శ్రీ
రాంలాల్ ప్రభు – మోహిని కథ- Part 5
ఇతను ఒక్క సారిగా
చూశాడేమో ఉలిక్కి పడ్డాడు. ఆ అమ్మాయి ఎటువంటి భావాలు లేకుండా కేవలం నవ్వుతూ అతని
వైపు చూస్తూ ఉంది. మీరేమేం మాట్లాడుకుంటున్నారో, ఏమేం చేస్తున్నారో, ఏమేం
ఆలోచిస్తున్నారో నాకు అంతా తెలుస్తూనే ఉంది. హనుమాన్ చాలీసా చేసినంత మాత్రాన
నేను నీ దగ్గరకి రాను అని మీరు అనుకుంటున్నారు కదా ! అలా ఏమీ లేదు.
మీరు హనుమాన్
చాలీసా చదివినా కూడా నేను నీ దగ్గరకి రాగలను చూడు ! నేను వస్తున్నాను అని అంటూ ఆమె
ఆ కిటికీ నుంచి, ఆ గోడలోంచి ఆ గదిలోపల ప్రవేశించి అతను పడుకున్న మంచం మీద
కూర్చుంది. చూశావా ! నీకు నేను అప్పుడే చెప్పాను. నేను సర్వ
శక్తివంతురాలిని, ఏ పనైనా చేయ గలను అని అప్పుడే చెప్పాను. అయినా మీకనుభవం
లేదు కాబట్టి మీరు నమ్మడం కష్టమే. మీరు హనుమాన్ చాలీసా చదివారు.
అయినా కూడా ఆ
శక్తి నన్ను ఆపలేక పోయింది. నేను ధైర్యంగా నీ దగ్గరకి రాగలిగాను. నీకు నేను ఆలోచించుకోమని
సమయమిచ్చాను. ఏం ఆలోచించావు? నీవు ఏం ఆలోచించినా, ఆలోచించక పోయినా, నీవు నా
దగ్గరకి వచ్చినా, రాక పోయినా నాకెటువంటి తేడా లేదు. నాకు కావలసిన పని నేను
చేసుకుని తీరతాను. కాబట్టి నీవు అనవసరంగా పెనుగులాడకుండా నేను
చెప్పినట్లు నాతో కలిసి ఉండు. మరొక్కసారి చెప్పుతున్నాను. విను. ఈ
ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యమంతా నీ పాదాల ముందు నేను పోస్తాను. అవన్నీ నకిలీవి
కావు. నేనిచ్చిన బంగారు నగలు కాని, బంగారు నాణాలు కాని ఎంతో స్వచ్ఛమైనవి.
అయినా నిన్ను చూస్తుంటే నాకు హింసించాలి అని అనిపించడం లేదు. నీవు మనస్ఫూర్తిగా
ఒప్పుకుంటేనే నాకు సంతోషంగా ఉంటుంది. కాబట్టి నీవు మరొక్కసారి ఆలోచించుకో.
నీవు మనిషిగా ఉండి, నీ ప్రాథమిక స్థాయిలో ఉన్న సుఖాలను చవి చూసి దానికే నీవు
ఉబ్బితబ్బిబ్బై పోతున్నావు. మా స్థాయిలోని సుఖాలను కనుక నీవు చవి చూస్తే నీ మానవ
జన్మలోని సుఖాలని ఎందుకూ పనికిరావని నీవే అంటావు. అలాంటి సుఖాలను నీకు నేను
అందిస్తాను కాబట్టి నీవు నన్ను ప్రేమించు. నీ దాన్ని చేసుకో. హాయిగా మనం కలిసి
కాపురం చేద్దాము. ఒకవేళ నీ ఆయుష్షు ముప్పై ఏళ్ళు తగ్గిపోతే మాత్రం ఏమవుతుంది? నీ
తదనంతరమూ కూడా మీ అన్నదమ్ములకి ఏ లోటు రాకుండా నేను చేస్తాను. అయినా నేను నిన్ను తొందర
పెట్టదలచుకోలేదు. నా శక్తి నీకు తెలియాలి. నిజంగా నా శక్తి తెలిసి, నీవు
మనఃస్ఫూర్తిగా నా ప్రతిపాదన అంగీకరిస్తావని నాకు నమ్మకం ఉంది అని చెప్పేసి ఆవిడ
అక్కడనుంచి వెళ్ళిపోయింది.
