బ్రహ్మశ్రీ స్వర్గీయ మల్లాది
గోవింద దీక్షితులుగారు చెప్పిన కొన్ని ఆసక్తికరమయినటువంటి విశేషాలు.
శ్రీపాదవల్లభ
చరితామృతంలో సాక్షాత్తు శ్రీపాద శ్రీ వల్లభ స్వామివారు శంకర భట్టు అనే కన్నడ బ్రాహ్మణుడికి
చెప్పినటువంటి ఆసక్తి కరమయిన , యోగపరమయినటువంటి విషయాలు మొత్తం 18 భాగాలుగా విభజించారు. అందులో మొదటి 6
భాగాలు శ్రీపాదవల్లభుల గురించి, ఆ తర్వాత ఆరు భాగాలు శ్రీ నృసింహసరస్వతి వారి
మీద, తక్కిన ఆరు భాగాలు శ్రీ సమర్థ స్వామి
వారి మీద మొత్తం 18 భాగాలుగా శంకర భట్టుగారు వ్రాసారు. సంస్కృతంలో వ్రాసినటువంటి ఆ గ్రంధంలోని మొట్టమొదటి
భాగాన్ని మల్లాది బాపనార్యులుగారు ఆంధ్రీకరించారు.ఆ తర్వాత మిగిలిన 5 భాగాలు శ్రీపాదవల్లభుల
వారి గురించి ,మిగిలినవి ఆరేసి భాగాలు చొప్పున శ్రీనృసింహ స్వామి గురించి మరియు స్వామి
సమర్థ గురించి వ్రాసిన ఆరు గ్రంథాలు ఆయన హస్తస్పర్శతో అదృశ్యమయినాయి అని చెప్పగా
అవి సంధ్యా భాషలో ఉన్నాయి అని శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారు తెలియచేసారు. అదే
విషయం శ్రీపాదశ్రీవల్లభ చరితంలో ప్రస్తావించబడింది. అయితే ఎప్పుడో 1326 నుంచి 1350
సంవత్సరాల మధ్య వ్రాసినటువంటి ఆ గ్రంథాన్ని శ్రీపాద శ్రీవల్లభస్వామి వారు బ్రహ్మశ్రీ
మల్లాది బాపనార్యులతో మొదలయ్యి మల్లాది వంశంలో 33వ తరానికి చెందిన వ్యక్తి ,అలాగే వెంకటప్పయ్యగారి
కుటుంబంలోని 33వ తరానికి చెందిన వ్యక్తి మరియు నరసింహవర్మ వంశంలోని 33వ తరానికి
చెందిన ఆ వ్యక్తి వచ్చినప్పుడు మాత్రమే ఆ గ్రంథాన్ని బయటకు తీసి తిరిగి చక్కగా వ్రాసి
మల్లాదివారి కుటుంబంలోని 33వ తరానికి చెందిన
వ్యక్తి పారాయణ చేసి పిఠాపురం సంస్థానానికి యివ్వవలసింది అని శ్రీపాద శ్రీవల్లభ
స్వామి వారు ఆదేశించినట్టుగా మనకి తెలిసింది. అదే విషయాన్ని చెబుతూ శ్రీ మల్లాది గోవింద దీక్షితులుగారు కేవలం 33వ తరానికి చెందిన వ్యక్తికి మాత్రమే ఆ సంధ్యా
భాషలో ఉన్నటువంటి మిగిలిన భాగాలు వ్రాయగలిగే శక్తి సామర్థ్యాలు శ్రీపాద శ్రీవల్లభస్వామి
వారు యిచ్చారని చెప్పడం జరిగింది.
