ఆధ్యాత్మిక విశేషాలు
పూర్వం వంగ దేశం అంటే పశ్చిమ బెంగాల్ లో ఒక సిద్ధ పురుషుడు మహాత్ముడు ఉండేవాడు. ఆయన ఎంతో నిరాడంబరంగా ఉంటూ తనకు తోచిన పద్ధతుల్లో ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ ఉండేవాడు. ఆ చుట్టూ ప్రక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలంతా ఆయన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో సేవిస్తూ ఉండేవాళ్ళు. ఆయన ఏ ఊరికి వెళ్లినా సరేఅక్కడి జనమంతా ఆయన్ని సత్కరించి , కూర్చోబెట్టి , వాళ్ల ఇంట్లో వండిన మిఠాయిలు, మంచి రుచికరమైన పదార్థాలు అన్నీ ఆయనకి అర్పిస్తూ ఉండేవాళ్ళు. ఇలాగేఆయన ఒకసారి పర్యటిస్తూ ఒక గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఉన్నారు. వేలాదిమంది భక్తులు వచ్చి, వారు తీసుకువచ్చిన మధుర పదార్థాలన్నీ కూడా ఆయనముందు పెట్టారు.
ఆ సిద్ధ పురుషుడు ఆ మధుర పదార్థాలన్నీ స్వయంగా అక్కడకి వచ్చిన రెండు కుక్కలకి తన చేత్తో తినిపించ సాగాడు.ఆ రెండు కుక్కలు కూడా ఎంతోప్రేమతో ఆ భక్తులు సమర్పించినట్టి ఆ మధురమైన పదార్థాలన్నీ సిద్ధపురుషుని చేత్తో స్వీకరిస్తూ పళ్ళాలలో అవి నోరు పెట్టి ఆరగిస్తూ ఉన్నాయి. అయితే అక్కడకి వచ్చినవేలాది మంది భక్తుల్లో ఒక ధైర్య స్థుడికి ఈ సిద్ధ పురుషుడు చేసిన పని ఏమీ అర్థం కాలేదు. ఎంతో ప్రేమగా ఈ మధురమైన పదార్థాలు భక్తులు ఆయనకి సమర్పిస్తే ఇదేమిటీఆయన వాటిని తానూ తినకుండా కుక్కలకి తినిపిస్తున్నాడు. ఆ కుక్కలు కూడా చక్కగా పళ్ళాల నుంచి తింటున్నాయి.ఆ సిద్ధ పురుషుని వింత ప్రవర్తన అంతా తికమకగా గందరగోళంగా ఉండాలి. అతడు సభలో లేచి ఆ మహాత్మునికి నమస్కరించి, "అయ్యా ! మీరేమిటీ ఇలా వింతగా ప్రవర్తిస్తున్నారు ? భక్తులంతా ఎంతో ప్రేమతో మీకుసమర్పించినట్టి మధురమైన ఈ భక్ష్యాలన్నింటినీ మీరు స్వీకరించకుండా ఈ కుక్కలకి తినిపిస్తున్నారు.మీ ప్రవర్తన ఏమిటో మాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు. అంతాతికమకగా ఉంది అని ప్రశ్నించాడు. తోటి భక్తులందరూ కూడా ఆ మహాత్ముడు ఏం సమాధానం చెప్తాడా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఆ మహాత్ముడు చిరునవ్వునవ్వుతూ అతన్ని తన దగ్గరకు పిలిపించుకున్నాడు. ఆ వ్యక్తి ఆ మహాత్ముడి దగ్గరకి వెళ్లి నిలబడగా ఇక్కడ నీకేం దృశ్యం కనిపిస్తున్నదీ అని అడిగాడు. ఇక్కడ ఏం దృశ్యంకనిపిస్తుంది స్వామీ ఇక్కడ రెండు కుక్కలు ఉన్నాయి. అవి భక్ష్య పదార్థాలన్నీ తింటున్నాయి అని బదులిచ్చాడు. అప్పుడు ఆ మహాత్ముడు అతని భ్రుకుటి మద్యని తనబొటన వేలుతో తాకాడు .వెంటనే ఆ వ్యక్తి గడ గడా వణికి పో సాగాడు.చాలా గాభరాగా అయి పోయాడు.ఒళ్ళంతా చెమటతో నిండి పోయింది. అప్పుడు ఆ మహాత్ముడు,"ఎందుకలా వణికి పోతున్నావు ? వేలాదిమంది భక్తులు ఇక్కడ ఉండగా మరి ఎందుకంత గాభరా పడుతున్నావు ? ఏం కన్పిస్తుందని అంత భయ పడుతున్నావు అనిఎంతో ప్రేమగా ప్రశ్నించాడు ."
మహాత్మా ! ఇక్కడ మనుష్యులు కూర్చున్నారు అని మీరంటున్నారు కాని నాకు మాత్రం వాళ్ళు మనుష్యులలాగా కనిపించడం లేదు. కొంత మంది తోడేళ్ళ లాగా,కొంతమంది నక్కల్లాగా,కొంతమంది పిల్లుల్లాగా ఇలా అనేక రక రకాల జంతువుల్లాగా కన్పిస్తున్నారు. ఇక్కడ వాళ్ళంతా మనుషుల్లాగా కనిపించడం లేదు అని చెప్పాడు.
మరి నీకు నీవు చూసుకున్నావా ? అని ప్రశ్నించగా చూసుకున్నాను మహాత్మా ! “ అందుకనే నేను భయ పడు తున్నాను. నా శరీరమంతా ఎలుగుబంటి మాదిరిగాఅయిపొయింది. ఒంటిమీద దట్టమైన వెంట్రుకలు వచ్చేశాయి.
