దేవదత్తుని వృత్తాంతం - 01
పూర్వం దేవదత్తుడనే ఒక పరమ భక్తుడైనటువంటి శ్రీ దత్తాత్రేయ వారి భక్తుడు ఉండేవాడు. అతను ఎన్నో జన్మలనుంచీ ఎన్నో పుణ్య కార్యాలు చేసి ఎంతో పుణ్యసంపదని ప్రోగు చేసుకున్నాడు. దాని ఫలితం వల్ల దత్తాత్రేయుల వారి కరుణాకటాక్షాలు పుష్కలంగా లభించాయి. అతను నిరంతరం శ్రీ దత్తాత్రేయులవారి ధ్యాసలోనే ఉండి ఆయనతో ఒక మానసికమైన అనుసంధానంలో ఏర్పరచుకున్నాడు. కూర్చున్నా, లేస్తున్నా, పడుకున్నా, భోంచేస్తున్నా, ఏ పని చేస్తున్నా 24 గంటలు కూడా ఆ దత్తాత్రేయులవారి స్మరణలోనే, ధ్యానంలోనే ఉంటూ ఉండేవాడు. అతని భక్తి శ్రద్ధ ఎంత గొప్పదంటే స్వయంగా ఆ దత్తత్రేయులవారు ఏదో ఒక రూపంలో దర్శనమిస్తుండేవాళ్ళు.
శ్రీ దత్తాత్రేయుని అనుగ్రహం వల్ల అతనికి
పవిత్ర హిమాలయాలలోని ద్రోణగిరి లోని శంబల అనే పవిత్రమైన ప్రదేశంలో స్థానం
లభించడం జరిగింది. శంబాల అని అంటే దీనికి నానా అర్థాలు ఉన్నాయి. ‘శం’ అంటే
‘మంచిది’, ‘బల’ అంటే ‘శక్తి’. ఇక్కడ ‘మంచి శక్తి’ అంటే అద్భుతమైన దైవిక శక్తి
ఘనీభవించి మొత్తం విశ్వానికి అది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగానూ, యోగపరంగా
విశ్వానికంతటికి కుండలిగా వ్యవహరింప బడుతూ ఉండేది. ఈ అద్భుతమైన ప్రదేశంలో
ప్రవేశించడం అంటే మన అదృష్టం పండినట్లే ఎందుకంటే ఎంతో పుణ్యం సంపాదించుకున్నవాళ్ళే
ఇక్కడకి రాగలుగుతారు. ఇక్కడనుంచే కలికి అవతారం రాబోతుందని భవిష్యత్తు పురాణంలో
చెప్పబడి ఉంది.
నిరంతరం ఈ దేవదత్తుడు సమాధి స్థితిలో
సాక్షాత్తు శ్రీ దత్తాత్రేయుల వారి తేజో రూపంతో అనుసంధానింప బడుతూ ఉండేవాడు. ఇక్కడ
కాల౦, ప్రదేశం అనే సిద్ధాంతం వర్తించదు. ఇక్కడ కాలం ఒక అనంత ప్రవాహ౦ లాగా ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ
కాలమానానికి ఎక్కడా పోలిక ఉండదు. మానవులకి కాలం ముక్కలు, ముక్కలుగా విభజింప బడి
ఉంటుంది. ఇక్కడ శంబలాలో కాలం నిరంతరం ఒక ప్రవాహంలాగా వెళ్ళిపోతూ ప్రవహిస్తూ
ఉంటుంది. అందుకని అక్కడ ఎందఱో సాధువులు, సిద్ధులు, గంధర్వులు మొదలైన అందరూ కొన్ని
వేల సంవత్సరాలనుంచి ధ్యానం చేయగల స్థితిలో ఉంటారు. వారికి ఆకలి, దప్పులు ఉండవు.
ప్రకృతియే వారిని సదా రక్షిస్తూ ఉంటుంది. ఎందుకంటే వారి అంతఃకరణం ఎంతో
నిర్మలంగానూ, పవిత్రంగానూ ప్రకృతి వలె స్వయంసిద్ధగానూ పరిశుద్ధం గానూ
ఉంటుంది కాబట్టి.
