N. Sairam Garu || Email: sridatta50@gmail.com. Please visit our spdss.org and sreedatta.guru website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.

Monday, 27 January 2014

Nivrutti Sangamam


నివృత్తి సంగమం- తీర్థ క్షేత్ర దర్శనం

నాకు ఈ మధ్యే గొప్ప దత్త భక్తుడు అంతకుమించి శ్రీ పాద శ్రీ వల్లభుడి భక్తాగ్రేసరుడు అయినటువంటి సాయికృష్ణ గారితో వెబ్ ద్వారా పరిచయం అయ్యింది . ఆయన  నన్ను ఋషిపంచమి రోజున తప్పకుండా నివృత్తి సంఘానికి తీసుకెళతాను అని చెప్పారు. నాకు నేత్రవ్యాధి కొంత ఉన్నది కనుక ఎలాగా అని కొంత తటపటాయిస్తుండగా “ఏమి  పర్వాలేదు, మిమ్మల్ని స్వయంగా నేను తీసుకెళతాను” అని అక్కడ విఠల్ బాబా గారి కట్టించినటువంటి వసతి గృహం ఉంది, అక్కడే పైన చిన్న ఆలయం ఉంది అని వివరాలు చెప్పగా అది నేను శ్రీ పాదశ్రీ వల్లభుల యొక్క ఆదేశమే అని గ్రహించి అదే ఉద్దేశంతో తప్పకుండా వస్తానని చెప్పడం జరిగింది. వినాయకచవితి రోజు పూజ అయ్యాక  మధ్యానం శ్రీపాద శ్రీవల్లభుడి భక్తుడు వర్మగారు అనే ఆయన వచ్చి ఆయన కారులో అమీర్ పేట్ తీసుకువెళ్ళారు. అక్కడే దాదాపు 20 మంది భక్తులు బస్సులో ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు. ఈ బృందానికి నాయకత్వం సాయి కృష్ణగారు వహించారు. మంచి కార్య దీక్షత, పట్టుదల, వాక్చాతుర్యం మరియు నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తిగా ఆయనని నేను గ్రహించాను ఎందుకంటే ఇంతమందిని ఏ తీర్థయాత్రకి తీసుకెళ్లాలన్నా చాలా కష్టమైన పని.

ఆ పనిని నిర్వహించే వారికే ఆ బాధలు తెలుస్తాయి. లోగడ నేను కూడా అటువంటి పనులు  చేసి ఉన్నాను కాబట్టి అది ఎంత కష్టమో నాకు తెలుసు. కాని ఎక్కడ ఇష్టం ఉంటుందో అక్కడ కష్టం ఏమి అనిపించదు. మేము అక్కడికి వెళ్ళిన కొద్దిసేపటికే మా బస్సు ప్రారంభం అయ్యింది.  అది వీడియో కోచ్ కావడం వాళ్ళ దానిలో ప్రశాంతత కలిగేట్లుగా శ్రీ పాదవల్లభ చరితామృతం సీడీ పెట్టారు. నేను ఎంతో ఆనందంగా ఉన్నాను ఎందుకంటే మేము వెళ్ళేది వినాయక చవితి రోజు, చాలా పవిత్రమైన రోజు. మర్నాడు అది ఋషి పంచమి, పర్వ దినం. ఆ రోజు ప్రత్యేకంగా శ్రీ పాదశ్రీవల్లభుల వారే  స్వయంగా నన్ను అక్కడికి రమ్మని ఆహ్వానించినట్లుగా భావించాను. ఎంతో ఆహ్లాదకరంగా ఆ చరితామృతం  వింటుండగా కొంతమందికి అది నచ్చలేదో ఏమో తెలియదుకాని అది తీసి ఏదైనా కొత్త సినిమా పెట్టమని చెప్పటం జరిగింది. అపుడు నేను శ్రీ పాదుడిని మనసులో ఇలా ప్రార్దించుకోసాగాను “స్వామీ ఏదో ఈ రోజు పూజ చేసుకుని నేనిలా వచ్చాను. మనం వెళ్ళే ప్రదేశానికి మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి, మనకి మంచి పవిత్రమైన స్పందనలు కలగాలంటే  మంచి విషయాలు వినాలి కదా మరి ఎందుకు స్వామీ ఈ సినిమా సీడీలు, ఎట్లాగో ప్రతీ రోజు ఇంట్లో చూస్తూనే ఉంటాము. మన జీవితంలో చాలా భాగం ఇటువంటి వాటికే వెచ్చిస్తూ ఉంటాము అని కొంత బాధపడ్డాను. అయితే మరి కారణాలు ఏమిటో తెలియదు కొత్త సినిమా పెట్టారు కాని ప్రింట్ సరిగా లేకపోవడమో, సౌండ్ సరిగా లేకపోవడమో ఇంకొకటి పెట్టగా అది కూడా అలానే జరగడంతో వాళ్ళు అన్నారు ఇవేమో బాగాలేవు ఇవన్ని తీసేయండి అనగా ఒక ప్రశాంత వాతావరణం ఏర్పడింది. హమ్మయ్య అని మనసులో ఊపిరి పీల్చుకుని శ్రీ పాదులవారికి ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఈ విధంగా మేము మా ప్రయాణం సాగించాము.

