ఆధ్యాత్మిక అనుభవాలు - విశేషాలు
ఒక సారి బహుశా గురువారం అనుకుంటాను నాకు మార్గదర్శకుడైన స్వామీజీ వారి దగ్గరకు వెళ్లాను. నాకు అంతకుముందే మా ఇంటికి లలితా పరమేశ్వరి ఉపాసకురాలు వస్తారు. ఆవిడ అమ్మవారి విషయాలు చెప్తుంటారు.నీవు తప్పకుండా వచ్చి వారిని కలుసుకోవలసింది అని ఆదేశమిచ్చారు.
అదే సమయంలో నా ఆధ్యాత్మిక మిత్రుడై నటువంటి , షిరిడి సాయి బాబా భక్తుడు ఫోన్ చేసి మీరు తప్పకుండా వారిని కలవాల్సిందే . నేను మీ గురించి అప్పుడే ఆవిడకి చెప్పాను అని చెప్పాడు. ఇద్దరి ఆదేశాల ప్రకారం నేను స్వామీజీ వారింటికి ఆవిడని కలుసుకోవడానికి వెళ్లాను. కాస్సేపటికి ఆవిడ వచ్చారు. ఆవిడ చాలా ప్రశాంతంగా ఉన్నారు.
ఆవిడ M.A. పట్టభద్రురాలు. ఆవిడ మాతృభాష తమిళం అయినప్పటికీ తెలుగు చాలా బాగా మాట్లాడుతారు.
అదే విధంగా ఇంగ్లీష్ కూడా ధారాళంగా మాట్లాడుతారు. మా స్వామీజీ వారు కూడా తమిళము , తెలుగు , ఇంగ్లీష్ ఈ మూడు భాషలు చాలా బాగా మాట్లాడగలరు. నేను మా గురువుగారి ప్రక్కనే కూర్చున్నాను. అప్పుడు కొంచెం ఆధ్యాత్మిక విషయాల మీద చర్చ జరిగింది. ఆవిడ కొన్ని విషయాలు నాతో చెప్పారు. అవే విషయాలు నేను బయటకి మీతో చెప్తాను.
మేము పూజా గదిలోకి వెళ్ళినప్పుడు శ్రీమతి లక్ష్మి ప్రసన్న కుమారి గారు రచించిన "శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం " పుస్తకాన్ని స్వామి వారి చేత నేను ఆవిడకి ఇప్పించాను. స్వామీజీ వారు చీర- జాకెట్టు, పసుపు- కుంకుమ, కొబ్బరికాయ తో పాటు ఈ పుస్తకాన్ని ఆవిడకి బహుకరించారు. తరువాత కొద్ది సేపటికి నేను మా ఇంటికి వచ్చేసాను. తర్వాత నేను ఆవిడకి ఫోన్ చేసినప్పుడు ఆవిడ నాతో ఇలా చెప్పారు. స్వామివారు నా జీవితంలో నేను మరువలేనట్టి అద్భుతమైన పుస్తకం బహుమతిగా నాకిచ్చారు. మీ గురించి మీ స్నేహితుడు నాకప్పుడే చెప్పాడు . నా దగ్గరకి శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం పుస్తకాలు మూడు వచ్చాయి. ఇన్ని రోజులైనా వాటిని నేను చదవలేదు. కాని స్వామి వారు నాకిచ్చిన ఈ పుస్తకం నాలో చెప్పలేనటువంటి దివ్యానుభూతిని కలగజేసింది. ఏవో దివ్య ప్రసారాలు నా శరీరమంతా వ్యాపించాయి. నాకు చాలా సంతోషం వేసింది. ఈ పుస్తకంలో విద్యుత్తే కాకుండా ఒక ఆధ్యాత్మిక విద్వత్తు ప్రతి అక్షరంలోనూ ఉన్నది. రచయిత ఎవరో కాని ఈ పుస్తకాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో, భావ శుద్ధితో వ్రాసినటువంటి పుస్తకం. ఈ పుస్తకాన్ని నేను తప్పకుండా చదువుతాను. మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ విన్నాను. నాకు చాలా సంతోషం వేసింది. మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు సాక్షాత్తు శ్రీ పాదుల వారు కనిపిస్తున్నారు. వారు ఒక సూచనని ఇస్తున్నారు. నేను దాన్ని యథాతథంగా మీకు చెప్తున్నాను. ప్రస్తుతం మీరు పంచ దేవ్ పహాడ్ లో చేస్తున్న కార్యక్రమాలన్నీ చాలా బాగున్నాయి. కాని అక్కడ ఆధ్యాత్మిక శక్తులతో పాటు కొన్ని విపరీత శక్తులు, మాయా శక్తులు విజ్రుంభించి అవి పని చేస్తుంటాయి. ఇది సర్వ సాధారణ విషయమే. ఇక్కడ ఏవైనా విపరీత శక్తుల్ని, మాయా శక్తుల్ని ఎదురించడానికి మరి కొంత దైవిక శక్తి అవసరము కావున శ్రీ పాద శ్రీవల్లభ స్వామి వారి ఆదేశ ప్రకారం 108 శ్రీ పాద శ్రీ వల్లభుల వారి విగ్రహాలని మీరు తెప్పించి ఒక పౌర్ణమి నాడు ఏ పౌర్ణమి అయినా ఫరవాలేదు 108 విగ్రహాలని పెట్టి పూజ చేసి , పంచామృతంతో అభిషేకం చేసి యథావిధిగా ఆ రోజు దత్త భక్తులు యెంత మంది వస్తారో అంత మందిని కూర్చోబెట్టి