ఇలా దేవదత్తుడు కొన్ని వేల సంవత్సరాలు సమాధి
స్థితిలో ఉండి విధివశాత్తు ఒకసారి లోపల ఎక్కడో దాగిఉన్నట్టి ఒక ఆలోచనా తరంగం
బహిర్గతం కావడంతో అతను నెమ్మదిగా కనులు తెరిచాడు. అతని అంతరా౦తరాల్లో ఎక్కడో ఒక
సారి మానవులు నివశించే ప్రదేశాలకి వెళ్ళాలని , ముఖ్యంగా దత్త క్షేత్రాలని
దర్శించాలని ఆలోచన కలిగింది. ఆయన దానికోసం శ్రీ దత్తాత్రేయుల వారి అనుమతి కోరగా
మానసికంగానే దత్తాత్రేయులవారు ఆయన అంతఃకరణ౦లో కనిపించి “నీ మనస్సులో కలిగినట్టి ఈ
సంకల్పం మంచిదే అయినప్పటికీ అది పూర్తిగా తీరితే కాని నీవు ఇంకా ఉన్నతస్థితికి
వెళ్ళలేవు. కాబట్టి నీవు నీ సంకల్పాన్ని నెరవేర్చుకో. కాని ఒక్క విషయం గుర్తు
పెట్టుకో. నీవు ఇప్పుడు వెళ్ళబోతున్న భూలోకపు పరిస్థితులు, మానవులు నీవు ఇదివరకు
భూలోకంలో ఉన్నప్పటి మాదిరిగా ఉండవు. ఇప్పటివాళ్ళు చాలా భిన్నంగా ఉంటారు. అక్కడ నీవు
చూడబోయే విషయాలని గమనించి ఏమాత్రమూ ఆశ్చర్య పడవలసిన అవసరం లేదు. అక్కడ నీ
ఇష్టప్రకారం గానే అక్కడి పరిస్థితులని బట్టి నీ వేషం ధరించు. ఎట్టి పరిస్థితులలోను
నీ మనస్సును నిశ్చలంగానే ఒక ప్రేక్షకుడి మాదిరిగా నే వీక్షించు” అని కొన్ని
సూచనల్ని దేవదత్తునికి ఇచ్చి తన అనుగ్రహాన్ని ప్రసాదించారు. ఎంతో సంతోషంతో ఎంతో
వినయ౦గా శ్రీ దతాత్రేయులవారికి సాష్టాంగ ప్రణామం పెట్టి, ఆయన మానవులు
నివసించే ప్రదేశానికి అదృశ్య రూపంలో తాను సంకల్పించినంత మాత్రాన తను
కోరుకున్నటువంటి ఒక దివ్యమైన దత్తక్షేత్రానికి చేరుకున్నాడు. ఆయన మనస్సులో ఉన్న
సంకల్పం ముఖ్యంగా శ్రీదత్తాత్రేయులవారు జన్మించినట్టి ఒక క్షేత్రానికి రావడం
జరిగింది.
శ్రీ పాద శ్రీ వల్లభుల వారి జన్మస్థలం.
మొట్టమొదటిసారిగా సాక్షాత్తు శ్రీ
దత్తప్రభువులు అవతారం ధరించినటువంటి శ్రీ పీఠికాపురానికి ఆయన రావడం జరిగింది.
ఇక్కడ మొదటి అవతారమైనట్టి శ్రీపాద శ్రీ వల్లభులు జన్మించారు. దేవదత్తుడు తనకళ్ళను
తాను నమ్మలేకపోయినాడు. తాను చూసినట్టి పీఠికాపురానికి ప్రస్తుతం ఉన్న
పీఠికాపురానికి ఎక్కడా పోలిక లేదు. ఏమీ సంబంధం లేదు. అతను ఆకాశంలో ప్రయాణిస్తూ
పీఠికాపురానికి దగ్గరలో వస్తున్నప్పుడు అతనికి కించిత్తు బాధ కలిగింది. ఎందుకంటే
ఇక్కడ ఆకాశంలో ఉన్నటువంటి భూమి యొక్క అయస్కాంత క్షేత్రంలో కాలుష్యం ఆయన భరించ
లేకపోయాడు. ప్రస్తుత పీఠికాపురానికి ఆ పట్టణంలోనే సామూహిక, మానసిక జన చైతన్యం
యొక్క భావాలు పూర్తిగా కల్మషంతో నిండిపోయి ఉన్నాయి. స్వార్థం, అహంకారం.
