ఇది చాలా ఏళ్ళ క్రిందట కృష్ణా జిల్లాలో ఒక చిన్న గ్రామంలో నిజంగా జరిగిన సంఘటన. కథ కాదు. ఆ గ్రామంలో 300 కుటుంబాలు ఉన్నా అందరూ కలిసి మెలిసి ఒక కుటుంబంలాగా ఉంటుండేవారు.
లక్ష్మినారాయణ అనే సద్బ్రాహ్మణుడు జన్మతః బ్రాహ్మణుడైనా
20 ఎకరాల మంచి మాగాణి భూమి ఉండడంతో రైతు పని చేస్తుండేవారు.
ఆయనకి ఊళ్ళో మంచి పేరు ఉండేది.
అందరికీ తలలో నాలుకలాగా మెసలుతుండేవారు . ఆయనకి ఒక్కగానొక్క కొడుకు.ఎంతో స్ఫురద్రూపి మంచి అవయవ పుష్టి ఉన్నవాడు. అతనకి వివాహం చేసి బాధ్యత తీర్చుకున్నారు.
ఇలా సుఖంగా రోజులు గడుస్తుండగా ఆకస్మాత్తుగా వారి సంసారంలో ఘోరమైన విపత్తు వచ్చి పడింది. అదేమిటంటే ఒక్కగానొక్క కొడుకైన కృష్ణమూర్తికి ఏదో అంతు పట్టని వ్యాధి సోకింది. శ్రీమంతుడైన లక్ష్మి నారాయణ శాయశక్తులా డబ్బు ఖర్చు పెట్టి అన్ని రకాల వైద్యం చేయించినా ఏమాత్రం లాభం లేక పోయింది. జబ్బు మాత్రం ఒక్క పిసరైనా తగ్గలేదు. రోజు రోజుకి శుష్కించి పోతున్న కొడుకుని చూసి ఏం చేయాలో తెలియక ఆ తల్లిదండ్రులు మనో వ్యాధతో బాధ పడ సాగారు . ఇలా ఉండగా ఒకనాడు ఆయన పరిచయస్తుడు మన పొరుగూరిలో సకల వేద శాస్త్ర పారంగతుడు,అన్ని మంత్రాలు క్షుణ్ణంగా నేర్చుకుని ఉపాసన చేస్తున్నట్టి సద్బ్రాహ్మణుడైన విష్ణు శర్మ గారు ఉన్నారు.
ఈ విష్ణు శర్మ గారు అన్ని మంత్రాలతో బాటు గాయత్రి మంత్రం కూడా అనుష్టానం చేస్తారు. మొహంలో మంచి తేజస్సు, నుదుటి మీద విభూతి రేఖలు , మెడలో రుద్రాక్ష మాలలు ఎవరైనా ఆయనని చూసినా గౌరవంతో నమస్కరిస్తుంటారు మీరు ఆయనని మీ అబ్బాయి వ్యాధి గురించి సంప్రదిస్తే బాగుంటుంది అని సలహా ఇచ్చాడు.అందరి సలహాలు పాటిస్తున్న లక్ష్మి నారాయణ గారు సరే అని ఒప్పుకుని ఎడ్ల బండి కట్టించుకుని మరునాడు ఉదయాన్నే విష్ణు శర్మ గారి ఊరికి బయలు దేరి మధ్యాహ్నానికి చేరుకున్నారు.
