కదళీవనం
యాత్ర
గురుచరిత్ర పారాయణ పూర్తి చేసినప్పటినుంచి
శ్రీ నృశింహసరస్వతి వారు నివసించిన, తిరిగిన
ప్రదేశాలన్నీ చూడాలని చాలా కోరికగా ఉండేది, అందులోను ముఖ్యంగా కదళీవనము బాగా చూడాలి అని అనిపించేది.
దత్తభక్తులందరికీ ఇది సహజంగా ఉండే కోరికే అని నాకు తరువాత తెలిసింది. నా మనసులోని కోరికని
సాయిరాం గురువుగారికి చెప్పగా ఆయన తనకి తెలిసిన కాంటాక్ట్ నంబర్స్ ఇచ్చి వెళ్లి రమ్మని
ప్రోత్సాహించారు. అలాగే కీర్తివల్లభులుగారు ఇదివరకు అక్కడికి వెళ్ళిన కారణంగా చాలా
విలువైన సూచనలు ఇచ్చారు. అందులో ముఖ్యమైన సూచన ఏమిటంటే కదళీవనం ఒంటరిగానో లేదా ఇద్దరో
వెళ్ళదగిన స్థలం కాదు, కనీసం ఒక పదిమంది గుంపుగా వెళ్ళాలి ఎందుకంటే అది దట్టమయిన అడవిప్రదేశం
కారణంగా జంతువులు బాగా తిరుగుతుంటాయి. ముఖ్యంగా ఆ ప్రదేశం అంతా పులులు, ఎలుగుబంట్లు
వంటి క్రూరమృగాల సంచారం బాగా ఉంటుంది కనుక గుంపుగా వెళ్ళడం శ్రేయస్కరం. ఆయన సలహా మేరకు
నా స్నేహితులు, బంధువులను కలుపుకుని సరిగ్గా 10 మంది ప్రయాణానికి సిద్ధమయ్యాము. ఆ అడవి
ప్రాంతంలో ఏ ఆహరం దొరకదని కీర్తివల్లభులుగారు చెప్పిన కారణంగా మేము కొన్ని బిస్కెట్
పాకెట్స్, స్నాక్స్ ఇంకా నీరసం వస్తే తాగడానికి గ్లూకోజ్, ఎలక్ట్రాల్ వంటివి ఏర్పాటు
చేసుకున్నాము. ఎవరి సామాను వారే మోయాలి కాబట్టి చాలా తక్కువ లగ్గేజి ఉండేట్లుగా బ్యాక్
పాక్ లో సర్డుకున్నాము.
మేము శనివారం పొద్దున్న కదళీవనము చేరుకొని
సాయంత్రానికి తిరిగి శ్రీశైలం వచ్చేసి మల్లిఖార్జునుడి దర్శనం చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. డిసెంబరు 27 రాత్రి 2 గంటలకు రెండు కార్లలో శ్రీశైలానికి
ప్రయాణం మొదలుపెట్టాము. మంచు బాగా కురుస్తున్నందు వల్ల కొంచెం నెమ్మదిగానే ప్రయాణం
సాగించాము. మేము శ్రీశైలం చేరుకునే సరికి 8 గంటలు అయ్యింది. మేము తిన్నగా పాతాళగంగ
దగ్గరకు వెళ్లి అక్కడ మా కాలకృత్యాలు తీర్చుకుని కదళీవనానికి వెళ్ళే పడవ గురించి వాకబు
చేసాము. మేము వెళ్ళేసరికే ఒక బోటు అక్కడికి వెళ్ళిన కారణంగా మేము చాలాసేపు ఎదురుచూడవలసి
వచ్చింది. అక్కడే కదళీవనంకు దారి చూపించడానికి ఒక గైడ్ ని కూడా మాట్లాడుకున్నాము. కాని
అక్కడి వారు మీరు ఇప్పుడు వెళితే సాయంత్రానికి రాలేరు, అక్కడే ఉండి పోవలసివస్తుంది,
చీకటి పడితే క్రూరమృగాల సంచారం ఎక్కువగా ఉంటుంది కనుక మీరు ఆహరం ఏర్పాట్లు చూసుకోండి
అని సలహా ఇచ్చారు. మేము మా దగ్గర ఉన్న పదార్థాలు సరిపోతాయి, లేదంటే ఒక పూట నిరాహరంగా
ఉండచ్చు అని నిర్ణయించుకుని 11 గంటలకు పడవ ఎక్కేసాము.
