Part - 2
తెల్లవారుఝామునే మా గురువుగారు "మనం
చేరుకోవాల్సిన ప్రదేశానికి వచ్చేసాము, కనిపించే ఆ కొండ వెనుకే ఆ ప్రదేశం ఉంది"
అని చూపగా మేము త్వరత్వరగా ఆ ప్రదేశానికి చేరుకున్నాము. అక్కడ మాకు ఒక మూలగా ఒక పెద్ద
రాయి కనపడింది. దాన్ని దగ్గరగా వెళ్లి చూస్తే అక్కడ ఏదో ఒక చిన్న సందులోంచి సన్నటి
వెలుగు కనపడింది.మేము ఒక్కొక్కరం ఆ సన్నటి ఇరుకు సందులోంచి లోపలకి వెళ్ళడం జరిగింది.
అక్కడ మాకు ఒక అద్భుతదృశ్యం కనపడింది. ఆ గుహలోపల విశాలమయిన భవనం ఒకటి కనపడగా, మేమందరం
ఆ భవనంలోకి ప్రవేసించాము. అక్కడ చాలా వెలుతురు
రావడం గమనించి మేము అంత వెలుగు ఎక్కడనుంచి వస్తోందా అని పైకి చూసాము. అక్కడ పైకప్పు
ఒక వృత్తాకారపు ఆకారంలో (dome) ఉంది, దానిలోంచే ఆ
వెలుతురు వస్తోంది. అక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా, మనసుకి ఆహ్లాదకరంగా ఉంది.
అక్కడ నేను అప్రయత్నంగా ఒక ప్లాట్ ఫారం లాగ ఉన్న ఒక బండ ఎక్కడం జరిగింది. దాని మీద
పట్టుకుని నుంచోడానికి ఒక రైలింగ్ కూడా ఉంది. అలా ఎక్కగానే ఆ బండ పైకి లేవడం మొదలుపెట్టింది.
ఈ రోజుల్లో లిఫ్ట్ మాదిరిగా ఉన్న ఆ బండ చాలా విశాలంగా, ద్వారబంధాలు లేకుండా ఉంది. అది
అలా కదలడంతో నేను చాలా భయపడ్డాను. నా కంగారుని గమనించిన మా గురువుగారు పకపకా నవ్వుతూ
"నువ్వేమి భయపడకు, ఏమి కాదు. దూకే ప్రయత్నం మాత్రం చెయ్యకు" అని చెప్పారు.
అది క్రమక్రమంగా పైకి వెళుతూ, ఆ భవనం పై భాగానికి నా తల తగులుతుందేమో అని అనుకుంటుండగా
ఆ బండ సరిగా పైభాగానికి 3, 4 అడుగుల దూరంలో ఆగిపోయింది. నేను కాస్త తేరుకుని మెల్లగా
ఆ వెలుతురు వస్తున్నా ఆ పైకప్పుని ముట్టుకోగా అది చాలా చల్లగా ఉంది. నేను చాలా ఆశ్చర్యపోయాను,
ఎందుకంటే మామూలుగా మనం ఇళ్ళల్లో వాడే బల్బులు చాలా వేడిగా ఉంటాయి కాని ఇది మాత్రం చాలా
చల్లగా ఉంది. ఆ వెలుతురు కూడా చాలా ఆహ్లాదంగా ఉంది. నేనింక కిందకి వెళిపోతే బాగుండు
అని అనుకుంటుండగా ఆ బండ మెల్లగా యధాస్థానానికి వెళ్ళిపోయింది. నేను వెంటనే కిందకి దిగిపోయాను.
మా గురువుగారు "ఇలాంటి చాలా వింతలు ఉంటాయి ఇక్కడ, ముందుకు కదలండి" అని అనగా
బయలుదేరాము.
మేము ఆ భవనపు రెండవ అంతర్భాగంలో ప్రవేసించాము,
అక్కడ ఒక విశాలప్రాంగణంలో ఆడిటోరియంలాగ ఉండి
కుర్చీలు వేసి ఉన్నాయి. మేమందరం అక్కడ కాసేపు కూర్చుందామని నిర్ణయించుకుని కూర్చోగా
ఎక్కడినుంచో ఒక స్వరం మాకు అర్థమయ్యే భాషలోనే ఇలా వినిపించింది "స్వాగతం మిత్రులారా,
ఎప్పటికో ఒకసారు మీరు తప్పకుండా ఇక్కడికి వస్తారని మాకు తెలుసు. నాగరికతలో మేమెంతో
అభివృద్ధి సాధించాము, మీరు చూస్తున్నటువంటి కాంతి మేము మీరు ఉత్పాదన చేసే విధంగా కాకుండా
వేరే ప్రక్రియద్వారా తయారు చేస్తాము, వాటి ద్వారా ఎన్నో యంత్రాలను నడుపుతున్నాము. అయితే
మేము ఏ విధంగా అభివృద్ధి చెందామో అదే విధంగా మా పొరుగుదేశాలు కూడా ఎంతో అభివృద్ధి చెందాయి.