వారందరి తరఫున కూడా పూజ చేయాలి. మామూలుగా మీరు నిత్య పూజ ఎలా చేస్తారో అలాగే చేయాలి ఆ తర్వాత ఎవరికి కావాలో వారు ఆ విగ్రహాలని కొనుక్కుని ఇంట్లో పెట్టుకుని కూడా పూజ చేసుకో వచ్చును. ఆ తర్వాత ఎవరికి కావలసిన విగ్రహాలు వాటంతట అవే వాళ్ళింటికి వెళ్లి పోతూ ఉంటాయి. ఈ పౌర్ణమి కార్యము అయిపోయినాక మీరు చేస్తున్న మానవ ప్రయత్నాలకి దైవిక శక్తి తోడ్పడుతుంది శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి వారి కరుణ ఉంది కనుక మీరు చేస్తున్నమంచి పనులకి ఆయనే శక్తిని ప్రసాదిస్తారు . మీలో ఎవరైనా శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి వారి కార్యక్రమాలు ఏవైనా చేయాలి అని అనుకుంటే దానికి ఇంత కాలము మీకు ఏమైనా అడ్డంకులు వచ్చి ఉంటే అవి కూడా తప్పకుండా తొలగి పోతాయి. ఇది నేను చెప్పటం కాదు సాక్షాత్తు శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి వారు ఇచ్చిన ఆదేశమే నేను మీకు చెప్తున్నాను. మీరు తప్పకుండా ఈ కార్యక్రమములు చేయండి అని ఆవిడ చెప్పారు. అప్పుడు నేను వెంటనే మైత్రేయి గారికి ఫోన్ చేసి విషయమంతా వివరించాను
శ్రీ పాదుల వారి ఆదేశానుసారం వెంటనే మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం మొదలు పెట్టాము. అయితే అద్భుతంగా మేము పూజ చేసే రోజు 108 విగ్రహాలకి బదులు 114 విగ్రహాలు వచ్చాయి. వాటన్నిటినీ పెట్టి పంచామృతంతో అభిషేకమూ, పూజ అన్నీ చేసాము. యథావిధంగా ఈ కార్యక్రమాలన్నీ ముగిసిపోయినాక మైత్రేయి గారు మనస్సులో ఇలా అనుకున్నారు ." స్వామీ ! నేనయితే ఎవరికీ ఇక్కడ పూజ ఉంది అని ప్రత్యేకంగా ఫోన్ చేసి చెప్పడం కాని పిలవడం వంటివి చేయలేదు. నీ ఇష్టం. నీవెవరిని పిలిపించు కుంటావో, ఎవరు నీ భక్తులొ , ఎవరితో నీకు సంబంధం ఉంటుందో వాళ్ళు వచ్చివిగ్రహాలు తీసుకు వెళతారు." అని సంకల్పం చేసుకున్నారు.
చాలా మంది చాలా అద్భుతంగా రావడం , ఆ విగ్రహాలని తీసుకుని వెళ్లి పోవడం జరిగింది. ఆ విగ్రహాలు అమెరికా కూడా తిరిగాయి. శ్రీ పాద శ్రీ వల్లభుల వారిని దృష్టి లో పెట్టుకుని, సమాజ శ్రేయస్సు కోసం మేము చేస్తున్న ప్రయత్నాలు మరి అంత కాలము మాకు కలిగిన అడ్డంకులు అన్నీఈ పూజ తర్వాత నిర్వీర్యమై పోయి శ్రీపాద శ్రీ వల్లభ స్వామివారి అనుగ్రహం వల్ల ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలు మేము చేయగలము. ఊళ్ళో ప్రజలకు , ముఖ్యంగా బలహీన వర్గాల వారిని దృష్టి లో పెట్టుకుని మేము సంకల్పించిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా శ్రీపాద శ్రీ వల్లభ స్వామివారి అనుగ్రహం వల్ల జరుగుతున్నాయి.
నేను ఫోన్ చేసేసరికి నా దగ్గర 5 విగ్రహాలు మాత్రమే ఉన్నాయి అని మైత్రేయిగారు చెప్పడం , ఎందుకో నాకు ప్రేరణ వచ్చినేను మైత్రేయి గారింటికి వెళ్లి ఆ 5 విగ్రహాలు తీసుకు వచ్చాను. ఆ మరుసటి రోజే ఆశ్చర్యకరంగా ఐదుగురు దత్త భక్తులు వచ్చి ఆ విగ్రహాలు తీసుకెళ్లడం జరిగింది . ఈ విధంగా మరొకసారి శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి వారు మమ్మల్ని కరుణించి , కటాక్షించి మేము చేసే ప్రయత్నాలకి ఆయన అనేక వ్యక్తుల ద్వారా, సాక్షాత్తు ఆయన శక్తుల ద్వారా మేము చేసే అన్ని కార్య క్రమాలకి అండ దండగా నిలిచి ఉన్నారు .