ఆధ్యాత్మిక అనుభవాలు - విశేషాలు
గాయత్రి మంత్ర శక్తి - క్షుద్ర దేవత అపజయం
ఒక చిన్న పల్లెటూరిలో ఒక ఆలయం ఉంది. ఆ ఆలయంలో నిత్య పూజ కార్యక్రమాలు చేయడానికి మరియూ ఆ గ్రామంలో విశేషంగా ఏ పండగలు-పబ్బాలు వచ్చినప్పుడు పూజలు చేయడానికి ఒక బ్రహ్మచారి బ్రాహ్మణున్ని ఆ ఊరి కరణంగారు కలిసి తీసుకు రావడం జరిగింది. ఆ వచ్చిన బ్రాహ్మణుడు చాలా నిష్టాపరుడు. నిత్యం వేద పఠనం చేస్తుండేవాడు. ఎంతో పొద్దున్నే లేచి సంధ్యావందనం చేసుకుని గాయత్రి మంత్రం చదువుకుంటూ ఆ దేవున్నీ, ఆ పూజా గృహాన్ని కడిగి తుడిచీ, నిత్యం ఎంతో అలంకారాలు అవీ చేస్తూ నిత్య పూజలన్నీ నిర్వహిస్తుండేవాడు. బ్రహ్మచారి కావడమూ, దేవుని నిష్ఠ పాటించడమూ, ఆహార నియమాలు పాటించడం వల్ల దేహ దారుఢ్యమ్ కలిగి చూడడానికి చాలా అందంగా కనిపిస్తూ ఉండేవాడు.
ఇలా రోజులు గడిచి పోతున్నాయి. అతను వేరే విషయాలేవీ పట్టించుకోకుండా నిరంతరమూ తన పూజా కార్యక్రమాల్లోనే ఉండి మిగిలిన సమయమంతా స్వాధ్యయనం చేసుకుంటూ, గాయత్రి మంత్రం చేసుకుంటూ ఉండే వాడు. నిద్రలో కాని మెళకువగా ఉన్నప్పుడు కాని ఎప్పుడైనా గాయత్రి మంత్రాన్ని జపిస్తూ ఉండేవాడు. అతనికి అవసరాలు ఎక్కువగా లేవు కాబట్టి ఇంటి ముందు ఒక కుక్కి మంచం వేసుకుని, పడుకుని ఆయన ఈ గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేస్తుండేవాడు.
ఆ ఊళ్లోనే ఒక సంపన్నమైన కుటుంబం ఉండేది. వాళ్ళింట్లో అప్పుడప్పుడు సత్య నారాయణ వ్రతం ఇంకా వేరే ఏవైనా పూజలు అయినప్పుడు వారు ఈ బ్రహ్మచారి పూజారిని పిలవడమూ, అతను వారింటికి వెళ్లి ఆ పూజా కార్యక్రమాలు, వ్రతాలు అన్నీ వారిచేత చేయిస్తూ ఉండేవాడు. ఈ పూజారి గారు వారింటికి వస్తూ పోతూ ఉండడం వల్ల పైగా చూడడానికి కూడా చాలా అందంగా ఉండడం వల్ల ఆ సంపన్నుడి భార్య అతని మీద మనసు పడింది. ఒక రోజు ఏకాంతంగా అతన్ని కలిసి తన కోరిక వెల్లడించింది. అతను వెంటనే "హర హరా"' అంటూ గట్టిగా చెవులు మూసుకుని తల్లీ ! స్త్రీలంతా నాకు తల్లితో సమానులు. మీరు ఇటువంటి కోరిక కోరడం ఉచితం కాదు. నేను కూడా పతనమై పోతాను. అటువంటి విషయాలు మీరు ఆలోచించ కూడదు అని చాలా వినయ పూర్వకంగా ఆవిడ కోరికని త్రోసి పుచ్చాడు. దానితో ఆవిడకి అవమానంగా అనిపించి అతని మీద ఎలాగైనా సరే ప్రతీకారం తీర్చు కోవాలి అని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆవిడ ఇలా వాకబు చేస్తూ చేస్తూ ఉంటే ప్రక్క గ్రామంలోనే ఒక క్షుద్రోపాసన చేసే మాంత్రికుడు ఉన్నాడని, అతను డబ్బు తీసుకుని క్షుద్రదేవతల ద్వారా ప్రత్యర్థిని హత మారుస్తాడని ఆవిడకి తెలిసింది.