ఇపుడు అవన్నీ మీరు చూడబోతున్నారు, దయచేసి అందరు నిశ్చింతగా కూర్చోండి అని ప్రార్ధిస్తున్నాను".
మేము యాంత్రికంగా మా కుర్చీలలో స్థిరపడిపోయాము. వెంటనే మా ముందు ఒక తెర ప్రత్యక్షమయ్యింది,
దాని మీద ఎన్నో అద్భుతమయిన దృశ్యాలు కనపడటం మొదలుపెట్టాయి.
దాంట్లో ఒకతను ఒక రాజకీయ నాయకుడిలా పెద్ద ఉపన్యాసం
ఇస్తున్నాడు, ఎంతో ఆవేశంగా మాట్లాడుతున్నాడు. ప్రజలందరూ అక్కడ చేరి అతను చెప్పేది శ్రద్ధగా
వింటూ మధ్యమధ్యలో చాలా క్రోధంతో అరుస్తున్నట్లు కనిపించింది. మాకేమి అర్థమయ్యిందంటే
ఏదో ఒక దేశానికి సంబంధించిన నాయకుడు ప్రజలని ఉద్రేకపరిచి మాట్లాడుతున్నాడు. మరలా ఇంకొక
దృశ్యం కనిపించింది, అది ఇంకొక దేశమనుకుంటాను, అక్కడ కూడా ఇలానే ఒక రాజకీయ నాయకుడు
తన ప్రసంగంతో ప్రజలను రెచ్చగొడుతున్నాడు. ఇంకొక
దృశ్యంలో వారు కనిపెట్టిన
అత్యాధునిక మారణాయుధాలని ఆ రెండు దేశాలవారు
పరస్పరం ఒకరి మీద ఒకరు ప్రయోగించుకోవడం కనిపించింది. అక్కడ జరిగే విధ్వంసాన్ని
మేము చూడలేకపోయాము. ఎత్తైన భవనాలు ఒక్క క్షణంలో కుప్పకూలిపోయాయి. ప్రజల హాహాకారాలు
మిన్నుముట్టాయి. ఈలోపల ఇంకో దృశ్యం తేరా మీదకి వచ్చింది. అదొక ఒక పెద్ద ప్రయోగశాల లాగ ఉంది, దాంట్లో శాస్త్రవేత్తలు,
విజ్ఞానవేత్తలు అంతా హడావిడిగా కొన్ని పెట్టెల్లో వారు కనిపెట్టిన పరికరాలను సర్దుతున్నారు.
కొంతమంది ఆధ్యాత్మిక గురువులు ఆ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సర్దిన
పెట్టెలకు మూత బిగించి వాటిని ఎక్కడికో తీసుకెళ్తున్నట్లుగా మాకు అర్థమయ్యింది. వారిలో
నాయకుడిలా అనిపించిన అతను విచారవదనంతో "మనం సంపాదించిన కీర్తి ప్రతిష్టలు, నాగరికత
ఇలాంటి యుద్ధాల వల్ల నాశనం అయిపోతున్నాయి.
మనం కనిపెట్టిన పరికరాలన్నీ మనుష్యుల మరియు ప్రకృతి విధ్వంసానికే వాడుతున్నాం తప్ప
మానవాళి ప్రయోజనానికి వాడట్లేదు. ఎప్పుడైతే మనం మనలోని మనోవికారాలని జయించలేదో, మానవాళికి
ఇలాగే నాశనం తప్పదు" అని చెప్పడం జరిగింది. మా అందరి మనస్సు ఒకసారి విచారంతో నిండిపోయింది.
