N. Sairam Garu || Email: sridatta50@gmail.com. Please visit our spdss.org and sreedatta.guru website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.

Thursday, 3 March 2016

Mohini Katha-04


శ్రీ రాంలాల్ ప్రభుజి లీల ­- మోహిని కథ – Part 4

అది 1958వ సంవత్సరం. మేము మా అమ్మగారి పుట్టిల్లైన హార్డికర్ బాఘ్ ఇంటికి తరచూ వెళ్ళుతూ ఉండేవాళ్ళం. చలి కాలం. ఆ రోజు రాత్రి మా అమ్మగారి చుట్టూ మేమంతా కూర్చుని సహజంగా పిల్లలకి కథలంటే చాలా ఇష్టంగా ఉంటుంది అందులో దయ్యాల కథలయితే మరీ ఆసక్తిగా ఉంటుంది. అందుకని మా అమ్మగారిని బలవంత పెడితే ఆవిడ ఈ కథ చెప్పడం  ప్రారంభించారు. ఇది నిజంగా జరిగిన కథ. 

ఆ రోజుల్లోఅంటే నైజాంనవాబు పరిపాలించిన రోజుల్లో, ఆయన రాజ్యంలో యదార్ధంగా (నిజంగా) జరిగిన సంఘటన. మొత్తం హైదరాబాదులోనే కాకుండా మహారాష్ట్ర, కర్నాటక రాజ్యాలలో కూడా ఈ కథ వ్యాపించి  ఒక సంచలనాన్ని కలిగించింది. ప్రజలంతా భయంతో గడ గడా వణికి పోయారు. ప్రతి ఇంట్లో ఈ కథనే ఆ రోజుల్లో చెప్పుకుంటూ ఉండేవాళ్ళని మా అమ్మగారు మాకు చెప్పడం జరిగింది. 

వారు మాకు దూరపు బంధువులని కూడా మా అమ్మగారు చెప్పారు. మా అమ్మగారు నండూరి రాజరాజేశ్వరీ దేవి. మా తాతగారు అంటే మా అమ్మ తండ్రిగారు నైజాం నవాబుగారి కోర్టులో ప్రఖ్యాత  జడ్జిగా పని చేస్తుండేవారు. మాడపాటి హనుమంత రావు గారు, బూర్గుల రామకృష్ణా రావు గారు మంచి స్నేహితులుగా ఉండేవారు. యథాప్రకారంగా మేము మా అమ్మని రోజు వేదించుతుంటే కథ చెప్పమంటారు రాత్రి భయపడుతూ ఉంటారు అని అంటూ ఈ కథని మాకు చెప్పడం మొదలు పెట్టారు. 
కథ మంచి రస పట్టులో ఉండగా మధ్యలో మా మామయ్య వచ్చి గట్టిగా అరిస్తే మేమంతా ఉలిక్కి పడి భయంతో గట్టిగా కెవ్వుమని కేక పట్టి గట్టిగా అరవడం మొదలు పెట్టాము. అప్పుడు మా మామయ్య పక పకా నవ్వుతూ ఏమిట్రా ఇంత పిరికిపందలు? అంటూ మమ్మల్ని పరిహాసం చేశాడు. ఆ తర్వాత మమ్మల్ని మేము సంభాళించుకుని చెప్పమ్మా ! ఆ తర్వాత ఏం జరిగింది? అని అడిగితే మా అమ్మగారు మళ్ళీ ఆ కథ చెప్పడం మొదలు పెట్టారు.

మరి ఆ రవికాంత్ గాఢంగా నిద్రపోయి లేచి, చక్కగా స్నానం చేసి అప్పుడు తీరిగ్గా కూర్చున్నాడు. అప్పటిదాకా కుతూహలాన్ని ఆపుకుని ఉన్న అతని అన్నగారు, మిగతా మిత్రులు కూడా ఎంతో ఆత్రుతగా అసలు ఏం జరిగింది? చెప్పు. మేమందరమూ చాలా గాభరా పడి పోయాం. కొంత మంది నీవు పరాయి స్త్రీ వెనక వెళ్ళడం అది చూసి మాకు వచ్చి చెప్పారు. ఏం జరిగింది, ఆమె ఎవరు? నీవు ఆమె వెనుక ఎక్కడికి వెళ్లావు? జరిగిందేమిటో సరిగ్గా చెప్పు అని అడిగారు. దానికి సమాధానంగా అన్నయ్యా! ఏం జరిగిందంటే నేను పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి నా అప్లికేషను పోస్ట్ చేసి వస్తుంటే ఒక అందమైన అమ్మాయి వచ్చి నా పెన్ను తీసుకుని నాకు వాపసు ఇవ్వకుండా వెళ్లిపోతుంటే మరి ఏం జరిగిందో నాకు తెలియదు. ఒక సమ్మోహన శక్తి , ఒక ఆకర్షణ శక్తి నన్ను అ అమ్మాయి వెనక వెళ్లేటట్టు చేసింది. చూడడానికి ఆ అమ్మాయి మామూలుగా నడుస్తున్నట్టుగానే ఉండింది కాని నేను మా ఇద్దరి మధ్య దూరాన్ని తగ్గించాలంటే పరిగెత్తవలసిన పని పడింది. అన్నయ్యా ! నాకు తెలుసు నేను అలా పరిగెత్తకూడదని. అది సభ్యతగా ఉండదు కదా ! అలా అమ్మాయి వెనుక నేను అలా పరిగెత్తుకుని వెళ్ళడం మంచి లక్షణం కాదని తెలిసినా కూడా నన్ను నేను నిగ్రహించుకోలేక ఏదో శక్తి నన్ను లాక్కుని వెళ్లుతున్నట్టుగా అన్పించి నేను ఆవిడ వెనక వెళ్ళిపోయాను అని మొత్తం జరిగిన కథంతా వాళ్లకి యదాతథంగా చెప్పాడు. 

