ఆధ్యాత్మిక అనుభవాలు - విశేషాలు
భారతీయ శాస్త్రజ్ఞుడైన సర్ జగదీశ్ చంద్ర బోస్ వృక్షాల మీద చేసిన పరిశోధనలు, ప్రయోగాలు.
క్రిందటి ఎపిసోడ్ లో చెప్పినట్టుగానే మొక్కల గురించి నాకు తెలిసిన చాలా ఆసక్తికర మైన విషయాలు నేను మీతో చెప్పదలచు కున్నాను. మన భారతీయ శాస్త్రవేత్త సర్ జగదీశ్ చంద్ర బోస్ గారు కనుక్కున్న క్రెస్కోగ్రాఫ్ అనే పరికరము, ఆయన దానితో మొక్కలమీద, వృక్షాల మీద చేసిన ప్రయోగాలు చెప్తాను. అంతే కాకుండా మరి కొన్ని ఆశ్చర్యకరమైన, అద్భుతమైన విషయాలు కూడా చెప్పదలుచు కున్నాను.
నోబల్ బహుమతి (నోబెల్ ప్రైజ్) రావలసిన ఆద్భుతమైన శాస్త్రవేత్త కాని ఎందుకో రాజకీయ కారణాల వల్లనో మరి ఎందుకో రాలేదు. అలాగే ఆయన తన పరిశోధనలు మొదలు భౌతిక శాస్త్రం మీద చేస్తూ ఉండేవారు. తర్వాత అనుకోకుండా ఆయన జీవశాస్త్రం వైపు తిరిగి పోయారు. సర్ జగదీశ్ చంద్ర బోస్ ఈ క్రెస్కోగ్రాఫ్ అనే పరికరాన్ని కనుక్కున్నప్పుడు కలకత్తాలో చాలా మంది శాస్త్రజ్ఞులని, పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిచి అది పని చేసే విధానాన్ని చూపించారు.
ఈ క్రెస్కోగ్రాఫ్ పరికరం ఏ వస్తువునైనా కొన్ని కోట్ల రెట్లు పెద్దగా చేసి (magnify) చూపిస్తుంది . ఆ క్రెస్కోగ్రాఫ్ అనే పరికరాన్ని ఆయన ఒక మొక్కకి అమర్చి, పెద్ద తెర మీద ఆ మొక్కలో కనిపించే మార్పులని అక్కడకి వచ్చిన వారందరికీ చూపించారు. అది అలా మాగ్నిఫై అయినప్పుడు ఆ మొక్కలో sap movement అంటారు అది కనిపించింది. అంటే మానవులలో , జంతువులలో రక్తం ఏ విధంగా పైకీ, క్రిందకీ ప్రవహిస్తూ ప్రతి అవయవానికి ఏ విధంగా ఆహారాన్ని అందిస్తుందో అదే విధంగా అది అంత పెద్దగా మాగ్నిఫై చేసినప్పుడు లోపల ఉన్నటువంటి జీవ కణాల్లో ఉన్నటువంటి పదార్ధం అది ఎలా చక్కగా ప్రవహిస్తుందో అవన్నీ కూడా అద్భుతంగా కనిపించాయి. అయితే దాని మీద క్లోరోఫాం వేసి చూస్తే అక్కడ sap మూవ్మెంట్ ఏదైతే ఉందో అది ఆశ్చర్యకరంగా ఆగిపోయింది. అలాగే ఆయన మనుష్యుల యొక్క భావ ప్రసారాలు , మనస్తత్వాన్ని బట్టి ఆ మొక్కలో కదలికలు ఆయన గమనించారు. అదే విధంగా ఆయన తన పరిశోధనలు కొన్ని ధాతువుల (మెటల్స్) మీద కూడా చేసారు. అప్పుడు వాటి లోపల నుంచి వస్తున్న ప్రకంపనలని వారు గమనించారు. ఎప్పుడైతే వాటి మీద ఆయన క్లోరోఫాం వేసారో ఆ ప్రకంపనలన్నీ ఆగిపోయినాయి. ప్రేమ , ద్వేషం ,ఆనందం ,సంతోషం ,భయం , బాధ ,ఉద్రిక్తత ,మైకం ,లెక్క లేనన్ని ఇతర ఉత్తేజకాలు జంతువులన్నిటికీ ఎంత సర్వ సామాన్యమైనవో , మొక్కలకు కూడా అంత సర్వ సామాన్యమైనవి అని నా క్రెస్కోగ్రాఫ్ చెప్పుతుంది ఫెర్న్ మొక్కకి క్రెస్కోగ్రాఫ్ తగిలించి దానిలో పెరుగుదలని స్పష్టంగా తెర మీద యోగానంద గారికి చూపించారు. ఆ మొక్కని కడ్డీతో తాకగానే విచిత్రంగా పెరుగుదల ఆగిపోయి కడ్డీని తీసివేయగానే మామూలుగా పెరుగుదల కనిపించింది. బోస్ మహాశయులు ఆ ఫెర్న్ మొక్కకు ఒక చోట పదునైన పరికరం ఒకటి గుచ్చారు;వెంటనే ఆ మొక్క గిల గిలా కొట్టుకోడంతో ఎంత బాధ పడుతుందో తెలిసింది. కాడలో కొంత మేరకు ఆయన కడ్డీ గుచ్చేసరికి మొక్క విపరీతంగా విల విల్లాడి పోతున్నటు నీడలో కనిపించింది. చివరకి మరణ యాతన ముగిసి పోయి చలనం లేకుండా అయిపోయింది.అలాగే ఆయన దాతువులమీద కూడా రక రకాల ప్రయోగాలు చేసి వాటిలో కూడా స్పందనలు, ప్రకంపనలు (అలసట) ఉన్నాయి అని నిరూపించారు.