మోసం, అజ్ఞానం, పరస్పర ద్వేషాలు, స్వార్థ చి౦తన, ధనాపేక్ష, అధర్మ ప్రవర్తన,పరస్పర
దూషణ, ఈర్ష్యా , అసూయ ద్వేషాలు అరిషడ్వర్గాలు విజ్రుంభించి ఆ చుట్టుప్రక్కల ఉన్న
అయస్కాంత క్షేత్రాన్ని దాటి అపవిత్రం చేస్తున్నాయి. ఆయనకి ఈ విషయాలేవీ
అంతుపట్టకుండా ఉన్నాయి.
సాక్షాత్తు భాగవత్స్వరూపుడైనట్టి
దత్తాత్రేయుల వారి యొక్క ప్రథమ అవతారమైనటువంటి శ్రీ పాద శ్రీ వల్లభుల వారు ఇక్కడ
భరద్వాజ మహర్షి గుట్ట పైన వారు సాగించినటువంటి సావితృకాఠకచయనం కొన్నివేల సంవత్సరాల
తర్వాత కాని ఎక్కడో సూర్య మండలం అవతల ఉన్న కొన్ని వేల బ్రహ్మాండాల వెనక కొన్ని
కోట్ల సూర్య కాంతులతో ప్రకాశించే సాక్షాత్తు శ్రీ దత్తాత్రేయుల వారి యొక్క ప్రకాశ
పుంజం, శ్రీ భరద్వాజ మహర్షి అతి పవిత్రంగా మంత్రయుక్తంగా చేసినట్టి సావితృకాఠకా
చయనం వల్ల ఆ సూర్యమండలం వరకు ఆయన ఆకర్షించ బడ్డాడు. ఇలా ఆకర్షించాబడడానికి ఎన్నో
కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. అంత పట్టుదలతో, ఎంతో భక్తిశ్రద్ధలతో భరద్వాజ ముని
ఇంకా అనేక ఋషులు దేవర్షులు సాగించినట్టి వేదయుక్తంగా, మంత్రయుక్తంగా చేసిన
సావితృకాఠకచయనం వల్ల ఇక్కడ అవతారం ఎత్తినటువంటి పుణ్యభూమిలో ఇంత విపరీతపు
పరిణామాలు వికృత ధోరణిలో ఇలా ఉన్నాయేమిటి? అని ఆయన ఆశ్చర్యపడ్డాడు. శ్రీ
దత్తాత్రేయుల వారు తనకి మర్మగర్భంగా చెప్పిన సూచనలు ఆయనకి గుర్తుకి వచ్చాయి. ఎక్కడ
చూసినా ఈ భావకాలుష్యం అంతటా వ్యాపించి ఉండడం ఆయన గమనించారు. అయితే ఇతను మహా
శక్తిసంపన్నుడు కాబట్టి, దత్తాత్రేయులవారి కరుణాకటాక్షాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి
శక్తియుతమైనటువంటి అసురశక్తుల కన్నా ఎన్నో రెట్లు శక్తివంతంగా ఉన్నటువంటి ఈ భావ
కాలుష్య తరంగాలని ఆయన శరీరం తట్టుకోగలిగింది.
