
“జై శ్రీ స్వామి నారాయణ” ,“జై
శ్రీ స్వామి నారాయణ” ,“జై శ్రీ స్వామి నారాయణ”