దేవదత్తుని వృత్తాంతం 6వ అధ్యాయం
నాగనాథుని ఆవేదన
ఈ విధంగా అందరిని గమనిస్తున్న నాగనాథునికి అయ్యో ! శ్రీపాదశ్రీవల్లభ స్వామి వారు జన్మించిన ఈ పిఠాపురంలో నిజమైన భక్తులున్నారా? అని ఆవేదన చెందుతున్నప్పుడు ఆయన మనోనేత్రానికి పిఠాపురం చివరగా ఉన్న ఒక వ్యక్తి వైపు ఆయన దృష్టి వెళ్ళింది. ఊరికి దూరంగా ఉన్నఒక మాలపల్లిని ఆయన గమనించాడు. అక్కడ ఎంతో అందమైన కుటీరం లాగా ఒక ఇల్లు కనిపించింది. అది మునివాటిక లాగా ఉన్నది. ఆ వీధి అంతా ఎంతో పరిశుభ్రంగా ఉంది. ఆ వ్యక్తి యొక్క శరీరమంతాకూడా విద్యుల్లతలు కనిపించాయి. అతని శిరస్సు చుట్టూ ఒక దివ్య తేజస్సుకనిపించింది. ఆయన పేరు వల్లభ దాసు అని తెలుసుకున్నారు. అక్కడికి వెళ్ళగా ఎంతో పరిశుభ్రమైనటువంటి దుస్తులు ధరించి ఆ వల్లభ దాసు ఎదురుగుండా చాలామంది కూర్చుని చక్కగా భజన చేస్తున్నారు. అక్కడ నాలుగు కుక్కలు నిశ్శబ్దంగా, ఎంతో శ్రద్ధగా వారు చేస్తున్నటువంటి భజనల్ని, కీర్తనలని వింటున్నాయి. వల్లభదాసు ఎంతో శ్రావ్యంగా తంబూరా మీటుతూ దత్తాత్రేయుని మీద, శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి మీద తనకు తోచిన కీర్తనలు తమకు తోచిన శైలిలో పాడుతూ ఉన్నారు. ఆయన వాక్కులు బయటకి వస్తున్నప్పుడు వాటిలో ఎంతో శక్తివంతమైన విద్యుత్పుంజాలు కనిపించాయి. అవి అక్కడ కూర్చున్న మనుష్యులను తాకుతున్నాయి. వారిలో మానసికంగా , శారీరకంగా చాలా మంచి మార్పులు కనిపిస్తున్నాయి. నాగనాథునికి చాలా ఆశ్చర్యం వేసింది. ఈ వల్లభ దాసు ఎటువంటి శాస్త్రాలు చదవలేదు. తాను నమ్ముకున్న శ్రీపాద శ్రీవల్లభుని మీద, దత్తాత్రేయుని మీద కీర్తనలు ఎంతో తన్మయత్వంతో చేస్తున్నాడు. నాగనాథుడు కూడా ఎంతో తన్మయత్వంతో ఆనందంగా ఆ కీర్తనలని వింటున్నాడు.
కీర్తనలు, భజనలు అయిపోయినాక అక్కడ చేరిన భక్తులు “మహాత్మా ! మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. వాటికి సమాధానాలు మీరే చెప్పాలి” అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా ఎంతో ప్రశాంతంగా “నాయనలారా ! తప్పకుండా అడగండి. నేను సమాధానాలు చెప్పి మీ సందేహాలని తీరుస్తాను” అని చెప్పాడు. వెంటనే వారిలో ఒకడు స్వామీ ! ఈ పిఠాపురంలో ఒక అవధూత ఉన్నారని అందరూ చెప్పు కుంటున్నారు. అక్కడ కూడా జనం చాలా విపరీతంగా వెళ్ళుతున్నారు. ఒక సారి నేను కూడా అక్కడకి వెళ్ళడం జరిగింది. ఆయన ఒక మంచం మీద ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఆ తర్వాత అక్కడనుంచి నేను వచ్చేశాను. అసలు అవధూత అంటే ఏమిటి స్వామి? ఆ తత్వం ఏమిటో మీరు మాకు చెప్పగలరా ? అని ఎంతో వినయంగా అడిగాడు. దానికి సమాధానంగా “నీవు చూసిన వ్యక్తి మంచి సాధువు. అతను ఎప్పుడూ తాను అవధూత అని చెప్పుకోలేదు. అక్కడ చేరిన ప్రజలు ఆతని గురించి అలా ప్రచారం చేస్తున్నారు. ఆతను సహృదయుడు, ఎంతో నెమ్మదస్తుడు, వృద్ధుడు. నాయనా! ఈ పీఠికాపురం లో సుమతీ మహారాణి గారి దగ్గరకి ఒక సాధువు యాచించడానికి వచ్చాడు. అప్పుడు సుమతీ మహారాణి గారు అతనికి భిక్ష ఇచ్చినప్పుడు ఆ వచ్చిన సాధువు “అమ్మా ! నీకేం వరం వరం కావాలో కోరుకో ! అని