బోస్ గారు "రిసోనేంట్ కార్డియో గ్రాఫ్" అనే జటిలమైన పరికరాన్ని కని పెట్టి భారత దేశంలోని మొక్కలమీద లెక్క లేనన్ని ప్రయోగాలు చేశారు. వీటి పర్యవసానంగా ఉపయోగకరమైన మందులకు సంబంధించి, ఊహించనంత పెద్ద ఔషధ ప్రయోగ పధ్ధతి వెల్లడి అయింది. ఒక్క సెకండ్ లో వందోవంతు కాలాన్ని కూడా గ్రాఫ్ మీద సూచించే విధంగా, ఒక్క పిసరు కూడా తేడా రానంత ఖచ్చితంగా పని చేసే కార్డియో గ్రాఫ్ ని తయారు చేయడం జరిగింది. మొక్కలకూ ,జంతువులకూ , మానవులకూ శరీర నిర్మాణంలో ఉండే అత్యంత సూక్ష్మమైన నాడీ స్పందనల్ని రేసోనేంట్ రికార్డు లు లెక్క కడతాయి. తన కార్డియో గ్రాఫ్ ముందు ముందు, జంతువుల్ని కాకుండా మొక్కల్ని కోసిచూడడానికి ఉపయోగ పడుతుందని ఆ ప్రసిద్ధ వృక్ష శాస్త్రవేత్త జోస్యం చెప్పారు. అంటే ఈ శాస్త్రజ్ఞులు వారి వారి ప్రయోగాలు జంతువులమీద కాకుండా వ్రుక్షాలమీద చేస్తుంటారు. ఒక మొక్కకు ఒక జంతువుకూ వేసిన మత్తుమందు కలిగే ఫలితాల రికార్డులను పక్క పక్కన పెట్టి చూసినప్పుడు ,అవి అచ్చూ మచ్చూ ఒక్క లాగే ఉండడం చాలా ఆశ్చర్యం కలిగించింది అన్నారాయన." మనిషిలో ఉన్న ప్రతి ఒక్కటి ముందుగానే మొక్కలలో కనిపించింది. మొక్కల మీద చేసే పరిశోధన, మనుషులకూ ,జంతువులకూ కలిగే బాధల్ని తగ్గించడానికి సాయ పడుతుంది." అని సర్ జగదీష్ చంద్ర బోస్ పరమ హంస యోగానంద గారితో చెప్పారు. చాలా ఏళ్ళ తరవాత, మొక్కల విషయంలో మొట్ట మొదటిసారిగా బోసు కని పెట్టిన విషయాలు , ఇతర శాస్త్రవేత్తల పరిశోధనలలో బల పడ్డాయి ఆ తరవాత శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతము లో నాకు ఆశ్చర్యకరంగా అది ఎలా శాస్త్రీయపరంగా చెప్పగలము అనే విషయం తెలిసింది అయితే ఈ రాళ్ళలో , మొక్కలలో , దాతువుల్లో కూడా ప్రాణ శక్తి ఉంటుందని ఆయన చెప్పారు. కాకపొతే అది నిద్రాణమై ఉంటుంది లేదా తక్కువ స్థాయిలో ఉంటుంది. అల్లాగే వృక్షాల గురించి కూడా అద్భుతంగా చెప్పారు.
కాబట్టి సత్యం ఎవరి నోటినుంచి వచ్చినా కూడా భాష , పదాలు మారవచ్చు కాని దాని భావమైతే మారదు. ఒకే లాగానే ఉంటుంది అని నా కనిపించింది.