కాసేపు అయినా తర్వాత రవి కాంత తన అన్నయ్యని వేరే స్నేహితులని లేపాడు.
అన్నయ్యా ! మీరంతా అలా ముసుగు పెట్టుకుని పడుకుని ఉన్నారు. ఈలోగా ఆ అమ్మాయి రానే
వచ్చింది అని చెప్పగానే వీళ్ళంతా ఆశ్చర్య పడడమే కాకుండా చాలా భయపడి పోయారు కూడా.
బ్రతికాం రా! బాబూ !ఆవిడ వచ్చినప్పుడు మనం మెలకువగా లేము లేకపోతే “ఢామ్మని” గుండె
ఆగి చచ్చేవాళ్ళం. అదేముంది ఆవిడ లేనప్పుడు మనం ధైర్యంగా ఏం మాట్లాడినా ఆవిడ నిజంగా
ఎదురైతే అప్పుడు మనం మాట్లాడ గలుగుతామా? స్పృహ తప్పి పడి పోతామో, ప్రాణాలు లేకుండా
ఉంటామో ఏమీ చెప్పలేము. అయినా ఎలా ఉందిరా ఆ అమ్మాయి? అని వాళ్ళ అన్నయ్య అడిగాడు.
చెప్పానుగా అన్నయ్యా ! ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుందని. చూస్తుంటే అలాగే చూస్తూ
ఉండి పోవాలని అనిపిస్తుంది. ఆవిడ దేవకన్యలాగా ఉంటుంది తప్ప మానవ కన్యలాగా ఉండదు.
కాని అన్నయ్యా ! ఆవిడలో మంచి సంస్కారాలున్నాయి. పిశాచీ లక్షణాలకన్నా దైవ లక్షణాలు
కలిగి మంచి సంస్కారవంతురాలిగా కనిపిస్తుంది. ఆవిడ మాట్లాడే మాటల్లో విజ్ఞానం
కనిపిస్తూ ఉంటుంది. అదే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మనం “హనుమాన్ చాలీసా” చదివాం
కదా! అంత చదివాక కూడా ఆ అమ్మయినేమీ చేయలేక పోయింది. అదే నాకు అర్థం కావడం
లేదు. అన్నయ్యా! కొన్ని రోజులు సమయం ఇచ్చి నన్ను ఆలోచించుకో అని చెప్పుతున్నది. నాకు
ఏం చేయాలో తోచడం లేదు. పైగా ఆవిడ చెప్పిన విషయాల్లో లేశ మాత్రమైనా నాకేమీ
ఆసక్తి లేదు అని రవి కాంత్ చెప్పాడు.
అతని అన్నయ్య , వారి మిత్రులు కూడా అతని అవస్థని చూసి బాధ పడ్డారు. వాళ్ళు ,
వీళ్ళు చెప్పగా వాళ్ళెంతో మంది మాంత్రికులని సంప్రదించారు. ముఖ్యంగా పర్బనిన,
నాందేడ్ ప్రాంతాలనుంచి వచ్చి ఇక్కడ స్థిర పడిపోయిన మాన్త్రికులని, తాంత్రికులని
అందరినీ వాళ్ళు సంప్రదించారు. వాళ్ళు చెప్పిన విధంగానే అన్నీ ప్రయోగాలు, అన్ని
తాయత్తులని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి అన్ని విధాల ప్రయత్నాలు ఆ మోహిని పిశాచం
బారి నుండి తప్పించు కొనడానికి చేశారు ఎంత చేసినా కూడా ఏమాత్రం ప్రయోజనం లేక
పోయింది. ఆమె తన మానసిక శక్తి బలంతో రవికాంత్ కట్టుకున్న తాయత్తులన్నీ అతని చేతితో
స్వయంగా అతనే తీసి పారేసేటట్టుగా చేస్తూ ఉండేది. కాని ఆ తాయత్తు అతని ఒంటి మీద
ఉన్నంత సేపు అతని దగ్గరకి మాత్రం వచ్చేది కాదు. కొన్ని సందర్భాల్లో అతన్ని వేరే
లోకాలకు తీసుకెళ్లడం కూడా జరిగింది. ఆ మోహినికి అంటే ఆ కామ పిశాచానికి