మక్తల్ దాటాక తంగిడి అనే ఒక చిన్న గ్రామం ఉంది, ఆ గ్రామంలోనే మా బస్సు ఆగింది. ఆ దారి అంతా పాడయిపోయింది. వర్షాలు నిరంతరంగా కురవడం వల్ల అక్కడంతా బురదగా ఉంది. కార్లు అటువైపుగా రాలేవు వస్తే అవి బురదలో చిక్కుకుపోతాయి. అంతకు మునుపే విఠల్ బాబాగారు సమాచారం మేరకు మేము నివృత్తి సంగమంచేరుకోడానికి  ట్రాక్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. అవి మాత్రమే ఆ బురదలో ప్రయాణించగలవు అని చెప్పడం వల్ల మేము అక్కడే బస్సు ఆపుకున్నాము. ఎక్కడ చూసిన చీకటి, కరంటు అప్పుడే పోయినట్లుంది. 

అలాగే మేము నిరీక్షిస్తూ కూర్చున్నాము. కాసేపటికి 2 ట్రాక్టర్లు రావటం, మేము రెండు భాగాలుగా విడిపోయి ఆ ట్రాక్టర్లో నివృత్తి సంగమందగ్గర ఉన్న విఠల్ బాబా ఆశ్రమానికి చేరుకున్నాము. కాని ఈ ప్రయాణం చాలా సాహసయాత్ర మాదిరిగానే ఉన్నది. ఆ ప్రదేశానికి చేరుకొని నేను ట్రాక్టరు దిగగానే మొట్ట మొదటి సారి విఠల్ బాబాగారిని చూసాను. ఆయన అందరిని పేరుపేరునా "వచ్చారా, ప్రయాణం బాగా జరిగిందా" అని ఆప్యాయంగా పలకరించారు. సాయికృష్ణగారు నన్ను వారికి పరిచయం చేసారు. తరువాత ఆయన అందరిని "బాగా అలసిపోయారు, పైకి వెళ్లి భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి" అని మేడ మీదకి పంపించారు. మేము వస్తున్న సంగతి ముందే తెలుసు కాబట్టి అందరికి భోజనం సిద్ధంగా ఉంచారు. నాకు ప్రత్యేకంగా చపాతీలు ఏర్పాటు కూడా చేసారు. అందరికీ చక్కగా అతిధి సత్కారం చేసారు. ఆ తరువాత మేమందరం 2వ అంతస్తులోకి వెళ్ళగా అక్కడ మాకు దత్త భీమేస్వరుడి విగ్రహం కనిపించింది.