అన్నాడు. సుమతీ మహారాణి గారు ఎంతో వినయంగా “నాయనా ! నన్ను ‘అమ్మా’ అని పిలిచావు. అది సార్థకం చేయి’, అని సుమతీ మహారాణి గారు అన్నారు. అంటే తనకి పుత్రుడుగా జన్మించమని అన్నారు. అప్పుడు ఆ సాధువు తన నిజ రూపాన్ని చూపించాడు. ఆయన మరెవరో కాదు సాక్షాత్తు దత్తాత్రేయుడు. అవధూత రూపంలో వచ్చాడు. తల్లీ ! నీకు నావంటి పుత్రుడే జన్మిస్తాడు అని చెప్పాడు. కాని దత్తాత్రేయుడి లాంటి వ్యక్తి , అవధూత ఇంకొకడు లేదు కాబట్టి ఆయనే స్వయంగా శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారిలా ఆమె గర్భం నుంచి జన్మించారు. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? సాక్షాత్తు దత్తాత్రేయుల వారి రూపమే సంపూర్ణమైనటువంటి అవధూత. ఇంకా ఈ ప్రపంచంలో తనలాంటి అవధూత ఇంకొకడు లేదు కాబట్టి ఆయనే స్వయంగా జన్మించవలసి వచ్చింది. అయితే తనని ఎవరైతే చాలా భక్తిగా, శ్రద్ధతో సేవించారో శ్రీపాద శ్రీవల్లభుల స్వామి వారు వారిని ఆశీర్వదించి వారికి కొన్నిమహిమలు, మంచి శక్తులూ, సిద్ధులూ వచ్చే జన్మలో కలుగుతాయని ఆశీర్వదించారు కాబట్టి అందులో ఒకతను శ్రీ వెంకయ్య గారనే ఆతను అవధూతగా జన్మించడం అనేది కేవలం శ్రీపాద శ్రీవల్లభుల వారి వాక్కు వల్లనే సుమా ! అని చెప్పాడు.
దానికి ఒక వ్యక్తి “స్వామీ ! అసలు అవధూత తత్వం ఏమిటీ?” అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా వల్లభ దాసు “నాయనా ! దానికి సమాధానం చెప్తాను శ్రద్ధగా విను. అవధూత తత్వం గురించి చెప్పడం అనేది చాలా కష్టపరమైన విషయం. నాకున్న బుద్ధీ, పరిజ్ఞానంతో శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారిఆశీర్వాదం, అనుగ్రహంతో ఆయన నానోట పలికించ బోయే వాక్కు మాత్రమే నేను మీకు చెప్పగలను అని చెప్పి, కొచెం సేపు కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుని అప్పుడు ఇలా చెప్ప సాగారు. పూర్వం పరశురాముడు శ్రీ దత్తస్వామిని ప్రధానంగా పెట్టుకుని ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టాడు. సాక్షాత్తు శ్రీ దత్తాత్రేయుల వారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైనటువంటి యజ్ఞాన్ని చేశారు. సమస్త దేవతలు, మహర్షులు, సిద్ధులు, సాధువులు, మనుష్యులు అందరూ కూడా ఆ యజ్ఞానికి విచ్చేశారు. ఆ యజ్ఞంలో పింగళనాగుడు అనే ఒక బ్రాహ్మణుడికి కూడా కొంత అర్చకత్వం లభించింది. ఈ పింగళనాగుడు ఒక మహానుభావుడు. ఎన్నో శాస్త్రాలు చదివిన వాడు. అయితే అయన గమనిస్తున్న కొన్ని విషయాలను చూసి చాల ఆశ్చర్య పడి పోయాడు. ఒక రోజు దత్తాత్రేయ ప్రభువు అమలక వృక్షం క్రింద విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో పింగళ నాగుడు వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో చేతులు కట్టుకుని “మహాత్మా ! మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని వచ్చాను. మీరు కోపగించకుండా ఉంటే అడుగుతాను” అని చెప్పగా శ్రీ దత్తాత్రేయుల వారు చిరునవ్వు నవ్వుతూ “పింగళ నాగా! ఎటువంటి సందేహాలు పెట్టుకోవద్దు. తప్పకుండా నీవు అడుగు. నేను జవాబు చెప్తాను” అని చెప్పారు.