విష్ణు శర్మ గారికి మంచి పేరు ప్రతిష్టలు, పలుకుబడి ఉండడంతో చాలా తేలికగా వారి ఇల్లు కనుక్కుని వారింటికి వెళ్ళారు. విష్ణు శర్మ గారు ఆయనని చూడగానే సాదరంగా ఆహ్వానించి, చాలా ఎండలో వచ్చారు ముందు చల్లటి మజ్జిగ త్రాగండి తర్వాత భోజనం చేసాక అన్ని విషయాలు మాట్లాడుకుందాము అని చెప్పి చల్లటి మజ్జిగ ఇచ్చి ప్రేమగా భోజనం పెట్టారు. కుశల ప్రశ్నలన్నీ అయ్యాక, మీ పేరు లక్ష్మి నారాయణ అంటున్నారు . చక్కగా ప్రశాంతంగా ఉండకుండా మీ మొహం ఎందుకంత కళా విహీనంగా ఉన్నదో చెప్పండి అని అన్నారు . అప్పుడు ఆయన తనకొడుకి అనారోగ్యం సంగతి అంతా చెప్పి మీరు తప్పకుండా మా ఇంటికి వచ్చి ఏదో ఒక తరుణోపాయం చూపవలసినదిగా ఎన్నో రకాల ప్రాధేయ పడ్డారు. విష్ణు శర్మ గారు సరే, తప్పకుండా మీ ఇంటికి వస్తాను అని మాట ఇచ్చి ఆయన్ని పంపేసారు.
ఒక వారం రోజుల తర్వాత అన్న మాట ప్రకారం విష్ణు శర్మ గారు ఉదయానే బయలు దేరి, లక్ష్మి నారాయణ గారి ఊరు చేరుకున్నారు దారి పొడుగునా ఆయన అన్ని మంత్రాలతో పాటు గాయత్రి మంత్రం కూడా చదువుతూ వచ్చారు. అంటే 24 గంటలు ఆయనకి గాయత్రి మంత్రం జపించడం అలవాటు . ఆ ఊరి పొలిమేర చేరగానే అక్కడ ఒక బావి దగ్గర ఒక అందమైన స్త్రీ నీళ్ళు తోడుతూ కనిపించింది. ఈయన్ని చూసి ఆ స్త్రీ తటాలున బిందె నీళ్ళతో గబా గబా నింపుకుని ఆయన బావిని సమీపించే లోపున వడి వడిగా తన ఇంటివైపు నడవసాగింది. విష్ణు శర్మ గారు ఆ బావి దగ్గరకి వచ్చి ఆ స్త్రీ గురించి అడగ్గా మిగిలిన స్త్రీలు ఆవిడ లక్ష్మి నారాయణ గారి ఒక్కగా నొక్క కోడలు, మేమందరమూ ఇక్కడకి నీళ్ళు తీసుకోడానికి వస్తాము అని చెప్పి వారి ఇంటి ఆనవాలు చెప్పగా లక్ష్మి నారాయణ గారింటికి వెళ్లి వారింటి అరుగుమీద కూర్చుని ఏదో మననం చేసుకోసాగారు. ఇంతలో లక్ష్మి నారాయణగారు ఆయన్ని చూసి కుశల ప్రశ్నలు అడిగారు. లొపలకి వచ్చి మీరు మా కుమారున్ని చూస్తారా? అని అడిగితే ముందు మీరు ఇది చెప్పండి. మీ అబ్బాయి వివాహం చేసినప్పుడు మీ కోడలి పుట్టు పూర్వోత్తరాలు అన్నీ కనుక్కుని చేసారా లేక అలాగే చేసారా? మీ కోడలి వివరాలు మీరు చెప్పగలరా? అని ప్రశ్నించగా ముందు లక్ష్మినారాయణ గారు ఆశ్చర్య పడినా అందులో ఏదో మర్మం ఉందని గ్రహించి, విష్ణు శర్మ గారూ ! మీ దగ్గర దాచవలసింది ఏముంది ? అని ఇలా చెప్ప సాగారు.
కొన్నాళ్ళ క్రితం ఒక నాడు నేను, నా భార్య ఎడ్లబండిలో ప్రయాణం చేస్తున్నాము. అప్పుడు ఈ ప్రాంతమంతా అడవిలాగా ఉండేది. అకస్మాత్తుగా ఒక చిన్న పిల్ల ఏడుపు వినిపించి అక్కడకి వెళ్లి చూస్తే ఒక అందమైన చిన్న బాలిక మాకు కనిపించింది.