విశ్లేషణ
మొక్కలలో కూడా చైతన్యం ఉంటుంది . అవి కూడా మన భావాలకి స్పందిస్తుంటాయి. మనం వాటికి దగ్గరగా వెళ్లి మాట్లాడి నప్పుడు వాటి యొక్క ప్రకంపనలు వేరుగా ఉంటాయి. మనం వాటిని కోపడినప్పుడు , మన భావాలు సరిగా లేనప్పుడు కూడా వారి భావాలు , స్పందనలు వేరుగా ఉంటాయి. వాటి ప్రకంపంనల్లో కూడా మార్పువస్తుంది. ఈ విషయం వైజ్ఞానికంగా రుజువు చేయబడింది. ఇంతే కాకుండా మన పురాణాల్లొ కూడా ఈ వృక్షాల గురించి అంటే ఈ మేడి చెట్లు ,మర్రి చెట్లు మరియు రావి చెట్ల గురించి కూడా చాలా కథలు మన భారత దేశంలో ప్రచలితంగా ఉన్నాయి. సంతానం లేనివాళ్ళు ఈ చెట్ల చుట్టూతా మంత్రాలు చదువుతూ నలభై రోజుల పాటు ప్రదక్షిణలు కనక చేస్తే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ ఉదాహరణ గురు చరిత్ర లో చెప్ప బడింది. ఆ చెట్లని గట్టిగా కావలించుకుంటే ఆరోగ్యవంతులవుతారు. ఈ ఉదాహరణ దత్త పురాణంలో మనం చూడ వచ్చును. వైజ్ఞానికంగా చూస్తే మనంచెట్టు చుట్టూతా ప్రదక్షిణాలు చేసినప్పుడు చెట్లోంచి ప్రాణ శక్తి మనలో ప్రవేశిస్తుంటుంది. కార్బన్ డయాక్సైడ్ ని ఆ చెట్లు తీసుకుని మనకు ఆక్సిజన్ నిఇచ్చి మానవాళికి ఎంతో సహాయం చేస్తున్నాయి. అదే కాకుండా స్త్రీలలో harmonal
imbalance ఏమన్నా ఉంటే అది తొలగి పోతుంది. అంతే కాకుండా రావి చెట్టు చుట్టుతా దారాలు కట్టి మనస్సులో ఉన్న కోరికలు తీరాలని కూడా ప్రదక్షిణాలు చేస్తుంటారు. ఈ విధంగా మంచి మాటలతో , మంత్రాలతో ప్రభావితమైన ఆ చెట్లు వాతావరణంలో కూడా మంచి స్పందనలు కలిగించి మన మనస్సులని ప్రశాంత పరుస్తాయి . మన సత్య సాయి బాబా గారి పుట్టపర్తిలో కూడా ఇలాగే మొక్కలమీద ఒక పరిశోధన చేసారు . మంచి శాస్త్రీయ సంగీతం విన్నప్పుడు మంచి స్పందనలు , మంచి ప్రకంపనలని ఆ చెట్లలో చూసారు. అదే అశాస్త్రీయ సంగీతం అంటే అరుపులతో ,రణ గొణ ధ్వనితో సంగీతం విన్నప్పుడు ఆ చెట్లు క్రుంగి పోయి శుష్కించినట్టుగా వాడి పోయినట్టుగా అయిపోయినాయి. ఈ ప్రయోగ ఫలితాలని సత్య సాయి బాబా గారి మ్యూజియంలో భద్రపరచారు. ఈ రోజు కూడా మనం అక్కడి పుట్టపర్తి సత్య సాయి బాబా గారి మ్యూజియంలో చూడ వచ్చు.
ఈ రోజుల్లో కూడామన దేశంలో ఉన్న చిన్న కుగ్రామాల్లో గ్రామస్తులు పాటిస్తున్నట్టి ఒక ప్రథ
నేను ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. నా స్నేహితుడు శెణాయ్ అనే అతను కొంకణ దేశ వాస్తవ్యుడు. అతను వాళ్ళ గ్రామంలో జరిగిన చాలా ఆశ్చర్యకరమైన ఒక సంఘటన గురించి చెప్పాడు. వాళ్ళ ఊరు ఒక చిన్న కుగ్రామామన్నమాట ఊళ్ళో చాలా ముళ్ళ చెట్లు ఉండేవి. వాటిని మనుషులని పెట్టుకుని కొట్టేయడం చాలా ప్రయాసంగా ఉండేది. అప్పుడు ఆ గ్రామస్తులందరూ కలిసి మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వచ్చి రోజూ ఆ ముళ్ళ చెట్ల దగ్గరకి గుంపుల వారిగా వెళ్లి ఆ ముళ్ళ చెట్లని తిడుతుండేవాళ్ళు. ఇలా పదిహేను రోజులు గడిచాక చూస్తే ఆ చెట్లన్నీ ఎండి పోయి చచ్చిపడి ఉన్నాయి అప్పుడు ఆ ఊళ్ళో ఉన్నవాళ్ళకి అవి తీసి పారేయడం చాలా తేలిక అయి పోయింది.