దాదాపు గంటన్నర (16 కిలోమీటర్ల) ప్రయాణం
చేసిన తరువాత కదళీవనం అడవుల కి వెళ్ళే కొండ దగ్గర బోటు ఆగింది. దిగిన వెంటనే ఎదురుగా
అనఘా సమేత దత్తాత్రేయుల వారి పోస్టర్ ఒకటి కనపడగా మేము అటు వైపు వెళ్ళాము. అక్కడ ఒక
చిన్న కుటీరం మాదిరిగా ఉన్నది, దానికి "శ్రీ దత్తాశ్రం" అని బోర్డు ఉంది.
కొంచెం లోపలి వెళ్లి వాకబు చేయగా అక్కడ ఒక సాధువు కదళీవనం వచ్చేవారికి ఉచితంగా భోజనం పెట్టి, అక్కడ సేద తీరడానికి ఆశ్రయం కల్పిస్తున్నారు.
ఆయనను కలిసి మా యాత్ర గురించి చెప్పగా మాకు అప్పటికప్పుడు తినడానికి అల్పాహారం ఏర్పాటు
చేసి, వేడిగా టీ ఇచ్చారు. అంతే కాకుండా కొండ పైకి ఎక్కడానికి ప్రతి ఒక్కరికి ఒక కర్ర,
రాత్రి నిద్రపోడానికి ప్రతి ఒక్కరికి ఒక ప్లాస్టిక్ చాప లాంటిది ఇచ్చారు. ఆ చాపను మేము
మా బ్యాగ్గులకి కట్టేసుకున్నాము. అంతే కాకుండా "మీకు పైన తినడానికి ఏమి దొరకవు,
మా అబ్బాయి పైన కొంతమందికి వంట చేసిపెడుతున్నాడు నేను చెప్పానని చెప్పి మీరు భోజనం
చెయ్యండి" అని ఆయన చెప్పారు. ఆయన దగ్గర సెలవు తీసుకుని మేము కదళీవనానికి బయలుదేరాము.
కొండ కింద నుంచి కదళీవనానికి 7 కిలోమీటర్ల దూరము, మొత్తం దారి అంతా కొండలమీదే ఉంటుంది.
కొన్ని చోట్ల రాళ్లు వంకర టింకరగా అమర్చబడి కొండ ఎక్కడానికి కొంచెం కష్టంగా ఉంటుంది.
మాకు కీర్తివల్లభులుగారు ముందే చెప్పడం మూలంగా దాదాపు అందరం షూస్ వేసుకునే బయలుదేరాము. మేమందరం మనసులో ఆ దత్తాత్రేయుని నమస్కరించుకుని
కొండ ఎక్కడం మొదలుపెట్టాము. మధ్యాన్నం కావడం వల్ల ఎండ కాస్త ఎక్కువగానే ఉంది. దారంతా చెట్లు, గడ్డి పరుచుకుని ప్రక్రుతి చాలా
ఆహ్లాదంగా ఉంది. మధ్య మధ్యలో కిందకి చూస్తే కృష్ణా నది, చుట్టూ కొండలు ఎంతో అందంగా
కనిపించింది. మధ్యమధ్యలో ఆగుతూ, ఫోటోలు తీసుకుంటూ
3 గంటలలో మేము కదళీవనం గుహల దగ్గరకి చేరుకున్నాము.
