నేను టాంజానియాలో పని చేసేటప్పుడు ట్రైనింగ్
నిమిత్తం ఒకసారి నైరోబిలోని Amboseli నేషనల్ పార్క్ కి వెళ్ళడం జరిగింది. సుమారు ఏడుగురు
సభ్యులతో ఛార్టర్డ్ విమానంలో నైరోబి నుంచి Amboseli నేషనల్ పార్క్ కి చేరుకున్నాము.
సాధారణంగా ఇక్కడ శిక్షణ కార్యక్రమాలన్నీ అడవి ప్రాంతాలలోనే ఏర్పాటు చేస్తుంటారు. ఎందుకంటే
అక్కడ ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉన్నందు వల్ల, అందరు మనసు విప్పి మాట్లాడుకుంటారని.
ఈ కార్యక్రమాలు జరిగినపుడు ట్రైనీస్ వారి వారి జాతీయ దుస్తుల్లో వచ్చి ఈ కార్యక్రమాలలో
పాల్గొంటారు. అక్కడ మాకు కేటాయించిన వసతి చాలా బాగుంది. మాకు శిక్షణ ఇచ్చే జెర్మనీ
మహిళ కూడా చక్కగా మాట్లాడుతూ మాలో కలసిపోయింది.
ఈ పార్కులో మాకు ఎన్నో రకాల జంతువులు కనపడేవి. ఇక్కడ సాధు జంతువులు, క్రూర మృగాలు అన్ని
కలిసే ఉండేవి. రోజు అల్పాహారం తరువాత సుమారు ఒక గంట వ్యాన్ ఎక్కి ఆ అడవిలో తిరుగుతుండేవాళ్ళము.
ఆ వ్యాన్ నడిపే అతను మసాయి తెగకు చెందినవాడు. వారు చాలా పొడవుగా, సుమారు 6.5' అడుగులకు
తక్కువ ఉండరు. వారి ముక్కు చాలా సూటిగా ఉంటుంది. వీరు ఎర్రటి దుస్తులు వేసుకుని, చేతిలో
ఎప్పుడు ఒక బల్లెం పట్టుకుని ఉంటారు. అతను మాకు అక్కడ అనేక విశేషాలు చూపుతూ ఉండేవాడు.
ఇలా రోజు మా శిక్షణ కార్యక్రమానికి ముందు ఒక గంట, అయిపోయాక ఒక గంట మేము అడవిలో తిరుగుతుండేవాళ్ళము.
అదొక అత్యద్భుతమైన అనుభవంగా నా మదిలో ముద్ర వేసుకుపోయింది. మాకిచ్చే శిక్షణ కూడా చాలా
సహజంగా ఉండేది. భోజనం అయిన తరువాత మనం సహజంగా ఒక మత్తులో ఉంటాము. ఆ మత్తు వదలగొట్టడానికి
మా శిక్షకురాలు మాతో రకరకాల ఆటలు ఆడించేది.
మాతో కలిసి ఆమె కూడా ఆడుతుండేది.
ఇలా జరుగుతుండగా ఒక రోజు సాయంత్రం నేను
నా గది బయటకు వచ్చి, అలా వ్యాహ్యాళికి వెళ్ళడం జరిగింది. కొంచెం దూరం అలా వెళ్ళాక అక్కడ
ఉన్న ఒక చిన్న రాయి మీద కూర్చుని ఇలా ఆలోచిస్తున్నాను "ఆహా, ఇక్కడ ప్రకృతి ఎంత
ఆహ్లాదంగా ఉంది, మరి మన భారతదేశంలో జనసాంద్రత ఎక్కువగా ఉండటం వలన కాబోలు ఇలాంటి ప్రదేశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ చెట్లు
నరకడం నిషేధింపబడింది, అందుకనే ఇక్కడ ప్రకృతి చాలా సమతుల్యంగా ఉంటుంది.ఇక్కడ ప్రకృతి
నియమాలు కూడా చాలా బాగున్నాయి. ఎందుకంటే ఇక్కడ జంతువుల సంతానోత్పత్తి కూడా చాలా వేగంగా
ఉంటుంది వేరే దేశాలతో పోలిస్తే. అందువల్ల ఇక్కడ జంతువుల జనాభా పెరిగిపోయి, వాటి ఆహరం
తక్కువ అయిపోవడం కారణంగా జంతువులు వాటి ఆహరం కోసం ఒక దాని మీద ఒకటి దాడి చెయ్యటం మూలంగా
వాటిలో కొన్ని గాయపడటం, మరి కొన్ని చనిపోవడం కూడా జరుగుతుంది. వీటిని నియత్రించడానికి
ప్రకృతి క్రూర మృగాలను సృష్టించింది. ఈ క్రూర మృగాలు వాటికి ఆకలి వేసినప్పుడే వేరే
ప్రాణులను వేటాడి చంపి తింటాయి. వాటికి ఒక్కసారి కడుపునిండాక అవి వేరే జంతువుల జోలికి
పోవు. అటువంటి సమయంలో చిన్న చిన్న ప్రాణులు కూడా వాటి ముందు నుంచి ధైర్యంగా తిరుగుతుంటాయి.