ఒక
సందర్భంలో శ్రీ మల్లాది గోవిందదీక్షితులుగారు హైదరాబాద్ వచ్చారు. అప్పటికే ఆయన
ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉండేది.పిఠాపురంలో ఉన్నంతకాలం ఆయనకి మనశ్శాంతి లేకుండానే
ఉండేది అని చెప్పారు. ఎందుకంటే శ్రీపాద శ్రీవల్లభులవారి మూలగ్రంధంలోని కొన్ని
భాగాలు ప్రచురించకపోవడం వల్ల ఆయనకి మనస్థాపం కలిగింది అని చెప్పారు. ఆ సందర్భంలో
నేను ఆయనని “మీరు రెండవ భాగం ఎప్పుడు వ్రాస్తారు ? అది మాకు కావాలి” అని అన్నాను. ఒక
రోజు ఆయన ఉస్మానియా హాస్పిటల్ అనుకుంటా అక్కడికి వెళ్లి అన్ని పరీక్షలు
చేయించుకొని వచ్చారు.అప్పటికే ఆయన ఆరోగ్యం చాలా క్షీణించిపోయింది.ఆ సమయంలో ఆయన
అంటుండేవారు “మరి ఈ గ్రంథాన్ని నేను వ్రాయగాలనా లేక దీనికోసం మరొకసారి జన్మ
ఎత్తాలా ? ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను” అని అన్నారు. అప్పుడు నేను ఆయనకి
ఒక సలహా ఇచ్చాను. రెండవ భాగం నుంచి అన్ని సంధ్యాభాషలో ఉన్నాయి అని మీరే అన్నారు
కదా! ఏదో ఒక వస్తువుని పట్టుకొని ఆకాశతత్త్వం నుంచి ఆ జ్ఞానం మీ ద్వారా బయటకి
రావడం అది కూడా ఒక్కటే ఒక్కసారి మాత్రమే వస్తుందని మీరే చెప్పారు కదా. మీరు
చెప్తుంటే మేము వ్రాయడం చాలా కష్టం. కాబట్టి మేము ఒక డిజిటల్ వాయిస్ టేప్
రికార్డర్ కొని మీకు ఇస్తాము. మీరు ఆ సుషుమ్నావస్థ స్థితిలోకి వెళ్లి సంధ్యా
భాగంలో ఉన్న ఆ రెండవ భాగాన్ని చెప్తుంటే మేము దాన్ని రికార్డు చేస్తాము” అని
చెప్పాను. “కాకినాడలో ఒక హోటల్లో మీకు ఏ ఇబ్బంది లేకుండా ఒక ఏ.సి గదిలో బస
ఏర్పాటు చేస్తాము. మేము కూడా వస్తాము” అని చెప్పాను. ఆయన సరే అని అంగీకరించారు.
అదే విధంగా నేను, శ్రీ రఘుబాబుగారు డిజిటల్ టేప్ రికార్డర్ కొన్నాము.
రఘుబాబుగారు దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో నేర్చుకొని దాన్ని శ్రీ మల్లాది
గోవిందదీక్షితులిగారికి ఇవ్వడం జరిగింది. సాంపిల్ గా కొన్ని మాటలు రికార్డు చేసి
చూపించడం జరిగింది. ఆ తర్వాత నేను మీరు 2వ భాగం గబగబా చదివేసి మాకు ఇవ్వాలి అని
పసిపిల్లవాడిలాగా వెంట పడుతుండేవాణ్ని.అయితే ఆయన హైదరాబాదు నుంచి వెళ్ళిపోయారు.
