దయానంద సరస్వతి గారు గాయత్రి
అనుష్టానం, ఎన్నో సాధనాలు, ఉపాసనలు, మహా పునశ్చరణలు చేశారు. దాని వల్ల ఆయనలో
అద్భుతంగా ఒక ఆధ్యాత్మికపరమైనటువంటి వివేకం మేల్కొన్నది. హిందూ మతంలో ఉన్న
లోటుపాట్లు ముఖ్యంగా ఈ అష్టాదశ పురాణాల్లో ఉన్న చాలా అసంబద్ధమైన విషయాలు ఎత్తి చూపించడం
జరిగింది. వాటిలో పైన చెప్పినట్లుగా గందరగోళం, తికమకలు ఉన్నాయి. ఈ రోజు ఒక పురాణ
ప్రవక్త చెప్పిన విషయాలు అదే శివపురాణం అనుకోండి ఇంకా ఏ పురాణమైనా అనుకోండి రెండు
రోజుల తర్వాత మీరు ఇంకొక ఆధ్యాత్మిక ప్రవక్త చెప్పుతున్న విష్ణుపురాణం విన్నప్పుడు
ఈ శివపురాణం చెప్పినతను శివున్ని మించిన దైవం లేడు, మిగతా దేవుళ్ళు-దేవతలు
ఇతని కన్నా తక్కువే అని వచ్చే భావంతో చెప్పుతూ ఉంటారు.
విష్ణు పురాణం చెప్పే పురాణ
ప్రవక్త విష్ణువుని మించిన దైవం లేడు , శివుడు, బ్రహ్మ ఇతని కన్నా తక్కువే
అని వాళ్ళు చెప్పుతూ ఉంటారు. దేవి పురాణ ప్రవక్త దేవిని మించిన శక్తి లేదు
బ్రహ్మ,విష్ణు మహేశ్వరులు దేవి కన్నా తక్కువే అన్నట్లుగా చెప్తుంటారు. ఈ విధంగా
పరస్పర విరుద్ధమైన భావాలు వాళ్ళు చెప్పడంతో ఇవి విన్న యువకులకేంటి పెద్దవాళ్ళకు
కూడా మనస్సులో ఏమిటో ఇది అర్థం కాదు.
అంటే శివుణ్ణి ఎక్కువ చేయడం
మిగతా దేవుళ్ళని తక్కువ చేయడం అలా ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు చాలా ఎక్కువగా
ప్రాధాన్యతనిచ్చి మిగతా వాళ్ళను చిన్నచూపు చూడడం జరుగుతూ ఉంది. ఇలాంటివన్నీ ఈ
పురాణాల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటుంది.
హిందూమతంలో ఉన్న పెద్ద చిక్కు ఏమిటంటే దేన్నికూడా మనం ప్రశ్నించడానికి వీల్లేదు.
పెద్దవాళ్ళ నడిగితే వాళ్ళకే తెలియదు కాబట్టి “నోరు మూసుకో ! నీకు చెప్పినా అర్థం
కాదని” అంటూ ఉండేవాళ్ళు. దానివల్ల పిల్లల్లో వచ్చినటువంటి ప్రశ్నలు ప్రశ్నల్లాగే
మిగిలిపోతూ ఉండేవి. అందులో ఎన్నో గొడవలు, పూజలు-పునస్కారాలు, నోములు, వ్రతాలు 33
కోట్ల దేవుళ్ళు ఈ గొడవలన్నీ ఎందుకు?అని అనుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళెలాగో మిషనరీ
స్కూల్లో నే చదువుతారు కాబట్టి చాలామంది చిన్నప్పుడు ఆ క్రైస్తవ మతం పట్ల
ఆకర్షించబడి క్రైస్తవమతాన్ని స్వీకరించడం ఇలా జరుగుతూ ఉండేది. ఇటువంటి మూఢ
విషయాలని ఆయన చాలా ధైర్యంగా ఖండించారు. అందుకని ఆయన ఆర్య సమాజాన్ని స్థాపించడం
జరిగింది. బ్రహ్మ సమాజమన్నా, ఆర్య సమాజమన్నా రెండూ ఒకటే. ఆయన ఇవన్నీ ఖండిస్తూ ఒక
పెద్ద గ్రంధాన్ని వ్రాయడం జరిగింది. కాకపోతే చిన్నప్పట్నుంచి ఈ పెద్దవాళ్ళనుంచి
మనం అన్నీ వింటూ ఉంటాం కాబట్టి దానికి విరుద్ధంగా ఆలోచిస్తే నరకానికి వెళ్తామేమో
అనే ఒక భయం ఉంటుంది కాబట్టి జీవితాంతం మనలో ఉన్న ప్రశ్నలు ప్రశ్నలుగానే ఉండిపోతాయి
కాని వాటికి జవాబులు దొరకవు. కాని ప్రస్తుతం పరిస్థితులు మారాయి. పిల్లలు
తార్కికంగానే తమకు సమాధానాలు చెప్పమని అంటూ ఉన్నారు. ఇవన్నీకూడా మనం ఆయన వ్రాసిన
పుస్తకాలు చదివితే చాలా విషయాలు మనకి అసలు నిజమేమిటీ అన్నది తెలుస్తుంది. ఎవరైతే
గాయత్రి మంత్రాన్నిచాలా శ్రద్ధగా అనుష్థానం, ఉపాసన చేస్తారో, ఒక క్రమబద్ధంగా ఎంతో కొంత
చేయాలని సంకల్పం చేసుకుని చేస్తారో వాళ్లందరికీ కూడా విజ్ఞానం అనేది ఆధ్యాత్మిక
పరంగా ఉన్న జ్ఞానం అంతా తర్కానికి అందేటట్టుగానే వాళ్లకి స్ఫురిస్తూ ఉంటాయి.
మరి ఇదే గాయత్రి మంత్రం మహిమ.