అక్కడ ఒక చిన్న మందిరం కూడా ఉన్నది. నాకు వారు అక్కడ భీమేశ్వరాలయం ఎక్కడ ఉంది, భీమజా నది ఎక్కడ నుండి వస్తుంది, కృష్ణ ఎక్కడ నుండి వస్తుంది ఈ 2 నదుల యొక్క సంగామాన్నే నివృత్తి సంగమం అంటారని వారు చెప్పడం  జరిగింది. అయితే అక్కడ సత్సంగం చేసుకుందామని కొందరు అనుకున్నారు. అయితే విఠల్ బాబాగారు మేమున్న అంతస్తుకి రావడం, చాలా క్లుప్తంగా ఆయన సత్సంగం చెయ్యడం, ఆయన మమ్మల్ని ఉద్దేశించి "పైకి వెళ్ళద్దు, అక్కడ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు, చీకట్లో పడిపోగలరు” అని పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి జాగ్రత్త చెప్పినట్లుగా చెప్పారు. భోజనాలయ్యాక అందరం విశ్రమించాము. ఆ తరువాత తెల్లవారుజామున 3 గంటలకు కాబోలు అందరు అక్కడ హాలులో కుర్చీలు వేసుకుని ఆ సంగమం వైపే చూస్తూ కూర్చున్నాము. 

ఋషిపంచమి రోజున ఋషులు, సిద్ధులు, యోగులు ఈ సంగమం దగ్గరకు వచ్చి ప్రాతః కాలాన్నే స్నానం చేస్తారని, వారు జ్యోతిస్వరూపంలో వస్తారని  చెప్పి ప్రతీతి. అయితే వాళ్ళు కొంతమందికి కనపడతారు, కొంతమందికి కనపడరు అని చెప్పడం జరిగింది. అందరు అక్కడే కూర్చుని ఆ నదిసంగమం వైపు తదేకంగా చూస్తున్నారు. కొంతమంది తమ కెమెరాలతో ఫోటోలు తీస్తున్నారు, తరువాత ఆ ఫోటోలు చూడగా వాటిలో సిద్ధగోళాలు కనిపించడం జరిగింది. అయితే నేను అక్కడే కూర్చున్న కానీ ఇంకొక రకంగా ఆలోచిస్తున్నాను. మరి ఈ కాంతి స్వరూపంతో వచ్చిన మహానుభావులకి అందరికి కనపడడం ఇష్టముండదు, ఎవరైతే ఆధ్యాత్మిక దారిలో వెళతారో, వారికి చూడాలని అనిపిస్తేనే చూస్తారు . కానీ నిజమైన దత్తభక్తులకి ఇటువంటి మహిమల పట్ల కాని, ఇటువంటి దృశ్యాలు చూడాలని అనిపించదు. ఆధ్యాత్మిక మొదటిదశలో ఉన్నవారికి తప్పకుండా ఇటువంటి ఆశ ఉండటం చాల సహజం. అయితే నేను చదివిన ఒక సంఘటనలో సారాంశం ఏమిటంటే అటువంటి దివ్యపురుషులు వస్తుంటే మనం వారిని చూడకూడదు అని చెప్పినా కూడా ఒకతను వినకుండా అటువైపు చూడటము, ఆ జ్యోతిస్వరూపం నుండి వచ్చిన వెలుగురేఖల తాకిడికి అతనికి మెల్లగా అంధత్వం రావటం జరిగిందని నాకు గుర్తొచ్చాయి. అయితే ఒకటి, అతను ఒక మంచి భావనతో కాకుండా ఏమిటి ఈ దుష్టశక్తులు అని భావించడం, ఆ వెలుగు కనపడినపుడు దానిని దూషించడం జరిగింది కనుకనే అలా జరిగింది అని నేను రకరకాలుగా ఆలోచించడం జరిగింది.