ఎర్రటిఎండలో వైశాఖ మాసంలో మొట్టమొదటి సారిగా ఆయన పాండిచ్చేరి వెళ్లి, అక్కడ గణపతి
హోమం చేసాక రెండవ భాగం చదవాలని సంకల్పించారు.ఆయనతో పాటుగా చాలా దగ్గర సన్నిహితులైన
శ్రీరాములుగారు, వారి సతీమణి, శ్రీ రఘుబాబుగారు పాండిచ్చేరి వెళ్ళారు.ఆ తర్వాత
అక్కన్నుంచి అప్పటికే గురువుగారు గణపతిహోమం కోసం రిజిస్ట్రేషన్ చేసారు కాబట్టి అందరూ రమణ
మహర్షి ఆశ్రమానికి వెళ్ళడం జరిగింది. అక్కడే అనుకుంటాను ఆయన శ్రీపాద శ్రీవల్లభస్వామివారి చరితామృతంలో
రెండవ భాగంలోని కొన్ని అధ్యాయాలు తెలుగులో చదువుతుంటే దాన్ని శ్రీ రఘుబాబు గారి
రికార్డు చేసారు. ఆ సందర్భంలో ఆయన అక్కడ్నుంచే అంటే, రమణ మహర్షి ఆశ్రమంనుంచే
రికార్డింగ్ మొదలు పెట్టాము అని ఫోన్ చేసి నాకు చెప్పారు. అది విని
నేను చాలా సంతోషించాను. తర్వాత వాళ్ళు పాండిచ్చేరి నుంచి బయలుదేరారు.
ఆయన తిరిగి
హైదరాబాదు వచ్చినప్పుడు మా పథకాన్ని వివరంగా తెలియచేసాము “జూన్ నెలలో మేము కాకినాడ
వస్తాము. అప్పుడు మీరు రెండవ భాగం మిగిలిన అధ్యాయాలు చదువుతూ ఉంటె మేము దాన్ని రికార్డు చేస్తాము” అని చెప్పడం
జరిగింది. నాకు సుమారు ఒంటిగంట తర్వాత ఆయన ఫోన్ చేసి హైదరాబాదుకి వచ్చాను అని చెప్పారు.
సాయంత్రమో, రేపో కలుస్తానని నేను ఆయనకి చెప్పాను. మరి అదే రోజు రాత్రి ఆయన స్వర్గస్తులయినట్టుగా వార్త వచ్చింది.నేను చాలా దిగ్భ్రాంతి చెందాను. మరి శ్రీపాదశ్రీవల్లభులవారి పథకం ఎవరికీ తెలుసు? కాని ఆయన ఇంకా కొంతకాలం జీవించి ఉంటే తప్పకుండా రెండవ భాగం ఆయన చదువుతూ ఉంటే మా ప్లాన్ ప్రకారం రికార్డింగ్ పూర్తి అయిపోయి ఉండేది. ఎందుకంటే ఆయన చెప్తున్నప్పుడు వ్రాయడం చాలా కష్టమయిన పని, పైగా చాలా కాలం పడుతుంది. అదే ఆయన మాట్లాడుతున్నప్పుడు రికార్డు చేసి ఉంటే చాలా తేలికగా ఉండేది. ఎందుకంటే అది వింటూ మనకి కావలసిన చోట ఆపి వ్రాసుకోవడం చాలా తొందరగా మరియు తేలికగా అయిపోయి ఉండేది. మరి ఏ కారణాలవల్లో అది జరగలేదు. మనం అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి జరిగింది. అయితే అదృష్టవశాత్తు శ్రీరఘుబాబుగారు పాండిచ్చేరిలో శ్రీ గోవిందదీక్షితులుగారు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలోని 2వ భాగంలోని కొన్ని భాగాలు చదివినప్పుడు రికార్డు చేయడం జరిగింది కదా. దానిని ఆయన సీడి రూపంలో నాకు పంపడం జరిగింది. కాని, మరి ఆయన ఏ కారణాలవల్లో ఈ సీడి ఎవ్వరికీ ఇవ్వవద్దు, ఇది బయటపెట్టవద్దు అని గట్టిగా చెప్పడంవల్ల మరి నేను కూడా దాన్ని అలాగే చాలాకాలం గుప్తంగా ఉంచాను.