అది విన్నాక అయితే నీవు ఎక్కడకి వెళ్ళావో, ఏ సందులో తిరిగావో అన్నీ నీకు గుర్తున్నాయా?  నీవు గుర్తు పట్టగలవా?అని వాళ్ళు అడిగారు. అన్నయ్యా ! నేను చెప్పగలను అని అనగా అందరూ బట్టలు మార్చుకుని గబ గబా తయారై  సైకిళ్ళ మీద బయల్దేరారు.

అలా బయల్దేరి రవికాంత్ సైకిల్ మీద ముందు వెళ్ళుతుండగా, అతని అన్నయ్య , ఇద్దరు మిత్రులూ కూడా అతని వెనుక సైకిళ్ళ మీద వెళ్ళ సాగారు. వాళ్ళందరూ ప్రయాణం చేస్తూ బోలారం దిశగా వెళ్ళుతూ వెళ్ళుతూ అక్కడ ఒక పాడుబడ్డ భవనం దగ్గర ఆగారు. వాళ్లకి స్పృహ వచ్చి చూసేసరికి అది బోలారం దగ్గర పాడుబడిన ఒక స్మశానం. అక్కడ అన్నీ పాడుబడిన సమాధులు, పిచ్చి ముళ్ళ చెట్లతో భయంకరంగానూ, అసహ్యంగాను ఉంది. అన్నయ్యా! ఇదిగో ఈ భవనం దగ్గరకే వచ్చాను కాని అప్పుడు ఆ భవనం ఇలాగ లేదు బ్రహ్మాండంగా ఉండాలి. అందమైన పాలరాతి బొమ్మలు చెక్కబడి ఉన్నాయి. 
ఈ మెట్లు కూడా చాలా అందంగా ఉండాలి, పెద్ద పెద్ద తలుపులతో వాటిమీద చక్కటి నగిషీలతో ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉండాలి. తివాచీలు కూడా చాలా కొత్తగా అందంగా ఉండి చాలా ఆకర్షణీయంగా ఉండాలి. ఈ చుట్టు ప్రక్కలంతా చక్కని ఉద్యానవనం ఉండాలి అని ఆశ్చర్య పడుతూ వాళ్ళని తీసుకు వెళ్ళాడు. అక్కడ మెట్లన్నీ విరిగి పోయి ఉన్నాయి ఆ విరిగిన సందుల్లోంచి ముళ్ళ మొక్కలు పెరిగి ఉన్నాయి. కొన్ని బీటలు పడిపోయాయి. కొన్ని గదులకి  పైన కప్పు లేదు. కొన్ని సోఫాలు కనిపించాయి. వాటిలోంచి ఎలకలు పరిగెత్తుతూ ఉన్నాయి. లోపల చూస్తె ఆ గదులన్నీ విశాలంగా ఉన్నాయి కాని చాలా శిథిలమై పోయి ఉన్నాయి రెండు, మూడు పాములు వీళ్ళు రాగానే అటు ఇటు పరిగెట్టడం మొదలు పెట్టాయి ఎలకలు హాయిగా కాపురం చేస్తున్నాయి అక్కడ. అంతా భీభత్సంగా, భయంకరంగా ఉంది. గబ్బిలాలు కొన్ని అటూ ఇటూ ఎగర సాగాయి. ఇంతలో ‘ధం’ అనే చప్పుడుతో ఏదో క్రింద వీళ్ళ ప్రక్కనే పడింది. దెబ్బకి అందరూ భయంతో గాభరా పడి పోయారు. కాస్త సంభాలించుకున్నాక  “ అదేమిట్రా  నీవు చెప్పినదానికి ఈ భవనానికి ఎక్కడా పోలికలు లేవు. ఎంత భయంకరంగా ఉంది” అని అన్నాడు అతని అన్నయ్య. అవునన్నయ్యా ! నన్ను ఇక్కడకి తీసుకు వచ్చినప్పుడు ఇలా లేదు ఈ భవనం చాలా అత్యాధునికంగా ఉండాలి. ఇదిగో! ఇక్కడే ఈ మఖమల్ సోఫా  మీద నేను కూర్చున్నాను. చాలా మెత్తగా ఉండాలి. విచిత్రంగా ఉందే ! అప్పుడు ఇక్కడ ఉన్న చిత్ర పటాలు కూడా ఇప్పుడు కనిపించడంలేదు. మరి అప్పుడు బంగారంతో కవరింగ్ తో ఉన్న సోఫాలు ఉండాలి అవి కూడా ఇప్పుడు కనిపించడం లేదు. ఇవన్నీ వాళ్ళు ఆలోచిస్తుంటే వాళ్లకి అన్ని విషయాలు రూడిగా తెలిసిపోయాయి. వాళ్ళు ఇలా అనుకున్నారు. 