అమోఘమైన అద్భుత శక్తులు ఉన్నాయి. అదృశ్య రూపంలో కూడా అన్ని లోకాలకు రవికాంత్ ని
తీసుకు వెళ్లి అక్కడ ఎన్నో శాస్త్రాలు, ఉపనిషత్తుల గురించి కూడా ఆమె చెప్పితే
అతను చాలా ఆశ్చర్య పడ్డాడు. అతనికి వేదాల గురించి కాని ఉపనిషత్తుల గురించి కాని
ఏమాత్రం జ్ఞానం కూడా లేదు. అయితే ఆవిడ మాట్లాడుతున్నప్పుడు ఆవిడ ఒక మహా
పండితురాలిగా, మహా విద్వాంసురాలి లాగా మాట్లాడుతూ ఉంటె ఈ రవికాంత్ ఒక శిష్యుడిలాగా
అన్ని విషయాలు వింటున్నట్టుగా భావించే వాడు. ధర్మార్థ కామ మోక్షాల గురించి,
అరిషడ్వర్గాల గురించి ఆవిడ మాట్లాడని విషయమంటూ ఏమే లేదు. తింత్రి ఉపనిషత్తు,
మాటికోపనిషత్తు వీటన్నింటి గురించి కూడా ఆమె చాలా బాగా మాట్లాడుతుంది. అయినా కూడా
ఆమె అత ని మీద ఉన్న కామ కోరికలని మాత్రం తట్టుకోలేక బలవంతంగా ముద్దు పెట్టుకోవడం,
గట్టిగా కౌగలించుకోవడం లాంటివి చేస్తున్నప్పుడు అతను ఆ బాధకి తట్టుకోలేక
స్పృహ తప్పి పడి పోతుండేవాడు.
ఇలాగే ఒకరోజు అతను గదిలో ఉన్నాడు. రాత్రి వీళ్ళంతా మరి దేవుడి గురించి ప్రార్థనలు
అవీ చేశారు. వాళ్ళంతా పడుకున్నారు. ఈలోపల వాళ్లకి ఏదో చప్పుడు వినిపించింది. శ్వాస
ఆడకుండా గుర గుర అని చప్పుడు వినిపించింది. ఆ మంచం మీద తన తమ్ముడు ఎవరితోనో
పెనుగులాడుతున్నట్టుగా అనిపించింది. ఏమైంది రా?అని ధైర్యం చేసి వాళ్ళు దుప్పటి
పట్టుకుని గట్టిగా బలవంతంగా లాగి ముసుగు తీసి చూడగా అతని ముఖంమీద, బుగ్గలమీద
పళ్ళగాటులని చూసి వాళ్ళు ఆశ్చర్య పడిపోయారు. భయపడిపోయారు. నీరసంగా ఉండాలి అని మంచి
నీళ్ళడిగితే వాళ్ళు అతనికి మంచి నీళ్ళు త్రాగించారు. ఏమైంది రా నాయనా? అని అడిగితే
అన్నయ్యా ఏముంది? ప్రతి రోజు వస్తుంది. శాస్త్రీయ చర్చలు చేస్తుంది. ఎన్నో రకాలుగా
ప్రాధేయ పడుతుంది. కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆఖరికి తన కామాన్ని అదుపులో
పెట్టుకోలేక నన్ను గట్టిగా కౌగలించు కుంటుంది. ముద్దు పెట్టుకుంటుంది. దాని ఫలితం
వల్లే నేనిలా నీరస పడిపోతుంటాను. ఈ లోపల మీరు లేచారు. మరి నాచేతికున్న
తాయత్తులన్నీ నా ద్వారానే నేను స్వయంగా బయట పడేటట్టు చేసింది అని వాళ్లకి
చెప్పాడు. వాళ్లకి ఏమీ అర్థం కావడం లేదు. మామూలుగా కామ పిశాచాలంటే ఎంతో క్రూరంగా
ఉంటాయి కదా! మరి ఈ అమ్మాయిలో ఎంతో సంస్కారం ఉందని మనవాడు చెప్పుతూ ఉంటాడు. ఈ మధ్య
మన వాడి ధోరణి కూడా మారింది. ఇప్పుడు వీడు కూడా ఎన్నో విజ్ఞానపరమైన విషయాలెన్నో
చెప్పుతున్నాడు. ఓరి భగవంతుడా! ఈ బాణావతి నుంచి ఎలా బయట పడాలి? అప్పటికే
ఎంతో మంది మాంత్రికులని, తాంత్రికులని కలిశారు కాని లాభం లేక పోయింది.
