ఆశావాది అంటే జీవితంలో తను అనుకున్నది తప్పకుండా
సాధిస్తాననుకునే ఒక ధృఢమైన ఆత్మవిశ్వాసం మరియు నమ్మకం వున్నవాడు , ఆ పని చేయగలిగిన
సామర్ధ్యం కలిగినవాడు , పట్టుదలగా చేసేవాడు తన
లక్ష్యం నెరవేరే వరకు కూడా ప్రయత్నాన్ని విరమించు కోకుండా చేసేవాడు . నిరాశావాది దానికి భిన్నంగా
ఉంటాడు. చెయ్యగలిగే సామర్ధ్యం వుండికూడా అతనిలో ఆత్మ విశ్వాసం తక్కువగా వుంటుంది , ఎప్పుడూ
కూడా తన లక్ష్యాన్ని తాను చేరుకొలేనేమో అని భయం పట్టి పీడిస్తూ వుంటుంది . అటువంటి
వాళ్ళు మన సమాజంలో కొకోల్లలుగా వున్నారు. వాళ్ళు జీవితంలో ఏ పనిని కూడా సాధించలేరు
పైగా సాధించగలిగే స్నేహితులని కూడా నిరాశ, నిరుత్సాహం
పాలుచేస్తూ వుంటారు . అలాంటి వాళ్ళ కథ ఈ రోజు తెలుసుకుందాం .
ఒక చిన్న గ్రామంలో రాముడు, రంగడు అని
స్నేహితులు వుండేవారు. వారిలో వయసులో రాముడు పెద్దవాడు , సుమారు
పన్నెండు సంవత్సరాల వయసు వుంటుంది. రంగడు చిన్న వాడు సుమారు ఏడు సంవత్సరాల వయసు
ఉంటుంది . వారి వయసులో ఎంతో వ్యత్యాసం వున్నా ఇద్దరూ కలిసిమెలిసి ఎంతో
అన్యోన్యం గా ఉండేవారు . ఒక
రోజు ఆ గ్రామం చివర వున్న
గుట్టదగ్గరికి వాళ్ళిద్దరూ వెళ్ళటం జరిగింది . వాళ్ళు అక్కడ ఆటపాటల్లో
మునిగిపోయారు , ఒక చిన్న బంతిని కాలితో తన్నుతూ చాలా సంతోషంగా
ఆడుకుంటున్నారు . ఈ లోపల రాముడు బలంగా బంతిని తన్నడంతో అది వెళ్లి పక్కనున్న
బావిలో పడి పోయింది. దాన్ని పట్టుకుందాం అనే ప్రయత్నంలో పెద్దపిల్ల వాడైన రాముడు
పరిగెత్తి పరిగెత్తి ఆ బావికి చుట్టూ అంచులేక పోవడం వల్ల కాలు జారి ధభేల్న
ఆ బావిలో పడిపోయాడు . ఆ శబ్దాన్ని వింటూనే రంగడు పరిగెత్తుకుంటూ బావి దగ్గిరకు వెళ్ళాడు . ఆ
బావి చాలా లోతు గా వుంది , ఒక ప్రక్క
ప్రహారీ లేదు , అటువైపు నించే తన మిత్రుడు పడిపోయాడు అని
గ్రహించిన అతనికి ఏ౦చెయ్యాలో తోచలేదు . చుట్టుపక్కల అంతా చూసాడు వారికి సహాయ
పడడానికి ఒక్కరు కూడా దగ్గరలో లేరు . ఐతే అదృష్ట వశాత్తూ అక్కడ ఒక బొక్కెన , దానికి
కట్టిన తాడు కనిపించాయి. బహుశా నీళ్ళు తోడుకోడానికి పెట్టి ఉంటారు . రంగడు , రాముడికి
ధైర్యం చెప్తూ "రాము ! నువ్వు ఏమి భయపడకు నేను ఈ బొక్కెన తాడు లోపల వేస్తాను
. ఈవైపు నించి నేను లాగుతాను నువ్వు దాన్ని పట్టుకుని జాగ్రత్తగా పైకి వచ్చెయ్యి, ఏం
ఫరవాలేదు నేను వున్నాను " అన్నాడు . అక్కడ లోపల రాముడు కూడా ధైర్యంగా నాకు చెట్లూ
చేమలూ ఎక్కడం అలవాటే కదా ! నువ్వు తాడు వేసేయ్యి నేను అందుకుని వచ్చేస్తాను
అన్నాడు .
