యథా ప్రకారంగా మేమందరం కథ కోసం
మా అమ్మ చుట్టూ చాలా ఆసక్తిగా కూర్చుని ఎదురు చూస్తుంటు౦టే ఈ ప్రకారంగా కథ చెప్పడం
మొదలు పెట్టింది.
కాకతీయ సామ్రాజ్యాన్ని రాణి
రుద్రమ దేవి పరిపాలిస్తున్న రోజుల్లో ధర్మపురి అనే పట్టణం పాడి పంటలతో సస్య
శ్యామలంగా ఉండేది. అక్కడ భూమి సారవంతమైనందు వల్ల పంటలు చక్కగా పండి ఆహార ధాన్యాలు
ఇతర ప్రదేశాలకు కూడా ఎగుమతి చేస్తుండేవాళ్ళు. అదే ఊళ్ళో ధర్మాన్న అనే ఒక సంపన్న రైతు
కుటుంబానికి చెందిన వ్యక్తి ఉండేవాడు. అతను ఒక రోజు తన పొలంలో భూమి దున్నుతుండగా
భూమినుండి ఒక వింత వస్తువు దొరికింది. దాన్ని భూమిలో నుంచి పైకి తీసి , మట్టంతా
దులిపి, శుభ్రం చేసి ఎంతో పరీక్షించాడు. ఎంత చూసినా కూడా అదేమిటో ఆయనకి
అర్థం కాలేదు. దాన్ని తీసుకుని వెళ్లి ఆ ఊళ్ళో అతనికి తెలిసిన వారందరికి
చూపించి అడగ్గా వాళ్ళందరూ అల్లాంటి వస్తువుని వాళ్ళెప్పుడు చూడలేదని
చెప్పారు.
ఇలా ఆ వింత వస్తువు గురించిన వార్త మెల్లగా చుట్టుప్రక్కల పాకి రాణి రుద్రమ దేవి
గారి దాకా వెళ్ళింది. ధర్మన్నఆ వింత వస్తువుని స్వయంగా తీసుకుని వెళ్లి రాణి
రుద్రమ దేవికి సమర్పించాడు. ఆ సభలో ఉన్న అందరు ఆ వింత వస్తువుని పరీక్షించారు కాని
అదేమిటో వాళ్ళెవరికి అంతు పట్ట లేదు. వాళ్ళెవరు ఇంతవరకు అలాంటి వస్తువుని
చూడలేదు. అంతేకాదు వాళ్ళ తాత ముత్తాతలు కూడా చూడలేదని చెప్పారు. రాణి రుద్రమ దేవి
ఆ రాజ్యంలో అతివృద్ధులు ఎవరైనా ఉంటె సభకి రావలసిందిగా ఆహ్వానిస్తూ చాటింపు
వేయించారు. ఒక రోజు నడుమంతా వంగిపోయిన ఒక ముసలాయన చేతి కర్ర సహాయంతో ఆస్థానానికి
వచ్చాడు. ఆయన్ని సగౌరవంగా ఆహ్వానించి ఆ వింత వస్తువుని ఆయన చేతిలో పెట్టి అదేమిటో
చెప్పమని అడిగారు. ఆ వస్తువుని కళ్ళ దగ్గరకి తీసుకుని కళ్ళు చిట్లించి చాలా
జాగ్రత్తగా దాన్ని పరిశీలించి , “మహారాణి గారూ ! ఈ వస్తువేమిటో నాకు తెలియడం లేదు
. నేను కూడా దీన్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. మా నాన్నగారు నాకన్నా చాలా
పెద్దవారు. ఆయన ఇంకా బ్రతికే ఉన్నారు. బహుశా ఆయన ఇదేమిటో గుర్తు పడతారేమో !” అని
చెప్పాడు.
వెంటనే ఆయన తండ్రిని సగౌరవంగా రాజ సభకి తీసుకుని వచ్చి ఆ వింత వస్తువుని చూపించి
అదేమిటో చెప్పమని అడిగారు. ఆశ్చర్యం ఏమిటంటే ఆయన శరీరం కొడుకు శరీరమంతా వంగి
పోలేదు కాని కొంచెంగా వంగి ఉండాలి ఆయన చేతి కర్ర సహాయం లేకుండా వచ్చాడు.