అప్పుడు ఆ క్రూరమృగాలు వాటి వైపు కన్నెత్తైనా చూడవు. మామూలుగా ఆహరం కోసం కొట్టుకుని
చనిపోయే జంతువుల సంఖ్య కన్నా ఈ క్రూర మృగాల ఆహరం కోసం చనిపోయే జంతువుల సంఖ్య తక్కువే
ఉంటుంది. ఈ రకంగా ప్రకృతి అపరిమితమయిన సంఖ్యని పరిమితం చేయడం కోసం(limitation of law
) ఇటువంటి క్రూర మృగాలని సృష్టించింది. మరి
మన మనుషుల సంగతేమిటి, మనమెంత విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నాము? ఎప్పుడు పడితే అప్పుడు
ఆహరం తినటం, అలాగే అనారోగ్యం తెచ్చుకోవటం, చిన్న చిన్న విషయాలకి ఘర్షణ పడటం, కోపతాపాలు,
ఇలా ఎన్నో ఉన్నాయి. మనుషులం అయిఉండి ఎందుకు మంచిని నేర్చుకోలేకపోతున్నాము, జంతువులకన్నా
ఉన్నతమయిన జీవిగా మనిషి భావిస్తున్నపుడు మరి మనం ప్రాధమిక ప్రకృతి నియమాలని కూడా ఎందుకు
అర్థం చేసుకోలేకపోతున్నాము? అడవులను నరికి వేసి వాతావరణ కాలుష్యం చేస్తున్నాం,
ఇష్టానుసారం సమయం సందర్భం లేకుండా తింటున్నాం, ఏమిటిదంతా " అని ఆలోచిస్తున్న సమయంలో
నాకు ఎదురుగా అద్భుతమయిన ఒక తేజో వలయం కనపడింది. నేను అటువైపు చూస్తుండగా నేననుకున్నట్లుగానే
సాదుపురుషుడు అయిన lobsang rampa గారు దర్శనమిచ్చారు.