అయితే ఈ లోపల విఠల్ బాబా దగ్గర నుండి “మీరు 6 తరువాత స్నానం చెయ్యండి, ఎందుకంటే ఈ రోజు అక్కడకి చాలామంది మహా పురుషులు వస్తారు, మనం ఏ మాత్రం వారి ప్రశాంతతకి భంగ పరచకూడదు” అని ఆదేశం వచ్చింది. మేము అలాగే 6 తరువాతే స్నానానికి బయలుదేరాము, బయల్దేరగానే పెద్ద వర్షం మొదలయ్యింది. అలాగ వర్షం పడుతుండగానే మేము మెల్లగా నదిలోకి ప్రవేశించడం జరిగింది. గమ్మత్తేమిటంటే నది మొదలు నీరు చల్లగా ఉన్నాయి, మధ్యలోకి  వెళ్ళగా నీరు గోరువెచ్చగా ఉన్నట్లుగా మాకు అనిపించింది. అక్కడ రాళ్ళు అన్ని పాదుకల మాదిరిగా, కొన్ని వినాయకుడి ఆకృతిలో ఉంటాయని చెప్పడం జరిగింది. అయితే మేము వెళ్ళినపుడు నీరు ఎక్కువగా ఉండడం వాళ్ళ కాబోలు మాకు పెద్దగా అటువంటి రాళ్ళు కనపడలేదు. 

స్నానం అయిన తరువాత ఆశ్రమానికి వచ్చి అల్పాహారం తీసుకుని బాబాగారి దగ్గర సత్సంగంలో పాల్గొన్నాము. ఆయన చాలా మంచి విషయాలు బోధించడం జరిగింది.  ఎటువంటి వసతులు లేని చోట  నానా ఇబ్బందులు పడుతున్న భక్తుల కోసం అన్ని వసతులు కల ఒక ఆశ్రమాన్ని స్థాపించడం అనే ఆయన ఆలోచనకి, సంస్కారానికి నా మనసులోనే ధన్యవాదాలు అర్పించుకున్నాను. అయితే ఎక్కడ నదులు ప్రవహిస్తు ఉంటాయో, ఆ నదులలో కూడా ఒక విధమైన కుండలిని శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ముఖ్యంగా 2 నదులు కలిసే చోట అక్కడ ఒక అద్భుతమైన శక్తి ప్రకటితం అవుతుంది.

కొన్ని ప్రత్యేక రోజుల్లో సూర్యుడి నుంచి వచ్చే కిరణాల వల్ల, కొన్ని గ్రహాలూ నుంచి వచ్చే స్పందనల వల్ల ఇటువంటి నదీ ప్రదేశాలలో ఒక దైవికశక్తి విద్యుత్రూపంలో ప్రహిస్తూ ఉంటుంది. ఆ రోజుల్లో కనుక మనం అటువంటి చోట స్నానం చేస్తే మన ప్రాణమయశరీరం శుద్ధి కావించబడుతుంది. అటువంటి సమయంలో ఏదో దైవధ్యానంలోనో, భగవన్నామ స్మరణలోనో ఉంటే మన భావాలూ ఇంకా ఎక్కువ పరిశుద్ధమవుతాయి. మన మనస్సు ఎంత ప్రశాంతంగా పెట్టుకంటే మన భావనలు కాని మన స్పందనలు కాని మనకి అనుభూతిలోకి వస్తాయి అని నేను అనుకున్నాను. ఆ తరువాత మేము విఠల్ బాబాగారి ఆశ్రమం నుంచి సెలవు తీసుకుని వెనక్కి వచ్చేసాము. అయితే అక్కడ నుంచి పంచదేవ్ పహాడ్ వచ్చి అన్ని దర్శనాలు చేసుకుని అటునుంచి వల్లభాపురం వచ్చాము. విఠల్ బాబా అక్కడ ముందే మాకు భోజన సదుపాయం ఏర్పాటు చేయించారు. బాబా గారి ఆతిధ్యం నేను మొదటి సారి తీసుకున్నది కాదు. కొన్ని సంవత్సరాల క్రితం కురుపురంలో భక్తులు కాలకృత్యాలు తీర్చుకునేందుకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఆ సమయంలో భక్తుల కష్టాలను గ్రహించి ఆయన అక్కడ అన్ని సదుపాయాలు కల  ఒక పెద్ద భవనం కట్టించడం జరిగింది. నేను కూడా అక్కడ ఒకసారి బస చేయడం జరిగింది.