ఏమయింది అని అడగ్గానేను మా అమ్మా , నాన్నతో కలిసి వచ్చాను కాని మార్గ మధ్యంలో నేను దారి తప్పి పోయాను. ఎంత వెతికినా నాకు మా అమ్మా, నాన్న కనిపించక , చేసేదేమీ లేక ఏడుస్తున్నాను అని చెప్పింది. మేమిద్దరమూ సంప్రదించుకుని ఆ పిల్లని అలా ఒంటరిగా అడవిలో వదలడం మంచిది కాదని మాతో పాటు మా ఇంటికి తెచ్చాము. ఆ పిల్ల తల్లి దండ్రుల కోసం చుట్టుప్రక్కలా అంతా గాలించాము. ఈ అమ్మాయి వివరాలు అన్ని చోట్లా ప్రచారం చేసాము . అయినా కూడా ఎవ్వరూ ముందుకు రాలేదు. సరే అని మా ఇంట్లోనే ఉంచుకున్నాము. ఆమె కూడా మాలో బాగా కలిసిపోయింది. చురుకైన పిల్ల చాలా తెలివిగలది. ఏ విషయమైనా చిటికలో గ్రహించేస్తుంది.
యుక్త వయస్సు రాగానే నా ఒక్కగానొక్క కుమారునితో వివాహం చేయించాను. ఇదీ జరిగిన సంగతి అని చెప్పారు.
నాయనా ! నీ కోడుకి ఆరోగ్యం కుదుట పడుతుందని నేను హామీ ఇస్తున్నాను.
నేను ఇక్కడే కూర్చుంటాను.నీవు నా గురించి ఏమీ చింత పడవద్దు కాసేపు నన్ను ఒంటరిగా వదిలివేయి అని చెప్పారు. సరే అని చెప్పి లక్ష్మి నారాయణగారు తప్పుకోగా విష్ణు శర్మ గారు ఎంతో తీవ్రంగా కొంచెం సేపు గాయత్రి జపం చేసారు. ఇల్లు చాలా పెద్దది, వెనకవైపు పెరడు కూడా చాలా పెద్దగా ఉంది. అక్కడ పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి ఇవన్నీ చూస్తూ, ఇంటి చుట్టూతా మూడు ప్రదక్షిణలు చేసి వచ్చి అరుగుమీద కూర్చున్నారు.
హఠాత్తుగా ఇంట్లోంచి అరుపులు, కేకలు వినపడ సాగాయి. ఆ కేకలు విని ఎక్కడో ఉన్న లక్ష్మి నారాయణ గారు పరుగెత్తుకుని వచ్చారు. నాయనా ! తలుపు తీయి. నేను కూడా లోపలకి ఏం జరుగుతున్నదో చూడడానికి వస్తానుఅని విష్ణు శర్మ గారు అనగానే లక్ష్మినారాయణ గారు తలుపు తెరిచి అక్కడ దృశ్యాన్ని చూసి హడలి పోయారు.
