శ్రీ రాంలాల్
ప్రభుజి లీల - మోహిని కథ
రవికాంత్ మెల్లగా
హైదర్బస్తి నుంచి బయలుదేరి దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీసుకి చేరాడు, అతను నిరుద్యోగిగా ఉన్నాడు మొన్ననే బీ.ఏ పాస్ అయ్యాడు, అతని దినచర్య ఏమిటి అంటే వివిధ కంపెనీలకి దరఖాస్తులు పంపుతూ ఉండడం. అలాగే ఆ
రోజు పోస్ట్ ఆఫీస్ కి చేరి తను వ్రాసిన దరఖాస్తును పోస్ట్ చేసి ఇంక ఇంటికి
బయలుదేరుదాము అని అనుకుంటుండగా ఒక మృదు మధురమైన స్త్రీ గొంతు, “ఏమండీ, ఒకసారి మీ పెన్ను ఇస్తారా?” అని వినిపించింది. అతడు వెను వెOటనే చూడగానే ఒక విధమైన దిగ్భ్రాంతికి లోనయ్యాడు ఎదురుగుండా అద్భుతమైన
సౌందర్యరాశి నవ్వుతూ కనిపించింది.
అతడు తనని తాను
మైమరచిపోయాడు, అంతటి అధ్బుతమైనటువంటి సౌందర్యరాశిని, అంత మధురమైనటువంటి గొంతుని తాను ఎప్పుడు వినలేదు. స్వతహాగా అతను
సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు ఆడవాళ్ళ నుంచి కొంచెం దూరంగానే బెరుగ్గానే
వుంటూ వుంటాడు. ఆ రోజు అతనికి ఏమైందో తెలియదు కాని తన చూపులని మరల్చుకోలేక పోయాడు.
ఆ అమ్మాయి మృదు మధురంగా నవ్వి, “ఏమండి !
మిమ్మల్నే!” “ఒక్కసారి మీ పెన్నుఇస్తారా?” అని అడగ్గా ఉలిక్కి పడి వెంటనే తన చేతిలో ఉన్న పెన్నుని ఆవిడకి ఇచ్చాడు ఆ
పెన్నుతో ఆవిడ ఏదో ఉత్తరం వ్రాసినట్టుగా చేసి ఆ ఉత్తరం వ్రాయగానే మరు మాట్లాడకుండా
పెన్ను చేత్తో పట్టుకుని వెళ్ళిపోసాగింది.
ఇదంతా చూస్తున్న
రవికాంత్ కి ఏమి అర్ధం కాలేదు. అదేంటి? ఆవిడ పెన్ను మరి నాకు వాపసు ఇవ్వాలి కదా! మరి ఇవ్వకుండా అలా వెళ్ళిపోతోంది
ఏమిటి? అంత తొందరగా మరిచిపోయే అవకాశం
లేదు కదా! ఆ పెన్నుతన దగ్గరనుంచి తీసుకున్న విషయం! ఇలా ఆలోచిస్తూనే యాంత్రికంగా
తను ఆ అమ్మాయి వెనక నడవసాగాడు చూపరులందరికి కూడా ఈ దృశ్యం చాలా వింతగా
అనిపించింది ముందు ఒక అథ్బుతమైన సౌందర్యరాశి చాలా అలవోకగా ఒంపుసొంపులతో వయ్యారంగా
నడుస్తూ వెళ్ళటం,వెనకనే ఒక అందమైన స్పురద్రూపి అయిన ఒక యువకుడు ఆవిడ
వెంట పడి వెళ్ళూతున్నట్టుగా వారందరికి అనిపించి అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు.
ఇక్కడ రవికాంత్
కి కాళ్ళు మాత్రం ఆగటం లేదు తాను ఎందుకు అంత ఆ అమ్మయి వెనక పరిగెత్తుతున్నాడు? తను మెల్లగానే నడవాలనుకుంటున్నాడు కానీ తాను పరిగెత్తుతున్నట్టుగా
తెలుస్తుంది. గట్టిగా ఆ అమ్మాయిని పిలిచి నా పెన్ను నాకు ఇస్తారా? అని యెన్నో సార్లు అడగాలనుకున్నాడు కానీ ఏదో తెలియని శక్తి అతని గొంతు
నొక్కేసినట్టుగా ఆ మాట పైకి మత్రం రావటంలేదు. అతడు తనని యాంత్రికంగా ఎవరో
తనను లాక్కెళ్తున్నట్టుగా అనిపించి ఆ అమ్మాయి వెంటనే వెళ్ళ సాగాడు. అలా మరి ఎంత
దూరం వెళ్ళాడో ఏమిటో మరి తనకి తెలియదు కానీ అనిపించినట్టు స్పృహలోకి వచ్చే
సరికి అతడు ఒక అధ్బుతమైనటువంటి రాజమహలు దగ్గర నిల్చి ఉండటం గమనించాడు
అది అంతా పాలరాతి కట్టడంతో ఉన్నట్టూగా ఉండి ధగధగా మెరిసిపోతుంది.