ఆయన మెల్లగా తెప్పరిల్లుకుని పూర్తిగా ఆ భూమిమీదకి అడుగు పెట్టడం జరిగింది. ఇక్కడ
మనుష్యులంతా కూడా విచిత్రవేషధారణలో ఉన్నారు. వారు మాట్లాడే భాష కూడా అంత స్వచ్చంగా
లేదు. వారి మనస్సులోని దురాలోచనలు బయటకి వాక్కు రూపంలో మాత్రం ఎంతో వికృతంగా
ఉన్నాయి. ఎంతో కుతూహలంతో ఆయన మెల్లగా స్వామివారు జన్మించినటువంటి ప్రదేశానికి తన
మనోనేత్రంతో ఆ ప్రదేశాన్ని చూసి రావడం జరిగింది. ఆయన తన కళ్ళని తానే నమ్మలేక
పోయాడు. వీథులన్నీ అపరిశుభ్రంగా ఉన్నాయి. ఆ గృహం కూడా కుచించుకుపోయి అసలు గుర్తు
పట్టలేనంత విధంగా మారిపోయింది. ఆ రోజుల్లో బ్రాహ్మీ ముహూర్తం నుంచే వినపడే వేద ఘోష
ఆ చుట్టుప్రక్కల వాతావరణానికి ఎంతో పవిత్రతని చేకూరుస్తూ ఉండేది. బాపనార్యులుగారి
గంభీరమైనటువంటి వాక్కుతో, వారితోపాటు అప్పలరాజు శర్మగారు, శ్రీపాదులవారు గొంతు
కలిపి పాడుతుంటే ఎంతో మధురంగా ఉండేది. కాని ఇప్పుడు ఆ వీథులన్నీ అపరిశుభ్రంగా ,
కొన్ని ఇల్లు పడిపోయి, కొన్ని పాడుబడి ఉండడంతో ఎంతో కళావిహీనంగా ఉంది. అక్కడ
పందులు విచ్చలవిడిగా తిరుగుతూ ఉండడంవల్ల ఆ వీథి అపరిశుభ్రంగా ఉంది. ఎప్పుడైతే
చుట్టుప్రక్కల వాతావరణం అపరిశుభ్రంగా ఉంటుందో, ఎక్కడైతే ఈ జంతువులూ స్వేచ్చగా
తిరుగుతూ ఉంటాయో ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ కూడా ఒక ప్రకృతికి విరుద్దమైనటువంటి
అయస్కాంత క్షేత్రం కలిగి ఉంటాయి. అయితే ఆయనకి ఒక ఆలోచన వచ్చి వెంటనే సంకల్పమాత్రం
చేత ఒక సాధారణ మానవుని వేషం ధరించారు. కాకపోతే ఆయన వస్త్రధారణ మాత్రం పూర్వంలాగే
ఒక పంచ,ఒక అంగీని ధరించారు. చూడడానికి ఆయన ఒక సామాన్య మానవుడిలాగే కనిపించారు.
ముందుగా ఆయన ప్రఖ్యాతి గాంచిన శ్రీపాదగయప్రదేశానికి సంకల్పమాత్రం చేత
చేరుకున్నారు. ముందుగా ఆయన సాక్షాత్తు స్వయంభూ దత్తాత్రేయులవారిని దర్శనం చేసుకుని
నమస్కారం చేసి తదుపరి కార్యక్రమాన్ని నేత్రాదించుకోడానికి సంకల్పించుకున్నారు.
శ్రీపాదగాయ క్షేత్రాన్ని చూడగానే ఆయనకి ఎంతో బాధ కలిగింది. అక్కడ కూడా వీథులన్నీ,
పరిసర ప్రాంతాలన్నీచెప్పరానంత అపరిశుభ్రంగా ఉన్నాయి. దైవ సన్నిధికి
సంకేతాలైనటువంటి పరిశుభ్రత అన్నది ఎక్కడా కనుచూపుమేరలో లేదు. ఎంతో అపరిశుభ్రంగా
ఉన్న ఆ ప్రాంతమంతా కూడా బురదతో, పందులతో నిండిపోయి ఉంది. లోనకు ప్రవేశించగానే
అక్కడ ఉన్న పుష్కరిణి ఎంతో అపరిశుభ్రంగా ఉంది. అలాగే మెల్లగా ఆయన లోనికి
ప్రవేశించి స్వయంభూదత్తుడి విగ్రహం దగ్గరకి వెళ్ళాడు. ఆ విగ్రహాన్ని చూడగానే ఆయన
మనసంతా పులకరించిపోయింది. అక్కడే దగ్గరలో ఉన్న అరుగు మీద కూర్చుని ధ్యానస్థితిలోకి
వెళ్ళిపోయాడు. ఒకప్పుడు అక్కడ వేదఘోష వినిపిస్తూ ఉండేది. బ్రాహ్మీ ముహూర్తంనుంచే
వేదఘోషతో ఆ పరిసర ప్రాంతాలన్నీ అంతరిక్షమండలం కూడా ఎంతో పవిత్రంగా గోచుతూ ఉండేవి.