ఆయన
చిరునవ్వు చూసి నాలో కూడా ఆనందం అనే తరంగం ఉప్పొంగింది. నేను ఆయనతో "మహాశయా
చాలా రోజులకి దర్శనమిచ్చారు" అని నమస్కరించగా ఆయన నవ్వుతూ "నాయనా నేను నీ
దగ్గిరకి చాలాసార్లు వచ్చాను కాని నేను వచ్చినపుడల్లా నీ మనసు ప్రశాంతంగా లేదు. ఎప్పుడైతే
మనసు నిశ్చలంగా ఉంటుందో, అది నిశ్చలంగా ఉన్న నీళ్ళతో సమానము. అపుడు నీ ప్రతిబింబము,
ఆ నీళ్ళల్లో ఉన్న వస్తువులు ఆ నీటిలో స్పష్టంగా కనిపిస్తాయి. కాని ఎప్పుడైతే నీ మనసు చంచలంగా ఉంటుందో, మనం సరస్సులో
ఒక రాయి వేస్తే తరంగాలు ఏర్పడి మన ప్రతిబింబము ఎట్లు కనపడదో అదే విధంగా నువ్వు ఆ పరిస్థితిలో
ఉండి నన్ను చూడలేకపోయావు. ఆహ్లాదకరమయిన ఈ వాతావరణము
నీ స్వభావం మీద ప్రభావం చూపించడం వలన నీ మనస్సు ప్రశాంతంగా ఉంది. అందువల్లే నువ్వు
నన్ను స్పష్టంగా చూడగలుగుతున్నావు. అందులో నేను నా తేజోమయ కాంతిని చాలావరకు తగ్గించుకునే
వచ్చాను ఎందుకంటే ఆ కాంతిని మీ శరీరాలు భరించలేవు. ఇక్కడికి వచ్చినప్పటినుంచి నీ మనసులో
ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తున్నాయి, మరి భగవంతుడు సృష్టించిన ఎన్నో ప్రాణులకన్నా ఉన్నతమయిన
జన్మ మానవ జన్మే. కాని మానవుడిలో ఎప్పుడైతే స్వార్ధం పెరిగిపోతుందో, దురాశ ఎక్కువవుతుందో
అప్పుడు ఆ మానవుడు మృగాని కన్నా హీనంగా ప్రవర్తిస్తాడు. ఇక్కడ జంతువులు ఆకలివేసినపుడు
మాత్రమే పరిమిత సంఖ్యలో వేరే జంతువులను చంపటం అనే సూత్రాన్ని పాటిస్తాయి. కాని ఈ లోకంలో
మానవులు ఎంత దురాశాపరులంటే వాళ్ళ కడుపు నిండి అన్ని సౌకర్యాలు ఉన్నా కూడా వాళ్ళ ముందు
పదితరాల వరకు ఆస్తి సంపాదించుకోవాలి అనే ఒక కోరిక ఉంటుంది. దాని మూలంగా ప్రకృతికి విరుద్ధంగా
సంఘంలో సమతూకం అనే న్యాయం తగ్గిపోతుంది. ఆఖరికి వారి జీవితమంతా నిరాశ నిస్పృహలతో, ఆందోళనతో
నిండిపోతుంది. వారు పైకి ఎంత గంభీరంగా కనిపించినప్పటికీ, ఎంత సంపాదించినప్పటికీ వారికి
ఎటువంటి సుఖముండదు. వారు చనిపోయాక కూడా ఈ ఐశ్వర్యాన్ని, కీర్తి ప్రతిష్టలని తీసుకుపోలేరు
కదా. పోయాక కూడా వాళ్ళ గురించి జనం వారు తమకు చేసిన అన్యాయాల గురించి చెడుగానే చెప్పుకుంటారు.
కాబట్టి మనుషుల్లో ముఖ్యంగా అహంకారం అనే గుణం చాపకింద నీరులానే ఉంటుంది. పూర్తిగా ఆ
నీటిలో మీరు తడిసేదాక ఆ ప్రమాదస్థాయి మీకు తెలియదు. అటువంటి మనుషుల యొక్క body
energy కూడా చాలా సాంద్రత (gross) కలిగి ఉంటాయి. అందుకనే ఈ మనుషులు ఏమనుకుంటారంటే
"మేము చాలా శక్తివంతులం, చంద్రగ్రహానికి రాకెట్ పంపాము, వేరే గ్రహాలలోకి కూడా
వెళ్తున్నాము, మేము ఏమైనా చెయ్యగలము" అని. కాని మీకన్నా ఎన్నో రెట్లు తెలివిగలవాళ్ళు,
నాగరికులు, శక్తివంతులు ఈ భూలోకంలో ఎంతోమంది ఉన్నారు. అలాంటి నాగరికతలు ఎన్నో అంతరించిపోయాయి
కూడా. ఎందుకంటే వారు వస్తుసంపదను భౌతికంగా చూసారు కాని పారమార్ధికంగా ఆలోచించలేదు.
