దేవదత్తుని వృత్తాంతం – 7వ భాగం
దత్తాత్రేయులు వారు అభయమిచ్చాక పింగళ నాగుడు వారిని ఈవిధంగా ప్రశ్నించాడు. “స్వామీ ! మన సంఘంలో చాలా కట్టుబాట్లు ఉన్నాయి. వర్ణాశ్రమ ధర్మ పద్ధతులు ఉన్నాయి. వివిధ రకాల వర్ణాల వారికి వివిధ రకాలైన సాంఘికపరంగా ధర్మాలు ఉన్నాయి. ఈ నాలుగు వర్ణాశ్రమ ధర్మాలు మనందరమూ పాటించాల్సి వస్తుంది కదా ! మరి ఈ మహాయజ్ఞం లో సాక్షాత్తు మీరు ఈ సాంఘిక మర్యాదలను పాటించకుండా ఎన్నో చేస్తున్నారు. అక్కడికి వచ్చిన కుక్కల్ని తాకుతున్నారు. మధ్యమధ్య లో మీరు కుండలతో కల్లు త్రాగుతున్నారు. అంతే కాకుండా ఒక అందమైన యువతి కూడా మీ దగ్గరలోనే ఉన్నది. ఇదంతా చూస్తున్న నాకు మీ తత్వమేమిటో అర్థం కావడం లేదు. సాక్షాత్తు దేవతలు, గంధర్వులు, యక్షులు మీ చుట్టూతా మూగుతున్నారు. మీ ముగ్ధమోహన స్వరూపం చూస్తుంటే మా అందరికి తనివి తీరడం లేదు. మీలో ఎంతో కొంత గొప్పతనం ఉంటే తప్ప సాక్షాత్తు సిద్ధులు, గంధర్వులు, సాధువులు, సత్పురుషులు, దేవతలు మీ దగ్గరకి రారు కదా ! మరి ఇదేమిటీ స్వామీ నాకేమీ అర్థం కావడం లేదు. ఇందులో ఏదో విశేషమర్మం ఉంది. దయ చేసి దాని ఈరు నాకు చెప్పండి అని ప్రశ్నించాడు.
దానికి సమాధానంగా దత్తాత్రేయుల వారు చిరునవ్వు నవ్వుతూ “ పింగళ నాగా! నీవు సత్పురుషుడివి. ఎంతో శ్రద్ధా భక్తులతో ఆచారాలని, సాంఘిక నియమాలన్నీ నీవు పాటిస్తున్నావు. ఈ వర్ణాశ్రమ ధర్మాలు, పెద్దలు నియమించిన సాంఘిక కట్టుబాట్లన్నీ మీరందరూ యథాతథంగా పాటించ వలసిందే ల్సిందే. అవి మీరు దాటకూడదు. నాకు ఈ వర్ణాశ్రమ ధర్మాలు వర్తించవు. నేను వీటికి అతీతంగానే ఉంటాను. నాకు ఒక పని చేసినందు వల్ల పుణ్యం కానీ ఇంకొక పని చేసినందువల్ల పాపం కానీ ఈ రెండూ నాకు అంటవు. నేను ఒక చేత్తో సూర్యుణ్ణి తాకుతాను అని చెప్పగా పింగళ నాగునికి అద్భుతంగా ఆయన హస్తం అక్కడ సూర్యమండలాన్ని తాకడం గమనించాడు. నాయనా పింగళ నాగా ! నేను ఇంకొక చేత్తో అశుద్ధాన్ని కూడా ముట్టుకుంటాను అని చెప్పగానే రెండో చేయి ఆశుద్ధాన్ని ముట్టుకున్నట్టుగా కనిపించింది. నాకు ఈ రెండింటికీ ఏమీ భేదం లేదు. నాలాగా ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళనే అవధూతలుగా చెప్పుకోవాల్సి వస్తుంది. నాకు సాటి అయినవాడు నిజానికి ఈలోకంలో ఎవరూ లేడు. బాహ్యం గా నేను చేస్తున్నపనులు వాళ్ళు గమనించి నన్ను అనుకరించాలని ప్రయత్నం చేస్తే వాళ్లకి పతనం తప్పదు. వాళ్ళతో పాటు వాళ్ళ శిష్యులందరికీ కూడా పతనావస్థ తప్పదు. నాకు కుక్కలకి, కల్లుకి , యువతులకి ఎటువంటి భేదం లేదు అని చెప్పి పింగళ నాగుని భ్రుకుటిని తాకగానే ఆయనకి స్వామి వారి దగ్గరున్న ఆ నాలుగు కుక్కలు కూడా చాలా అద్భుతమైన సిద్దులుగా కనిపించారు. అలాగే అక్కడ ప్రక్కనే ఉన్న యువతి సాక్షాత్తు అనఘామాతగా దర్శనమిచ్చారు. అలాగే ఆయన త్రాగుతున్న కల్లు అమృతప్రాయంగా కనిపించింది. వెంటనే పింగళ నాగుడు వారందరికీ ఎంతో భక్తి శ్రద్ధలతో సాష్టాంగ దండ ప్రణామం చేశాడు.