మామూలు రోజుల్లో అయితే 10, 15 మంది
యాత్రికులు మాత్రమే వస్తుంటారు. డిసెంబరు నెల, చాలా మందికి సెలవలు ఉండడం వల్లనేమో ఆ
రోజు దాదాపు 150 మంది భక్తులు వచ్చారు. అందరూ ఆ గుహలో తలా ఒక చోట వారు తెచ్చుకున్న
దుప్పట్లు వేసుకుని కూర్చున్నారు. అలాగే మేము కూడా ఒక మూలగా మా చాపలు పరుచుకుని మా
సామాను సర్డుకున్నాము. అక్కడే ఒక మూలగా వంటలు చేసుకునే వారు వంట చేసుకుంటున్నారు. గుహలో
చాలా భాగం చీకటిగానే ఉంది, అయినా అందరూ అలాగే సర్దుకుని కూర్చున్నారు. మేము ఆ సాధువు
గారి అబ్బాయిని కలిసి భోజనం సంగతి చెప్పగా అతను అలాగే ఏర్పాటు చేస్తానని మాకు వేడి
టీ ఇచ్చాడు. మేము కాస్త విశ్రమించి గుహ బయట కోనేరు దగ్గర స్నానాలు చేసాము. అక్కడి వాతావరణం
చాలా చల్లగా ఉంది. 5 గంటలకే చీకటి పడిపోయింది. స్నానాలు చేసి మేము అక్కడ ఉన్న నృసిం
సరస్వతి స్వామి వారి విగ్రహం దగ్గర దీపం పెట్టుకుని కాసేపు ధ్యానం చేసుకున్నాము. ఆశ్చర్యకరమైన
విషయం ఏమిటంటే అక్కడ మేము తప్ప ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వారు ఎవరు లేరు, దాదాపు అందరూ
మహారాష్ట్ర నుంచి వచ్చినవారే. కొద్దిమంది కర్నాటక వాళ్ళు ఉన్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన
విషయం ఏమిటంటే అక్కడికి వచ్చినవారిలో 90 శాతం మంది దాదాపు 50 సంవత్సరములు పైబడిన వారే. ఆ భగవంతుని దర్శనం చేసుకోవాలన్న సంకల్పం ఉండబట్టే
వారు ఇంత దూరం కొండలు ఎక్కి నడుచుకుంటూ రాగలిగారు. వారిని చూస్తే భక్తికి ఉన్న శక్తి
అంటే ఏమిటో తెలిసింది. కాసేపటికి అందరూ కలిసి నృసింహ సరస్వతి స్వామి వారికి హారతి ఇచ్చి
కాసేపు భజన చేసారు. ఆ తరువాత అందరూ వారు చేసుకున్న వంటలను స్వామి వారికి నైవేద్యం పెట్టి,
వారు తిని మాలాగా ఏమి తెచ్చుకోకుండా ఉన్నవారికి కొంత పెడుతున్నారు. మాకు కూడా ఆ స్వామి
దయ వల్ల రుచికరమైన భోజనం అందింది. బాగా అలసిపోయినందు వల్లనేమో తిన్న వెంటనే మాలో చాలామంది
ఆదమరచి నిద్రపోయాము. మిగిలినవారు ధ్యానం చేసుకుని తరువాత పడుకున్నారు.
ముందుగా నిర్ణయించుకున్నట్లే అందరం
ఉదయం 5 గంటలకల్లా లేచి దత్తపాదుకల దర్శనానికి బయలుదేరాము. ఇప్పటి దాక (కొండ కింద నుంచి
గుహ దాక) ప్రయాణం ఒక ఎత్తయితే, గుహ నుంచి దత్త పాదుకలకి ప్రయాణం మరొక ఎత్తు. ఆ అడవి
అందాల్ని ఏమని వర్ణించగలము, రోజు యాంత్రికంగా ఇల్లు, ఆఫీసు అంటూ తిరిగే నాలాంటి వాళ్ళకి
ఆ ప్రకృతిలోకి వెళ్ళడమే ఒక చికిత్సలాంటిది. అందరం ఆ ప్రకృతి అందాల్ని చూస్తూ మైమరచిపోయాము.