వారు కనిపెట్టిన అత్యాధునికమయిన ఆయుధాలు మీరు కనిపెట్టిన ఆయుధాల కన్నా ఎన్నో రెట్లు
శక్తివంతమయినవి. కాని వారు ఆ ఆయుధాలను అధికార దర్పం కోసం వేరే దేశాల మీద ప్రయోగించి
దుర్వినియోగ పరచడం, ఎదుటి దేశం వారు కూడా ఉన్నతస్థాయిలో అభివృద్ధి చెందినవారు కావడం
వల్ల, వారు తిరిగి వీరిపై దాడి చెయ్యటం, ఈ విధంగా ఈ ప్రపంచం అంతా తాము సంపాదించిన జ్ఞానాన్ని వేరొకరిని మట్టుపెట్టడానికే
ఉపయోగించారు. అలా నాగరికతలు అంతరించిపోతున్నా కూడా మానవుడు తాను చేస్తున్న తప్పును
తెలుసుకోలేకపోయాడు ఎందుకంటే ఈ అరిషడ్వర్గాలు అనేవి చాలా భయంకరంగా మనుషుల ప్రవృత్తిలో
దాగుని ఉంటాయి. ఆ చెడు సంస్కారాలు ఉన్నంత కాలం వారు ఎంత భౌతికంగా ఎదిగినా, ఎంత గొప్పవారైన
వారు తమ విజ్ఞానాన్ని విధ్వంసానికే వాడుకుంటారు. వాళ్ళల్లో ఆత్మజ్ఞానం లేనంత కాలం,
సమాజం పట్ల, మానవుల పట్ల ప్రేమభావం లేనంత కాలం ఈ మానవులకి పురోగతి మాత్రం ఉండదు. వాటిని
సాధించుకోవడానికి ఒకే ఒక మార్గం ఆధ్యాత్మిక మార్గం. అటువంటి ఆధ్యాత్మిక మార్గాన్ని
బుద్ధ భగవానుడు ద్వారా మా టిబెట్ దేశం అంతా అంగీకరించి, ఆచరించింది. మేము అహింసావాదులం
కాబట్టి మా వద్ద ఆయుధాల తయారి, వేరే దేశం మీద దండయాత్రలు చేయడం, తోటివారి మీద దాడి
చేయడం అనేవి ఉండదు. ఆ బుద్ధుడు మాకు నేర్పిన అహింస, కరుణ, జాలి మాత్రమే మా నాగరికతలో
ఉన్నాయి, కాని ఒక్కొక్కసారి దురాక్రమణ చేయాలని తలంపు ఉన్న దేశాలు మాలాంటి దేశాలమీద
దాడి చేసినపుడు మా నాగరికత మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. మా పెద్దవారు సంపాదించిన
ఆధ్యాత్మిక విజ్ఞానము సమస్తం భూమిమీద లేకుండా తుడిచిపెట్టుకుపోతుంది. ఇదివరకు ఇలా చాలాసార్లు
జరిగింది, ఈ భూమి మీద సృష్టి మొదలయినప్పటి నుండి ఎన్నో గొప్ప జాతులు, నాగరికతలు ఇక్కడ
వెలిసాయి. అయితే కొంతమంది అహింసామార్గంలో వారి నాగరికతను వృద్ధి పరచుకున్నారు, కొన్ని
నాగరికతలు హింసామార్గంలో వెళ్లి అహింసావాదుల నాగరికతను పూర్తిగా తుడిచిపెట్టేసిన సందర్భాలు
చాలా ఉన్నాయి. అలాగే చైనా చేతిలో టిబెట్ దేశం దురాక్రమణకు గురి అయ్యింది. దురదృష్టవశాత్తు
ఏమి జరుగుతుందంటే మాలాంటి దేశాల్లో కూడా కొంతమంది విద్రోహులు ఉంటారు, వారు పొరుగున
ఉన్న శత్రువులతో చేతులు కలిపి వారిని తమ దేశం మీద దాడి చేయడానికి సహాయపడతారు. బదులుగా
ధనమో, లేక వారికి కావలసిన దాన్ని పొందుతారు. అయినా కూడా మేము అహింసా మార్గంలోనే వెళ్లిపోతుంటాము.
