ముందు చెప్పిన పాల్ బ్రంటన్
(Paul Brunton) కథ లాంటిదే జరిగిన ఒక సంఘటన “ఒక యోగి ఆత్మ కథ” (An
autobiography of a yogi) పరమహంస యోగానంద గారు వ్రాసిన పుస్తకంలో ఉంది. పరమ హంస
యోగానంద గారి గురువుగారైన శ్రీ యుక్తేశ్వరగిరి స్వామి గారు ఆయనకి కలిగిన
అనుభవాన్ని శ్రీ పరమహంస యోగానంద గారికి చెప్పారు.
ఒకప్పుడు ఎండాకాలం అనుకుంటాను
ఒక వృద్ధ సాధువు బెంగాల్ లో ఒక గ్రామంలో వెళ్ళుతూ ఉండగా ఆయనకి చాలా దప్పిక
కలిగింది. ప్రక్కనే ఒక బావి కనిపిస్తే అక్కడకి వెళ్ళాడు. అక్కడే ఒక చిన్న కుర్రాడు
కనిపిస్తే ఆ పిల్లవాడిని కాసిని మంచినీళ్ళు ఇవ్వమని అడిగాడు. దానికి ఆ పిల్లవాడు,
“మహాత్మా ! నేను ముస్లింని మీరేమో హిందువు, నేను నీళ్ళు తోడితే మీరు త్రాగలేరు కదా
! త్రాగకూడదు కదా” అని చెప్పాడు. ఆ పిల్లవాడు తెచ్చిన నీళ్ళు త్రాగి, ఆ పిల్లవాని
నిజాయితీని ఆయన ఎంతో మెచ్చుకుని అతనికి ఒక మంత్రం ఉపదేశించాడు. “నాయనా ! నీ
నిజాయితీని మెచ్చుకుని నేను నీకీమంత్రం ఉపదేశిస్తున్నాను. దీనిమూలంగా నీకు కొన్ని
శక్తులు వస్తాయి. వాటిని మాత్రం ప్రజలకు ఉపయోగపడేటట్టుగానే నీవు చేయాలి.
వేరువిధంగా చేయకూడదు అని చెప్పి ఆ సాధువు వెళ్ళిపోయాడు.
క్రమక్రమంగా ఈ బాలుడు మంత్ర్రోపాసన చేస్తూ పెద్దవాడై పోయాడు. ఈ మంత్రోపాసన మూలంగా
అతనికి ఒక కనిపించని భూతం వశమయింది. మన పురాణాల్లో వర్ణించినట్టుగానే అనేకరకాల
భూమికలుంటాయి. ఆ లోకం, ఈ లోకమని ఎన్నో లోకాలుంటాయి. ఒక్కొక్క డైమెన్షన్ లో
ఒక విధమైనటువంటి ఆకారం కనపడనటువంటి ఈ భూతాలూ, పిశాచాలు తిరుగుతూ ఉంటాయి.
వాటిలో మంచి, చెడు ఉంటాయి. కొన్నాళ్ళకి ఈ ముస్లిం బాలుడు ఫకీరుగా మారాడు. అతను ఆ
భూతాన్ని ‘హజ్రత్’ అని పిలిచేవాడు. దీనియొక్క మిష ఏమిటంటే ఆ ఫకీరు ఏదోవిధంగా
బంగారు నగలు అమ్మే దుకాణానికి వెళ్ళడం ,”అది కావాలి” అది కావాలి” అని ఆ నగలని
చూపించమని అడగడం, ఆ నగలను చేత్తో తాకి , నేను మనస్సు మార్చుకున్నాను, నాకివేవి
వద్దు అని చెప్పి ఆ దుకాణం నుండి బయటకి వచ్చేవాడు. హజ్రత్ అని పిలవగానే
కొంచెం సేపట్లో ఈ ఫకీరు ముట్టుకున్న నగలన్నీ దుకాణంలో నుంచి మాయమైపోయేవి. ఆ
కనిపించని భూతం అంటే హజ్రత్ ఆ నగలన్నీ కూడా ఈ ఫకీరుకి తెచ్చి ఇచ్చేది. అలాగే
మిఠాయి దుకాణానికి వెళ్లి ఏదోవిధంగా ఆ మిఠాయిలను స్పర్శించే వాడు. బయటకి రాగానే
హజ్రత్ అవన్నీ తీసుకొచ్చి ఇస్తుండేవాడు. క్రమక్రమంగా ఈ ఫకీరు చేసే కనపడని దొంగతనాల
మూలంగా ఇతను వస్తున్నాడంటే ప్రజలు హడలిపోయేవారు.
అలాగే ఇంకొకసారి తన
శిష్యబృందాన్ని వెంట పట్టుకుని రైల్వే స్టేషన్ కి వెళ్లి నాకు 50 టికెట్లు కావాలి
అని స్టేషన్ మాస్టారుకి చెప్పి ఆ టికెట్టు కట్టను ఏదో రకంగా ముట్టుకునేవాడు.
తర్వాత వద్దని బయటకి వచ్చేవాడు. ఈ ఫకీరు ముట్టుకున్న ఆ టికెట్ల కట్ట అక్కడనుంచి
మాయమై ఈ ఫకీరు చేతిలో ఉండేది. ఇతన్ని పట్టుకోవడం చాలా కష్టమైపోయింది.