మొక్కలు , వృక్షాలు మానవాళికి అయస్కాంత శక్తిని ప్రసాదిస్తుంటాయి. మన దేశంలోనే కాకుండా చైనా దేశంలో చైనీయులు వృక్షాలనీ కావలించుకుంటారు. దీని వల్ల ఆ వృక్షం లో ఉన్నటువంటి మహా ప్రాణ శక్తిని గ్రహించి ఆరోగ్యవంతులవుతారు. దురదృష్టవశాత్తు ఈ జన సంఖ్య విపరీతంగా పెరగడంతో కొద్ది రోజులలో ఈ వృక్షాలన్నీ క్రుంగి, కృశించి పోయి ఉన్నాయి. దీనివల్ల మనకి తెలిసింది ఏమిటంటే ఈ వృక్షాలన్నీ కూడా మానవులలో సమతూకం కోల్పోయిన అయస్కాంత క్షేత్రాలని సరి చేస్తాయి. దాని మూలంగా వారికి ఆరోగ్యం కలుగుతుంది. పూర్వ కాలంలో మన ఋషులూ, మునులూ వృక్షాల క్రింద కూర్చుని తపస్సు చేస్తుండే వాళ్ళు. వారిని ఆ చెట్లు ఎండా , వాన ,చలి నుంచి కాపాడడమే కాకుండా వారి యొక్క అయస్కాంత క్షేత్రాలని వాటి ప్రాణ / జీవ శక్తి ద్వారా ద్రుడంగా చేస్తూ ఉండేవి. ఇదేప్రకారంగా బుద్ధుడు బోధి చెట్టు క్రింద కూర్చుని ధ్యానం చేసినప్పుడే కదా ఆయనకి జ్ఞానోదయం అయింది. అలాగే శ్రీ శైలంలోని గుడి వెనక ప్రాంగణంలో ఉన్నటువంటి జువ్వి చెట్టు క్రింద దత్తాత్రేయులు , పరశు రాముడు తపస్సు చేసినట్టుగా మన గ్రంధాలలో ఉంది కదా ! దీన్ని బట్టి మనకి వృక్షాలలో భావాలు ఉంటాయి అని తెలిసింది కదా ! వృక్షాలు మానవుల మనుగడకి ఎంతో దోహదం చేస్తున్నాయి. అందుకనే మనం చెట్ల ఆకులని కాని ,పువ్వులను కాని , పళ్ళని కాని కోస్తున్నప్పుడు వాటి అనుమతి తీసుకుని ఎంతో భక్తి, ప్రేమ భావంతో కోయాలి.
మీరు కూడా "ఒక యోగి ఆత్మ కథ " అనే పుస్తకం చదవండి. ఈ మధ్యే ఈ పుస్తకాన్ని Ben kinsley అనే హాలీవుడ్ నటుడు అంటే "మహాత్మా గాంధి" అనే ఇంగ్లీష్ సినిమాలో మహాత్ముడి పాత్ర ధరించిన హాలీవుడ్ నటుడు కొని చదివాడు. చాలా ఇష్ట పడ్డాడు. విదేశాల్లో పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో ఇది పాఠ్యపుస్తకం (టెక్స్ట్ పుస్తకం)లాగా వాడుతుండే వారు. పరిశోధకులు దీన్ని ఒక reference పుస్తకం లాగా వాడుతున్నారు. సైకాలజిస్టులకి , పార సైకాలజిస్టులకి ,ఆధ్యాత్మికం మీద పరిశోధనలు చేసే వారికి ఈ పుస్తకం చాలా తోడ్పడుతుంది.
మనం జాగ్రత్తగా గమనిస్తే ఇలాంటివెన్నో ఉదాహరణలు మన నిజజీవితంలో కనిపిస్తాయి, మనం వింటాము కూడా. మనం చెట్లతో, వృక్షాలతో చక్కగా ప్రేమగా మాట్లాడినప్పుడు అవి సంతోష పడి , ఎక్కువ పంటను, పూలను, పళ్ళను ఇచ్చి మనలని సంతోష పెడతాయి. అవి ఒక్క చోట కదల కుండా ఉన్నంత మాత్రాన వాటిలో స్పందనలు కాని భావాలు కాని ఉండవు అని అనుకోవడం మన తెలివిమాలినతనం. మన పురాణాల్లో ఉన్న విషయాలన్నీ ఈ శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేసి అన్నీ నిజమే అని సప్రమాణంగా నిరూపించారు ఈ ఆధునిక యుగానికి చెందిన మనకి చూపించారు. అందులో మన భారతీయ శాస్త్రజ్ఞుడైన సర్ జగదీశ్ చంద్ర బోస్ వృక్షాల మీద చేసిన పరిశోధనలు, ప్రయోగాలు విశ్వంలో అందరూ గుర్తించడం మన దేశానికే గౌరవం .