కాని చాలామంది దత్తబంధువులు “ఇటువంటి మహాగ్రంధాన్ని,ఆధ్యాత్మిక గ్రంధాన్ని, కొన్ని లక్షల జీవితాలనే మార్చినటువంటి అమృతమయమైన ఆ గ్రంధాన్ని బయట ప్రపంచానికి తీసుకొని వచ్చిన మహానుభావుడైన ఆ మల్లాది గోవిందదీక్షితులుగారి గురించి ఎవ్వరికీ ఏమి తెలియదు, తెలిసినవారేమో మాకు చెప్పడానికి ఏమాత్రం యిష్టపడటంలేదు. మీకు తెలుసు కాబట్టి మీరు యి విషయాలన్నీమాకు చెప్పడం బాగుంటుంది” అని నాతో అన్నారు. చాలాకాలం ఆలోచించాక నా దగ్గరున్న సీడిని కొంతమంది దత్తబంధువులకి ఇవ్వడం జరిగింది.తర్వాత ఇంక దాన్ని దాచి ఉంచడం లాభం లేదు, ఆయన జీవించి ఉన్నప్పుడు ఆయనను చూడలేకపోయిన దత్తబంధువులు కనీసం ఆయన స్వరం విని సంతోషిస్తారు. దానికి ఉపోద్ఘాతంగా ఈ నాలుగు మాటలు మీ దత్తబంధువులందరికీ నేను చెప్తున్నాను. శ్రీ గోవిందదీక్షితులుగారి స్వరాన్ని వినండి, విని ఆనందించండి. రెండవ భాగంలో చాలా నూతనమైనటువంటి విషయాలు ఆయన చెప్పారు. ఆయన చెప్పిన విషయాలు ఖండఖండాలుగా, ముక్కలు ముక్కలుగా, అక్కడ అక్కడా కొంతమంది దత్తభక్తుల ద్వారా బయటకి వస్తున్నాయి. అయితే నేను చేసిన ఒక ప్రక్రియ ఏమిటంటే అలా బయటకి వచ్చిన ఆ ముక్కలన్నిటినీ ఒక చోట అనుసంధానం చేసి , దానికొక రూపాన్ని, ఆకారాన్ని కల్పించగలిగాను. అందుకని నాకు స్వర్గీయ శ్రీ గోవిందదీక్షితులిగారి మధ్య జరిగిన కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి,జ్ఞానపరమైనటువంటి మరియు శాస్త్రీయకరమైనటువంటి విషయాలని కూడా వెబ్ సైట్ ద్వారా మీ అందరికీ తెలియచేయాలి అని కూడా నేను ఆలోచిస్తున్నాను. దానికి నాకు మీ అందరి ఆశీస్సులు, శుభాకాంక్షలు, అలాగే శ్రీపాదులవారి అనుగ్రహం, కరుణాకటాక్షము మరియూ స్వర్గీయ బ్రహ్మశ్రీ గోవింద దీక్షితులుగారి ఆశీస్సులు కూడా నాకు త్వరలోనే కలగాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మరి ఈ సీడి నుంచి మీరందరూ ఆయన స్వరాన్ని విని ఆనందిస్తారని నేను కాంక్షిస్తున్నాను.ముఖ్యంగా రెండవ భాగంలో కొంత భాగమైన కణసిద్ధాంతం ,కణ్వమహర్షి సిద్ధాంతమూ వీటి గురించిన చాలా కఠినమైన మరియు తొందరగా అర్థం కాని విషయాలు ఎన్నో సరళమైనభాషలో అందరికీ, ఆయన అర్థమయ్యేటట్లుగా చెప్పారు. మీ అందరికి కూడా శ్రీపాదశ్రీవల్లభులవారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాను.
-
మీ భవదీయుడు నండూరి సాయిరాం.
బ్రహ్మశ్రీ
గోవిందదీక్షితులు గారి ప్రసంగములో నుండి
క్లుప్తముగా కొన్ని విషయాలు
ఈ ప్రసంగములో బ్రహ్మశ్రీ
గోవిందదీక్షితులుగారు శ్రీపాదశ్రీవల్లభుల వారి చరితామృతము యొక్క
రెండవ భాగము గురించి వివరించడమైనది.