అక్కడే దారిలో చిన్న జలాశయం ఉంటే అందరం మా స్నానాలు పూర్తిచేసాము. ఆ వాతవరణానికే మా
మనస్సంతా చాలా ప్రశాంతంగా అయిపొయింది. ఒక గంట ప్రయాణం తరువాత (దాదాపు 5 kms ) దత్త
పాదుకలు ఉన్న చోటికి చేరుకున్నాము. అక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా, చాలా ఆహ్లాదంగా
ఉంది. ఒక పక్క చిన్న జలపాతం, దాని వెనుక శివలింగము, ఎదురుగా కింద ఒక మామిడి చెట్టు
మొదట్లో ఒక రాయి కింద దత్త పాదుకలు ప్రతిష్టితమై ఉన్నాయి. మాలో కొందరు మళ్లీ ఆ జలపాతం
దగ్గర స్నానం చేసి ముందుగా శివుడిని దర్శించుకుని, తరువాత దత్త పాదుకలను దర్శించుకున్నాము.
చాలాసేపు ఆ పాదుకల దగ్గర కూర్చుని ధ్యానం చేసుకున్నాము. ఆ చుట్టుపక్కల రాళ్ల కింద,
చెట్ల కింద చాలామంది చాలా రోజులుగా ధ్యానం చేసుకుంటున్నవారు కనిపించారు. నేను వారిలో
ఒకాయన దగ్గరకు వెళ్లి నమస్కరించి "స్వామి ఈ స్థలపురాణం ఏమిటి" అని అడిగాను.
ఈ మామిడి చెట్టు కిందే నృసింహ సరస్వతి వారు 300 సంవత్సరాలు తపస్సు చేసుకున్నారని,
300 సంవత్సరాల తరువాత ఒక కోయవాడి గొడ్డలి పొరపాటున ఆ గుట్టకు తగిలి దానిలో కొంతభాగం
తెరబడిందని, అందులోంచి శ్రీ స్వామి సమర్ధ బయటకు వచ్చి, తమ అవతారాన్ని ప్రకటించారని
ఆయన నాకు చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే ఆ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంది.
మేము కాసేపు అక్కడే ఉండి తిరిగి
10 గంటలకు తిరుగు ప్రయాణమయ్యాము. 1గంట అయ్యేసరికల్లా మేము కింద ఉన్న దత్తశ్రమానికి
చేరుకొని ఆయన ఇచ్చిన కర్రలు, చాపలు ఆయనకి తిరిగి ఇచ్చేసాము. అక్కడే మా భోజనం ముగించి,
కాసేపు విశ్రమించి మాకు తోచిన దక్షిణ ఆయనకి సమర్పించాము. అటువంటి ఏమి దొరకని ప్రదేశంలో వచ్చీపోయే యాత్రికులకు
నిస్వార్థంగా సేవ చేస్తున్న ఆయనకి మనస్పూర్తిగా నమస్కారం చేసి బోటులో తిరిగి శ్రీశైలం చేరుకున్నాము. మరుసటి రోజు అందరికి ఆఫీసులు ఉండడం వల్ల మేము శ్రీశైలం
నుంచి వెంటనే తిరుగు ప్రయాణం అయిపోయాము. మొత్తానికి ఈ యాత్ర అటు ఆధ్యాత్మికంగాను, శారీరకంగాను
మాకు ఎంతో ప్రశాంతతను కలిగించింది.
యాత్ర బృందం: రఘు ప్రసాద్, నాగరాజు,
తారకరామ్, పవన్, శ్రీనివాసు, హరి, వంశీ, నరేష్, ప్రసాద్.