ఒక సారి సత్య
దేవత , అసత్య దేవత కలిసి ఒక అరణ్య ప్రాంతంలో ఏకాంతంగా విహరిస్తుంటే వారికి అక్కడ
ఒక అద్భుతమైన సరస్సు కనిపించింది. చుట్టూ ప్రక్కల వాతావరణం చాలా రమ్యంగా
ఉంది.వారికి ఆ సరస్సు చూడగానే దానిలో దిగి స్నానం చేయాలి అనే ఒక పెద్ద కోరిక చాలా
బలంగా కదిలింది. అదే ప్రకారంగా వారిద్దరు మెల్లమెల్లగా ఆ సరస్సు దగ్గరకి వెళ్లి,
అది నిర్జన ప్రదేశం గా భావించి , వారు వేసుకున్న వస్త్రాలని విప్పి , గట్టు మీద
ఉంచి ఆ సరస్సులో దిగారు. అందులో చాలా సేపు జలకాలాడుకుని వినోదించారు. కొంచెం
సేపయ్యాక అసత్య దేవత ఆ సరస్సు ఒడ్డుకి వచ్చింది. అక్కడ గట్టు మీద ఉన్న సత్య దేవత
విడిచిన వస్త్రాలని ఆవిడ ధరించింది.ఆవిడ ఈ పని కావాలా నే చేసింది. ఎందుకంటే
సత్యానికి చాలా శక్తి ఉంది కదా ! ఈ లోపల సత్య దేవత కూడా సరస్సునుంచి బయటకు వచ్చి
ఒడ్డుకి చేరింది. ఆవిడకి తన వస్త్రాలు అక్కడ కనిపించలేదు. ఆ స్థానంలో అసత్యదేవత
విడిచివేసిన వస్త్రాలు మాత్రమే కనిపించాయి.
ఆవిడకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆవిడ
సత్య దేవత కాబట్టి అసత్య దేవత విడిచిన వస్త్రాలు ధరించడం ఆవిడకి ఏమాత్రం నచ్చలేదు.
ఏం చేస్తుంది పాపం ! అందుకని అప్పట్నుంచి ఇప్పటిదాకా ఆ సత్య దేవత నగ్నంగానే ఉంది.
ఈ విధంగా “నగ్న సత్యం” అని నానుడి వచ్చింది.
అప్పట్నుంచి
పెద్దలు ఏదైనా నిర్ధారించుకోవాలి అంటే వాళ్ళు ఈ మాటని అంటూ ఉంటారు. అసత్య దేవత
వేసుకున్న సత్య దేవత వస్త్రాలు అందంగా ఉన్నాయి కాబట్టి అందరు అసత్యపు మాటలనే
విశ్వసిస్తూ ఉంటారు. ఎందుకంటే అసత్య వాక్కులు ఆవిడ వస్త్రాల్లాగా అందంగా,
ఆకర్షణీయంగా ఉంటాయి కదా ! సత్య దేవత మాటలు నిజంగా ఉంటాయి. నిజం ఎప్పుడు చేదుగా
ఉంటుంది కాబట్టి ఎవరు ఇష్ట పడరు. రాను రాను సత్య దేవత తన వాక్కు యొక్క శక్తిని
కోల్పోవసాగింది. అందుకనే పెద్దవారెప్పుడు అబద్ధం అందంగా ఉంటుంది అని అంటుంటారు.