ఆ కనిపించిన అమ్మాయి మానవమాత్రురాలు కాదు. కామిని పిశాచం అని అంటారు. వాటికి ఎంతో శక్తి ఉంటుంది. భ్రాంతి కూడా కల్పించే శక్తి ఉంటుంది.  బహుశా ఆ పిశాచే నిన్ను పట్టుకుని ఉంటుంది అని ఆలోచన రాగానే వాళ్ళు ఎంతో భయపడిపోసాగారు. అక్కడనుంచి ఎంత తొందరగా బయట పడితే అంత బాగుంటుంది అని అనుకుంటున్నారు. అక్కడి వాతావరణంలో కూడా కొంచెం మార్పు రావడం వాళ్లకి కనిపిస్తూనే ఉంది. ఒళ్ళంతా గగుర్పాటు చెంద సాగింది. వెంట్రుకలు నిక్క పోడుచుకున్నాయి. వాళ్ళు పీలుస్తున్న గాలి కూడా ఎంతో భయంకరంగా ఉంది. ఎందుకొచ్చారు మీరు? అన్నట్టుగా ధ్వని సంకేతాలు వాళ్లకి వినిపించ సాగాయి. మనస్సు లో భయంగా ఉన్నప్పుడు మన ఆలోచనలు ఎలా ఉంటె మనకి ధ్వనులు కూడా అలాగే వినిపిస్తూ ఉంటాయి. ఇదేమీ కొత్త కాదు. అందులో ఇలాంటి కథలు వింటున్నాం కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా భయపడ్డారు. అక్కడనుంచి వచ్చినంత వేగంగానే తిరుగు ప్రయాణం సాగించి సాయంత్రానికి వాళ్ళ గదికి చేరుకున్నారు.
       