దృష్టి కూడా కొడుకు దృష్టి కన్నా బాగానే ఉండి చూడడానికి కొడుకు కన్నా
ద్రుఢ౦గా ఉన్నాడు. ఆయన ఆ వస్తువుని జాగ్రత్తగా పరిశీలించి నేను కూడా నా జీవితంలో
మొట్టమొదటిసారిగా దీన్ని చూస్తున్నాను. ఇదేమిటో నాకు కూడా తెలియదు. బహుశా మా
నాన్నగారికి ఇదేమిటో తెలిసి ఉండవచ్చును. ఆయన ఇంకా బ్రతికే ఉన్నారు అని చెప్పాడు.
ఇది విని సభికులంతా ఆశ్చర్య పోయారు. ఈ సారి కూడా ఆయన తండ్రిగారిని రాజ సభకి గౌరవ
మర్యాదలతో తీసుకుని వచ్చారు. సభికులందరూ కూడా చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. అతను
చాలా ద్రుఢ౦గా, నిటారుగా, బలిష్టంగా, చాలా ఆరోగ్యంగా హుందాగా ఉన్నాడు. అతన్ని చూసి
రాణి రుద్రమ దేవి కూడా ఆశ్చర్య పడిపోయింది. మరి ముగ్గురిలో మనమడు అంటే మూడవ తరం
వాడు చాలా ముసలిగా కనిపిస్తుంటే, రెండవ తరం వాడైన తండ్రేమో కొంచెం
ముసలి వాడుగా కనిపిస్తున్నాడు. మొదటి తరానికి చెందిన తాతేమో అందరికన్నా చిన్న
వాడిలాగా ఆరోగ్యంగా కనిపిస్తున్నాడు. ఇదేమి చిత్రం ! అని రాణి రుద్రమ దేవితో సహా ఆ
ఆస్థానంలో ఉన్న సభికులందరు ఆశ్చర్యంగా చూస్తున్నారు. “చూడండి ! మిమ్మల్ని
చూస్తుంటే మాకు ఆశ్చర్యంగా ఉంది. మీరు అందరిలోకి మీరే ద్రుఢ౦గా, యవ్వనంగా
కనిపిస్తున్నారు. మీ కొడుకు, మనమడు మీకన్నా ముసలివారిలాగాకనిపిస్తున్నారు.
ముగ్గిరిలో మీ దృష్టి కూడా తీక్షణంగా ఉంది. మా దగ్గర ఒక వింత వస్తువు ఉంది. మా
రాజ్యంలో ఒక రైతు తన పొలం దున్నుతుంటే ఆ వింత వస్తువు బయట పడింది. అది అతను మన
రాణీ గారికి ఇచ్చాడు. దాన్ని ఇప్పటిదాకా ఎవరు చూడలేదంటున్నారు. అదేమిటో మాకు
తెలియక రాజ్యంలో అతి వృద్ధుడైన మీ మనమడిని, అతని ద్వారా మీ అబ్బాయిని తీసుకుని
వచ్చాం. కాని వాళ్లకి కూడా ఈ వింత వస్తువేమిటో అంతు పట్టడం లేదు. కనీసం
మీరైనా దాన్ని చూసారా, అది ఏమిటో చెప్తారా?” అని మహా మంత్రి గారు అడిగారు. ఆ
వస్తువుని చేతిలో తీసుకుని, పరిశీలించాక దాన్ని చూసి అతను సంభ్రమశ్చార్యాలతో
సంతోషించాడు. “మహామంత్రి గారూ ! ఈ వింత వస్తువుని ఇన్నేళ్ళ తర్వాత నేను ఇప్పుడే
చూస్తున్నాను. ఈ మాటలకి అందరు ఆశ్చర్య పడి అతను ఏం చెప్తాడా అని చెవులు నిక్కించి
వినసాగారు. ఇది మా చిన్న తనంలో మేము పండించిన ధాన్యపు గింజ. ఆ రోజుల్లో మేము
దీన్ని పండించేవాళ్ళం. ఇది పావురపు గుడ్డంత పరిమాణంలో ఉండేది. రాను రాను దీని
పరిమాణం తగ్గిపోతూ వచ్చింది. కాని మా చిన్నతనంలో దీన్ని మేము ప్రతి రోజు ఆహార
పదార్ధం లాగా వాడుతూ ఉండేవాళ్ళం. అది విని అందరు అదేమిటీ ఆ రోజుల్లో బియ్యపు గింజ
అంత పెద్దగా ఉండేదా! అంటూ ఆశ్చర్య పడ్డారు. అప్పుడు మంత్రి గారు బహుశా
ఆ రోజుల్లో ధాన్యపు గింజల పరిమాణం కూడా చాలా పెద్దగా ఉన్నట్టున్నాయి అని అన్నారు.