ఇదేమిటీ ? ఏం జరిగిందో నాకేమీ అర్థం కావడం లేదు అందుకనే నేను చాలా భయపడు తున్నాను” అని బదులిచ్చాడు.
“ఓహో ! “ “ఆలాగా !” ఇక్కడ భక్ష్య పదార్థాలు తింటున్న ఈ రెండు కుక్కలు నీకు కనిపిస్తున్నాయా “ ? అని ఆ సిద్ధ పురుషుడు అడిగాడు .
“అవి కుక్కలు కావు. సాక్షాత్తు దేవతల్లాగా , దివ్య పురుషుల్లాగా కనిపిస్తున్నారు . ఇక్కడ మనుషులందరూ , జంతువుల్లాగా , జంతువులైన ఈ రెండు కుక్కలూ దేవతల్లాగాకన్పిస్తున్నారు.” అని సమాధానం
చెప్పాడు.
సరే అని చెప్పి మళ్ళీ ఆ మహాత్ముడు తన బొటన వేలుతో అతని భ్రుకుటి మద్యని తాక గానే అతను మామూలు బాహ్య స్థితికి వచ్చాడు. అక్కడ కూర్చున్న వాళ్ళందరూమనుషుల్లాగా , ఆ భక్ష్య పదార్థాలు తింటున్న కుక్కలు కుక్కల్లాగా కనిపించారు. మహాత్మా ! ఏమిటీ ఈ వింత ? నాకేమీ అర్థం కావడం లేదు అని అన్నాడు.
నీ కళ్ళతోటే నీవు చూశావు కదా !ఇంకా ఇందులో అర్థం కానిదేముంది ? మనుషులన్న వాళ్ళలో మానవత్వం ఉండాలి కదా !
మానవత్వం లేనప్పుడు వాళ్ళందరిలో పశుత్వమే కన్పిస్తుంది. వాళ్ళ పూర్వ జన్మ వాసనలు బట్టి వాళ్లు ఆ విధంగా వివిధమైన జంతు రూపాల్లో నీకు కన్పించారు. కొంతమంది తోడేళ్ళలాగా, కొంతమంది నక్కల్లాగా, కొంతమంది పిల్లుల్లాగా వారి వారి స్వభావాన్ని బట్టి వారు నీకు కనిపిస్తున్నారు.దీని అర్థమేమిటంటే ఈ జీవిత పరిమాణక్రమంలో వారు ఎంతో కొంత పుణ్యం చేసుకున్నారు కాబట్టి కొన్ని కోటి జన్మల తర్వాత అద్భుతమైన ఈ మానవ జన్మ వచ్చింది. మానవ జన్మ ఎత్తినా , మనుషుల్లాగాకనిపించినా వారిలో మానవత్వం లోపించినప్పుడు వారిలో ఈ స్థాయే కనిపిస్తుంది.వాళ్ళలో ఉంటుంది. మానవజన్మ ఎత్తినందుకు సార్థకం చేసుకోవాలి. మంచి పనులుచేయాలి. అరిష డ్వర్గాలని అణచుకోవాలి. స్వార్థం లేకుండా సమాజ సేవ చేయాలి. తోటి మానవులు దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పుడు , దరిద్ర నారాయణుడిలాగాఉన్నప్పుడు వారికి సహాయం చేయాలి.అలా కాకుండా వాళ్ళు జంతువుల్లాగా ప్రవర్తిస్తున్నప్పుడు వాళ్ళలోని ఆ తత్త్వం బహిర్గతంగా కనిపిస్తూ, వాళ్లు మనుషుల్లాగాకనిపించరు. అందుకనే నేను నీకు అంతర్నేత్రాన్ని ప్రసాదించాను. మరి నీ సంగతి కూడా నీకు తెలిసిపోయింది కదా ! మరి నీ తత్వాన్ని నీవు వదిలేసుకోవాలి.ఎలుగుబంటిఅంటే అది చాలా పిసినారి గా ఉంటుంది. వడ్డీ వ్యాపారాలు చేసి ప్రజలని హింసించే వాళ్లు , వాళ్ల శ్రమని దోచుకునే వాళ్ళందరూ కూడా ఎలుగుబంటి లాగానే ఉంటారు.చూడు, ఈ కుక్కలని చూడు! వాటిలో మానవత్వం ఉంది . దైవత్వం ఉంది ఎంతో విశ్వాసం ఉంది . అందుకనే నీవు వాటిలో దైవత్వాన్ని చూశావు. ఇకనుంచైనా మీరందరూమానవ జన్మ ఎత్తారు కాబట్టి మీలోని పూర్వ జన్మ వాసనలని పోగొట్టుకుని చక్కటి మానవుల్లాగా జీవించండి. అప్పుడు మీరందరూ దేవ మానవుల్లాగా ఉంటారు.అని చెప్పిఆయన అక్కడకి వచ్చిన భక్తుల సముదాయాన్ని చూసి సెలవిచ్చారు. అప్పుడు అక్కడ చేరిన ప్రజలందరూ కూడా ఆశ్చర్య పోయారు. వాళ్ళలో వాళ్ళు వారు చేస్తున్నపనులని విమర్శించుకో సాగారు. అందరూ ఆ మహాత్మునికి నమస్కరించి తాము చేస్తున్న తప్పిదాన్ని తెలుసుకోగలిగారు.
ఈ కథ కూడా గాయత్రి పరివార్ వారి 'యోగ శక్తి' అనే మాస పత్రికలో (monthly )వచ్చింది. అందులో ఆ సిద్ధ పురుషుని పేరు కూడా ఉండాలి. అది నాకు గుర్తు లేక ఆపేరు చెప్ప లేదు. ఇకనైనా మనమందరమూ కూడా మానవ జన్మ ఎత్తినందుకు మన జన్మని మనం సార్థకం చేసుకుందాము .