దత్త మహాప్రభువుకి ఎంతోమంది ఎన్నో సేవలు చేస్తున్నారు. అదే విధంగా విఠల్ బాబాగారు కూడా ఈ రకంగా ఈ వల్లభాపురం దగ్గర, నివృత్తి సంగమం దగ్గర కూడా భక్తులకి ఈ విధంగా సదుపాయాలు కల్పించి ఆ దత్త మహాప్రభువుని సేవిస్తున్నారు అని నేను మనసులోనే ఆయనకి నమస్కరించుకున్నారు. తిరుగుప్రయాణంలో మహబూబ్ నగర్లో సాయికృష్ణగారి ఆప్తమిత్రుఅలైన పండరిగారు, వారి తండ్రి లక్ష్మినరసింహం గారి ఇంట్లో బస చేసాము. వారి కుటుంబం మా బృందం అంతటికి ఎంతో మర్యాద చేసారు. 

మేము వచ్చేటపుడు సరదాగా ఆడుకుంటూ పాడుకుంటూ వచ్చేసాము. ఆధ్యాత్మికత అంటే ఎప్పుడు నవ్వకుండా ఉండటమో, భగవంతుని గురించే మాట్లాడుతూ ఉండటమే కాదు దీనిలో కూడా మనం ఆడుతూ పాడుతూ ఉండచ్చు, సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చు. ఆ విధంగా మేమందరం చక్కగా ఒక కుటుంబసభ్యులుగా ఈ యాత్ర పూర్తి చేసాము. ఇదంతా చూసాక ప్రతి మనిషిలోను ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు, అలా ఉండాలి అప్పుడే జీవితం చాలా బాగుంటుంది. ఈ విధంగా ఇది ఒక కుటుంబ మరియు ఆధ్యాత్మిక యాత్రగా నేను భావించాను. నా తోటి ప్రయాణికులందరికి నేను మనసులోనే నమస్కరించి వీడ్కోలు తీసుకున్నాను.

 ఇక్కడ నివృత్తి అంటే ఏమిటంటే ఏ వ్రుత్తి లేకుండా, అంటే ఎటువంటి ఆలోచనలు లేకుండా ఉండే స్థితి. ఏదన్నా సందేహాలు కనుక ఉన్నట్లయితే వాటిని తీర్చుకోడాన్ని కూడా నివృత్తి అని అంటాము. అయితే అక్కడ నివృత్తి సంగమంలో మనం ఎటువంటి ఆలోచనలు లేని స్థితిలో, అంటే సూన్య స్థితిలోకి వెళ్ళటం అని భావించాలి. అక్కడకి వెళ్ళినపుడు మనం ఆ స్థితిలోకి వెళ్ళినట్లయితే మనము సాక్షాత్తు మన ఆత్మని దర్శించుకోవచ్చు. ఎందుకంటే ప్రతి జీవి పుట్టినపుడు అదే సూన్య స్థితిలో ఉంటారు. అక్కడ ఏవిధమైన పుణ్యకర్మలు, పాపకర్మలు చేయకుండా ఉంటాము. అదే మన ప్రధమతత్వం, అటువంటి స్థాయికి మనం తిరిగి చేరుకునే ప్రయత్నం చేయాలి అనే విషయాన్ని ఈ ఋషిపంచమి రోజున నివృత్తి సంగమంలో నేను సందేశంగా స్వీకరించాను.

-నండూరి సాయిరాం