అవును మహా మంత్రి గారూ ! ఆ రోజుల్లో అన్ని ధాన్యాలు ఇలాగే పెద్ద పరిమాణంలో ఉండేవి.
మేము ఒక ప్రత్యేకమైన పద్ధతిలో వ్యవసాయం చేస్తు౦డేవాళ్ళం. భూమి దున్నుతుండేవాళ్ళం.
పండిస్తూ ఉండేవాళ్ళం. మాకు మా వృత్తి మీద ఎంతో గౌరవం ఉండేది. ధాన్యం అంటే
అన్నపూర్ణ కదా ! అందరి పొట్టలను నింపి అందరి ప్రాణాలను నిలిపే తల్లిగా ఈ భూమాత మీద
ప్రేమ, అభిమానాలతో మేము ధాన్యాలు పండించేవాళ్ళం కాని వ్యాపార రీత్యా కాదు. ఇలాంటి
భావాలు ఆ రోజుల్లో ప్రతి మనిషిలోను ఉండేవి. రాను రాను మారుతున్న కాలంతో మనుషులు,
వారి భావాలు కూడా మారిపోయాయి. ఏది ఏమైనా ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది
ఎందుకంటే నా చిన్నప్పటి రోజుల్లో మేము పండించే ధాన్యపు గింజని ఇన్నేళ్ళ తర్వాత
ఇప్పుడే నేను చూశాను అని చెప్పాడు. “అయ్యా ! ఇప్పుడు మీరు ఇంత ఆరోగ్యంగా ద్రుఢ౦గా
బలంగా ఎలా ఉన్నారో అన్న దానికి కారణం ఇప్పుడు తెలిసింది. ఆ రోజుల్లో
మీరు పండించిన ధాన్యం నీవు తిన్నావు కాబట్టి. అప్పుడు మీ మనసులో ఉన్న మంచి భావాల
వల్ల అమూల్యమైన ధాన్యం పండుతుండేది. ఆ ధాన్యం తిన్న మీరేమో ఇప్పటికి కూడా ఇంత
ఆరోగ్యంగా, బలంగా ఉన్నారు మీ మూడు తరాల మనుషులను పోలిస్తే.రాను రాను పంటను
పండించేవారి మనస్సులోని భావాలు,బుద్ధులు కూడా మారిపోవడం వల్ల ధాన్యపు గింజ పరిమాణం
చిన్నగా అవడమే కాకుండా మనుషుల ద్రుఢత్వం కూడా తగ్గి పోయింది అంతే కదా ! ” అని మహా
మంత్రి గారు అన్నారు.
ఇదంతా విని రాణి రుద్రమ దేవి
కూడా ఎంతో ఆశ్చర్య పడిపోయింది. అతనికి ఎన్నోవెలలేని బహుమానాలు ఇచ్చి తన
ఆస్థానంలో తగిన పదవిని కూడా ఇచ్చింది. ఈ విషయాన్ని ప్రజలందరూ ఎంతో
ఆశ్చర్యంగా చెప్పుకోవడం మొదలు పెట్టారు.