కొన్ని వేల మైల్లవరకు ఈ పరిశుద్ధమైన భావతరంగాలు చాలా మేర ఒక ప్రశాంతతని
వ్యాపి౦పచేస్తూ ఉండేవి. ఆ చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలయొక్క మానసిక చైతన్యాన్ని
స్పృశించిన మాత్రానే వారి మనస్సులో కూడా పవిత్ర భావాలు, ప్రేమ , కరుణ మొదలైన
భావాలన్నీ ఉప్పొంగిపోతూ ఉండేవి. పుష్కరిణి కూడా ఎంతో పరిశుభ్రంగా ఉండేది. నిత్యం
అక్కడ శివలింగానికి, స్వయంభూ దత్తునికి పూజలు జరుగుతూ ఉండేవి, దత్తపారాయణం పురాణ
ప్రవచనాలు నిరంతరం అక్కడ జరుగుతూ ఉండేవి. ఎంతో ఘనంగా పూజలు అతివైభవంగా జరుగుతూ
ఉండేవి. వీథులన్నీ విశాలంగా, ఎంతో పరిశుభ్రంగా ఉండేవి. అక్కడ జంతువులూ కూడా వాటి
వాటి పరిధుల్లో ఉండేవి తప్ప ఎప్పుడు ఆలయంలోనికి ప్రవేశించేవి కావు. ఇక్కదాస్
మనుషులందరూ కూడా ఎంతో ఆధ్యాత్మిక భావాలు కలిగి వారు సంపాదించిన దంతా పరస్పరం
పంచుకుంటూ ఉండేవారు. అందరివంతు కూడా ఇచ్చి పుచ్చుకునే ధోరణిలోనే ప్రజలంతా
కలిసి మెలిసి ఉండేవారు.
ఏ రోజైతే మానవ రూపంలో శ్రీపాదులవారి పాదకమలాలు ఈ భూమ్మీద పీఠికాపురాన్ని
స్పృశించినాయో అక్కడ భూమాత పులకించి పోయింది. అక్కడ సమస్త ప్రాణులు, వృక్షాలు,
జలప్రవాహాలు, పక్షులు, జంతువులు మొత్తం ప్రకృతి అంతా పరవశించి పోయింది.
ముల్లోకాలలో ఉన్నటువంటి సిద్ధపురుషులు,సాధువులు, మహర్షులు, సమస్త దేవగణాలన్నీ కూడా
ప్రతి రోజూ వచ్చి ఆయన్ని సేవిస్తూ ఉండేవి. శ్రీ పాదులవారు మూలంగా మాటలతో
చెప్పలేనంత అందంగా,జగన్మోహనంగా బాలకృష్ణుడివలె అందరికీ కనిపిస్తూ ఉండేవారు. వారి
యొక్క ప్రేమపూరితమైన, కరుణాపూరితమైన దృష్టి ఎవరి మీదైతే పడుతుందో వాళ్ళలో క్షణంలో
ఒక అద్భుతమైనటువంటి శాంతి, సంతోషం కలుగుతూ ఉండేవి. వారిలో మచి సంస్కారాలు
పుష్కలంగా కలుగుతూ ఉండేవి. పండుగలు-పబ్బాలు ఆ
వీథుల్లోని ప్రజలే కాకుండా ఆ చుట్టూ ప్రక్కల ఉన్నలక్షలాది ప్రజందరు
పీఠికాపురానికి వచ్చి స్వామి వారిని అనేక రకాలుగా అర్చిస్తూ ఉండేవాళ్ళు. ప్రజల్లో
అసలు అరిషడ్వర్గాలనేవి పూర్తిగా మటుమాయమైపోయాయి. అందరి హృదయాలు కూడా ఎంతో
పవిత్రభావాలతో ఉండేవి.
(మొదటి అధ్యాయం సమాప్తం )