ఒకసారి నా చిన్నతనంలో నాకు మా గురువుగారు
mingyar dondup దగ్గరనుండి రమ్మని కబురు రాగా నేను వెళ్ళడం జరిగింది. ఆయనే నాకు ప్రత్యేక
శిక్షణ ఇచ్చి నా 3వ కన్ను తెరిపించడం ద్వారా నాకున్న ప్రత్యేక శక్తులతో అపుడప్పుడు
కొన్ని మంచి పనులు చేయిస్తుండేవారు. నేను ఎందుకింత అకస్మాత్తుగా నన్ను రమ్మన్నారా అని
ఆలోచిస్తూ ఆయన వద్దకు వెళ్లి వినయంగా నమస్కరించి నుంచున్నాను. ఆయన నన్ను సాదరంగా "రా
lobsang rampa, కూర్చో" అని తనకు దగ్గరలో ఉన్న ఆసనం మీద నన్ను కూర్చోమని, గంభీర
స్వరంతో "lobsang rampa, మనం ఊహించినట్లుగానే మన పొరుగు దేశమయిన చైనా వారు మన
దేశాన్ని ఏ క్షణంలోనైనా ఆక్రమించుకునే ప్రయత్నంలో ఉన్నారు. మేమంతా కూడా మానసికశక్తి
ద్వారా ఈ దురాక్రమణ ఇప్పుడే జరగదు, మరి కొంత కాలం పట్టచ్చు అనుకున్నాము కాని కొన్ని
విచిత్ర పరిస్థితుల వల్ల వారు కొంచెం ముందుగానే దాడికి దిగుతున్నారని మాకు సమాచారం
అందింది.
వారి యొక్క భావతరంగాల ద్వారా మాకు వారి ఆలోచన తెలిసిపోయింది. దురదృష్టవశాత్తు
మన ప్రజలంతా అహింసావాదులే, మనం ఎటువంటి ఆయుధాలని సృష్టించుకోలేదు. ఆధ్యాత్మికంగా మనమెంతో
పురోగామించాము. మన నాగరికతను, మన సంస్కృతిని ప్రతిబింబించే వస్తువులను సేకరించి ఒక
రహస్యప్రదేశంలో దాచుకోవలసిన అవసరం ఇప్పుడు ఉంది. ఇదివరకు కూడా మన పెద్దవారు, మనకన్నా
ఎంతో అభివృద్ధి చెందిన జాతివారు కూడా ఈ విధంగానే చేసారు కాని ఇప్పటికి అవన్నీ ఎక్కడ
దాచారో ఎంతమంది అన్వేషించినా తెలియరాలేదు.
అదృష్టవశాత్తు నేను చిన్న వయసులోనే మా గురువుగారి ఆశీర్వాదంతో అటువంటి ప్రదేశానికి
వెళ్ళటం జరిగింది. ఆ ప్రదేశంలో వారు రాబోయే
తరానికి ఇచ్చినటువంటి సంకేతాలు ఎన్నో ఉన్నాయి" అని చెప్పగా నేను చాలా ఆశ్చర్యపోయి
గురువుగారు "మీరు ఎన్నో నమ్మశక్యంకాని విషయాలు చెప్తున్నారు, నాకేమి అర్థం కావట్లేదు.
మీరు ఆ ప్రదేశాన్ని చూసారా, అది ఎక్కడ ఉంది" అని అడగ్గా "lobsang ఎందుకంత
ఆదుర్దా పడతావు, నేను నీకు అంతా వివరంగా చెప్తాను, నిన్ను అందుకోసమే పిలిచాను. మనం
చాలా రహస్యంగా అటువంటి ప్రదేశానికి వెళ్ళవలసి
ఉన్నది. ఆ ప్రదేశం ఏమిటి, ఎక్కడుంది ఆ రహస్యాలను మాత్రం బయటకు చెప్పడానికి వీలు లేదు.
ఎందుకంటే మన చుట్టూ కూడా పొరుగు దేశపు గూఢచారులు ఉన్నారు, వారు మన ప్రతి కదలికను గమనిస్తున్నారు.