ఇలా రోజులు గడుస్తున్నాయి. అన్నగారు ఒకసారి ఇలా అన్నారు “అసలు ఆ అమ్మాయి పుట్టు
పూర్వోత్తరాలు మెల్లగా తెలుసుకోరా!” సరే ! అని ఒక రోజు రవికాంత్ ఆ మోహినితో,
““నీవు అద్భుతమైన సౌందర్యవతివి. అందానికి మించిన సంస్కారముంది. ఇన్ని విషయాలు నాకు
కూలంకుషంగా చెప్పుతున్నావు. సంస్కృత విషయాలు చెప్తున్నావు, శ్లోకాలు చెప్తున్నావు.
ఇన్ని ఉండికూడా ఈ తుచ్ఛమైన కోరికలని ఎందుకు జయించ లేకుండా ఉన్నావు? నాకు చాలా
ఆశ్చర్యంగా ఉంది. నీవు నాకొక మంచి స్నేహితురాలిలాగా ఉన్నావు. ఎన్నో విజ్ఞానపరమైన
విషయాలు చెప్పావు. అయినా ఎందుకు ఇంత తుచ్ఛమైన కామాన్ని నీవు ఆపుకోలేక పోతున్నావు”
అని అనగా ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. మేము సాధారణంగా మానవులతో ఇంత కూలంకుషంగా ఏమీ
చర్చించము. మా పని ఏదో మేము కానిస్తాము. కాని నాకెందుకో నిన్ను చూస్తుంటే బాధ
పెట్టాలని అనిపించడం లేదు. కాని ఆఖరి క్షణంలో నేను నా కోరికలని నిగ్రహించుకోలేక
పోతున్నాను. సరే! నా కథ వింటానంటున్నావు కదా ! చెప్తాను విను అని తన కథ రవి కాంత్
తో ఇలా చెప్ప సాగింది.
నేను కృష్ణా జిల్లాలో ఒక అగ్రహారంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. మా
నాన్నగారికి ఉన్న ఎన్నో ఎకరాల భూమితో వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు. వేదాలు ఆయన
క్షుణ్ణంగా చదివారు. అంతే కాకుండా మంత్రతంత్రాల్లో కూడా ఆయన దిట్ట. ఆ చుట్టుప్రక్కలదాదాపు
వంద గ్రామాల్లో దాకా మా నాన్నగారి గురించి తెలియని వాళ్ళు లేరు. ఆయన అన్ని
వేదాలలో నే కాకుండా మంత్ర తంత్రాలలో కూడా నిష్టార్తుడే. అతనికి ఈ ఆంగ్ల విద్య అంటే
సరి పడదు. మన స్వధర్మాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. పర ధర్మాన్ని మనం
పట్టుకోకూడదు అని ఆలోచిస్తుండేవారు. మరి రాను రాను బ్రాహ్మణ్యానికి ప్రోత్సాహం
ప్రభుత్వంనుంచి తగ్గిపోయింది. వేద పాఠాలు నేర్చుకునేవాళ్ళు కరువై పోయారు. అలాగే
పోరోహిత్యం చేసుకుని బ్రతుకుదామన్నా సంఘంలో అంత గుర్తింపు లేకుండా పోయింది. వచ్చే
సంభావన కూడా అంతంత మాత్రమే. ఇంగ్లీష్ చదువులు మెల్లగా పెరగడంవల్ల ప్రజలు
యజ్ఞాలు, యాగాలు చేయడం తగ్గించేశారు. ఒకవేళ వాళ్ళు పూజలు వ్రతాలు చేశినా కూడా అవి
కడుపుకి సరిపోయేటట్టుగా ఉండేవి కావు. ప్రజల్లో దాన,ధర్మ గుణాలన్నీ క్రమక్రమంగా
క్షీణించడం మొదలు పెట్టాయి. బ్రాహ్మణ్యానికి రాను రాను విలువ తగ్గి పోయింది. ప్రభుత్వ
ఉద్యోగాల్లో కూడా బ్రాహ్మణులకి ఎటువంటి ప్రాముఖ్యత లేకుండా పోయింది.
