అది వేసవి కాలం. పరిక్షలు
అయిపోయి స్కూళ్ళకి సెలవులు ఇవ్వడంతో మా మామయ్య పిల్లలు, మా ముగ్గురు పిన్నుల
పిల్లలు అందరూ కూడా యథాప్రకారంగా మా ఇంటికి వచ్చారు. మేమందరం ఈ ఎండాకాలం సెలవుల
కోసం ఎదురు చూస్తుండే వాళ్ళం. అందరం కలిసి ఆటలేమిటీ, పాటలేమిటీ, నానా రకాల అల్లర్లు
చేస్తు౦డేవాళ్ళం. రాత్రిపూట ఆరు బయట మా అమ్మ చుట్టూ కూర్చుని కథలు వినడం మా
అందరికీ చాలా ఇష్టంగా ఉండేది. ఎన్నో రక రకాల కథలు చెప్తుండేది. మా అమ్మ కథలు
చెప్పడ౦లో నేర్పరి. చాలా ఆసక్తికరంగా చెప్తుండేది. మేమంతా ఎదురు చూస్తున్న రాత్రి
వచ్చింది. మేమందరం యథాప్రకారంగా ఆరుబయట వేప చెట్టునుండి వీచే చల్లటి గాలిని
ఆహ్లాదిస్తూ “అమ్మా ! ఒక కథ చెప్పు” అంటూ చుట్టూ చేరాం. “ఎన్నికథలు
చెప్పాల్రా మీకు? నాకు రావు పొండి ! హాయిగా పడుకోండి” అని అంది. అమ్మా, అత్తయ్యా ,
పెద్దమ్మాకథ చెప్పు అంటూ అందరం గొడవ చేస్తే. “ఎగ దీస్తే బ్రహ్మ హత్య,
దిగ దీస్తే గోహత్య” అని అంది. అమ్మా ! ఏమిటది చెప్పవా అంటూ అందరం వెంట
పడడంతో ఈ కథ చెప్పడం మొదలుపెట్టింది.
పూర్వం ఆర్యావర్తం లో వేదగిరి
అనే ఒక సంస్థానం ఉండేది. ఆ సంస్థానానికి అధిపతి అయిన ధర్మకీర్తి అనే
మహారాజు చాలా ధార్మికంగా పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి పండితులన్నా,
గోవులన్నా చాలా ఇష్టం, గౌరవం అందుకనే అతని రాజ్యంలో గోసంపద మరియూ విద్యా సంపద
వృద్ధి చెందింది. అన్ని దేశాలనుండి బ్రాహ్మణులు ఈ దేశానికి వచ్చి విద్యను
ముగించుకుని వారి వారి వృత్తుల్లో స్థిర పడి పోతుండేవాళ్ళు. అతను వినయశీలుడే
కాకుండా ఆహి౦సాపరుడు అవడంతో తన సైన్యాన్ని ఎక్కువగా పెంచు కోలేదు. అతని రాజ్యం
అన్ని రంగాల్లో మంచి ప్రగతిని సంపాదించుకుంది. వివిధ దేశాల నుంచి వర్తకులు క్రయ,
విక్రయాలకోసం ఇతని రాజ్యానికి వస్తుండేవాళ్ళు. ధర్మం నాలుగు పాదాలమీద నడుస్తూ
ఉండేది. ఇలా ఉంటూ ఉండగా పొరుగు దేశపు రాజైన శూరసేనుడికి ఈ రాజ్యం మీద కన్ను
పడింది.
ఆ రాజ్యాన్ని జయించడం చాలా సులభమని తన వేగులద్వారా అతను గ్రహించాడు
ఎందుకంటే ఆ వేదగిరి రాజుకి సైనికబలం చాలా తక్కువగా ఉంది. ఇంక ఆలస్యం చేయకుండా ఒక
సారి హఠాత్తుగా వేదగిరి మీద దండయాత్ర చేయాలని , చాలా రహస్యంగా తన సైన్యాన్ని తీసుకుని
వేదగిరి రాజ్యం మీద దండయాత్రకి బయలుదేరాడు. శూరసేనుడి సైన్యం ఆ రాజ్యపు
పొలిమేరల్లో రాగానే ధర్మకీర్తికి వేగుల ద్వారా శత్రువు తన సైన్యం తో తన రాజ్యం మీద
దండయాత్రకి వచ్చి తన రాజ్యం చుట్టుముట్టాడని తెలిసింది. యుద్ధం చేయడానికి తగిన
ఏర్పాట్లు వాళ దగ్గర లేవు, సైనిక బలం కూడా తక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం
చేయాలో ధర్మకీర్తికి పాలుపోలేదు. కాని అతని దగ్గర సుబుద్ధి అనే చాలా తెలివైన
మంత్రి ఉన్నాడు. రాజభక్తి కల ఆ మంత్రికి శత్రువుకు అపార సైన్యం ఉందని తెలిసింది.