అక్కడ గదిలో కూర్చుని  తీరిగ్గా అవే విషయాలు చర్చించ సాగారు. వారికి ఈ జరుగుతున్న విషయాల గురించి కొంచెం కూడా అవగాహన లేదు. అంతా తికమకగా ఉంది. మనస్సంతా ఎంతో బాధగా, ఏదో చెప్పలేని దిగులుతో వాళ్ళంతా ఉన్నారు. అందరూ చిన్నవాళ్ళే. అనుభవం లేదు. ఎవరి దగ్గరకి వెళ్ళాలి? ఏం చేయాలి? ఇదంతా మాయా? భ్రాంతియా?  ఎటూ తెలుసుకోలేకుండా ఉన్నారు. వీడు స్వతహాగా చాలా తెలివి గలవాడు, జ్ఞాపక శక్తి కలిగిన వాడు చాలా మంచి వాడు. మరి  వీడు ఈవిడ వలలో ఎలా పడి ఉంటాడు? ఇంత వివరంగా అన్నీ చెప్పుతూ ఉన్నాడు. తీరా మరి ఇక్కడకి వచ్చేసరికి చూస్తె అక్కడ ఏమీ లేదు ఇలా అనుకుని అక్కడే అద్దెకు ఉన్న కొంత మందిని సంప్రదించారు. అక్కడ అద్దెకు ఉన్నవారిలో ఒక మహారాష్ట్ర కుటుంబం ఒకటి ఉంది. అతనికి ఇవన్నీ తెలుసు అని అక్కడ సంప్రదించిన వారిలో ఒకతను చెప్పి  అతని దగ్గరకి తీసుకుని వెళ్ళాడు. అతనికి జరిగినదంతా వివరంగా చెప్పారు. అంతా విన్నాక అతను “నాయనా ! ఈ నైజాం వారి ప్రభుత్వంలో అనేక క్షుద్ర విద్యలు ప్రబలుతున్నాయి. ఎంతో మంది తాంత్రికులు వచ్చి వాళ్ళ శత్రువులమీద తాంత్రిక ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అందులో నాందేడ్, పర్బని ప్రాంతాల్లో కూడా చాలా ఎక్కువగా ఈ తాంత్రిక విద్యలు చేస్తూ ఉంటారు. అయితే దీనికి విరుగుడు కూడా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సాధారణంగా ఏ కోరికలు తీరకుండా చని పోయిన, ఆత్మహత్య చేసుకున్న ఆడ వాళ్ళ, అకస్మాత్తుగా యవ్వనం లో చనిపోయిన ఆడ వాళ్ళు ఒక భూమికలో తిరుగుతూ ఉంటారు. వాళ్లకి స్థూల శరీరం ఉండదు. ఒక గాలి ఆకారంగా తిరుగుతూ ఉంటారు. కాని వాళ్ళలో తీరని కోరికలు ఉంటాయి. అప్పుడు ఎక్కడో ఒకడు ఈ కామినీ పిశాచానికి తగిన మంత్రం సాధన చేసినప్పుడు ఆ మంత్రం యొక్క ధ్వనికి వీరు ఆకర్షించ బడతారు. అయితే ఆ మాంత్రికుడు ఎవరిని ఉద్దేశించి ప్రయోగం చేస్తారో ఈ గాలి రూపం లో ఉన్న స్త్రీలందరూ కూడా ఆ వ్యక్తి వైపు ఆకర్షించ బడి అతన్ని గట్టిగా పట్టుకుంటారు. మరి దీన్ని నానా రకాలుగా అంటారు. బాణావతి విద్య , బాణావతి అంటారు. ఏది ఏమైనా ఇది ఒక రకమైన క్షుద్ర విద్యే.ఇది చాలా అమోఘమైన శక్తి కలిగి ఉంటుంది.ఒక పట్టాన వీరికి విరుగుడు చేయడం సాధ్యం కాదు. అయినా మీరేమీ గాభరా పడకండి. ముందు మీరు విరుగుడు చేయాలో వద్దో అన్నది నిర్ణయం చేసుకోండి. తర్వాత ఏం చేద్దామో చూద్దాం అని మాత్రమే చెప్పగలిగాడు. అప్పటికే మెల్ల మెల్లగా చీకట్లు పడుతున్నాయి. 

వీళ్ళలో కొంతమంది బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. కొంతమంది ధైర్యంగా కూడా ఉన్నారు. దాంట్లో ఒక మిత్రుడు “మనం ఈ రోజు రాత్రంతా హనుమాన్ చాలీసా చదువుతూ కూర్చుందాము” అది చదివితే భూత పిశాచాలు మన దగ్గరకి రావని మనం చదువుకున్నాం కదా!” అని అన్నాడు. సరే! అలాగే చదువుదాం అని వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ధైర్యం చెప్పుకుని , నిద్ర పోకుండా ఉందామని చెప్పి తమ్మున్ని ఆ గదిలో ఉన్న ఒకే ఒక మంచం పైన పడుకోబెట్టగానే  , బాగా అలసి పోయాడేమో వెంటనే గాఢ నిద్రలోకి జారిపోయాడు. మిగతా వాళ్ళందరూ ఆ మంచం ప్రక్కనే చాపలు వేసుకుని కూర్చుని, హనుమంతుని ఫోటో ఒకటి పెట్టుకుని హనుమాన్ చాలీసా చదవడం మొదలు పెట్టారు. వారిలో ఒకడు , చూద్దాం మనం ఈ హనుమంతుని ఫోటో పెట్టుకున్నాం కాబట్టి మనకి ఏమీ కాదు అని అలా మాట్లాడుకోసాగారు. అలా ఆ రాత్రి  ప్రశాంతంగా గడిచి పోయింది. రెండో రోజు రాత్రి  మాత్రం మెల్లగా మెల్లగా వీళ్ళంతా నిద్రాదేవి ఒడిలో జారి పోయారు. దాదాపు అది అర్ధ రాత్రి సమయం పన్నెండు గంటలు దాటి పోయింది. చీమ చిటుక్కుమన్నా శబ్దం వినిపిస్తుంది. అందరూ నిద్ర పోతూ ఉండగా ఇక్కడ రవికాంత్ కి ఎందుకో మెలకువ వచ్చింది. దుప్పటి తీసి బయటకి చూడగా కిటికీ దగ్గర మోహిని అనబడే కామ పిశాచి కనిపించింది.

                                                 (తరువాయి వచ్చే వారం ..... )