బ్రాహ్మణులంటేనే సంఘం వేలివేసేటట్టుగా తయారయింది. అటువంటి దిక్కు తోచని
పరిస్థితుల్లో మా అన్నగార్లిద్దరూ ఆంగ్ల విద్యను అభ్యసించి M.A లో పట్టభద్రులై ఏదో
ఒక ప్రైవేట్ కాలేజిలో ఉద్యోగాలు చేసుకుంటూ ఊరు విడిచి వెళ్లి పోయారు. దానికి మా
నాన్నగారికి కోపం వచ్చి ఇంగ్లీష్ వాళ్ళని కాపీలు చేస్తున్నారు. పిలకలు తీసేశారు.
వేదాలు మర్చిపోయారు వాళ్ళు భ్రష్టులైపోయారు. నా ఇంటికి రానక్ఖర్లేదు అని
అంక్ష వేసి వాళ్ళని బహిష్కారం చేశారు. అయితే ఆ రోజుల్లో ప్రైవేట్ కాలేజీల్లో
జీతాలు కూడా అంతంత మాత్రంగానే ఉండేవి.
ఈ మధ్యలో నా పెళ్లి ప్రయత్నాలు చేయవలసి వచ్చింది. అన్నగార్లిద్దరూ మా తండ్రిగారిని
వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు ధన సహాయం చేస్తానంటే మా తండ్రిగారు ఒప్పుకోలేదు.
ఆయన మహా పట్టుదల గల మనిషిగా ఉండేవారు. ధనం లేక పోయినప్పటికీ ఆయనకు మహా పంతంగా
ఉండేది, పట్టింపుగా ఉండేది. మా తల్లిగారు నా చిన్నప్పుడే పోయారు. నేనేదో వంట
చేస్తూ ఉండేదాన్ని. అప్పుడప్పుడు నేను కూడా మా తండ్రిగారితో కూర్చుని వేదాధ్యయనం
చేస్తుండేదాన్ని. నాకు కూడా కొన్ని మంత్ర శాస్త్రాల్లో మా తండ్రిగారు ప్రవేశం
కలిపించారు. మడి కట్టుకుని నేను అన్నీ చేస్తుండేదాన్ని. ఇలా ఉండగా నా పెళ్లి
గురించి మా తండ్రిగారు బాధ పడుతూ ఉండేవారు. అయితే నాకు తగిన వరుడు ఆయనకీ ఎక్కడా
కనిపించ లేదు. బ్రాహ్మణులందరూ కూడా బ్రాహ్మణ్యం వదిలివేసి ఇంగ్లీష్ చదువులకి
పట్టణాలకి వెళ్లిపోవడంతో ఆయనకి నాకు తగ్గ వరుడు ఎవరూ కనిపించలేదు. ఒకరోజు మా
తండ్రిగారు చాలా దూరం వెళ్లి పండిత చర్చచేసి వచ్చారు. ఆ రోజు ఆయన ఎందుకో చాలా
సంతోషంగా కన్పించారు. అమ్మా! అమ్మా! నాకు ఇన్నాళ్ళకి తగిన అల్లుడు దొరికాడు. నీకు
తగిన భర్త దొరికాడు. నేను ఫలానా ఊరికి వెళ్లి శాస్త్ర చర్చలో అతని చేతిలో
ఓడిపోయాను. అతను ఎంతో ఘనమైన పండితుడు. మహా విద్వాంసుడు. నీకు అతన్ని ఇచ్చి పెళ్లి
చేస్తాను అని ఆయన ఎంతో సంతోషంగా అల్లుడిగురించి చెప్పాడు. అయితే ఆ మర్నాడు మా
తండ్రిగారు లేనప్పుడు చుట్టుప్రక్కల ఉన్న అమ్మలక్కలు, వేదం బ్రాహ్మణులు అందరూ