రంగడు వయసులో చిన్నవాడైనా
స్వతహాగా తెలివైనవాడు కావడంవల్ల బాగా ఆలోచించి రాముడి బరువుకన్నా నా బరువు తక్కువ
నేను ఒక్కడినే తనని పైకి లాగడం కష్టం అని గ్రహించి తెలివిగా తాడుని మెల్లగా
నీళ్ళలోకి వదిలేసి బొక్కేనని పక్కన వున్న చెట్టుకి గట్టిగా కట్టేశాడు . రాముడికి
ధైర్యం ,హుషారు కలిగించే
కబుర్లు చెప్తూ అతడిని “నువ్వు వచ్చెయ్య గలవు , నువ్వు బడిలో ఆటపాట అన్నిటిలోనూ చురుకు ,చె ట్లూ పుట్టలూ
ఎక్కడంలో అందరికన్నా మెరుగు , నేను ఈ తాడుని చెట్టుకి కట్టేసాను. నువ్వు
ధైర్యంగా వచ్చెయ్యి” అని ఉత్సాహపరుస్తూ కబుర్లు చెప్తూ కూర్చున్నాడు .
రాముడు కూడా చాలా హుషారుగా ఆ బావిలో వున్న ఎగుడు దిగుడులమీద కాలేస్తూ, రొప్పుతో
కష్టపడి బావి అంచులు పట్టుకుని బైటపడ్డాడు . ఇద్దరూ సంతోషంగా కబుర్లు
చెప్పుకుంటూ ఇంటిదారి పట్టారు . వాళ్ళు ఊర్లోకి వెళ్తూనే పెద్దవాళ్ళు చూసి
ఏరా రాము ! ఏమిటి ఈగాయాలు ఎలా తగిలాయి? అని అడగ్గానే వాళ్ళు జరిగిందంతా చెప్పారు .
చిన్న పిల్లాడైన రంగడు బావిలోనించి రాముడ్ని తాడుతో లాగాడంటే ఎవ్వరూ నమ్మలేదు .
ఇంత బక్కగా వున్న నువ్వు నీకన్నా వయసులో బరువులో పెద్దవాడైన రాముణ్ణి లాగడం ఏంటి ,కథలు చెప్పొద్దు
అంటూ వాళ్ళని తక్కువ చేసి హేళనగా మాట్లాడారు . అప్పుడు ఆవూరి బడి ప్రధానోపాధ్యాయుడు
వచ్చి ఆ పిల్లల్ని దగ్గర కూర్చోపెట్టుకుని నిజంగా ఏ౦ జరిగిందో వున్నది
వున్నట్టు చెప్పమన్నారు . ఈ రంగడు నిన్ను నిజంగా బావిలోంచి పైకి లాగాడా ? అని
రాముణ్ణి అడిగారు, దానికి సమాధానంగా రాముడు “అవును మాస్టారూ !