వారి కోడలు గట్టిగా అరుస్తూ,తిడుతూ "అతన్ని పంపించేయండి " అతను నా దగ్గరకి రావద్దు "అని అంటూ అటు-ఇటు గెంత సాగింది.విష్ణు శర్మ గారు ఇంకా తీవ్రంగా జపం చేయడం మొదలు పెట్టారు. ఆవిడని తీక్షణంగా చూసేససరికి తటాలున పైకెగిరి దూలం మీద కూర్చుండి పోయింది. ఇదంతా చూసేసరికి లక్ష్మి నారాయణ భార్యనిర్ఘాంత పోయింది నోట మాట రాలేదు.ఏదో తెలియని భయం వారికి వచ్చేసింది. ఆ అమ్మాయి మానవ కన్య కాదని వారికి అర్థమై పోయింది. అప్పుడు విష్ణు శర్మ గారు చెప్పారు. నాయనా ! మీకు అడవిలో దొరికిన అమ్మాయి మానవ రూపంలో ఉన్న పిశాచి కన్య. నేను రాగానే గుర్తు పట్టాను ఇలాంటిదేదో జరిగి ఉంటుందని.అందుకనే నన్ను చూడగాన్నే బావి దగ్గర్నుంచి గబ గబా మీ కోడలు ఇంటికి వచ్చేసింది. అయినా నీకేం భయం లేదు అని చెప్పి ఆ కోడలితో నేకేం భయం లేదమ్మా ! నీకు ముక్తిని ప్రసాదిస్తాను అనగా "వద్దు!" "వద్దు !" "నాకేమీ వద్దు ! "మీరు వెళ్ళిపొండి!"
"ఎందుకొచ్చారు? "నన్ను రెచ్చ కొట్టకండి. నా ఒళ్ళంతా కాలిపోతున్నది.నా దేహమంతా వేడెక్కిపోతుంది". "మీరు వెళ్ళండి !" " మీరు వెళ్ళండి !"అని భయంకరంగా అరుస్తూ ఉండి పోయింది. అప్పుడు ఈయన గాయత్రి మంత్రం చదువుతూ ఆ మంత్రపు నీళ్ళు ఆ అమ్మాయి మీద చల్లగా గట్టిగా కేక పెట్టి అరుస్తూ అక్కణ్ణుంచి మాయమై పోయింది.అదే క్షణంలో పెరట్లోంచి చెట్టు విరిగిన శబ్దం విని అందరూ పరిగెత్తుకెళ్ళి చూస్తే, అక్కడ చెట్టుది పెద్ద కొమ్మ విరిగి పడి కనిపించింది. విష్ణు శర్మ గారు శల్యావస్థలొ ఉన్న కొడుక్కి గాయత్రి మంత్రం చేసిన జలాన్ని భోక్షిస్తూ నీళ్ళు త్రాగించారు.
లక్ష్మి నారాయణతో నాయనా ! నీవింక ఏమీ భయపడక్ఖర్లేదు. తొందరగా నీ కొడుకు కోలుకుంటాడు. కాని గాయత్రి మంత్రం పది మాలలు మాత్రం ఒక మండలం పాటు జపం చేయమనండి . స్వస్థత చేకూరుతుంది.
మీకు ఆ పిశాచి బాధ ఉండదు. ఈ గాయత్రి మంత్ర మహిమ వల్ల ఆ పిశాచి పిల్లకి ముక్తి కలిగింది. దానికి మోక్షం కలిగి వెళ్లి పోయింది. వాటికి కూడా మోక్షం కలిగినప్పుడు , ఈ జన్మ అంతమైనప్పుడు విపరీతమైన బాధ ఉంటుంది . అందుకనే నేను లోపలకి రాగానే, మంత్రం శక్తి ప్రయోగించగానే దానికి చాలా బాధ కలిగింది. ఈ రకంగా ఆ అమ్మాయికి మోక్ష ప్రాప్తం జరిగింది. ఇక మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్పేసి విష్ణు శర్మగారు తన ఊరికి తిరిగి వెళ్లి పోయారు.
ఈ మాటలన్నీ వింటున్నటువంటి లక్ష్మినారాయణ కొడుకు విష్ణు శర్మ గారు చెప్పినట్టుగానే ఎంతో శ్రద్ధగా ఒక మండలం పాటు గాయత్రి మంత్రం జపించగా మెల్ల మెల్లగా స్వస్తత చేకూరి సంపూర్ణ ఆరోగ్యవంతుడు అయినాడు. ఈ గాయత్రి మంత్రం జపించడం మటుకు అతను మానలేదు. ఇదీ గాయత్రి మంత్ర మహిమ.