కలిసి వచ్చి అయ్యో! అయ్యో! మీ తండ్రిగారు నీ గొంతు కోసేస్తున్నారు. ఎవరో చాలా
ముసలి వాడు అరవై ఏళ్ళ పైబడ్డ వాడు , నీకన్నా పెద్ద కొడుకు ఉన్నాడు, అతను పండిత
చర్చలో మీ తండ్రిగారిని ఓడించాడుట. అందుకని మీ తండ్రిగారు సంతోషించి అతన్ని తన
అల్లుడిగా చేసుకుందామని నిర్ణయించుకున్నాడు అని అందరూ అంటున్నారు తల్లీ ! జాగ్రత్త
పడు. మంచి యవ్వనంలో ఉన్నావు నీ తండ్రితో సమవయస్కుడైన ముసలిమనిషితో నీ పెళ్లి
చేయించి నీ బ్రతుకును సర్వ నాశనం చేస్తున్నాడు మీ నాన్న లేనిపోని చాదస్తాలన్నీ
పెట్టుకుని నూరేళ్ళ నీ జీవితాన్ని పాడు చేస్తున్నాడు అని కళ్ళ నీళ్ళు పెట్టుకుని
వాళ్ళంతా వెళ్ళిపోయారు. బంధువులంతా వచ్చి చెప్పినా కూడా మా నాన్నగారు ససేమిరా
వినలేదు. మరి చక్కగా ముహూర్తం కూడా పెట్టుకుని వచ్చారు. నేనా మరి చిన్నదాన్ని.
అన్నగార్ల దగ్గరకి కూడా మా నాన్నగారు నన్ను వెళ్ళనిచ్చేవాళ్ళు కారు, వాళ్ళని ఇక్కడకు
రానిచ్చే వాళ్ళు కారు. సంసారంలో మాకు పేదరికం ఆసరాగా ఉండేది. తండ్రిని కాదని నేను
ఎక్కడకీ వెళ్ళలేను. ఏం చేయాలో తెలియలేదు. నేను ఆ దేవుడి మీదే భారం వేశాను. ఇంతలో
పెళ్లి ముహూర్తం నిశ్చయం చేసుకొని నాకు తండ్రి వయస్కునితో వివాహం జరిపించారు.
నన్ను విడిగా కాపురానికి మా నాన్నగారు పంపించి వేశారు. అప్పుడే నేను
వయస్కురాలినయ్యాను. కాని నా మనస్సంతా ఆందోళనగా ఉంది. ఎప్పుడూ నేను నా అన్నల
గురించి, వదినల గురించి ఆలోచిస్తూ ఉండేదాన్ని. భగవంతుడా ! ఏమిటీ నా జీవితం ఇలా
తయారయింది? నేను మంచి మార్గంలోనే వెళ్ళాలా ఏమిటీ నా పరిస్థితి అన్నది నాకే
తెలియదు. నా భర్తతో ఎలా వ్యవహరించాలో నాకు తెలియదు. చెప్పడానికి నాకు అమ్మ గాని,
అక్కలు గాని లేరు. నాకు మా ఆయన మొదటి భార్యద్వారా పుట్టిన నా వయస్సు గల
కొడుకున్నాడు. వాడు నా వయస్సు కనుక చీటికి మాటికి నాతో దెబ్బలాడుతూ
ఉండేవాడు. నేను కూడా చిన్నదాన్నే కాబట్టి నాకు కూడా కోపం, ఉక్రోశంవచ్చేది. నేను కూడా అతన్ని తిడుతుండేదాన్ని. ఇలా గడిచి
పోతుండగా మా ఇంటి ఎదురుగా ఉండే ఒక స్త్రీ నాతో చక్కగా మాట్లాడుతూ నన్ను తనకి
దగ్గరగా చేర్చుకుంది. ఆమె ఎప్పుడూ స్వాంత వచనాలు చెప్పుతుండేది. ధైర్య వచనాలు