రంగడు నిజంగా నాకు చాలా ధైర్యం యిచ్చాడు , తాడుని బావిలోకి వేసి బొక్కెన
పక్కనే వున్న చిన్న చెట్టుకి కట్టి నాకు ధైర్యం చెప్పి వుత్సాహపరుస్తుంటే
మెల్లమెల్లగా నేను బైటికి వచ్చేసాను అని అన్నాడు . అన్నీ విన్న ఆ మాస్టారు
పెద్దలవైపు తిరిగి వీళ్ళు నిజమే చెప్తున్నారు అన్నారు . ఎంతో లోకానుభవం వున్న
ఆ మాస్టారు మనసులో ఇలా అనుకున్నాడు 'ఈ రంగడు వయసులో చిన్నవాడైనా బలంలో తక్కువ వాడైనా ఆత్మ
విశ్వాసంతో నమ్మకంతో తన తోటి మిత్రుడు అపాయంలో వున్నప్పుడు అతనికి ధైర్యం చెప్తూ,
బుద్ధిబలాన్ని ఉపయోగించి వున్న తాడు బొక్కెన తోనే తనకన్నా పెద్దవాడైన
రాముడిని రక్షించాడు . ఇది ఎందుకు సాధ్యమై౦దంటే అక్కడ అతనిని నిరుత్సాహ
పరిచేవాళ్లు ఎవరూ లేరు ,ఇక్కడున్న పెద్దవాళ్ళలో ఏ ఒక్కరు అక్కడ వున్నా నీవల్ల
ఏమి అవుతుంది బక్క వాడివి చిన్న వాడివి అని నిరుత్సాహ పరిచి వుండేవారు , ఈ
పిల్లవాడు ఇటువంటి సాహసం చెయ్యగలిగి ఉండేవాడు కాదు ".
మన ఆలోచనల తీరు మనం చేసే పనులపై
ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో కదా ! కాబట్టి పిల్లలారా ! మీరు మీ చుట్టు పక్కల
వున్నవాళ్ళు ఎంతమంది మిమ్మల్ని నిరుత్సాహ పరచినా మీ ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకూడదు
. ధైర్యంతో పట్టుదలతో ముందుకు వెళ్తే మీరు అనుకున్న పనిని సాధిస్తారు . మనం పైకి
వెళ్దాం అనుకున్నప్పుడు మనల్ని ప్రోత్సహించేవాళ్ళు చాలా తక్కువమంది ఉంటారు, ముఖ్యంగా
ఇంట్లో వాళ్ళే పిల్లల్ని తక్కువగా అంచనా వేస్తారు , అది మన
పిల్లలు చిన్నవాళ్ళు అన్న గారాబం వల్లో ,అపనమ్మకం వల్లో లేక ప్రేమవల్లో తెలీదు . పిల్లవాడు
బాగా చదువుకున్నాడు, అన్ని పరీక్షలలో పాసయ్యాడు విదేశాలకి వెళ్ళే
అవకాశం వచ్చింది , సంతోషించ కుండా ఒక్కడివి ఎలా వెళ్తావు? ఒంటరిగా
దేశం కాని దేశం లో ఎలా బతుకుతావు? అంటూ ఏడుస్తూ కూర్చుంటారు . తాముఎల్ల కాలం
బ్రతకరు కదా ,తాము పోయాకా వాడ్ని ఎవరు చూసుకుంటారు ?అప్పుడు వాడు ఎలా
బ్రతుకుతాడూ? ఇప్పుడూ అంతే కదా అన్న కనీస ఇంగితం ఉండదు ఆ ఏడుస్తున్న పెద్దవాళ్ళకి
. కాబట్టి పిల్లలెవరైనా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఏదైనా కొత్తగా చెయ్యాలి , విన్నూత్నంగా
నేర్చుకుని సాధించాలి అని ఉత్సాహ పడుతున్నప్పుడు వాళ్ళని ప్రోత్సహించాలి అంతే గాని
నిరుత్సాహ పరచకూడదు అని మా అమ్మగారు కథ తో పాటుగా దానిలోని నీతి కూడా
మాకు అర్ధం అయ్యేలా చెప్పారు . అదేవిధంగా మమ్మల్ని చదువులోను ,ఆటపాటల్లోనూ
ఎప్పుడూ ప్రోత్సహించారు తప్ప నిరుత్సాహ పరచలేదు . అన్ని వేళలా ఒక స్నేహితుడుగా , మార్గ
దర్శి గా, మిత్రుడుగా
మన తల్లులు మనకి ఎంత సహాయం చేస్తారో కదా !