మాటల్లో అర్థంకాని ఎన్నో విషయాలు మాకు బొమ్మల ద్వారా అర్థమయ్యాయి. మేమంతా మన నాగరికత
శ్రేష్టమయినది అనుకుంటున్నాం కాని జరుగుతున్నది ఏమిటి అని అందరం ఒక్కసారిగా మాలో మేము ప్రశ్నించుకోసాగాము. అపుడు మాకు ఒక గంభీరమయిన
స్వరం ఇలా వినపడింది "ప్రియమయిన సోదరులారా, ఈపాటికి మీరు గ్రహించే ఉంటారు మేము
భౌతికంగా, శాస్త్రీయంగా ఎన్నో ఉన్నత శిఖరాలు అందుకున్నాము. గొప్ప అస్త్రాలని, మనకి
పనికొచ్చే పరికరాలను ఎన్నో కనుక్కున్నాము. అలాగే మా పొరుగుదేశాలు కూడా ఎన్నో కనుక్కున్నారు,
కాని వాటిని ఒకరిని ఒకరు చంపుకోవడానికి మాత్రమే మేము వాడుకున్నాము. ఇక్కడి ఆధ్యాత్మిక
గురువుల మాటలు మేమెవరూ పట్టించుకోలేదు. కొంతమంది స్వార్థరాజకీయ నాయకుల వల్ల, వాళ్ళ
ప్రసంగాల వల్ల ప్రజల్లో ఉండే మంచితనం పోయి లోపల ఒక విధమయిన ఈర్ష్యాద్వేషాలు రెచ్చగొట్టబడతాయి.
అప్పుడు వారు మంచి చెడు ఆలోచించకుండా ఒకరి మీద ఒకరు దాడి చెయ్యటం, కొన్నిసార్లు వారు
ఉపయోగించిన మారణాయుధాలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే అవి మొత్తం దేశాన్నే క్షణంలో భస్మీపటలం
చేస్తాయి. ఆ విషయం చెప్పడానికే మాలో కొంతమంది పెద్దలు రాబోయే తరాలు మేము చేసిన తప్పు తెలుసుకుని, అదే తప్పును వారు చెయ్యకుండా
ఉండాలనే ఉద్దేశంతో మేము మా విజ్ఞానం నుంచి కనిపెట్టిన పరికరాలని కూడా పెట్టెల్లో పెట్టుకుని
ఎటువంటి మనుష్యులు రాలేనటువంటి ప్రదేశంలో నిక్షిప్తం చేసాము. టిబెట్లో మతగురువులు కొంతమందికి
ఈ ప్రదేశం గురించి భావప్రసారాల ద్వారా తెలియజేశాము. మీరందరూ కూడా ఈ గుహని సందర్శించడానికి
ఎన్నుకోబడినవారే. మనిషి ఎప్పుడైతే తనని తాను జయించలేకపోతాడో, తన మనసుని ఇంద్రియాలని
నిగ్రహించుకోలేకపోతాడో, వాడు ప్రపంచానికి ఒక దుష్టశక్తిగా పరిణమిస్తాడు. ఒక దుష్టశక్తి
వల్ల ఎంతోమంది నాశనం కాక తప్పదు. ఈ చిన్న సూత్రం మానుంచి రాబోయేతరాలవారు తెలుసుకుంటారని
మేము ఈ ఏర్పాటు చేసాము. ఇక్కడకి మీరు రాగానే మీలో ఉన్న అయస్కాంత క్షేత్రం ద్వారా మేము
సృష్టించిన పరికరాలన్నీ కూడా చైతన్యం పొంది పని చెయ్యటం ప్రారంభిస్తాయి. ఇపుడు మీరు
చూస్తున్న వెలుతురు కూడా కొన్ని వందల ఏళ్ళ నుంచి ఏ మాత్రం ప్రకాశం తగ్గకుండా అలాగే
ఉన్నది. ఇటువంటి అద్భుతమయిన జ్ఞానాన్ని సంపాదించి చివరికి మేమంతా ఒకరినొకరం నాశనం చేసుకున్నాము"
అని ఎంతో బాధతో చెప్పారు. తరువాత అక్కడ తెర
మీద దృశ్యం ఆగిపోయింది.