ఒక రోజు ఆవిడ ఆ క్షుద్ర మాంత్రికుణ్ణి కలిసి, వాడికి డబ్బు ఆశ చూపించి ఎలాగైనా సరే ఆ పూజారిని నీవు హతమార్చాలి అని చెప్పి ఆ పనికి పురమాయించింది. అలాగే అని చెప్పి ఆ క్షుద్ర మాంత్రికుడు స్మశానంలోకి వెళ్లి ఏదో బ్రహ్మాండ మైనటువంటి ఒక తాంత్రిక శక్తి ఆ పూజారి మీద ఉపయోగించాడు. సాధారణంగా పల్లెటూళ్ళలో ఎండా కాలంలో అందరూ మంచాలు వేసుకుని ఆరు బయట హాయిగా పడుకుని నిద్ర పోతుంటారు. అలాగే మన ఈ పూజారి గారు కూడా తన కుక్కి మంచం వేసుకుని ఆరు బయట పడుకున్నారు. యథా ప్రకారం నిద్రలో కూడా గాయత్రి మంత్రం చదువుకుంటున్నారు. అయితే అతనికి అకస్మాత్తుగా మెలకువ వచ్చింది. ఎవరో పిలిచినట్టుగా అనిపించి కళ్ళు తెరిచి చుట్టూ చూసేసరికి ఒక భయంకరమైన ఆకారంలో జుట్టంతా విర బోసుకుని, చేతిలో భగ భగా మండే నిప్పుల పళ్ళెం పట్టుకుని అతని మంచం చుట్టూ తిరిగి, అతని మీద ఈ మండే నిప్పులు వేసి అతన్ని హతమార్చే ప్రయత్నంలో ఉన్నది. అతను ముందు కలవర పడ్డా ధైర్యం తెచ్చుకుని ఆ గాయత్రి మంత్రాన్ని జపించ సాగాడు. ఎన్ని విధాల ప్రయత్నం చేసినా ఆ భూతం , ఆ పిశాచం అతని దగ్గరకి రాలేక పోతుంది. కొంత దూరంలో అతని మంచం చుట్టూ తిరిగి తిరిగి విసుగు పుట్టి, సహనం చచ్చి ఆ పిశాచం పిచ్చి పిచ్చి చేష్టలతో అతన్ని దడిపిస్తూ ఉంటుంది కాని దాని ప్రయత్నాలు ఒక్కటి కూడా ఫలించవు. ఎంతో శ్రమ పడి పడి ఏమీ చేయలేక నిరాశతో తిరిగి వెళ్లి పోతుంది. అప్పుడు అతను గాయత్రి మంత్రం ఇంకా ఎక్కువగా జపించడం మొదలు పెట్టాడు. ఇలా ప్రతీ రాత్రి ఆ పిశాచం, ఆ భూతం నిప్పుల పళ్ళెంతో రావడమూ, అతని మంచం చుట్టూ తిరగడమూ, అతన్ని చంపాలనే ప్రయత్నంలో విఫలమవ్వడమూ ఇలా మూడు రోజులు గడిచాయి. నాలుగవ రోజు ఉదయాన్నేఒక వింత వార్తతో ఊరు ఊరంతా గుప్పుమంది. అందరూ తలా ఒక మాట చెప్పసాగారు. స్మశానంలో ఒక క్షుద్ర మాంత్రికుడు ఒళ్ళంతా నిప్పులతో కాలి చచ్చి పడి ఉన్నాడు అని, అతని చుట్టూ చల్లారి పోయిన బొగ్గులు ఉన్నాయని ఎంతో ఆశ్చర్యంగా, చాలా వింతగా అందరూ చెప్పుకోవడం జరిగింది.
మంత్రం ప్రయోగం చేసినప్పుడు ఆ మంత్రం అధీనంలో ఉన్న క్షుద్ర దేవత ఎవరినైతే సంహరించాలో వారిని సంహరించలేనప్పుడు అది తిరిగి వచ్చి ఎవరు ప్రయోగించారో వాళ్ళ మీదనే ఆ ప్రయోగం చూపిస్తుంది అని మంత్ర శాస్త్రంలో ఉన్నది. మరి అప్పుడు ఏం జరిగింది? తన ప్రయత్నం విఫలమవడంతో ఆ పిశాచం ఆ భగ భగా మండే బొగ్గులని ఆ మాంత్రికుడి మీదే వేసింది. దెబ్బకి అతను కాస్తా చచ్చి ఊరుకున్నాడు. ఎవరి మీదైనా దుష్ట ప్రయోగం చేసినప్పుడు దైవిక శక్తి కనక అడ్డు తగిలితే అది తిరిగి వెళ్లి ఆ దుష్ట ప్రయోగం చేసిన వారికే తగులుతుంది అని ఆ పూజారి గారికి అర్థమయి ఇంకా చక్కగా గాయత్రి మంత్రం జపించ సాగాడు.
ఇది కూడా విశ్వ నాథ సత్య నారాయణ గారు తను వ్రాసిన నవలలో చెప్పటం జరిగింది. కనుక ప్రస్తుతం కలి యుగంలో, ప్రస్తుతపు పరిస్థితుల్లో మనల్నిరక్షించేది గాయత్రి మంత్రమే అని గాయత్రి పరివార్ ఫౌండర్ పండిట్ శ్రీ రాం శర్మ ఆచార్య గారు చెప్పటం జరిగింది. ప్రస్తుతం యుగ సంధిలో అంటే 1980 నుంచి 2013-14 వరకు కూడా సంధియుగం నడుస్తుంది. ప్రస్తుతం ఈ గాయత్రి మంత్రం పది మాలలు చేయడం అవసరం. పడుకునే ముందు కనీసం మూడు మాలలు చేయడం అవసరం.ఇప్పుడైతే కుల మత భేదాలు లేవు కాబట్టి ఎవరైనా చేసుకోన వచ్చును. దీని మూలంగా వారికే కాకుండా సమాజానికి కూడా ఎంతో సేవ చేసిన వారవుతారు అని ఆయన అంటే పండిట్ శ్రీ రాం శర్మ ఆచార్య గారు చెప్పటం జరిగింది.