చిత్ పవన బ్రాహ్మణ వంశములోని వారు
అయిన పరశురాముని శిష్యులు 14
మంది యోగులు పరశురామదేశంలో నివసించేవారు. వారు "అలక్ నిరంజన్" అని
ఉచ్చరించే వారు. వారు సంధ్య భాషలో మాట్లాడుకునేవారు. వారిలో ముగ్గురు యోగులు
ఏకముఖినాధుడు,
ద్విముఖినాధుడు,
త్రిముఖినాధుడు శంకరభట్టునికి కనపడినారు. ఏకముఖినాధుడు శంకరభట్టునితో ఈ
విధముగా చెప్పెను.
1) శ్రీ
గురుని చరిత్ర 18
ఖండములలో విభజించడమైనది. అందులో శ్రీపాదుని గురించి 6
ఖండములు, శ్రీ నృసింహ సరస్వతి గురించి 6 ఖండములు, శ్రీ
స్వామి సమర్ధ గురించి 6
ఖండములుగా చెప్పబడినవి.
2)
శ్రీ బాపనర్యులవారి కరస్పర్శతో వాటిలో
మొట్టమొదటి భాగమయిన శ్రీపాదవల్లభ చరితామృతము మినహాయించి మిగిలిన 17 ఖండములు సంధ్య
భాషలో మార్చబడినవి. అనగా మహాసరస్వతి చైతన్యము లోనికి మార్చబడినవి. మల్లాది
వంశములోని 33వ
తరంలోని వారికి మాత్రమే వీటిని తర్జుమా చేసే శక్తి ఉండును.
3)
శంకరభట్టు ఉడిపి క్షేత్రము వెళ్ళడానికి ఒక
రహస్యం కలదు. ఆదివరాహమూర్తికి,
భూదేవికి ఒక అసురశక్తి జన్మించింది.
అదే నరకాసురుడు, వాడే నరకుడు అనే ఖగోళముగా ఆవిర్భవించాడు. అది అనేక లక్షల
సంవత్సరాలు అంతరిక్షంలో వుంది. ఉడిపి క్షేత్రం నుంచే శ్రీకృష్ణుడు
తన సుదర్శన చక్రంతో ఆ ఖగోళాన్ని ముక్కలు ముక్కలుగా చేసాడు. ఆ సూక్ష్మశరీరము
మానవాకారం ధరించి నరకాసురినిగా మారింది.
4)
నారాయణుడిలోని 16 కళలు (స్పందనలు), 16000
మానవాకారాలు ధరించి రామావతారంలో మగవారిగా, కృష్ణావాతారంలో
గోపికలుగా జన్మించాయి. భార్య అనగా భరింపబడునది.16 దివ్యస్పందనలను స్త్రీ
స్వరూపం ధరింపచేసి ఆయన అధినంలో ఉంచుకున్నారు.
5)
ప్రతి మానవుడు భూమికి వచ్చే ముందు
స్పందనాత్మకమైన శక్తి స్వరూపంగా (శబ్ద స్వరూపంగా) ఉండవలసిందే.
మహాసరస్వతి యొక్క వీణనాదము యొక్క అంతర్యమిదియే. బ్రహ్మశ్రుతులు,అపశ్రుతులు
బట్టి మనిషి నొసట ప్రారబ్ధకర్మ లిఖించబడును. వీణనాదము మహాదానందకరముగా, ఆహ్లాదముగా
వాయించినపుడు యోగ్యులు,ఆరోగ్యవంతులు
జన్మించును. వీణనాదము అపస్వరంతో,చికాకు
కలిగించినపుడు అయోగ్యులు,
అనారోగ్యంతో ఉన్నవాళ్లు జన్మించును.
6) శబ్దచైతన్య
తరంగాలు సర్పాకృతిలో కదులును. జ్యోతి స్వరూపములు, అలలు కూడా సర్పాకృతిలో
కదులును. దీనినే కుండలినీ శక్తి
అందురు.
7)
శ్రీపాదులు మాత్రమే బ్రహ్మ రాసిన తలరాత
మార్చగలరు, కర్మధ్వంసము చేయగల సర్వసమర్ధులు.