మనం వనమూలికలను సేకరించడానికి ఎత్తైన ప్రదేశాలకు వెడుతుంటాము కదా, అలాగే ఇప్పుడు కూడా
వెళ్తున్నట్లు మనం వారిని ఏమార్చి ఆ రహస్య ప్రదేశానికి వెళ్ళవలిసి ఉన్నది. నేనన్ని
సిద్దంచేసే ఉంచుతాను, నీకు కబురు చెయ్యగానే నువ్వు ఏమి తెలియనట్లు రావాలి" అని
ఆజ్ఞాపించారు. ఆ తరువాత యధాప్రకారంగా ఆయన "థమ్సా" అనే పానీయాన్ని తెప్పించగా
దానిని సేవిస్తూ కొన్ని క్షణాలు గడిపాము.
మా గురువుగారు ఎందుకో కొంత విచారంగా ఉన్నారు.
"Lobsang నువ్వు వెళ్ళడానికి సమయం అయ్యింది, వెళ్లిరా" అని నన్ను పంపించి
వేసారు. కొద్దిరోజుల తరువాత నేను ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. నాకు ఆ రహస్య
ప్రదేశంలో ఏముంటుందో అనే కుతూహలం బాగా పెరిగిపోయింది. నేను గురువుగారి ఆదేశం ప్రకారం
ఆయన చెప్పిన చోటుకి చేరుకున్నాను. అప్పటికే ఆయన అక్కడ ఒక బృందంతో సిద్ధంగా ఉన్నారు.
మా వీపున చిన్న చిన్న బుట్టలు కట్టుకుని వనమూలికల సేకరణకు వెళ్తున్నట్లుగా మేము పర్వతప్రాంతాల
వైపు ప్రయాణం మొదలుపెట్టాము. అలా ప్రయాణిస్తూ మేము చాల పైకి వెళ్ళిపోయాము. అక్కడ వాతావరణములో
చాలా మార్పు వచ్చింది, చలి విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కడ చూసిన అగాధాలు, పర్వత శిఖరాలే కనిపిస్తున్నాయి. మా గురువుగారు మా అందరికి ఆయన
తెచ్చిన పానీయాన్నిఇచ్చి తాగమన్నారు, అది తాగగా ఆ చలిబాధ నుంచి మాకు విముక్తి లభించింది.
ఇంకా అలా పైపైకి వెళితే అక్కడ ప్రాణ వాయువు తగ్గిపోతుంది, అటువంటి ప్రదేశానికి వెళ్ళాలంటే
ముందుగా ప్రత్యేకమయిన శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది.
అవన్నీ నాకు మా గురువుగారు ముందే
చెప్పడం మూలంగా, ఆ వాతావరణానికి తగ్గట్లుగా నా శరీరాన్ని సిద్ధపరచుకున్నాను. అయినా
కూడా కొన్ని సందర్భాలలో ఆ చలిని తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. అక్కడ వీచే చల్లటిగాలులు
మన శరీరాన్ని కోసివేస్తున్నట్లుగా అనిపిస్తుంది, అందుకే శరీరమంతా ఉన్ని దుస్తులతో కప్పుకోవాల్సి
వస్తుంది. ఇలా మేము పది రోజులు ప్రయాణం చేసాక ఒక ఉన్నత శిఖరపు అంచుకు చేరుకున్నాము.
అక్కడ కిందకు చూస్తే ఒక సెలయేరు భూమి మీద ప్రవహించడం మాకు కనిపిస్తోంది. మేమందరం ఒక
తాడుని మా నడుములకు కట్టుకుని ఆ పర్వతం అధిరోహించడం మొదలు పెట్టాము. దీనిని నేను చాలా
కష్టతరమయిన యాత్రగా భావించాను,కాకపోతే గురువుగారు ఉన్నారనే ధైర్యంతో పెద్దగా భయపడలేదు. అతి కష్టం మీద మేము ఆ పర్వతానికి ఆవలి వైపుకి చేరుకున్నాము.
ఆ రోజు రాత్రికి మేము అక్కడే గుడారం వేసుకుని విశ్రమించాము.