ఆ తరువాత గుహలో మాకన్నా ఎన్నో తరాల ముందువాళ్ళు కనిపెట్టిన
అద్భుత ఆవిష్కారాలు ఎన్నో చూడటం జరిగింది. ఎన్ని వస్తువులు చూసామన్నది ముఖ్యం కాదు,
మనిషి సృష్టింపబడినప్పటినుంచి జరుగుతున్నది ఏమిటంటే, కొంతమంది స్వార్థపరులు బలహీనమయిన
దేశాలను ఆక్రమించుకుని వారి నాగరికతను పూర్తిగా తుడిచివెయ్యడం, వారి నాగరికత కన్నా
మా నాగరికత గొప్పది, మేము తలచుకుంటే ఏమైనా చెయ్యగలం అనుకునే దుష్టులే ఈ ప్రపంచాన్ని
శాసిస్తున్నారు, వీళ్ళు ఈ ప్రపంచాన్ని ఎన్నోసార్లు నాశనం చేస్తున్నారు. ఈ విధంగా ఎన్నో
నాగరికతలు ఈ భూమిమీద నుంచి తుడిచివేయబడ్డాయి. వీటన్నిటికి సరైన సమాధానం ఏమిటంటే మనం
ఆధ్యాత్మికంగా పరిణితి చెందాలి, మన మనసులో ప్రేమ, దయ అనే గుణాలని పెంచుకోవాలి. అటువంటి
మార్పు మనం ఆధ్యాత్మిక గురువులతో సంబంధం పెట్టుకున్నపుడే మనలో ఆ మార్పు వస్తుంది. కాబట్టి
ఇది మానవ జాతికి ఇదొక హెచ్చరిక. ఇంత జరుగుతున్నా కూడా మనుషుల్లో మార్పు రావట్లేదని
నేను చాలా తీవ్రంగా ఆలోచించాను. ఈ విధంగా మేమెన్నో వస్తువులని చూసాము, వాటన్నిటిని
నేను మాటల్లో చెప్పలేను కాని ఇపుడు మనం ఊరికే మనేమేదో గొప్ప విజ్ఞానాన్ని కనిపెట్టామని
గర్వపడుతుంటాము కాని మనకన్నా ముందుతరాలవారు
ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందారు, అయితే దుశ్తశక్తులకి బలి అయిపోయారు. అయినా
కూడా మనుషుల ప్రవృత్తిలో మార్పులేదు. ప్రకృతికి విరుద్ధంగానే మనుషులెపుడు వెళ్తూ ఉంటారు"
అని ఆయన గంభీరంగా చెప్పారు. "ఆ తరువాత మేము ఆ గుహలోంచి బయటకు వచ్చేసి మా ఆశ్రమానికి
చేరుకున్నాము. అయినా చైనా గూఢచారులు మేమేదో చేస్తున్నామని పసిగట్టారు. మా దేశం దురాక్రమణ
అయినప్పటినుంచీ ఈ రోజు వరకు కూడా ఇలాంటి గుహ ఒకటి ఉందని వారికి తెలిసి వెతుకుతూనే ఉన్నారు
కాని దాని స్థావరాన్ని తెలుసుకోలేకపోయారు. దాని యొక్క వివరాలని చెప్పమని ఎంతోమంది మతగురువులని
వారు హింసించి, చంపెయ్యడం కూడా జరిగింది. ఈ విధంగా ఒకప్పుడు ప్రపంచానికే శాంతి దూతలుగా
ఉండే మా టిబెట్ దేశంలో ప్రశాంతత, ఆధ్యాత్మికత మొత్తం తుడిచిపెట్టుకుపోయాయి. అయితే మా
ఆధ్యాత్మిక గురువులు ముందు జాగ్రత్తగా మా వద్ద ఉన్న టిబెటియన్ సంస్కృతికి సంబందించిన
చిహ్నాలు, మా నాగరికతను గుర్తుతెచ్చే వస్తువులను గుప్తపరిచి మంచిపని చేసారు. ఏదో ఒకరోజు
దురాక్రమణదారులకి పతనం తప్పదు. మా మతగురువులు చెప్పినట్లు మాకు మంచిరోజులు వస్తాయి,
మళ్లీ టిబెట్ ఏదో ఒక రోజు స్వాతంత్రాన్ని పొందుతుందనే ఆశతో మేమంతా ఎదురు చూస్తున్నాము.
పొరుగున ఉన్న మీ భారతదేశము మా మతగురువులకి ఆశ్రయమిచ్చి వారిని కాపాడింది, చైనా వారి
బెదిరింపులకి లొంగకుండా భారతదేశము చాలా సహాయం చేసింది. మాకు మీ దేశము చాలా విలువయిన
కానుకలనిచ్చింది, దానిలో బుద్ధుడి యొక్క జ్ఞానాన్ని మాకు పంచి ఇవ్వడం అనేది ఎంతో అద్భుతమయిన
విషయం. చూసావు కదా మనుషుల్లో మంచి మార్పు రావాలంటే ఆధ్యాత్మికతే శరణ్యం. మనం ఎప్పుడైతే
మనసుని జాలి, కరుణ, దయ, ప్రేమ అనే మంచిగుణాలతో నింపుతామో అప్పుడే మనం మంచిని గ్రహించగలుగుతాము.