సుదీర్ఘంగా ఆలోచించి ఆ రాజ్యంలో ఉన్నరాజభక్తి కలిగి ఉన్న బ్రాహ్మణులనే కాకుండా
చుట్టూ ప్రక్కల గ్రామాల్లో ఉన్న బ్రాహ్మణులందరినీ వెంటనే రమ్మని వర్తమానం
పంపించాడు. మంత్రి చెప్పినట్టుగానే అక్కడ కొన్ని వేల మంది బ్రాహ్మణులు
సమావేశమైనారు.
అప్పుడు మంత్రి అయిన సుబుద్ధి సమావేశమైన ఆ బ్రాహ్మణులందరికి ఆ
రాజ్యానికి వచ్చిన ఆపద గురించి చెప్పి, ఇంతకాలం గోవుల్ని, బ్రాహ్మణులని
కాపాడుతున్నట్టి రాజు గారి ఋణాన్ని తీర్చుకునే తరుణోపాయం వాళ్లకి చెప్పాడు.
వాళ్ళంతా మంత్రి చెప్పిన విధంగా మర్నాడు అనేక గోవుల్ని సేకరించి, సూర్యోదయం కాగానే
ఆ రాజ్యపు పొలిమేరల్లో ఉన్న మైదానికి ఆవుల మీద కూర్చుని యుద్ధానికి బయలుదేరారు.
వాళ్ళ మెడలో ఉత్తరీయం,యజ్ఞోపవీతం తప్ప వేరే ఏమీ లేవు. నుదుటిమీద, భుజాలమీద
విభూతిని ధరించి వార౦దరూ శత్రు సైన్యానికి ఎదురుగా తమ ఆవుల్ని నడిపించసాగారు. వేదం
ఘోష కూడా మొదలయింది. ఇదంతా చూస్తున్న శత్రు రాజు సైన్యం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.
కొన్ని వేల సంఖ్యలో ఆవులు, వాటిమీద తేజోమూర్తులైనటువంటి బ్రాహ్మణులు చేతిలో
ఎటువంటి ఆయుధం లేకుండా ఒంటి నిండా విభూతి రాసుకుని వేద పఠనం చేస్తూ వాళ్ళ మీదకి
వస్తుండగా వాళ్ళకేం చేయాలో పాలుపోలేదు. వాళ్ళందరికి బ్రాహ్మణులమీద, గోవులమీదా
భక్తి ఉండడం వల్ల కాళ్ళు చేతులు ఆడలేదు. వెంటనే శతృ రాజు యొక్క మంత్రి వాళ్ళ రాజు
దగ్గరకి వెళ్లి విషయమంతా వివరించి చెప్పాడు. తమ సైన్యం ఆ బ్రాహ్మణులతో యుద్ధం
చేయడానికి ఇష్ట పడడం లేదని చెప్పాడు. ఎందుకంటే పైన ఉన్న బ్రాహ్మణులని చంపితే
వాళ్లకి బ్రహ్మ హత్యా పాతకం , క్రింద ఉన్న గోవుల్ని చంపితే గోహత్యాపాటకం
అన్తుకుంటుందని అంటే “ఎగదీస్తే బ్రహ్మ హత్య, దిగదీస్తే గోహత్య” అని వాళ్ళు
భావిస్తున్నారని కాబట్టి గౌరవంగా ఆ మహారాజుగారికి వర్తమానం పంపించి శతృత్వాన్ని
ముగించి మితృత్వాన్ని పెంచుకోవడం మంచిదని హితోపదేశం చేశాడు. విధిలేక ఆ శతృ
రాజు మంత్రి ఇచ్చిన సూచనని అంగీకరించి ధర్మ కీర్తి మహారాజుకి కబురు పంపించి
సైన్యాన్ని పంపించి వేశాడు. ఎదురుగా ఉన్న బ్రాహ్మణులకి నమస్కారం చేశాడు. ధర్మ
కీర్తి మహారాజు శత్రురాజైన శూరసేనుడి దగ్గరకి వెళ్లిసగౌరవంగా ఆహ్వానించాడు.
ఆ
విధంగా ఆ మంత్రి తెలివితేటల మూలంగా ఆ రాజ్యానికి కలగబోయే ప్రమాదం నుంచి ధర్మకీర్తి
మహారాజు బయట పడడమే కాకుండా ఆ శతృ రాజుని మితృడి లాగా చేసుకున్నాడు. అప్పట్నుంచి
ఏదైనా ప్రబల సమస్యని పరిష్కారం చేయలేనప్పుడు “ఎగదీస్తే బ్రహ్మ హత్య, దిగ దీస్తే
గోహత్య” అనే నానుడి ప్రచారంలోనికి వచ్చింది తెలిసిందా మీకు? “కథ కంచికి మీరంతా
నిద్రలోకి” ఇక హాయిగా పడుకుని నిద్రపోండి అని అమ్మ తన కథని ముగించింది.
అప్పుడే కథ అయిపోయిందా ? అమ్మా ఇంకొక కథ చెప్పు అని మేం వెంట పడ్డా౦. కాని అమ్మ
మటుకు అన్ని కథలు ఒక్క రోజేనా, రేపు ఇంకొక కథ చెప్తాను. ఇక పడుకోండి అని ఆజ్ఞ జారీ
చేయడంతో మేమందరం నిద్రలోకి జారిపోయాం.
Told by : My mother Late Smt.Nanduri Raja Rajeshwari devi