చెప్తూ చాలా ప్రేమగా మాట్లాడుతుండేది. నేను కూడా ఆవిడని ‘పిన్నిగారు’,
‘పిన్నిగారు’ అంటూ తిరుగుతుండే దాన్ని. ఎందుకంటే అక్కడ ఈ పిన్నిగారు తప్పితే నాతో
మాట్లాడడానికి ఎవ్వరూ లేరు. అయితే ఈ పిన్నిగారు నన్ను మాటల్లో దింపిఅదేమిటే తల్లి, ఇంత చిన్న వయస్సులో నీ సంసారమంతా పాడయిపోయింది కదా ! నీ జీవితమంతా ‘అడవి కాచిన
వెన్నెల’ అయిందే అమ్మా ! ఎంతో చక్కగా భర్తతో దాంపత్య జీవితం గడుపుతూ, సుఖ
సంతోషాలతో ఉండవలసిన నీవు ఇలా మడి కట్టుకుని ఎందుకు ఉండవలసి వచ్చింది. నీ
అందమంతా ఎందుకూ పనికి రాకుండా పోయింది కదే ! నిన్ను చూస్తుంటే నాకు జాలి వేస్తుంది,
కడుపు తరుక్కుపోతుంది అని మెల్లగా మెల్లగా స్త్రీ సౌఖ్యాల గురించీ, వేరే స్త్రీలు
ఎంత హాయిగా ఉంటున్నారో, ఆ కామ కళల గురించీ ఊరికే చెప్పుతూ ఉండేది. నాలో కామ
కోరికలు ఉన్నా, నాలో సంస్కారాలు చాలా బలంగా ఉన్నాయి కాబట్టి వాటిని అంగీకరించ లేక
పోయాను. అప్పుడప్పుడూ నా కొడుకులాగా ఉన్న అతను నన్ను హింసిస్తూ ఉండేవాడు, మాటలతో
బాధ పెడుతూ ఉండేవాడు. నేను ఆ అబ్బాయి ఈడే కాబట్టి నాకు ఉక్రోషం, కోపం వస్తూ
ఉండేది. ఆ సమయంలోనే ఎదురింటి పిన్నిగారు ఎక్కిస్తూ ఉండేవారు. ఏమిటమ్మా ఇది తల్లి
అన్న గౌరవం కూడా లేకుండా ఇష్టమొచ్చినట్టు వ్యవహారం చేస్తున్నాడు. వీడిని
వదిలించుకోవాలి అనుకుంటే ఈ ఎలకలమందు ఇందులో కలిపి పెట్టు. ఎవ్వరికీ అనుమానం రాదు.
ఆ రోజు నేను, ఆ అబ్బాయి చాలా ఘోరంగా దెబ్బలాడుకున్నాము. నాకు ఆ అబ్బాయి మీద చాలా
కోపం వచ్చింది. అయితే ఆ పిన్నిగారు మాత్రం మెల్లగా ఎవరూ చూడకుండా ఆ విషం లడ్డులో
కలిపి అక్కడ పెట్టేసింది. నేను మాత్రం నా ప్రమేయమీ లేకుండా చూసుకుని నిర్లిప్తంగా
ఉండి పోయాను. కొంచెం సేపయ్యాక నా కొడుకు వచ్చాడు. ఆకలితో ఆవురావురుమంటూ ఆ లడ్డు
తిన్నాడు. అర్థరాత్రి అప్పుడు కడుపు నొప్పితో లేచి గట్టిగా మూలగడం మొదలు పెట్టాడు.
ఏమిటీ ఇలా జరిగింది? అని అనుకున్నాడు. బాగా తంటాలు పడ్డాడు. నాకు చాలా భయం
వేసింది. మా ఆయనకి నా మీద అనుమానం వచ్చి, నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు.