శ్రీ యుక్తేశ్వరగిరి స్వామి
వారు ఈ ఫకీరుని ఒక మితృడి ఇంట్లో చూడడం తటస్థించింది. ఆ మిత్రుడు ధనవంతుడు. అతని
దగ్గర ఒక బంగారు రిస్టు వాచీ ఉండేది. ఏదీ నీ రిస్టు వాచీ చూస్తాను అని చెప్పి , ఆ
ఫకీరు దాన్ని ముట్టుకుని మాయం చేశాడు. దాంతో ఆ మిత్రుడు కంగారు పడిపోయాడు. కాసేపు
వేళాకోళం చేసి 500 రూపాయలు తీసుకుని ఫలానా చోటకి వెళ్ళు నీ గడియారం దొరుకుతుందని
చెప్పాడు. అతను అక్కడికి వెళ్లి ఆ గడియారం తెచ్చుకున్నాడు. ఇదంతా యుక్తేశ్వర గారు
ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ ఫకీరు తన మహిమ చూపించడానికి ఒక రాయి మీద ఏమైనా వ్రాసి,
ఆ రాయిని బలంగా సముద్రంలో పడేయమని చెప్పాడు. శ్రీ యుక్తేశ్వరగిరి గారు ఆ రాయి మీద
సంతకం పెట్టి బలంగా దూరంగా సముద్రంలోకి విసిరేశారు. హజ్రత్ అని పిలవగానే ఆ రాయి
ఫకీరు చేతిలో ప్రత్యక్షమైంది. ఆ రాయిమీద పెట్టిన సంతకం కూడా చెక్కు చెదరకుండా
అలాగే ఉండాలి. బెంగాల్ లో ఈ ఫకీరు వస్తున్నాడంటే అందరూ భయ పడుతుండే వాళ్ళు.
ఒక సారి ఈ ఫకీరు ఎక్కడికో
వెళ్ళుతుండగా మార్గ మధ్యంలో ఒక ముసలి వాణ్ణి చూడడం తటస్థించింది. ఆ ముసలి వాణి
కాళ్ళకి బంగారు కడియాలు, గండపండేరాలు ఆ ఫకీరుకి కనిపించాయి. ఆ ఫకీరు ఆ వృద్ధుని
దగ్గరకి వెళ్లి, చక్కగా మర్యాదగా పలకరించి, ఆ బంగారు వస్తువుల్ని ముట్టుకున్నాడు.
అంతే ! ఆ వస్తువులు మాయమైపోయాయి. పాపం ! ఆ వృద్ధుడు ఏడుస్తూ ఈ ఫకీరు వెంట పడి ఎంత
బ్రతిమిలాడినా ఆ ఫకీరు వినిపించుకోకుండా వెళ్లి పోవడం మొదలు పెట్టాడు. కొంచెం
సేపటికి గట్టిగా అరుపు వినిపించి ఈ వృద్దుడికి ఇంత బలం ఎక్కడ్నుంచి వచ్చిందని ఆ
ఫకీరు వెనక్కి తిరిగి చూసి ఒక్క సారిగా హడలి పోయాడు. ఎందుకంటే ఆ వృద్ధుడు ఎవరో
కాదు మంత్రం ఉపదేశించిన సాధువు. కళ్ళు బైర్లు తప్పి వెంటనే ఆ సాదువి కాళ్ళ మీద
పడిపోయాడు.
“అయితే నేను విన్నదంతా నిజమే
అన్న మాట. నిజాయితీ గా ఉన్నావని నీ మీద దయతలచి, మంత్రాన్ని ఉపదేశించి, ఈ
మంత్రాన్ని ప్రజలకి ఉపయోగ పడేటట్టుగా వాడు, అని చెప్పితే నీవు దానికి వ్యతిరేకంగా
వాళ్ళని పీడించడానికి, వాళ్ళని మోసం చేయడానికి ఈ మంత్రాన్ని ఉపయోగిస్తున్నావు” అని
నాకు తెలిసింది. అందుకని ఈ రోజునుంచి నీ శక్తులన్నీ నేను హరింప చేస్తున్నాను. ఇక
హజ్రత్ నీకు కనిపించదు. నీ మూలంగా ఇక బెంగాల్ కి భయం లేదు. కేవలం నీకు తిండి,
బట్టా ఇవ్వడానికే హజ్రత్ వస్తాడు. ఇకనైనా మంచి పనులు చేస్తూ నీ జీవితాన్ని గడుపు
అని చెప్పి ఆ సాధువు అక్కడనుంచి వెళ్ళిపోయాడు. ఇక ఆ రోజునుంచి హజ్రత్ ఈ ఫకీరుకి
కనిపించలేదు. ఇది జరిగిన తర్వాత వార్తా పత్రికల్లో ఒక పెద్ద ప్రకటన చేయించాడు.
ఇప్పటి దాకా చేసిన నేరాలన్నింటినీ తానె చేసినట్టుగా ఒప్పుకుని , ఇక ముందునుండి
ఎవ్వరికీ ఏ అపకారం చేయనని, అందరితో మంచిగా ఉంటానని, క్షమించమని వార్తా పత్రిక
ముఖంగా అడిగాడని శ్రీ యుక్తేశ్వరగిరి గారు పరమహంస గారికి చెప్పారు. .