లేకపోతే ప్రకృతికి విరుద్ధంగా వెళ్తే ఆ ప్రకృతే మనకు శత్రువుగా పరిణమిస్తుంది అనే విషయాన్ని
ఈ మానవులు ఎప్పుడు గ్రహిస్తారో తెలియదు. కాని మంచి రోజులు రాబోతున్నాయి, 1985వ సంవత్సరంలో
దానికి నాంది పడింది. నీకు ఇదివరకే అనేక విషయాలు అయస్కాంత వ్యక్తి చెప్పారు కదా, మరి
కొన్ని విషయాలు నీకు త్వరలో తెలుస్తాయి.
1987 నుంచి సంధియుగం ప్రారంభమయ్యింది, అది
సుమారు 25 సంవత్సరాలు ఉండచ్చు, లేదంటే ఇంకా
కొన్ని రోజులు పొడిగింపబడచ్చు. సమస్త మానవ చైతన్యస్థాయి మంచిభావాలతో నిండి ఉంటుందో
అపుడు మాత్రమే మంచిమార్పులు రావటానికి నాంది పడుతుంది. ముందు ఎన్నో ప్రకృతి విరుద్ధమయిన
కార్యక్రమాలు జరుగుతుంటాయి, దానిని చూసి మానవాళి ఎంతో భయపడుతుంది, ఆ తరువాత మంచి రోజులు
తప్పక వస్తాయి. మంచి రోజులు త్వరగా రావాలా
లేక ఆలస్యంగా రావాలా అనేది సమస్త మానవాళి చేతుల్లోనే
ఉంది. నాయనా వేళ మించిపోతున్నది, ఇంక నువ్వు వెళ్లిరా, ముందు ముందు నీకు నేను ఆలోచన
రూపంలో వస్తుంటాను. ఏ విషయం మీద ప్రశాంతమయిన మనసుతో నువ్వు ఆలోచిస్తూ ఉంటావో, వాటికి
సమాధానాలు దొరుకుతాయి. నీకు మాత్రమే కాదు, ప్రపంచంలో చాలామందికి ఇలాంటి సందేశాలనే మేము
పంపిస్తుంటాము, ఎందుకంటే ప్రస్తుతం మానవాళి ఆధ్యాత్మిక స్థాయి కొంచెం పెరిగే సూచనలు
కనపడుతున్నాయి. నేను చెప్పినట్లుగా 1985లో బీజాలు పడ్డాయి, 1987లో మహానుభావుల సమావేశం
జరిగి కొన్ని తీర్మానాలు తీసుకున్నారు. కాబట్టి నువ్వు నిశ్చింతగా ఉండు, ఎవరికైతే ఆధ్యాత్మిక
జిజ్ఞాస ఉంటుందో, వారికి భావప్రసారాల ద్వారా మా సందేశాలు ఇస్తుంటాము. చాలామంది వారికి
తెలియకుండానే మా సూచనలను పాటిస్తూ ఉంటారు. కొద్దిగా స్థాయి పెంచుకున్నవారు మాత్రం స్పృహతో
ఏం జరుగుతోందా, ఈ సందేశం ఎక్కడనుంచి వస్తోంద అనేది తెలుసుకుంటారు. మరి ఇంక సెలవు"
అని ఆయన క్షణంలో అదృశ్యం అయిపోయారు.
ఈ అద్భుతమయిన అనుభూతిని తలచుకుంటూ నేను తిరిగి నా గదికి వెళ్ళిపోయాను. అయితే
తరువాత నేను చదివిన పుస్తకాల ద్వారా తెలిసినది ఏమిటంటే లోకంలో చాలామంది వ్యక్తులకి
ఇలాంటి భావప్రసారాలు వస్తుంటాయి ఎందుకంటే మరి ప్రస్తుతం ఈ సంధియుగంలో light
workers ఇటువంటి సంకేతాలని యాంత్రికంగా తీసుకుని
వారు చేస్తున్నామనే అనుకుంటారు. వాళ్ళచేత, వారిని పనిముట్లుగా వాడుకుని అదృశ్యరూపములో
ఉన్న మహా చైతన్యం ఇటువంటి పనులు చేయిస్తోందని వారికి తెలియదు. నేను ఇవన్నీ ఆలోచిస్తూ
పడుకున్నాను.