పుట్టింటికి వెళ్ళితే అక్కడ నా
కన్న తండ్రి కూడా నన్ను అసహ్యించుకున్నాడు. ఇంట్లోకి రానివ్వలేదు. దిక్కులేని
పరిస్థితుల్లో మా అన్నగారు వచ్చి తన ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడు. మా అన్నగారి
సంసారం కూడా అంతంత మాత్రమే. ఎలాగో అలాగా రోజులు గడిచి పోతున్నాయి. అయితే ఆ ఊళ్ళో
ప్రేమ వివాహం చేసుకున్న ఒక లేడీ డాక్టర్ వద్దకి మేము వైద్యం కోసం వెళ్ళుతూ
ఉండేవాళ్ళం. ఆ లేడి డాక్టర్ చాలా మంచి మనసు కలది. మేము బీద వాళ్ళం , డబ్బు
ఇచ్చుకోలేమని తెలిసి మాకు ఉచితంగానే వైద్యం చేస్తుండేది. ఇలా రోజులు గడుస్తుండగా
ఒకనాడు మా ఇంట్లో మా వదిన గారికి ఒంట్లో బాగు లేనందువల్ల ఆ డాక్టర్ గారి దగ్గరకి
వెళ్ళాము. కానీ ఆవిడకి ఆ రోజెందుకో మనస్సు స్థిమితంగా లేక కసురుకుంది. ఎన్నాళ్ళు
మీరిలా ఉచితంగా వైద్యం చేయించుకుంటారు? అసలు డబ్బులే ఇవ్వరు కదా మీరు ! ఎప్పుడు
పడితే అప్పుడు వస్తారు, మందులు ఇవ్వమంటారు అని ఆవిడ విసుక్కుంది. నాకు కాస్త
స్వాభిమానం ఎక్కువ కాబట్టి నేను కొంచెం బాధ పడ్డాను. ఆ రోజు సాయంత్రం ఆవిడ ఒంటరిగా
ఉన్నప్పుడు వెళ్లి డాక్టర్ గారూ ! మీరు ఎంతో సహృదయంతో ఎంతో కాలంనుంచి మాకు ఉచితంగా
వైద్యం చేస్తున్నారు. సాధారణంగా మీరు ఎంతో మృదుస్వభావం కలవారు, పరుషంగా
మాట్లాడారు. కాని ఎందుకో మీరు ఈ రోజు నాతో అలా విసుక్కుంటూ మాట్లాడారు ఏమైంది? ఏం
కష్టం వచ్చింది? నాకు చెప్పరా అని ప్రాధేయ పడగా ఆవిడ ఇలా చెప్పింది. మాది ప్రేమ
వివాహం. నేను నా భర్త మేమిద్దరమూ చాలా అన్యోన్యంగా ఉంటూ కలిసి ఇక్కడ వైద్యం
చేస్తున్నాము. ఇప్పుడు మా అత్తగారు, మామగారు వచ్చి మా ఆయన చేత నాకు విడాకులు
ఇప్పించే ప్రయత్నంలో ఉన్నారు. ఆ చికాకుల్లో నేను ఉండగా నీవు నా దగ్గరకి వచ్చి వైద్యం
కావాలని అడిగావు అందుకనే నేను కసురుకున్నాను. ఏమనుకోకు. నా బాధలు నాకున్నాయి కదా !
అని అంది. ఆవిడకి నేను ధైర్యం చెప్పుతూ, తెల్లవారేసరికి మీ కుటుంబ
సమస్యలన్నీ తీరిపోతాయి. మీ భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసి ఉంటారు. నేను మీకు హామీ
ఇస్తున్నాను. మీరు మాకు ఎంతోకాలంనుంచి సహాయం చేస్తున్నారు. దానికి ప్రతిఫలంగా నేను
మీకు ఈ ఉపకారం చేయదలచుకున్నాను అని చెప్పి నేను ఇంటికి వచ్చేశాను. మా నాన్నగారు
మంత్రశాస్త్రంలో ఒక విధి విధానం చెప్పారు. దానివల్ల వేరేవాళ్ళ యొక్క ప్రారబ్ధ
కర్మలు, వారిలో ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు అనేవి ఈ విధానం ద్వారా
వేరే వాళ్ళు గ్రహించవచ్చును. దానితో వాళ్ళు చేసుకున్న పాపమే కాకుండా, ఎదుటివారు
చేసిన పాపాలు అన్నీ కూడా వీళ్ళ ఖాతాలో చేరుతాయి. అ రాత్రి నేను శుభ్రంగా స్నానం
చేసి, ఆ మంత్రపరమైనట్టి విధి విధానం రాత్రంతా చేస్తూ కూర్చున్నాను.
(వచ్చేది మిగతా వారం..... )