స్తంభాలన్నీ కూడా చాలా ధృడంగా, బలంగా చాలా
ఎత్తుగా యే గ్రీకు పట్టణంలో కట్టినటువంటి పాతకాలపు పెద్ద కట్టడంలాగా గోచరించింది.
అద్భుతమైన శిల్ప సంపద కూడా ఆ భవనం మీద అతనికి కనిపించింది. రకరకాలైనటువంటి
అద్భుతమైనటువంటి సౌందర్యరాశుల విగ్రహాలు కనిపించాయి పెద్ద పెద్ద మెట్ల తోటి, శుభ్రమైన ఎర్ర రంగు తివాచి పరచినట్టుగా ఉంది. ఆ భవనం చుట్టూ చక్కటి పూల వనం,ఉద్యాన వనం ఉన్నాయి. దాంట్లో ఉయ్యాలలు కూడా ఏర్పాటు చెయ్యబడ్డాయి.
మధ్యలో ఫౌంటేను లోంచి నీళ్ళు చుట్టూతా చిమ్ముతూ ఉన్నాయి. రక రకాల పక్షులన్నీ కూడా
అక్కడ చేరి అరుస్తూ ఉన్నాయి. అంత పెద్ద భవనం దగ్గర అతను నిలబడి ఏమిటి నేను ఇక్కడకు
ఎలా వచ్చాను? అని ఆలోచించ సాగాడు. అతని ముందే ఆ అద్భుతమైన
సౌందర్యరాశి ఆ భవనం మెట్లు ఎక్కుతూ కనిపించింది అతను కూడా యాంత్రికంగా ఆమె వెంటనే
ఆ మెట్లు ఎక్కసాగాడు ఒక్కొక్క మెట్టూ చాలా ఎత్తుగా ఉంది. చాలా అందంగా చాలా
శుభ్రంగా ఉంది. అన్నీ పాలరాతి తో చేసినట్టుగా తెలుస్తూనే ఉంది. అతడు మెట్లు
ఎక్కి ఆ ప్రవేశ ద్వారం దగ్గర వచ్చి నిల్చుండి పోయాడు. అది సుమారు ఒక పన్నెండు
అడుగుల యెత్తులో ఉంది. అది బలిష్టమైన తలుపులు కలిగి ఉంది దాని మీద రకరకాల డిజైన్లు
నగిషీలు చెక్కబడి ఉన్నయి. అవన్నీ ధగధగా మెరిసిపోతూ, కొత్తగా రంగులు వేసినట్టుగా ఉన్నాయి. అతనికి యేమీ అర్ధం కావడం లేదు అసలు
ఆలోచించటానికి కూడ టైమ్ దొరకడం లేదు క్షణంలో నే కొన్ని వేల లక్షల ఆలోచనలు
ముసురుకుంటున్నాయి. ఏం జరుగుతుందో కలయా నిజమా అనే భ్రాంతిలో ఉండిపోయాడు ఎవరు ఈ
అద్భుతమైన సౌందర్యరాశి? ఎందుకు నేను ఇట్లా ఈమె వెంట పడుతున్నాను? అని ఆలోచించుకుంటుండగానే అంతలో పెద్ద తలుపు తెరుచుకుని అతనికి స్వాగతం పలుకుతూ
ఆ అద్భుతమైన సౌందర్య రాశి కనిపించింది. ఆమె తీయ్యటి గొంతు వీణ నొక్కినట్టుగా
ధ్వనించింది. మధురమైన ఆ గొంతులోనే ఒక సమ్మొహనశక్తి ఉంది. ఆమె కళ్ళలో చూస్తూ ఉంటే
అతడు అన్ని లోకాలనీ మరిచిపోతూ ఉన్నాడు. ఒక అద్భుతమైన పరిమళం అతన్ని
చుట్టుముట్టేసింది. ఏదో ఒక మైకంలో ఉన్నట్టుగా అతని గొంతు మామూలుగా లేకుండా ఏదో
గొణుకున్నట్టుగా ఉంది.
(సశేషం)