తర్వాత వల్లభ దాసు “నాయనలారా ! విన్నారు కదా అవధూత తత్వం! స్వామి వారి తత్వం అర్థం చేసుకోవడం చాలా కష్టం. మీకు నేను కొంచెం మాత్రమే చెప్పగలిగాను. ఈ మాత్రమైనా మీరు అర్థం చేసుకున్నారంటే అవధూతలుగా చెప్పబడుతున్న ఎటువంటి వారి దగ్గరకైనా వెళ్లవలసిన అవసరం లేదు. అటువంటి అవధూతలు ప్రస్తుతం ఎక్కడా లేరు. ఆయన సాక్షాత్తు వేదాల్లో, ఉపనిషత్తుల్లో చెప్పబడుతున్నటువంటి పరబ్రహ్మ స్వరూపం , అద్వితీయుడు, షడ్భావవికారాలు లేనివాడు, పుట్టుట- పెరుగుట- మరణించుట ఇటువంటివి ఏవీ ఆయనకి లేవు. కాబట్టి నాయనలారా, నేను మొదట్నుంచి కూడా శ్రీపాద శ్రీ వల్లభ స్వామిని, ఆ దత్తప్రభువుని మాత్రమే పట్టుకుని ఉంటాను. మనమందరం కూడా మూలాన్నే పట్టుకోవాలి. ఆ మూలం నుంచి వచ్చిన కొమ్మల్ని, ఆకుల్ని పట్టుకుని లాభం లేదు. ధృఢమైన ఆ మూలాధారం నుంచి ఊర్ధ్వముఖంగా వెళ్ళు తున్నటువంటి ఆ చైతన్యాన్ని మాత్రమే పట్టుకోవాలి” అని చెప్పగా అక్కడున్న భక్తులందరూ కూడా చాలా సంతోషించారు. ఈవిధంగా వల్లభ దాసు ఏమాత్రం శాస్త్రపరిజ్ఞానం లేకపోయినా ఎంతో చక్కగా దత్తాత్రేయుని యొక్క అవధూత తత్వాన్ని చెప్పడం నాగానాథునికి చాలా ఆనందం కలిగింది. అందుకే ఈ వల్లభ దాసు, ఆయన శిష్యులందరూ కేవలం ఆ దత్తాత్రేయ ప్రభువుని మాత్రమే తమ గురువుగా చేసుకుని మరి అటు ఇటు ఎక్కడకి వెళ్ళకుండా నిరంతరం ఆయన నామస్మరణం చేసుకుంటూ ఉండడం నాగనాథునికి సంతోషంగా అనిపించింది. ఎంతో విజ్ఞానం కలిగి, శాస్త్రాలు చదివిన వేదపండితులు, విద్యావంతులు వీరందరూ మూలాన్ని పట్టుకోకుండా కొమ్మలు పట్టుకుని వేలాడుతున్నారేమిటీ అని కూడా అనిపించింది. కేవలం శాస్త్రాలు, దత్తపురాణాలు లేక దత్తుని అవతారాల చరిత్రలు చదివినంత మాత్రాన వాళ్ళలో మార్పు కలగడం లేదని నాగ నాథుడు బాధ పడ్డాడు. ఆశ్రమం చుట్టూ కూడా వలయాకారంగా ఎంతో అద్భుతమైన కాంతి పరివేష్టితాన్ని ఆయన చూసి చాలా సంతోష పడ్డాడు.